సమకాలీన చిత్ర, శిల్ప కళలపై తెలుగులో రచనలు చేసేవారు చాలా తక్కువ. గత డిసెంబర్ మాసంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా స్టేట్ గ్యాలరీ ఆఫ్ ఆర్ట్ (చిత్రమయి) ప్రచురించిన చిరుగ్రంథం ‘తెలంగాణ చిత్ర కళా వైభవం’.
ఇందులో గుహలనుంచి గ్యాలరీదాకా తెలంగాణ చిత్రమయి, హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ చిత్రకారుల కులం, సై అంటున్న స్టేట్ ఆర్ట్, ఆర్ట్ ఎట్ తెలంగాణలపై రచయిత వుప్పల నరసింహం విహంగ వీక్షణం చేశారు. ప్రముఖ చిత్రకారులు-పి.టి.రెడ్డి, కె. రాజయ్య, కొండపల్లి శేషగిరిరావు, యం.ఎఫ్. హుస్సేన్, జగదీశ్ మిత్తల్, లక్ష్మాగౌడ్, సూర్యప్రకాష్, తోట వైకుంఠం, ఏలే లక్ష్మణ్, ఎక్కా యాదగిరిరావు, ఆగాచార్య, కంది నర్సింలుపై చిరు వ్యాసాలున్నాయి. అయితే ఈ గ్రంథం రచయిత చివరన – ‘ఇది’ సమగ్రమైన పుస్తకమని భావించడం లేదు, ఇదొక చిన్న ప్రయత్న’మని భావించి తెలుగు పాఠకుల ముందుకు తీసుకొస్తున్నానన్నారు.
దీని పరిధి పరిమితమైనదైనా, ‘తెలంగాణ చిత్ర కళా వైభవం’ అన్నందుకు ప్రపంచమే గర్వించదగిన హైదరాబాద్ నగరంలోని సాలార్‌జంగ్ మ్యూజియంలోని చిత్ర కళా ఖండాల గురించి, ముఖ్యంగా అందులో తెలుగు చిత్రకారుల చిత్ర కళావైభవం గురించి వ్యాసం ఉంటే బాగుండేది. అట్లాగే స్టేట్ మ్యూజియంలోని సమకాలీన చిత్ర కళా గ్యాలరీ గురించి వ్రాయవలసింది. ఏమైనా తెలంగాణ ప్రభుత్వ సాంస్కృతికశాఖకు సంబంధించిన స్టేట్ ఆర్ట్ గ్యాలరీ ఈ గ్రంథాన్ని ఇంత అందంగా ముద్రించినందుకు అభినందించవలసిందే.
అయితే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ రాష్ట్రంలో జాతీయ స్థాయి చిత్రకారుల, చిత్రకళా వ్యక్తిత్వాలకు కళ్ళకుకట్టే విధంగా రంగురంగుల అందమైన లఘుగ్రంథాలు ప్రచురిస్తే కళాభిమానులకు, సాధారణ ప్రేక్షకులు, పాఠకులకు కరదీపికలుగా నిలుస్తాయి.
-టి. ఉడయవర్లు