సత్యం, శివం, సౌందర్యం అనే మూడు గుణాలకు నిలయం తెలంగాణ రాష్ట్రం. అందమైన, అరుదైన పలుకుబడులకూ, జీవనశైలులకూ నెలవైన ఈ రాష్ట్రంలోని జనపదాలు అపురూపమైన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతిబింబాలు. ప్రతినిత్యం పండుగ జరుపుకొనే ‘నిత్యకల్యాణం పచ్చతోరణం’ వాతావరణం పల్లెలలో కనబడుతుంది. ఇలా ప్రతి యేడాదీ జరుపుకునే ముఖ్యమైన పండుగలలో దసరా, దీపావళిలు ప్రధానమైనవి.
ఆశ్వీయుజమాసంలో వచ్చే దసరా పండుగకూ, కార్తీక మాసంలో పూర్తయ్యే దీపావళి పండుగకూ ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. తెలంగాణ జనపదాలలో దసరా పండుగకు బతుకమ్మ పండుగ పూర్వరంగంగా విరాజిల్లుతోంది. తెలంగాణకే ప్రత్యేకమైన బతుకమ్మపండుగ విశేషాలు అనేకం. ఈ పండుగ దసరాకు ముందు ప్రారంభమై తొమ్మిది దినాలు కొనసాగుతుంది. ఈ తొమ్మిది రోజులలో ప్రారంభదినాన ఎంగిలిపూవు బతుకమ్మను కొలవడం పరిపాటి. ముగింపుదినమైన తొమ్మిదవరోజున చద్దుల బతుకమ్మను పూజిస్తారు. మహాలయ (పితృ) అమావాస్యనాడు బొడ్డెమ్మ ఆటతో బతుకమ్మ పండుగ మొదలౌతుంది. తంగేడు, గునగు, తామర, గుమ్మడి, బంతి, చేమంతి మొదలైన రంగురంగుల పూలతో బతుకమ్మలను శిఖరంలా పేరుస్తారు. ఇలా పేర్చడం వెనుక విశేషం ఉంది. బతుకమ్మ శక్తి స్వరూపిణి. సకల మానవాళికి ఆయురారోగ్యభాగ్యాలను ప్రసాదించే ఆదిశక్తి. ఇచ్ఛా (కోరిక), జ్ఞాన (తెలివి), క్రియా (ఆచరణ) రూపంలో మానవాళిని అభ్యుదయ మార్గాలలో నడిపిస్తుందని జనుల విశ్వాసం. శక్తిని శ్రీచక్ర రూపంలో కొలవడం సంప్రదాయం. శ్రీచక్రం భూమివలె (భూప్రస్థారం), మేరుపర్వతంవలె (మేరు ప్రస్థం), కైలాసపర్వతంవలె (కైలాసప్రస్థం) ఉంటుందని తంత్రశాస్త్రం చెబుతోంది. దీనికి అనుగుణంగా పూలతో శిఖరంలా పేర్చే బతుకమ్మ శ్రీచక్రరూపిణి! ఇలా కొలిస్తే అఖండ భాగ్యాలూ కలుగుతాయి. ఇళ్లల్లోనూ, వాకిళ్లలోనూ, గ్రామాలలోని రహదారుల కూడళ్లలోనూ, దేవాలయాలలోనూ, విశాల ప్రదేశాలలోనూ సామూహికంగా బ్రతుకమ్మలను పేర్చి, మహిళలంతా అప్రదక్షిణంలా తిరుగుతూ ‘బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో’ అని గొంతెత్తి పాడుతూ క్రమబద్ధమైన పదవిన్యాసాలతోనూ, కర విన్యాసాలతోనూ చప్పట్లు కొడుతూ బతుకమ్మను పూజిస్తారు. ప్రతినిత్యం బతుకమ్మకు నైవేద్యాలు సమర్పిస్తారు. సకుటుంబంగా బతుకమ్మ ఆశీస్సులను పొందుతారు. అమావాస్యనాడు ప్రారంభమయ్యే బతుకమ్మ పండుగ దుర్గాష్టమి వరకు తొమ్మిది దినాలు కొనసాగి, ముగుస్తుంది. ఒకవిధంగా బతుకమ్మ పండుగకూడా నవరాత్రోత్సవమే! చద్దుల బతుకమ్మను కొలిచే చివరి దినాన జలాశయాల తీరాలలో, నదీ తీరాలలో రకరకాల చద్దులను ఆరగిస్తారు. ప్రతినిత్యం కొలిచే బతుకమ్మలను జలనిమజ్జనం చేస్తారు. బతుకమ్మ పండుగకు నేపథ్యంగా అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ స్త్రీల మాంగల్య రక్షణనూ, పుత్రపౌత్ర సౌభాగ్యాన్నీ, ఆయురారోగ్య సంపదల సమృద్ధినీకోరి చారిత్రక పురుషులూ, జానపదులూచేసిన ఆరాధనల ఇతివృత్తాలతో అలరారుతున్నాయి. తొమ్మిదిదినాల బతుకమ్మల ఆరాధన క్రమ విధానం ఇది:
