indira2

ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకోసం సాగుతున్న ఉద్యమంలో చివరి ఘట్టంగా ప్రజా సమితి 1970 ఏప్రిల్‌ 22న ప్రారంభించిన రిలే నిరాహారదీక్షలు తొలిరోజు జంటనగరాలతోబాటు అన్ని జిల్లాల్లో విజయవంతంగా నిర్వహించారు.

నిజామాబాద్‌లో శాసనసభ్యులు జి. రాజారాం నాయకత్వంలో జిల్లా కలెక్టరేట్‌ ముందు రిలే నిరాహారదీక్షలను ప్రజా సమితి నిర్వహించింది. బోధన్‌లో శాసనసభ్యులు శ్రీనివాసరావు డిప్యూటీ కలెక్టర్‌ కార్యాలయం ముందు రిలే నిరాహార దక్షను చేపట్టారు.

కొత్తగూడెంలో ప్రజా సమితి కార్యకర్తలు, నాయకులు రిలే నిరాహారదీక్షలను ప్రారంభించారు. ముస్తఫా కమాల్‌ ఖాన్‌ నాయకత్వంలో ఈ దీక్షలు నిర్వహించారు.

ఖమ్మంలో గొల్ల వెంకటేశ్వర్‌రావు గాంధీచౌక్‌వద్ద దీక్షలకు నాయకత్వం వహించారు. రామవరం, రుద్రంపూర్‌, ఇల్లెందు, వైరా, మరికొన్ని పట్టణాలలో దీక్షలను ప్రజా సమితి నిర్వహించింది.

కరీంనగర్‌లో శాసనసభ్యులు కెప్టెన్‌ లక్ష్మీనరసింహారావు, హుజూరాబాద్‌లో శాసనసభ్యులు పోల్సాని నర్సింగరావు, పంచాయతి సమితి అధ్యక్షులు పి. జనార్దన్‌రెడ్డి దీక్షలకు నాయకత్వం వహించారు. నల్లగొండలో దామోదర్‌రెడ్డి, రామకృష్ణారెడ్డి దీక్షలకు నాయకత్వం వహించారు. వరంగల్‌లో హయగ్రీవాచారి (తెలంగాణ పీసీసీ కార్యదర్శి), భూపతి కృష్ణమూర్తి మరో నలుగురు, జె.పి.రోడ్‌వద్ద రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. ప్రజాసమితి జిల్లా శాఖ అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి. పురుషోత్తమరావు హన్మకొండలో రిలే దీక్షలు ప్రారంభించారు. ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కాలేజీ విద్యార్థి సంఘాల అధ్యక్షులు టి. సిద్దులు మరో మూడు సంఘాలవారు ఈ దీక్షలో పాల్గొన్నారు.రెండో రోజు ఏప్రిల్‌ 23న కూడా తెలంగాణ అంతటా రిలే నిరాహారదీక్షలు కొనసాగినవి. ఈ దీక్షలో తెలంగాణ ప్రజా సమితి కార్యదర్శి ఎస్‌. వెంకట్రామిరెడ్డి (ఎమ్మెల్సీ), మునిసిపల్‌ కౌన్సిలర్లు గోవిందసింగ్‌, ఇ.వి. పద్మనాభం, బాలరాజు, మర మల్లారెడ్డి, కాశీరాం తదితరులు ఉన్నారు. తొలిరోజు దీక్షలు ప్రారంభించిన వి.బి. రాజు, ఇతర నాయకులు 24 గంటలపాటు దీక్షలో పాల్గొని రెండో రోజు ఉదయం విరమించారు. కొన్ని ప్రాంతాల్లో పోలీసులు దీక్షా శిబిరాలను బలవంతంగా తొలగించారు.

చెన్నారెడ్డి నిరశన దీక్ష

రిలే నిరాహారదీక్షల మూడోరోజైన ఏప్రిల్‌ 24న హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజ వద్ద తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు డా|| మర్రి చెన్నారెడ్డి స్వయంగా దీక్షలో పాల్గొని శిబిరానికి నాయకత్వం వహించారు. జంటనగరాల్లోని 13 రిలే నిరాహార దీక్షా శిబిరాల్లో 300మందికి పైగా తెలంగాణవాదులు దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షలకు డా|| చెన్నారెడ్డితోబాటు సంతపురి రఘువీర్‌రావు, బొజ్జా నరసింహులు, మదన్‌మోహన్‌, జయా చారి, మరెందరో కౌన్సిలర్లు నాయకత్వం వహించారు.

ఏప్రిల్‌ 25, 1970న వెలువడిన ఆంధ్రజ్యోతి దినపత్రిక కథనం ప్రకారం… ”ఆందోళనకారుల్లో ఉత్సాహం నెమ్మదిగా, నిలకడగా పుంజుకొంటున్నది. ఈ శిబిరాలు గ్రూపు చర్చలకు వినియోగపడుతున్నాయి. ప్రజాసమితి నాయకులు ఈ శిబిరా లను రోజంతా సందర్శిస్తూ కార్యక్రమాలను శాంతి యుతంగా ఎలా నిర్వహించాలో వివరిస్తున్నారు.

