తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షుడు డా|| మర్రి చెన్నారెడ్డి ఇచ్చిన పిలుననుసరించి 1970 ఏప్రిల్ 22నుండి తెలంగాణ వ్యాప్తంగా ఉద్యమ నాయకులు, ప్రజలు నిరశనదీక్షలో పాల్గొంటున్నారు.
ఏప్రిల్ 26న హైదరాబాద్‌లోని 13 కేంద్రాలలో నిరశన దీక్షలు కొనసాగినవి. ఈ శిబిరాల్లో సుమారు 430మంది పాల్గొన్నారు. హైదరాబాద్ మేయర్ లక్ష్మీనారాయణ, ఐదుగురు మున్సిపల్ కౌన్సిలర్లు ఈ దీక్షలకు నాయకత్వం వహించారు. బోధన్, రామన్నపేట, కొడంగల్ తదితర పట్టణాలలో ఈ నిరశన దీక్షలు కొనసాగినవి. ఐదురోజులపాటు అనేక పట్టణాల్లో, జంట నగరాల్లో 24 గంటల నిరశనదీక్షలను నిర్వహించిన తర్వాత ఏప్రిల్ 27నుండి సత్యాగ్రహాలను తెలంగాణ అంతటా నిర్వహించాలని ప్రజాసమితి పిలుపునిచ్చింది. ఈ నిరశన దీక్షలలో మాజీ మేయర్ కుముద్‌బెన్, డా|| చెన్నారెడ్డి సతీమణితోబాటు ఎందరో మహిళలు పాల్గొన్నారు. వీరిలో కుమారి ప్రమీల, సులోచన, ఆశాలత, అశోకకుమారి, ఊర్మిళ, కళావతి, విజయలక్ష్మి, యశోద తదితరులున్నారు.
తుదిఘట్టంగా సత్యాగ్రహాలు
విధానసభలో ప్రతిపక్ష నాయకులు నూకల రామచంద్రారెడ్డి, కె. రామచంద్రారెడ్డి నాయకత్వంలో సుమారు 30మంది సుల్తాన్‌బజార్ చౌరస్తాలో సత్యాగ్రహం చేశారు.
తొలిరోజు సత్యాగ్రహం ముగిసే సమయం దగ్గర పడినకొద్దీ పురుషులు, పిల్లలు, స్త్రీలు అనేకమంది సుల్తాన్‌బజార్ చౌరస్తా ప్రాంతానికి వచ్చి అరుగులపైన, మేడలపైన, ఫుట్‌పాత్‌లపై గుమిగూడారు. అదే సమయంలో నూకల రామచంద్రారెడ్డి, కె. రామ చంద్రారెడ్డి కొందరు సత్యాగ్రహులతో ”జై తెలంగాణ” నినాదాలిస్తూ సుల్తాన్‌బజార్ చౌరస్తాకు చేరుకున్నారు. కొద్దిసేపట్లోనే డా|| చెన్నారెడ్డి, మేయర్ లక్ష్మీనారాయణ, డిప్యూటీ మేయర్ రామచంద్రయ్య, శాసనసభ్యులు హషీమ్, ఎం. మాణిక్‌రావు, ప్రజా సమితి ఉపాధ్యక్షులు మదన్‌మోహన్ అక్కడికి వచ్చారు.
అంతా కలిసి ‘జై తెలంగాణ’ నినాదాలిస్తూ ముందుకు సాగుతుండగా ఎన్.బి. కాలేజీ విద్యార్థిని ఒక పోలీస్ కానిస్టేబుల్ కొట్టగా, అతనికి గాయాలై రక్తం కారింది. ఆ విద్యార్థి డా|| చెన్నారెడ్డివద్దకు పరిగెత్తి పోలీసుల దౌర్జన్య చర్యపట్ల నిరసన తెలిపాడు. రక్తం కారుతున్న ఆ విద్యార్థిని చూసిన ఉద్యమకారులు హింసాకాండకు దిగినారు. పోలీసులపైకి వెళ్ళి వారి లాఠీలను, టోపీలను గుంజుకోవడానికి ప్రయత్నించారు. డా|| చెన్నారెడ్డి, ఇతర నాయకులు కలిసి జనానికి నచ్చజెప్పి వారిని శాంతింపజేశారు. ‘పోలీసు జులుం బంద్‌కరో’ అని నినాదాలిస్తూ జనం ముందుకు సాగినారు. ప్రజలనుద్దేశించి డా|| చెన్నారెడ్డి ప్రసంగిస్తూ పోలీసుల దౌర్జన్యాన్ని ఖండించారు. సభ తర్వాత పోలీసులు నూకల రామచంద్రారెడ్డితోబాటు మరికొందరిని ‘నిషేధాజ్ఞలు ఉల్లంఘించార’ని ఆరోపిస్తూ అరెస్టు చేశారు. సత్యాగ్రహంలో పాల్గొన్న నేతలను పోలీసులు అరెస్టు చేయడంతో అక్కడున్న జనం పోలీసులపై రాళ్ళు విసిరారు. కొన్ని బస్సులను ధ్వంసం చేశారు. వైద్యశాఖ కారుపై దాడి చేశారు. సాయుధ పోలీసులు రంగంలోకి దిగి జనాన్ని చెదరగొట్టారు. అరెస్టు చేసిన సత్యాగ్రహులను నాల్గవ సిటీ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చారు. న్యాయవాది ఎం.సుధాకర్‌రెడ్డితోసహా 26మందిని మెజిస్ట్రేటు మందలించి వదిలివేశారు.
