సమాజంలో సంఘాలు, సమితులు, వేదికలు వాటి వాటి ప్రయత్నాలతో కొత్త చైతన్యాన్ని రగిలిస్తాయి. దేశం దగ్గర నుండి రాష్ట్రసాధన వరకు వీటి పాత్ర అనిర్వచనీయం. ఈ వరుసలోనిదే ‘సాధన సమితి’. ఇది 1939లో ప్రారంభమైన నాటి నుండి తెలుగుసారస్వత సేవయే ధ్యేయంగా ముందుకు సాగింది. ఈ పుస్తక పీఠిక ప్రకారం ఈ సమితివారు ‘ప్రత్యూష’ పేరుతో లిఖిత పత్రికను నడపడమే కాకుండా, అనేక పుస్తకాలను ప్రచురించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు సాహితీపరమైన పోటీలను కూడా నిర్వహించారు. సమితి సభ్యులంతా కలిసి ఈ గ్రంథానికంటే ముందు ఎన్నో ప్రచురణలు తెలుగు లోకానికి అందించినప్పటికి ఈ సంకలనంలో మాత్రం సమితి సభ్యులేతరుల కవితలను కూడా తీసుకోవడం హర్షణీయం.

”కవిత్వంలో సాంస్కృతికత, కాల్పనికత, వాస్తవికత మూడు కలిపి ఉంటాయి. ఏది ముదిరినా పాడే. సాంస్కృతికత ఎక్కువయితే నిర్జీవస్థితి వస్తుంది. కాల్పనికత హద్దుమీరితే ఉన్మత్తతలోకి దిగుతుంది. వాస్తవికత పెచ్చుపెరిగితే రంగు, రుచి లేక పోవడం తటస్థిస్తుంది” అని కృష్ణశాస్త్రి అన్నట్లు ఒక్క కవితలో అన్ని కనిపించక పోయినా సంపుటి లేదా సంకలనంలో మాత్రం చూడ గలం. అటువంటి సంకలనాలలో ఒకటి ‘ప్రత్యూష’. ”ఈ కావ్య సంకలనంలో ప్రధానంగా తెలంగాణలోని సుప్రసి ద్ధులైన కవుల, కవయిత్రుల ఉత్తమోత్తమ కావ్యసుమాలను ఏర్చికూర్చే ప్రయత్నం జరిగింది…” అని పుస్తకం ‘మా మనవి’లో రాసుకున్నట్లు ఇది ఎందరో పేరుగాంచిన వారి పద్య, గేయాల సంకలనం. ఈ సంకలనంలో మొత్తం 28 మంది కవులు రాసిన 56 కవితలున్నాయి.

తెలంగాణ కోసం తన కవితలను అగ్నిధారలుగా కురిపించిన దాశరథి ”అవి తెలంగాణలోన దావాగ్ని లేచి / చుట్టుముట్టిన భీకరాశుభదినాలు…” అంటూ ‘తెలంగాణా విముక్తి’కోసం గర్జించిన పద్యాలు, గేయాలున్నాయి. భాగినారాయణమూర్తి – ”తేనెలు పిండే తెలంగాణము / నెత్తుట ముంచెత్తెదరా?…”అని ప్రశ్నించిన కవితలహారాలున్నాయి. వీటితోపాటు పొట్లపల్లి రామారావు, బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి, కవితలు పాఠకులను అలరిస్తాయి. రైతుల జీవితాలను చిత్రించిన కేశవపంతుల నరసింహశాస్త్రి, వానమామలై వరదాచార్యులు, ఖండవల్లి లక్ష్మీరంజనం ప్రభృతుల కవితలు హృదయాలను కదిలింపచేస్తాయి. పల్లాదుర్గయ్య ‘మామ’, ‘సెలయేరు’ అను గేయ కవితలు ప్రకృతి సౌందర్యాన్ని చిత్రించిన భావ కవితలు. 1950 నాటి గ్రంథాన్ని తిరిగి 2019లో ప్రచురించిన తెలంగాణ సాహిత్య అకాడమికి నమస్కారాలు. ఈ గ్రంథంలో మరో విలువైన సమాచారం ఉంది. కవితలతో పాటు కవుల సమాచారం పుస్తకం చివరన పొందుపర్చారు.

– అట్టెం దత్తయ్య

Other Updates