తెలంగాణ పల్లెపట్టులలోని గ్రామీణ మహిళను, వారి జీవనశైలిని, వారి భావాలను బహురమ్యంగా, కవితలాగా ప్రతిబింబించే సృజనాత్మక చిత్రకారిణి – కవితా దేవ్‌స్కర్‌.

తెలంగాణ గ్రామీణ స్త్రీల  ప్రతిరూప చిత్రకారిణితొలిరోజులలో సర్రిమలిస్టిక్‌ ధోరణితో చిత్రాలు గీసిన కవితా దేవ్‌స్కర్‌ అనంతర కాలంలో స్వప్నలోక వస్తువులు వదలి, వాస్తవ జీవితంలోకి పాదం పెట్టారు. తమ చుట్టూ ఉన్న సమకాలీన ప్రపంచంలోని మహిళలకు, వారి భావాలకు తమ చిత్రాలలో చోటిచ్చారు. పెన్‌ అండ్‌ ఇంక్‌ డ్రాయింగ్‌ అయినా, వాష్‌ పెయింటింగ్‌ అయినా, డ్రై పేస్టిల్‌తో గీసినా, తైలంతో, గుడ్డతో టెంపోరా వేసినా, గ్రాఫిక్‌ వర్క్‌ చేసినా అంతటా ఆమె చిత్రాలలో తెలంగాణ మహిళ కనిపిస్తుంది. ”నాగపూజ”కు పాలు, నీరు కుంకుమతో వెళ్ళే స్త్రీలు, తాము అనుభవించే బాధలను ”ముచ్చట్లాడుతూ” పరస్పరం పంచుకునే పడతులు, రాళ్ళుకొట్టేవారు, చెప్పులు కుట్టేవారు ఎవరైనాసరే కవిత చిత్రాల్లో ఉన్నారంటే వారు కచ్చితంగా తెలంగాణా మట్టినుంచి పుట్టిన మహిళలే.

ఎంతోకాలం జవహర్‌లాల్‌ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయంలోని లలితకళల కళాశాలలో పెయింటింగ్‌ శాఖలో అధ్యాపకులుగా, అధ్యక్షులుగా ఉన్న కవితా దేవ్‌స్కర్‌కు వర్థమాన చిత్రకారులలో శిష్యవర్గముంది. వాస్తవానికి ఆమె గొప్ప చిత్రకారుల కుటుంబం నుంచి పరంపరగా వచ్చిన చిత్రకారిణి. ఆమె తాత రామకృష్ణ వామన్‌ దేవ్‌స్కర్‌ పోట్రేట్‌ చిత్రకళలో శిఖరప్రాయుడు. సాలార్‌జంగ్‌ మ్యూజియంలో చిత్రకళా విభాగం తొలి క్యూరేటర్‌. ఇక ఆమె తండ్రి సుకుమార్‌ దేవ్‌స్కర్‌ కూడా గొప్ప చిత్రకారుడే. అతను హైదరాబాద్‌ స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ అండ్‌ క్రాప్ట్స్‌ ప్రిన్సిపాల్‌గా ఎందరో అపురూపమైన చిత్రకారులను తయారుచేశారు. ఇంతేకాకుండా దేవ్‌స్కర్‌ బంధువులు కూడా మరికొందరు చక్కని చిత్రకారులున్నారు.

కొన్ని తరాలుగా వీరి కుటుంబం చిత్రకళారంగంలో మణిపూసల వంటి సృజనాత్మక కళాకారులను అందించింది. గత సహస్రాబ్ది తొలినాళ్ళలో కవిత తాత, యూరప్‌లో ఉన్నప్పుడు బెంగాల్‌ యువతిని వివాహమాడాడు. వీరికి సుకుమార్‌ ఇటలీలో జన్మించాడు. ప్రాన్స్‌లో, శాంతినికేతన్‌లో చదివాడు. నేర్చిన విద్యనంతా హైదరాబాద్‌ వచ్చి కళాశాల ప్రిన్స్‌పాల్‌గా ఉండి శిష్యులకు ధారపోశాడు.

ప్రధానమంత్రులు పండిత జవహర్‌లాల్‌ నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, జైపూర్‌ మహారాణి లాంటివారి చిత్రాలు గీసి, తనకు తాను సాటి అనిపించుకున్న గోపాల్‌ దేవ్‌స్కర్‌ కూడా ఆమె తండ్రి తరఫున దగ్గరిబంధువు. ఈ మహానుభావులంతా గోపాల్‌ దేవ్‌స్కర్‌ స్టుడియోకి వచ్చి కావలసిన ఫోజు ఇచ్చారంటే ఆయన గొప్పతనం వేరుగా చెప్పనవసరం లేదు.

ఇంతటి విశిష్టమైన చిత్రకారుల కుటుంబంలో పుట్టిన కవితా దేవ్‌స్కర్‌ హైదరాబాద్‌లోని లలితకళల కళాశాలలోనే డ్రాయింగ్‌, పెయింటింగ్‌లలో డిప్లొమా పొందారు. ఆ తర్వాత మోడలింగ్‌లో, శిల్పంలో మూడేళ్ళు సర్టిఫికెట్‌ కోర్సు పూర్తి చేశారు. అనంతరం బరోడాలోని ఎం.ఎస్‌. విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌. కె.జి.సుబ్రహ్మణ్యం దగ్గర కుడ్య చిత్రకళ, ప్రెస్‌కో పెయింటింగ్‌లో ఆంధ్రప్రదేశ్‌లో లలితకళా అకాడమివారి స్కాలర్‌షిప్‌తో స్పెషలైజేషన్‌ చేశారు. కుడ్య చిత్రకళలో జైపూర్‌ ప్రెస్‌కో, జైపూర్‌ ఫ్రాండింగేట్‌, మెజాయిక్‌, ఇటాలియన్‌ ప్రెస్‌కో, ఇసుక, సిమెంట్‌ కాస్ట్‌, సిమెంట్‌ కాంక్రీట్‌, కొల్లేజ్‌, టెర్రాకోటా టెక్నిక్‌లలో అధ్యయనం చేశారు. చిత్రకళ పునర్వికాసానికి సంబంధించిన కోర్సును ఆమ్‌స్టర్‌ డ్యామ్‌ మ్యూజియం డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వాటరింగ్‌ చెంత చదివారు.

ఇంకా ఈమెకు గ్రాఫిక్స్‌ రూపొందించడంలో, కలప బొమ్మలు చేయడంలో, నిర్మల్‌ పెయింటింగ్స్‌ గీయడంలో సిమెంట్‌ మాస్క్‌లు చేయడంలో ఎంతో నేర్పు ఉంది. అందుకే అనేక మధ్యమాలలో ఈమెకు గల నైపుణ్యం వల్ల దేశంలో, విదే శాలలో ఎక్కడ వ్యష్టి, సమష్టి చిత్రకళాప్రదర్శనలు నిర్వహించినా కవితా దేవ్‌స్కర్‌ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షిస్తాయి.

Other Updates