శాసనసభ్యులకు జైలు శిక్ష
సల్తాన్‌బజార్‌లో సత్యాగ్రహం చేసినందుకు అరెస్టు చేసిన శాసనసభ్యులు నూకల రామచంద్రారెడ్డి, కె. రామచంద్రారెడ్డి, నాయకులు జయాచారి, సత్యనారాయణరెడ్డి, కేశవరావు పూర్కర్‌లను ‘పోలీసులు పేర్కొన్నట్లు మీరు నేరం చేసినట్లు ఒప్పుకుంటున్నారా?’ అని మెజిస్ట్రేట్ ప్రశ్నించారు. నూకల రామచంద్రారెడ్డి బదులిస్తూ ‘ప్రజా ఉద్యమాన్ని అణచివేయడానికి గత 16 నెలలుగా రాష్ట్ర ప్రభుత్వం దమననీతిని అవలంభిస్తున్నది. నేడు ఒక విద్యార్థిని పోలీసులు క్రూరంగా కొట్టారు. తెలంగాణ ప్రజల నిజమైన కోర్కెలను పోలీసు బలంతో అణచివేయడం సాధ్యంకాదని హెచ్చరిస్తున్నాను. మేము నిషేధాజ్ఞలను ధిక్కరించి సత్యాగ్రహం చేశాం’ అన్నారు. ‘తిరిగి ఎప్పుడూ నిషేధాజ్ఞలను ధిక్కరించమని హామీ ఇస్తే విడుదల చేయగలన’ని మెజిస్ట్రేట్ అనగా ‘ఎలాంటి హామీ ఇవ్వలేమ’ని నాయకులు బదులిచ్చారు. మెజిస్ట్రేట్ వీరికి ఐదురోజుల జైలు శిక్ష విధించారు. శాసనసభ్యులు మాణిక్‌రావు ఆనాటి సంఘటనలపై ప్రధానికి, హోంమంత్రికి టెలిగ్రాంలు పంపుతూ విచారణ జరిపించాలని కోరినారు.
సికింద్రాబాద్‌లో జరిగిన సత్యాగ్రహంలో పాల్గొన్న మున్సిపల్ కౌన్సిలర్లు డి. హరినారాయణ, కె. నరసింహ తదితరులకు మెజిస్ట్రేట్ వారం రోజుల జైలు శిక్ష విధించారు.
శాంతియుతంగా రెండోరోజు సత్యాగ్రహం… ఎంపీల అరెస్టు
రెండోరోజు సత్యాగ్రహంలో పార్లమెంట్ సభ్యులు జె. రామేశ్వరరావు, ఆర్. సురేందర్‌రెడ్డి పాల్గొన్నారు. పురానాపూల్ సమీపంలోని గాంధీ విగ్రహంవద్ద సత్యాగ్రహం చేస్తుండగా పోలీసులు ఈ నాయకులను అరెస్టు చేశారు. గాంధీ విగ్రహంవద్దకు వెళ్ళే అన్నిదారుల్లోనూ పోలీసులు భారీఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. సత్యాగ్రహులు పోలీసులను తప్పించుకుని ‘జై తెలంగాణ’ నినాదాలతో ముందుకుపోయి గాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. పోలీసులు వీరందరినీ అరెస్టు చేసి రెండు ట్రక్కులలో పోలీస్‌స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. ఈ సత్యాగ్రహ శిబిరాన్ని డా|| చెన్నారెడ్డి, మేయర్ లక్ష్మీనారాయణలు సందర్శించారు. సికింద్రాబాద్ రాష్ట్రపతిరోడ్‌లో కూడా సత్యాగ్రహం జరిగింది. ప్రజా సమితి లాలాగూడాశాఖ అధ్యక్షులు బాబూరావు, విద్యార్థులు కె. మోహన్‌కుమార్, వి. ప్రకాశ్ (రచయితకాదు), మరో ఐదుగురు సత్యాగ్రహం చేశారు. పోలీసులు వీరిని అరెస్టు చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరు పరచగా వారికి వారం రోజలు చొప్పున జైలు శిక్ష విధించారు. అరెస్టులకు నిరసనగా.. తొలిరోజు సత్యాగ్రహం సందర్భంగా ఏప్రిల్ 27న నగరంలో పలువురు నేతలను, విద్యార్థులను అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ వెటర్నరీ కళాశాల విద్యార్థులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాలల విద్యార్థులు సమ్మె చేశారు.
