ఇంత వరుకు మనం క్రీస్తుశకం, శాలివాహనశకం అంటూ కాలాన్ని కొలిచాం. తెలంగాణ ఆవిర్భావా నంతరం, ఓ నవశకం- ‘తెలంగాణ శకం’ మొదలైందంటారు వరంగల్లు వాసి, విశ్రాంత ఆంగ్ల ఉపాధ్యాయులు వెలపాటి రామరెడ్డి. పుట్టినగడ్డ మీది ప్రేమచేత ‘తెలంగణా! ప్రధాన వస్తువుగా ఆరు గ్రంథాల్ని వెలు వరించారు. ఇది వీరి ఏడవ పుస్తకం.
మూడుకోట్ల తెలంగాణా వాసుల ‘వేరు తెలంగాణా’ కల ఫలించటం, వేరు రాష్ట్రానికి, ‘తెలంగాణా తెచ్చుడో సచ్చుడో’ అని నడుం కట్టిన కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం మన భాగ్యం.
ఇదే విషయాన్ని రామరెడ్డి ఈ సంకలనంలో గేయాల రూపంలో మన ముందుకు తెచ్చారు. శిష్ట చందోబద్ధం కాకున్నా ఈ గేయాలన్నీ పాడుకోవటానికి అనువుగా, చక్కని శైలి, భాష, భావ ప్రకటన కలిగి ఉన్న గేయాలివి.
పునర్వసు శ్రీరాముని జనన నక్షత్రం అని, తెలంగాణా ఆవిర్భవించింది కూడా పునర్వసు నక్షత్ర సమయమే. కనుక రామరాజ్యం అవ్వాలి మన తెలంగాణ పాలన అనటం గొప్ప భావన. ‘తెలంగాణా చారిత్రిక నేపథ్యం’ అంటూ క్రీ.శ. 1323నుండి 2 జూన్ 2014 వరకు (పే4) వివరించిన తీరు ఎంతో విజ్ఞానదాయకం. అట్లాగే ‘తెలంగాణ రాష్ట్ర తొలి పండుగలు’ (పే29) అంటూ 1948 నుండి 2014 జరిగిన చారిత్రక అంశాల్ని వివరిస్తారు.
కవులు స్వేచ్ఛా జీవులు. భావుకులు. వారు ఏ విషయాన్నైనా దేనితోనైనా పోల్చే స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉంటాయి. కానీ చరిత్రను పద్యీకరించే కవుల విషయం అట్లా కాదు. చారిత్రకాంశాల్ని విస్మరించకుండా వ్రాయగలగాలి. ‘ఇదో అసిధారావ్రతం’. ఈ వ్రతాన్ని కడు నిష్టతో పాఠకుల ముందుకు తెచ్చిన రచయిత బహుధా ప్రశంసనీయులు.
తెలంగాణా రాష్ట్రం ఏర్పడకముందు, ఆ తర్వాత, పలు పత్రికల్లో వెలువడిన గేయాలను ఈ సంకలనరూపంగా తెచ్చిన రామరెడ్డి తెలంగాణా తల్లిని ‘ఎడ్డితల్లి, చంటి తల్లి, గాయాల తల్లి’గా (పే6) అభివర్ణించడం ఒక ఆత్మీయ భావ ప్రకటన. అట్లాగే ‘పంపకం’ (పే23)లో వాళ్లకేమిదక్కింది; మనకేమి మిగిలింది-తూకం వేయడం బావుంది.
గేయపద్యాలలో ఎన్నో జాతీయాలు-‘పచ్చి కర్ర ఎరుంగునా పగులు బాధ’ (మానవ సంబంధాలు పే55) ‘తల్లి విషం, పెళ్ళాము బెల్లం’ (పే57)లాంటి పద ప్రయోగాలు పాఠకుడిని రచయితకు మరింత దగ్గరగా తీసుకువెళ్ళగలుగుతాయి.
‘నాటి’ని చెబుతూ, నేటి తరానికి స్ఫూర్తి, మార్గదర్శకం చేసేదిగా ఉంది ఈ గేయ సంకలనం.
-కూర చిదంబరం
నవశకం-తెలంగాణాశకం
గేయ రచన: వెలపాటి రామరెడ్డి
ప్రతులకు: రచయిత, వడ్డేపల్లి పోస్టు, వరంగల్ (జిల్లా)