వరంగల్‌, హన్మకొండలో తొమ్మిది దీక్షా శిబిరాలను ప్రజా సమితి నిర్వహిస్తున్నది. ఈ దీక్షలను సమితి ఉపాధ్యక్షులు ఎస్‌.బి. గిరి, శాసనసభ్యులు పురుషోత్తమరావు తదితరులు మూడోరోజు సందర్శించారు.ఖమ్మంలో మూడోరోజు దీక్షలకు ఒక్కో శిబిరంలో 25మంది కూర్చున్నారు. మూడు దీక్షా శిబిరాలను ప్రజాసమితి నిర్వహిస్తున్నది. 1969 తొలిదశ ఉద్యమంలో చురుకుగ్గా పాల్గొన్న సికింద్రాబాద్‌ విద్యార్థి నాయకుడు సూరి (పట్టం సూర్య ప్రకాశరావు) ఒక ప్రకటనలో డా|| చెన్నారెడ్డి, వి.బి.రాజు తదితర మాజీ మంత్రులు నిర్వహించే రిలే నిరాహార దీక్షలకు సహకరించరాదని విజ్ఞప్తి చేశారు. సూరి పోటీ తెలంగాణ ప్రజాసమితికి సికిందరాబాద్‌ శాఖ అధ్యక్షునిగా వున్నారు. ”తెలంగాణ కష్టనష్టాలన్నింటికి బాధ్యులైన ఈ మాజీమంత్రులు ఉద్యమానికి నాయకత్వం వహించడం ద్వారా తమనుతాము కప్పిపుచ్చుకోవడానికి యత్నిస్తున్నారు” అని ఆయన పత్రికా ప్రకటనలో తెలిపారు.

తెలంగాణ సమస్య ఆర్థికపరమైనది:

నరసారెడ్డి (పీసీసీ అధ్యక్షులు)

తెలంగాణ ప్రాంతానికి చెందిన పి. నరసారెడ్డి ఏపీ కాంగ్రెస్‌ కమిటీకి అధ్యక్షులుగా వున్నారు. డి.సి.సి. కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ ”తెలంగాణ సమస్య ఆర్థికపరమైనది. దేశ సమగ్రత దృష్టితో చూడాలి. ప్రధాని ప్రతిపాదించిన ఎనిమిది సూత్రాల పథకాన్ని విశ్వాసంతో అమలుచేస్తే తెలంగాణ సమస్య పరిష్కారమవుతుంద”న్నారు. ప్రత్యేక తెలంగాణ డిమాండ్‌ను మొదటినుంచి నరసారెడ్డి వ్యతిరేకిస్తున్నారు. ”ప్రత్యేక తెలంగాణతో ఈ ప్రాంత సమస్యలు పరిష్కరించబడవు. ఉద్యమంవల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. విద్యార్థుల చదువులు నాశనమైనాయి” అని ఆయన తన ప్రసంగంలో అన్నారు.

తెలంగాణకు ఉప రాష్ట్రప్రతిపత్తి

రిలే నిరాహార దీక్షలతో తెలంగాణ అంతటా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరోసారి పుంజుకొంటున్న పరిస్థితిని గమనించి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన అనుచరుడు, రాష్ట్ర కార్మికశాఖామంత్రి జి. సంజీవరెడ్డి, అంజయ్య ద్వారా చెన్నారెడ్డికి ”తెలంగాణకు ఉపరాష్ట్ర ప్రతిపత్తి” ప్రతిపాదనను పంపించారు. గతంలో పీసీసీ అధ్యక్షులుగా దివంగత బి.వి. గురుమూర్తి ద్వారా కూడా ఒకసారి బ్రహ్మానందరెడ్డి ఈ ప్రతిపాదననే డా|| చెన్నారెడ్డికి పంపించారు. ఈ ప్రతిపాదనపై డా|| రెడ్డి ఏప్రిల్‌ 24న రిలే నిరాహార దీక్షా శిబిరంవద్ద స్పందించారు.

తెలంగాణ సమస్య పరిష్కారం విషయంలో ఏదో ఒక అంగీకారానికి రావలసిందిగా సీనియర్‌ శాసనసభ్యులు, మంత్రులు, పలువురు ప్రముఖులు అనునిత్యం తన వద్దకువచ్చి కోరుతున్నారని ఆయన వెల్లడించారు. తెలంగాణకు ఉపరాష్ట్ర ప్రతిపత్తి ప్రతిపాదనను తన వద్దకు తెచ్చినవారు ముఖ్యమంత్రి ప్రతినిధులుగానే వచ్చినట్లు స్పష్టం చేశారని డా|| చెన్నారెడ్డి అన్నారు. అయితే తెలంగాణపట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్న తీరునుబట్టి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ఖాయమైనట్లు తేలుతున్నదని, ఇక ‘ఆ’ ఏర్పాటు ‘ఎప్పుడా’ అనేది తేలవలసి ఉన్నదని ఆయన అన్నారు. అయితే ”తాము ఏ ప్రతినిధినీ చెన్నారెడ్డివద్దకు పంపలేదని ముఖ్యమంత్రి ఖండించారు. అందువల్ల బాధ్యతగల నాయకుడెవరైనా సూచిస్తే తప్ప తాము ఆ ప్రతిపాదనను గణనలోకి తీసుకోనని” ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్లు (ఆంధ్రభూమి ఏప్రిల్‌ 25) దినపత్రికలో వార్త వచ్చింది.

