modiతెలంగాణకు చెందిన ఇద్దరు బాలలు సాహస బాలల అవార్డును అందుకున్నారు. జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి యేడు ఇచ్చే ఈ అవార్డును జనవరి 24న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రదానం చేశారు. వీరితో పాటు మరో 23 మంది బాలలు ఈ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డు కింద ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందజేశారు. ఈ సత్కారం పొందినవారిలో తెలంగాణకు చెందిన రుచితాగౌడ్‌(8), సాయికష్ణ అఖిల్‌ (14) ఉన్నారు.

మెదక్‌ జిల్లా తూప్రాన్‌ మండలం వెంకటాయపాలెంకు చెందిన శివ్వంపేట రుచితకు గీతాఛోప్రా అవార్డును, హైదరాబాద్‌ ఆగాపురకు చెందిన సాయికష్ణకు జాతీయ బాలల సాహస అవార్డును ప్రదానం చేశారు. అవార్డులు అందుకున్న చిన్నారుల్లో రుచిత అతి పిన్న వయస్కురాలు. అవార్డులు పొందిన చిన్నారులను, వారి తల్లిదండ్రులను ప్రధాని అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పిల్లలు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం మాత్రమే కాకుండా పరిసరాలపై మనసును లగ్నం చేయడం ద్వారా సరైన సమయంలో తెలివిగా వ్యవహరించారని అన్నారు. ఆపద సమయంలో ఇతరుల కోసం ఆలోచించడం వారి పెద్ద మనసుకు అద్దం పడుతున్నదని అన్నారు. అవార్డులు అందుకున్న చిన్నారులు జీవితంలో మరెన్నో పనులు చేయాలని, చదువు, భవిష్యత్తుపై దష్టి పెడుతూనే సమాజం కోసం తమ తెలివితేటలను, సామర్థ్యాన్ని వెచ్చించాలని వారికి సూచించారు.

2014లో మెదక్‌ జిల్లా మాసాయిపేట రైల్వే లెవల్‌ క్రాసింగ్‌ దగ్గర స్కూలు బస్సును రైలు ఢీకొన్న సమయంలో ఇద్దరు చిన్నారులను ప్రాణాపాయం నుంచి కాపాడినందుకు రుచితను, విద్యుత్‌ షాక్‌కు గురైన తల్లిని రక్షించినందుకు సాయికష్ణను అవార్డుకు ఎంపిక చేశారు. ఈ పాతికమంది చిన్నారులు జనవరి 26న రాజ్‌పథ్‌లో జరిగే గణతంత్ర దినోత్సవ పెరేడ్‌లో పాల్గొన్నారు. ఈ బాలల హైస్కూలు చదువు వరకు బాధ్యత తీసుకోవడంతో పాటు తర్వాత ఉన్నత చదువులకు అవసరమైన సహకారాన్ని కూడా కేంద్రం అందజేస్తుంది.

జాతీయ బాలల దినోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం భారత బాలల సంక్షేమ మండలి ద్వారా బాలల సాహస అవార్డులను ప్రదానం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఇతరులను ప్రభావితం చేసేలా, తమ గురించి మాత్రమే కాకుండా ఇతరుల గురించి ఆలోచించి సాహసించి ఆపదలో ఆదుకునే బాలలను ఈ అవార్డులకు ఎంపిక చేస్తారు.

Other Updates