(1) ప్రథమ దినం: ఎంగిలిపూల బతుకమ్మ (మహాలయ అమావాస్య)
(2) ద్వితీయ దినం: అటుకుల బతుకమ్మ (ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమి)
(3) తృతీయదినం: ముద్దపప్పు బతుకమ్మ (ఆశ్వీయుజ శుద్ధ ద్వితీయ)
(4) చతుర్థదినం: తండుల బతుకమ్మ (ఆశ్వీయుజ శుద్ధ తృతీయ)
(5) పంచమదినం: అట్ల బతుకమ్మ (ఆశ్వీయుజ శుద్ధ చతుర్థి)
(6) షష్ఠమదినం: అలుక బతుకమ్మ (ఆశ్వీయుజ శుద్ధ పంచమి)
(7) సప్తమ దినం: వేప బతుకమ్మ (ఆశ్వీయుజ శుద్ధ షష్ఠి)
(8) అష్టమదినం: నవనీత బతుకమ్మ (ఆశ్వీయుజ శుద్ధ సప్తమి)
(9) నవమ దినం : చద్దుల బతుకమ్మ (ఆశ్వీయుజ శుద్ధ అష్టమి)
బతుకమ్మ పండుగవలెనే దసరా పండుగ కూడా నవరాత్రుల పండుగే. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడు ప్రారంభమై దశమి వరకు సాగే ఈ నవరాత్రోత్సవాలకు ‘శరన్నవరాత్రులు’అని కూడా పేరుంది. ఆశ్వీయుజ శుద్ధ దశమి నాడు జరిగే ‘దసరా’ వేడుకలకు ‘విజయదశమి’ అని సార్ధక నామధేయం ఉంది. విజయదశమినాడు విజయ ముహూర్తం ఉందనీ, ఆనాడు చేసే ధార్మిక, సామాజిక, కౌటుంబిక, ఆర్థిక, ప్రజా సంక్షేమ కార్యాలన్నీ విజయపథంవైపు సాగిపోతాయనీ, అనుకున్నవన్నీ నెరవేరుతాయనీ జనుల విశ్వాసం. పూర్వం ప్రజాపాలకులుగా చక్రవర్తులూ, రాజులూ ఉండేవారు. వారి రక్షణకోసం, సైనికబలంకోసం దుర్భేద్యాలైన కోటలు ఉండేవి. శరదృతువులోనే రాజులు దిగ్విజయ యాత్రలు చేసేవారు. రాజ్య రక్షణ, దుష్ట శిక్షణ, శత్రు నిర్మూలనం, రాజ్య విస్తరణవంటి అంశాలలో విజయం సాధించేందుకు పూర్వం రాజులుశక్తిపూజలు చేసేవారు. ఆ సంప్రదాయానికి ప్రతిరూపమే విజయదశమి (దసరా) పర్వదినం. తొమ్మిదిరోజులపాటు శక్తిని కొలిచే విధానమే నవరాత్రోత్సవ దీక్ష. పాడ్యమినుండి దశమివరకు రోజుకొక్క రూపంలో శక్తి దర్శనమిస్తుందనీ, విజయదశమినాడు ‘అపరాజిత’అనే శక్తి అపజయాలులేని విజయఫలాలను అందిస్తుందనీ ప్రజల నమ్మకం.
దసరానాడు జమ్మిచెట్టును పూజించడం సంప్రదాయం. దీనినే శమీపూజ అంటారు. జమ్మిచెట్టు విజయానికి సంకేతం. పూర్వం ద్వాపరయుగంలో పాండవులు శత్రువులపై విజయానికి కావలసిన తమ ఆయుధాలను అన్నింటినీ ఈ జమ్మిచెట్టుపైనే సంరక్షించి, వాడుకొన్నారు. వారికి యుద్ధంలో విజయం లభించింది. ఈ కారణంగానే దసరానాడు ఆయుధ పూజలు చేయడం, యంత్రాలను
అర్చించడం, జమ్మిచెట్టును
పూజించడం ఆనవాయితీగా మారింది. జమ్మిచెట్టును పూజించే సమయంలో ఈ క్రింది శ్లోకాలను పఠించడం జరుగుతుంది.