విద్యార్థులకు నష్టం జరుగనివ్వం: చెన్నారెడ్డి

ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమైన నాటినుంచి 1969 ఆగస్టు వరకు విద్యార్థులంతా తరగతులను బహిష్కరించి, త్యాగాలకు సిద్ధపడి పోరాటాల్లో, కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. విద్యా సంవత్సరం నష్టపోతామని తెలిసి కూడా పరీక్షలు రాయలేదు. విద్యార్థి కార్యాచరణ కమిటీ పిలుపునిచ్చినా, డా|| చెన్నారెడ్డి పిలుపునిచ్చినా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వందల సంఖ్యలో ప్రాణాలర్పించారు. వేలాదిగా గాయపడ్డారు.

జూన్‌ 25న ప్రజా సమితి, విద్యార్థి నాయకులంతా అరెస్టు కావడం సెప్టెంబర్‌ నుంచి తిరిగి విద్యాలయాలు తెరవడం, విద్యార్థులు తరగతులకు హాజరు కావాలని డా|| చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌ బాపూజీ విజ్ఞప్తి చేయడం, తాత్కాలికంగా (1969 చివరి మాసాల్లో) ఉద్యమాన్ని విరమించడం… ఇవన్నీ విద్యార్థుల్లో తీవ్రమైన అసంతప్తి కలిగించింది.

ప్రపంచంలోనే అరుదైన రీతిలో మహోద్యమం నడిపి అసమాన త్యాగాలు చేసినా కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందుకు రాకపోవడం, ఉద్యమంపై ఉక్కుపాదం మోపుతూ అప్రజాస్వామికంగా పాలన సాగిస్తున్న బ్రహ్మానందరెడ్డినే సీఎంగా కొనసాగించడం, తెలంగాణ ప్రజా ప్రతినిధుల్లో ఎంతోమంది బ్రహ్మానందరెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తూ ఉద్యమ అణచివేతకు సహకరించడం, కేసుల్లో ఇరుక్కున్న విద్యార్థులకు నాయకులు ఆర్థిక, న్యాయ సహాయం అందించకపోవడం… ఇవన్నీ విద్యార్థుల్లో నిరాశ, నిస్పృహలకు కారణమైనాయి.

1970 ఏప్రిల్‌ 22నుంచి మొదలైన రిలే నిరాహార దీక్షలకు విద్యార్థులు దూరంగా వున్నారు. రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, చెన్నారెడ్డిని అనుసరించే తెలంగాణ ఉద్యమకారులు మాత్రమే దీక్షల్లో పాల్గొన్నారు. ఏడాదిక్రితం సాగిన తెలంగాణ ఉద్యమంతో పోల్చితే 1970 ఏప్రిల్‌లో (డా|| చెన్నారెడ్డి అంతిమ పోరాటానికి పిలుపునిచ్చినా) ఉద్యమం బాగా బలహీనపడింది. తెలంగాణ ప్రజల్లో అత్యధికులు తెలంగాణ రాష్ట్రం కోరుతున్నా ఆందోళనలు, ఉద్యమాలతో ఫలితం ఉండదని భావించారు.

హైదరాబాద్‌లోని లాల్‌దర్వాజవద్ద ఏప్రిల్‌ 24న ప్రజా సమితి హైదరాబాద్‌ శాఖ అధ్యక్షులు మాణిక్‌రావు, సంస్థ ఉపాధ్యక్షులు మదన్‌మోహన్‌తో కలిసి డా|| చెన్నారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ”విద్యార్థులను ప్రజా సమితి పట్టించుకోవడం లేదనే భావం విద్యార్థివర్గాల్లో ఉన్నది. అది సరికాదు. కేసుల్లో చిక్కుకున్న విద్యార్థుల తరఫున వాదించడానికి న్యాయవాదులను పెడతాం. అరెస్టయి విద్యార్థులను జామీనుపై విడుదల చేయించడంలో నిధుల కొరతవలన కొంత ఆలస్యం జరుగుతున్నది. అంతమాత్రంచేత విద్యార్థుల సంగతి పట్టించుకోవడంలేదనడం సరైనది కాదు. విద్యార్థులకు నష్టం లేకుండా చూడడానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత తగువిధంగా నిబంధనలను సవరిస్తా”మన్నారు.

(వచ్చే సంచికలో… తెలంగాణ కోసం సత్యాగ్రహాలు)

వి.ప్రకాశ్‌

Other Updates