ప్రతియేడాదీ సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే పుణ్యదినాన జరుపుకొనే పండుగ మకర సంక్రాంతి. సూర్యుడు ప్రతిమాసం ఒక్కొక్క రాశిలోకి అడుగుపెడుతుంటాడు. మేషరాశి మొదలుకొని మీనరాశి వరకు గల పన్నెండు రాశులలోనికి పన్నెండు నెలల పాటు సూర్యుడు ప్రవేశించడం వల్ల నెలకొక్క సంక్రాంతి ఏర్పడుతుంది. కానీ అన్ని సంక్రాంతుల కంటె మకర సంక్రాంతి విశేష ప్రాధాన్యం
ఉంది. దీనికి కారణం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్యుని గమనం ఉత్తరం వైపుకు మరలడమే. కర్కాటక సంక్రాంతి నుండి మకర సంక్రాంతి దాకా సూర్యుడు దక్షిణం వైపుకు తిరిగితే, మకర సంక్రాంతి నుండి కర్కాటక సంక్రాంతి దాక ఉత్తరం వైపుకు ప్రయాణిస్తాడు. ఉత్తరం వైపు దేవలోకాలూ, దక్షిణం వైపు పితృలోకాలూ ఉంటాయి. అంతేగాక దేవతలు దక్షిణాయనంలో నిద్రించి, ఉత్తరాయణంలో మేల్కొంటారు. మకర సంక్రాంతినాడు దేవతల నివాసాల ప్రధాన ద్వారాలు తెరువబడుతాయి కనుక ఈ దినాన్ని పవిత్రంగా భావిస్తారు.
ఉత్తరాయణ పుణ్యకాలంలో
మరణించినవారు ఉత్తమ లోకాలైన దేవలోకాలకు పోతారనీ, దక్షిణాయన పుణ్య కాలంలో మరిణించిన వారు నరకలోకానికి పోతారనీ ఒక నమ్మకం. ఈ కారణంగా
ఉత్తరాయణంలోనే సకల శుభకార్యాలూ తలపెట్టడం కనబడుతుంది. మరణం విషయంలో ూడా
ఉత్తరాయణమే సద్గతి దాయకమని జన విశ్వాసం. భీష్ముడు సైతం అంపశయ్యపై పడుకొని, ఉత్తరాయణం వచ్చేదాకా మరణానికి వేచి ఉండడం వెనుక గల పరమార్థం ఇదే!
తెలంగాణ జనపదాలలో సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటినాడు భోగి, భోగం అంటే దేవతలకు నివేదించే నైవేద్యం. ఈ దినాన కొత్త బియ్యంతో వండిన క్షీరాన్నాన్ని దేవతలకు సమర్పిస్తారు. ఇళ్లలోనూ, వాకిళ్లలోనూ రంగురంగుల ముగ్గులు వేసి, ఆ ముగ్గులపై ఆవుపేడతో చేసిన గొబ్బెమ్మ (గొంతెమ్మ)లను పేర్చి, వాటిపై గరిక, పసుపు, కుంకుమ, రేగుపండ్లు, చెరుకు ముక్కలు, జీడిపండ్లు, బియ్యం, పత్తి, నువ్వులు వంటి ద్రవ్యాలను వేస్తారు. స్త్రీలు సౌమంగల్యం కోసం, సౌభాగ్యం కోసం, కుటుంబ క్షేమం కోసం గౌరీదేవిని పూజించి, పదమూడు శోభన వస్తువులను సమర్పించి, వాటిని ముత్తయిదువులకు దానం చేస్తారు. వీటినే నోములు అని పిలవడం పరిపాటి.
