ప్రతి రాజకీయ పార్టీ, ప్రభుత్వాలు రైతు సంక్షేమంపై పెద్ద మాటలు చెబుతాయి కానీ ఆచరణలో అవేవీ అమలుకావు రైతుల పక్షం తీసుకున్న తెలంగాణ ప్రభుత్వానికి అభినందనలు. కొత్త ఏడాది మొదటిరోజే దేశంలోనే వ్యవసాయానికి ఉచిత 24 గంటల కరెంటు సరఫరా చేస్తున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది.

గత కొన్నేళ్లుగా పలు కారణాలతో దేశంలో రైతులు కష్టకాలాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే అతివష్టి, లేదంటే అనావృష్టి.. ఇలా ఏదో ఒక కారణంతో రైతులు గోస పెడుతున్నారు. అప్పుల ఊబిలో కూరుకున్న అన్నదాత మరో దారి లేక ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రైతు సంక్షేమంపై ఎన్నో పార్టీలు పెద్ద పెద్ద మాటలు చెప్పాయి. కానీ అవేవీ అమలు కాలేదు. ఇదంతా ఓట్ల రాజకీయంతోనే ముడిపడి ఉంది. నిజానికి రాజకీయ నాయకులకు రైతులు గుర్తొచ్చేది కేవలం ఎన్నికల సమయంలోనే. ఇలాంటి నిరాశ, నిస్పృహలు రాజ్యమేలుతున్న తరుణంలో తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం ఇంత పెద్ద నిర్ణయాన్ని తీసుకోవడం స్వాగతించాల్సిందే. ఇతర రాష్ట్రాలు కూడా తెలంగాణను చూసి నేర్చుకోవాలి. రైతు సంక్షేమం గురించి నిజంగా ఆలోచించాలి.

అన్ని రాజకీయ పార్టీలు తమ మేనిఫెస్టోల్లో రైతులకు వాగ్దానాలిస్తాయి. అధికారంలోకి వస్తే అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ మాటలు చెబుతాయి. ముఖ్యంగా రుణమాఫీ, ఉచిత కరెంటు, సరిపడా కరెంటు లాంటి హామీలను… మొదటి ఐదు లైన్లలోనే ప్రచురిస్తాయి. అదే జరుగుతూ వస్తోంది కూడా. కానీ ఒక్కసారి ఎన్నికల్లో గెలిచినంక ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. చివరకు అన్నదాతలు తమ సమస్యల పరిష్కారం కోసం ఆందోళన చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఆందోళన చేస్తున్న రైతులపై తుపాకులను ఎక్కుపెడుతున్న వార్తలు కూడా ఈ మధ్య సర్వ సాధారాణమయ్యాయి. రైతుల సంక్షేమం గురించి పట్టించుకోవాల్సిన పాలకులు ఇలా వ్యవహరించడం తగదు. దేశానికి అన్నం పెట్టే రైతుకు న్యాయం ఎందుకు జరగకూడదు? రైతుకు న్యాయం జరిగేవరకు దేశాభివృద్ధి సాధ్యం కాదు. పార్లమెంటు సమావేశాల సమయంలో రైతుల సమస్యలపై కూలంకషంగా చర్చించాలి. వాటి పరిష్కారంపై ఆలోచించాలి. ఇది చాలా ముందే జరగాల్సింది. ఇప్పటికైనా అంత ఆలస్యమేమీ జరగలేదు. తెలంగాణ ప్రభుత్వం చేసి చూపించింది. ఇక ఇప్పుడు మిగతా రాష్ట్రాల వంతు వచ్చింది.

(తెలంగాణ రాష్ట్రంలో రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రశంసిస్తూ రాజస్థాన్‌లో అత్యధిక సర్క్యులేషన్‌ కలిగిన ‘రాజస్థాన్‌ పత్రిక’లో ప్రచురించిన సంపాదకీయం)

Other Updates