మే ఒకటిన తెలంగాణా బంద్ పిలుపు
తెలంగాణవ్యాప్తంగా 1970 మే ఒకటిన బంద్ నిర్వహించాలని తెలంగాణ ప్రజాసమితి పిలుపునిచ్చింది. సత్యాగ్రహాల తర్వాత తుది ఘట్టంలో భాగంగా ‘సామూహిక కార్యాచరణ’కు ప్రజాసమితి నిర్ణయించింది. దీనిలో భాగంగా తెలంగాణ బంద్‌లో పాల్గొనాలని ప్రజా సమితి ప్రజలను కోరింది. పోస్టాఫీసులు, ప్రభుత్వ కార్యాలయాల ఎదుట బస్సులు, రైళ్ళకు అడ్డంగా కార్యకర్తలు పికెటింగ్ జరుపాలని ప్రజాసమితి విజ్ఞప్తి చేసింది. మే ఒకటిన జరిగే బంద్‌లో డా|| చెన్నారెడ్డి మహిళా వాలంటీర్లతో కలిసి ఆబిడ్స్, పోస్టాఫీస్‌వద్ద పికెటింగ్ చేస్తారని ప్రకటనలో ప్రజా సమితి తెలిపింది.
మే ఒకటికల్లా కార్పొరేషన్‌లోని ఆంధ్ర సిబ్బంది బదిలీ…
తెలంగాణ ప్రజా సమితి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంకోసం ‘తుది ఘట్టం’లో భాగంగా నిరశన దీక్షలు, సత్యాగ్రహాలు, సామూహిక కార్యాచరణ, బంద్‌వంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండగా మరోవైపు నగరపాలక సంస్థ కార్పొరేషన్‌లో మేయర్, డిప్యూటీ మేయర్, పలువురు కౌన్సిలర్లు ఉద్యమాన్ని తీవ్రతరం చేయడానికి ఆంధ్ర సిబ్బంది బదిలీకై నిర్ణయించారు. నిర్ణయాన్ని అమలు చేయడానికి నగర పాలక సంస్థ కమిషనర్‌ను ఆదేశిస్తూ కార్పొరేషన్ ఏప్రిల్ 28న తీర్మాణాన్ని ఆమోదించింది. ‘ఆంధ్ర సిబ్బంది బదిలీకాని యెడల మే ఒకటినుండి విధులకు హాజరు కానివ్వరాద’ని ఈ తీర్మానంలో కమిషనర్‌ను ఆదేశించడం జరిగింది. దీనితో కార్పొరేషన్‌లోని తెలంగాణ వాదులకు, ప్రభుత్వానికి మధ్య జనవరిలో స్మారక స్థూప శంకుస్థాపన నాటినుండి మొదలైన వివాదాలు తారాస్థాయికి చేరినాయి. కార్పొరేషన్‌లోని తెలంగాణవాదుల నాయకుడు గోవింద్‌సింగ్ ప్రతిపాదించిన తీర్మానం ఏప్రిల్ నెలాఖరులోగా కార్పొరేషన్‌లోని ఆంధ్ర ఉద్యోగులను బదిలీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మరోమారు అభ్యర్థించింది. ప్రభుత్వం ఒకవేళ వీరిని బదిలీ చేయకపోతే మున్సిపల్ కమిషనర్, అకౌంట్స్ ఎగ్జామినర్‌లు ఆంధ్ర ఉద్యోగులను మే ఒకటినుండి డ్యూటీలో చేరనివ్వరాదని, వారిని ఉద్యోగాలలో కొనసాగనిస్తే కార్పొరేషన్ ఆమోదించిన తీర్మాణాన్ని దాని అధికారాన్ని ఉల్లంఘించి నట్లవుతుందని స్పష్టం చేశారు. ఈ తీర్మానాన్ని మేయర్ లక్ష్మీనారాయణ ఓటింగ్‌కు పెట్టగా అనుకూలంగా 24 ఓట్లు, ప్రతికూలంగా 11 ఓట్లు వచ్చాయి. ఒక్క కౌన్సిలర్ మాత్రమే తటస్థంగా ఉండిపోయారు.