‘శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్దాత్రీ రామస్య ప్రియవాదినీ
శమీ శమయతే పాపం శమీలోహితకంటికా
ధారిణ్యర్జునబాణానాం రామస్యప్రియవాదినీ
కరిష్యమాణయాత్రాయాం యథాకాలం సుఖంమయా
తత్ర నిర్వఘ్నకర్త్రీ త్వం భవ శ్రీరామపూజితే!
అంటే జమ్మిచెట్టు పాపాలను హరిస్తుందనీ, శత్రువులను తుదముట్టిస్తుందనీ, అర్జునునివంటి మహావీరునికి ధనుర్భాణా లను ప్రసాదించిందనీ, రామునికి ప్రియాన్ని చేకూర్చిందనీ, విజయయాత్రలలో సత్ఫలితాలను ప్రసాదించిందనీ, ఎలాంటి ఆటంకాలు లేని జీవితాన్ని ప్రసాదించిందనీ అర్థం.
జమ్మిచెట్టును పూజించడానికీ, జమ్మి కొమ్మలను, ఆకులనూ సేకరించడానికి ఊరిపొలిమేరలను దాటి వెళ్లడాన్ని తెలంగాణ జనపదాలలో ‘జంబికి వెళ్లడం’ అని అంటారు. జమ్మి ఆకులనూ, కొమ్మలనూ సేకరించడాన్ని ‘జంబికొట్టడం’ అంటారు. దసరానాడు సీమోల్లంఘనం (ఊరి పొలిమేరలుదాటి పోవడం) చేసి, ఇష్టదేవతలకు మొక్కులు చెల్లించి, ఆత్మీయ బంధుమిత్రుల అభినందనలనూ, ఆశీస్సులనూ గైకొని, పాలపిట్టను దర్శించడం సంప్రదాయం. దసరానాడు పాలపిట్టను చూస్తే సకలశుభాలూ కలుగుతాయనీ, అభీష్టమనోరథాలు నెరవేరుతాయనీ జనుల ప్రగాఢ విశ్వాసం. ఇలా దసరా పండుగ తెలంగాణ జనజీవనశైలిని ఎంతగానో ప్రభావితం చేస్తోంది.
దీపావళి పండుగ పూర్వోత్తర దినాలతో కలిపి అయిదురోజుల పండుగగా కనబడుతుంది. ఆశ్వీయుజ బహుళ త్రయోదశినాడు ప్రారంభమై కార్తీక శుద్ధ ద్వితీయ వరకు దీపావళి పండుగ జరుగుతుంది. ఈ అయిదు దినాల విశేషాలు ఇలా ఉంటాయి.
1. ఆశ్వీయుజ బహుళ త్రయోదశి… ధన త్రయోదశి (ధన్‌తేరస్)
2. ఆశ్వీయుజ బహుళ చతుర్దశి… నరక చతుర్దశి
3. ఆశ్వీయుజ అమావాస్య… దీపావళి
4. కార్తీక శుద్ధ పాడ్యమి… బలిపాడ్యమి
5. కార్తీక శుద్ధ ద్వితీయ…
భ్రాతృద్వితీయ (యమద్వితీయ) భగినీహస్త భోజనం
ధనత్రయోదశినాడు భూలోకంలో ప్రతి ఇంటా లక్ష్మీదేవి తాండవిస్తుందనీ, లక్ష్మీదేవి ఆగమనాన్ని స్వాగతించేందుకు బంగారాన్ని కొనడం, ధనాన్ని ఇంటిలో పూజా మందిరంలో
ఉంచి పూజించడం, వ్యాపార వాణిజ్య స్థానాలలో లక్ష్మీదేవిని అర్చించడం సంప్రదాయం. ఇలా చేయడంవల్ల సకలైశ్వర్య రూపిణి అయిన లక్ష్మీదేవి కరుణాకటాక్షాలు లభించి, సంపదలు అపారంగా వర్ధిల్లుతాయనీ, జీవితం ఆనందమయం అవుతుందనీ అందరూ విశ్వసిస్తారు. ఈ పండుగను ‘ధన్‌తేరస్’ అని కూడా పిలుస్తారు.
రెండవ దినం అయిన నరక చతుర్దశిని సత్యభామా శ్రీకృష్ణులు నరకాసురునిపై విజయం సాధించి, లోకానికి రాక్షసకంటకాన్ని నిర్మూలించినందుకు సంకేతంగా జరుపుకొంటారు. ఈనాడు దీపాలు వెలిగించి పూజలు చేస్తే నరకబాధ ఉండదనీ, జ్యోతిర్మయలోకాలే లభిస్తాయనీ అందరి నమ్మిక. అంతేగాక మహావిష్ణువు వామనావతారంతో బలిచక్రవర్తి అహంకారాన్ని అణచి, పాతాళానికి అణగద్రొక్కిన దినంగా కూడా ఈ దినాన్ని పరిగణిస్తారు. శ్రీరాముడు పట్టాభిషిక్తుడైన పుణ్యదినంకూడా ఇదే అని పురాణాల కథనం.
