మన పల్లెల్ల గలగల మాట్లాడే ముచ్చట అంతా తెలంగాణ యాసనే తెలుగుభాష అసలు అచ్చ తెలుగు మనగడ్డ మీన్నే మాట్లాడుతరు. దీన్ని యాసభాస అని ఎక్రిచ్చిన్రుగని ఇప్పుడు లేదు. అసలు సిసలు తెలుగు మన నేలమీదనే నడుస్తుంది.
మన తెలంగాణ భాష ఇనసొంపుగా ఉంటది. నాదమయంగ ఇన్పిస్తది. లయాత్మకత నిండి ఉంటది. మాట్లాడుతేనే పాణాఫానం అన్పిస్తది. అంటే ఒక్క మనదే అని లేదు ఎవల తల్లి భాష వాల్లకు నచ్చుద్ది. అంతేగని మాదే గొప్పది అవుతలోల్లది తక్కువది అల్కటిది అనుడు వద్దు. అగో గా లొల్లితోనే తెలుగు రెండు వక్కలుగ శీరుకపోయింది. ఎవలదైనా వాల్లకు భాష పరాయి వాల్లది యాస. మనకు తెలంగాణ పదాలు మాతృభాష. అట్లనే అవుతలిపక్క కోస్తా వాల్లది మాండలికం. మనకు వాల్లది మాండలికం. వాల్లకు మనది మాండలికం అంటే అక్షరాలు గవ్వే.. పదాలు గవ్వే.. పలుకే పలుకులు కొంత తేడా గంత మాత్రానికే అది అసలైన బాస ఇది అసలైనది కాదు అనేది లేదు.
నిజానికి అక్షరాలు పదాలు పదచందాలు అన్నీ మంచియే. మనుషులల్ల మంచోల్లు చెడ్డోల్లు ఉంటరుగని, పదాలు భాషల మంచి చెడు ఉంటదా? తానం అని ఒగలు అంటే స్నానం అని ఒగలు అంటరు. బాట అని ఒగలు అంటే తొవ్వ అని ఇంకొకరు అంటరు. సోపతి అంటే స్నేహం అని మరికొందరు అంటరు. ఇట్లనే మనుషులు మాట్లాడుకునేది అందరిది అసలైన భాష అయితే ఏ గడ్డమీద పుట్టిన భాషనైనా ఆ గడ్డమీద అదే మాట్లాడాలె. తెలంగాణ పల్లెల్ల స్నానం చేసిరా అనరు తానం చేసి వస్తన్న అంటరు. అట్లనే పెయ్యి కడుక్కొని వస్తన్న ఆగరాదే నాయిన అంటరు. పెయ్యి అంటే శరీరం. పెయ్యి జర మోటుగ ఎందుకు అన్పిస్తందంటే ఈ పదం రేడియలల్ల, సినిమాలల్ల, పాఠ్యపుస్తకాలల్ల లేదు. అందుకు ఇది మోటుది అయ్యింది అనుకుంటున్నం. అది శానత్తం భాష అనుకునుడే తప్పు.
నిజానికి తేట తెలుగు అంటే సంస్కృతం కలువని భాష. భాషల సంస్కృతం కలుస్తది. ఉర్దూ కలుస్తది. ఇంగ్లీషుకూడా కలుస్తది. అన్ని మేళవించుకున్న భాష కొత్తకొత్తరీతుల జగతికి ఎక్కుతున్నది. కాకపోతే విషాదం ఏందంటే ఎన్నోఏండ్లనుంచి ఉన్నపదాలు పోతన, సోమన వాడిన పదాలు కనపడకుంట అయి, తెలుగు పేర ఇక్కడ పలుకని పదాలు పేరు రావడం విషాదం. అందుకే మన సంస్కృతి, భాష, సాహిత్యం దోసుకున్నరు అన్న చర్చ జరిగింది. వాల్లు వాల్లది వాల్ల చేతులల్ల ఉన్న ప్రసార మాధ్యమాలద్వారా వాడిండ్రు. అవి అందరి మీద రుద్దిండ్రు. ఇప్పుడు ఎవ్వలది వాల్లకు వేరే అయినంక మనం మన సోయిలకు రావాలె. గప్పుడే తెలుగు అంటే తెలంగాణం అని తెలుస్తది. విశ్వవ్యాప్తంగ ఉన్న తెలుగును విస్తృత పరచాలి. అందుల అన్ని ప్రాంతాల ప్రజలుమాట్లాడే మాటలను పొందుపరచాలి. ఎవలు రాస్తే వాళ్ళ భాష రాస్తరు. ఇట్ల అన్ని ప్రాంతాల భాష అందరికి తెలుస్తది.
యారాలు అని చక్కని పేరు ఉండంగ తోటికోడలు అని అనుడు ఎందుకు. అట్లనే సడ్డకుడు అని చక్కగ మాట్లాడక తోడల్లుడు అనుడు. ఇదంత మనది మనం విడిచిపెట్టి ఇంకొకలది పట్టుకునుడు అన్నట్టు. ముందు ఈ గడ్డమీద మాట్లాడితే అసలైన భాష అని అనుకొని సగర్వంగా మాట్లాడాలె. ఏదైనా తెలంగాణ ఉద్యమంకు తెలంగాణ భాషనే ఆయువు. తెలంగాణ పాటలన్నీ అవే, తెలంగాణ ఉద్యమ కర్త చంద్రశేఖరరావు మాటలన్నీ అచ్చ తెలంగాణమే. అందుకే మనందరి హృదయాలను గెలిచినవి. తెలంగాణమే అసలైన తెలుగు. ఏ భాషనైనా గొప్పదే. అన్ని భాషలకు కావ్య గౌరవం ఇవ్వాల్సిందే. ఎవలురాస్తే వాల్లవాల్ల భాష ఎన్నటికైనా మంచి మనుషులున్నట్లు మంచి భాషనే ఉంటది.
తెలంగాణ భాషా సంస్కృతి వర్థిల్లాలి.
అన్నవరం దేవేందర్