‘సంక్రాంతి’ రోజున చక్కెర పాకంతో చిలుకల ఆకృతితో చేసిన తీపి పదార్థం (శక్కరి చిలుకలు), నూల ఉండలు (నువ్వులు, బెల్లంతో చేసిన చిన్న లడ్డూలు), చెరుకుముక్కలు, జీడి పండ్లు, రేగుపండ్లు (రేణివండ్లు), నువ్వులతో కలిపిన చక్కెర, కూరగాయలముక్కలు, ఉప్పు, పప్పు దినుసులు, పసుపు, కుంకుమ వంటి వాటిని ఇతరులకు పంచడం, దానాలలో ఉపయోగించడం కనబడుతుంది. నువ్వులు కలిపిన చక్కెరను ఇచ్చే సమయంలో ‘నువ్వులు తిని నూరేళ్లు బ్రతుకు, చక్కెరతిని తీయగా మాట్లాడు’ అని చెబుతారు. ఈ దినాన పిండి వంటలలో సజ్జ రొట్టెలు, (చకిలాలు) సకినాలు, అరిసెలు, చేగోళ్లు, నూనె బిళ్లలు, (భక్ష్యాలు) పోలెలు వంటివి భోజనంలో చేరుతాయి. వీటిని ఆరగిస్తూ కుటుంబ సభ్యులతోనూ, బంధుమిత్రులతోనూ పండుగను ఆనందంగా జరుపుకుంటారు. పిల్లలూ, పెద్దలూ పతంగులను (గాలిపటాలను) గాలిలోకి ఎగురవేస్తారు. పై లోకాలలో ఉండే దేవతలకు తమ ఆకాంక్షలను తెలియజేయడం, దేవతల నుండి ఆశీస్సులూ, వరాలను పొందడం, తమ ఆనందాన్ని లోకానికి తెలియజేయడం దీని పరమార్థంగా భావించవచ్చు. ఈ దినాన పెద్దలు పిల్లలను ఆశీర్వదిస్తూ, వారి తలలపై ‘బోడపండ్లు’ (బోడి అంటే శరీరం. శరీరంపై పడే విధంగా పోసేవి) పోస్తారు.
తెలంగాణ జనపదాలలో సంక్రాంతి మూడు రోజుల పండుగ. మొదటినాడు భోగి, భోగం అంటే దేవతలకు నివేదించే నైవేద్యం. ఈ దినాన కొత్త బియ్యంతో వండిన క్షీరాన్నాన్ని దేవతలకు సమర్పిస్తారు.
ఈ బోడపండ్లలో రేగుపండ్లు, చెరుకు ముక్కలు, నువ్వులు, బియ్యం, చిల్లరపైసలు, బంతిపూల రెక్కలు కలిసి ఉంటాయి. ఇలా బోడిపండ్లు పోయడం వల్ల పిల్లల ఆయురారోగ్యాలు వృద్ధి చెందుతాయని ప్రజల నమ్మకం.
సంక్రాంతి మరుసటి దినం అయిన ‘కనుము’ పండుగ వ్యవసాయం చేసే రైతులకు ఎంతో ముఖ్యమైంది. ఈ దినాన పశువులకు స్నానం చేయించి, వాటి కొమ్ములను రంగులతోనూ, పూలదండలతోనూ అలంకరిస్తారు. వ్యవసాయానికి ఉపయోగించే బండ్లను కూడా రంగు రంగు బట్టలతో, పూలదండలతో అలంకరిస్తారు. మట్టితో ఎడ్లను తయారుచేసి పూజిస్తారు. వ్యవసాయానికి ఉపయోగించే పరికరాలైన నాగలి వంటి వాటిని, రోకళ్లు, చేటలు, కుదుర్లు వంటి గృహోపకరణాలనూ అర్చిస్తారు. తమ బ్రతుకులను నిలిపే పరికరాల పట్ల కృతజ్ఞతాభావం, అవి దైవసమానాలనే నమ్మకం ఇందులో ప్రస్ఫుటంగా కనబడుతుంది.
ఇలా మకర సంక్రాంతి పండుగ తెలంగాణ జనపదాలలో జనులందరిచేత ఆచరింపబడుతూ, వారి జీవితాలలో ఆనందోత్సాహాలను అందించడమే గాక, కొత్త వెలుగుల్ని కూడా ప్రసాదిస్తోంది.