మూడవదినం అయిన ‘దీపావళి’ ఎంతో ప్రాధాన్యతను కలిగిన పండుగ. ఇంటింటా దీపాలు దివ్యంగా వెలిగే ఈ పండుగనాడు ఆనందోత్సాహాలతో టపాకాయలు పేలుస్తూ పర్వదిన విశేషాన్ని లోకానికి చాటడం సంప్రదాయం. చెడు, అజ్ఞానం, పాపం ఇవన్నీ చీకటివంటివనీ, వీటిపై విజయాన్ని సాధించినందుకు దీపాలను వెలిగించి లోకమంతా వెలుగులమయమనీ, పుణ్యదాయకమనీ, జ్ఞానరూపమనీ, పవిత్ర నిలయమనీ భావించడం ఇందులోని పరమార్థం.
బలిపాడ్యమినాడు పితృదేవతలకు బలులు (నైవేద్యాలు) సమర్పించి, వారికి నరకలోక బాధలను తప్పించేందుకు దీపాలను వెలిగిస్తారు. మరణించి పితృలోకాలలో ఉండే పెద్దలు ఈ దినాల భూలోకానికి వస్తారనీ, తమ వారసులు ఇచ్చే బలులను (ఆహారపదార్థాలను) భుజిస్తారనీ నమ్మకం.
యమద్వితీయ, భ్రాతృద్వితీయ అనే పేరుతో వ్యవహరింపబడే ద్వితీయనాడు జనులు తమ సోదరీమణుల ఇండ్లకు వెళ్లి వారి కరకమలాలతో వడ్డించిన విందు భోజనాన్ని ఆరగించాలని సంప్రదాయం. ఇలా చేస్తే సోదరీసోదరుల మధ్య ప్రేమానురాగాలూ, ఆత్మీయతలూ క్షీణించకుండా ఉంటాయని అందరూ నమ్ముతారు. పూర్వం యమధర్మరాజు కూడా తన సోదరి యమున ఇంటికి వెళ్లి, ఆమె చేతివంటను ఎంతో ప్రేమగా ఆరగించి, ఆమెకు అనేకవరాలు ప్రసాదించాడని ఐతిహ్యం. ఇలా సోదరీమణుల ఇండ్లకు వెళ్లి ఈ ద్వితీయనాడు ఎవరు భోజనం చేస్తారో, వారికి నరకబాధ ఉండదనీ, సకల సౌఖ్యాలు కలుగుతాయనీ ప్రాచీన గ్రంథాలు చెబుతున్నాయి. ఈ యమద్వితీయతో దీపావళి పండుగ వరుస ముగుస్తుంది.
ఇలా దసరా, దీపావళి పండుగలు తెలంగాణ జనజీవితాలపై అపార ప్రభావాన్ని చూపుతున్నాయి. కల్లాకపటం తెలియని జానపదులు ఇలాంటి పర్వదినాలలో తమ ఆనందాలను వ్యక్తం చేయడానికి అనేక కళలను ప్రదర్శిస్తారు. అవన్నీ తెలంగాణ జానపదకళల రూపంలో విరాజిల్లుతున్నాయి.
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలు. పల్లెలలో ప్రభవించిన సంప్రదాయాలే పట్టణాలకు విస్తరించి, దేశమంతా వ్యాపించి, స్నేహ సౌభ్రాతృత్వాలను శాశ్వతంగా నిలిపేందుకు దారి చూపుతున్నాయి. పండుగలలోని పరమార్థం మానవ సుఖశాంతిమయ జీవనమేకాని, మరొకటి కాదు. కనుక దసరా-దీపావళి పర్వదినాలు అందరి హృదయాలనూ స్నేహ సూత్రాలతో బంధించాలని కోరుకుందాం!
విజయదశమినాడు విజయ ముహూర్తాన్నిగూర్చి ప్రాచీనగ్రంథాలు ఇలా చెప్పాయి:-
‘ఆశ్వినస్య సితే పక్షే దశమ్యాం తారకోదయే
సకాలో విజయో నామ సర్వకామార్థసాధక:!
అంటే ఆశ్వయుజ
శుక్లపక్ష దశమినాడు నక్షత్రాలు
కనబడే ఉషోదయ వేళలో
‘విజయ ముహూర్తం’ సంభవిస్తుందనీ, అది సకల కామనలనూ
నెరవేస్తుందనీ అర్థం.
డా|| అయాచితం నటేశ్వరశర్మ