నేపథ్యం: ఆంధ్ర ప్రాంతీయుడైన కార్పొరేషన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ (ఎస్‌ఈ)ను బదిలీ చేయనందున ఏప్రిల్ ఒకటినుండి ఆ పదవినే రద్దు చేస్తూ కార్పొరేషన్ గతంలో ఒక తీర్మాణాన్ని ఆమోదించగా దానికి విరుద్ధంగా ఎస్.ఇ. పదవిని కొనసాగించవలసిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై కార్పొరేషన్ ఈ తీర్మాణాన్ని ప్రతిపాదించింది. కార్పొరేషన్ నేటి తీర్మాణంలో ప్రభుత్వ ఉత్తర్వులను కమిషనర్ అమలు జరుపరాదని, ఆయనకు ఇచ్చే కారును, టెలిఫోన్‌ను ఉపసంహరించుకోవలసినదిగా ఆదేశించింది. ఎస్.ఇ. వేతనపు బిల్లును ఆయన కార్యాలయ సిబ్బంది వేతనాల బిల్లులను అంగీకరించరాదని ఆ విభాగాన్ని రద్దు చేస్తూ కార్పొరేషన్ తీర్మాణించినందున 1970-71 సంవత్సరపు కార్పొరేషన్ బడ్జెట్‌లో వారి వేతనాలను చేర్చలేదని అకౌంట్స్ ఎగ్జామినర్‌ను ఆదేశించింది.కార్పొరేషన్‌లోని ఆంధ్ర ఉద్యోగు లనందరినీ బదిలీ చేయమని, వారి స్థానాల్లో తెలంగాణా వారిని నియమించాలని కోరినా ప్రభుత్వం ఇంతవరకు ఎట్టి చర్య తీసుకోనందుకు ఈ తీర్మాణంలో విచారాన్ని వ్యక్తం చేశారు. గోవింద్‌సింగ్ ప్రవేశపెట్టిన తీర్మాణాన్ని ప్రముఖ తెలంగాణ ఉద్యమనేత ఇ.వి. పద్మనాభం సమర్ధిస్తూ ప్రసంగించారు.
‘కార్పొరేషన్‌లోని ఆంధ్ర సిబ్బంది జంటనగరాల్లోని తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని, ఆంధ్రులకు తక్కువ పన్నులను, తెలంగాణ వారికి ఎక్కువ పన్నులను వేశార’ని పద్మనాభం అన్నారు. ఈ తీర్మానాన్ని వ్యతిరేకించిన వారిలో బి.ఎం. రాజ్, యాదగిరి, కె.వి.వి. నరసింహాచార్యులు, నజీరుద్దీన్, దేవేంద్రపురి గో స్వామి, సయ్యద్ రహ్మత్ అలీ, జి. నరసింహారావులు ఉన్నారు.
పి. రామస్వామి మాట్లాడుతూ.. ఇప్పటి ఎస్.ఇ. ముఖ్యమంత్రి చెప్పుచేతల్లో పనిచేస్తున్నాడని, కొత్తగా నియమితులైన మంత్రుల ఇళ్ళముందు రోడ్లు వేయిస్తున్నాడని, పన్నులు చెల్లించే ప్రజల అవసరాలను బుట్ట దాఖలు చేస్తున్నాడని విమర్శించారు.
ప్రభుత్వం ఇచ్చే రూపాయలు 40 లక్షల గ్రాంటును భేషరతుగా ఇవ్వాలని, ఎట్టి షరతులను విధించరాదని ప్రభుత్వాన్ని కోరుతూ కార్పొరేషన్ మరొక తీర్మాణాన్ని ఆమోదించింది. దీనిని ప్రభుత్వం ఇచ్చిన సంజాయిషీ నోటీసుకు సమాధానంగా ఆమోదించారు. ఈ తీర్మాణానికి అనుకూలంగా 20 ఓట్లు, ప్రతికూలంగా 9 ఓట్లు వచ్చాయి.