kcrప్రతి జాతికీ కొన్ని ప్రత్యేకతలుంటాయి. అంతకంటే మించి కొన్ని ప్రతీకలుంటాయి. ఇవి జాతి ఆత్మను ప్రతిబింబిస్తాయి. జాతి జనుల అంతరంగాన్ని సమైక్యం చేస్తాయి. జవ జీవాలను తట్టిలేపుతాయి.

అందుకే ఒక జాతిని ధ్వంసం చేయాలనుకునే వారు ముందుగా ఆ ప్రతీకలపై దాడి చేస్తారు. తమ కొత్త ప్రతీకలను రుద్దుతారు. తెలంగాణ విషయంలోనూ సరిగ్గా ఇదే జరిగింది. ఉదాహరణకు బతుకమ్మ పండుగ. గౌరమ్మను పూజిస్తూ, కుటుంబ సంక్షేమాన్ని, సామాజిక క్షేమాన్ని కాంక్షిస్తూ, ఆడపడచులతో అనుబంధాన్ని కొనసాగిస్తూ ఆడుకునే బతుకమ్మ తెలంగాణ మహిళల విశిష్ట ఆచారం. ఒక ప్రాకృతిక అర్చన. అయితే వలస పాలకులు, వారి ఆధిపత్య భావజాలం బతుకమ్మ ఆటపై అనాగరిక సంప్రదాయంగా ముద్రవేశాయి. అవహేళన చేశాయి. ‘పనికిరాని పూలను ఒక్క చోట పెట్టి చుట్టూ తిరిగి చప్పట్లు కొట్టి పాటలు పాడడం కూడా ఒక పండగేనా?’ అని ఎకసెక్కాలాడాయి. దీంతో 1990ల నాటికి పట్టణాల్లోని మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలు బతుకమ్మ ఆడడాన్ని నామోషీగా భావించే పరిస్థితి నెలకొంది. తెలంగాణ భాష విషయంలోనూ ఇంతే. తెలంగాణ యాసలో మాట్లాడడం.. వెనకబాటుతనానికి, భాష రాని తనానికి, కమ్యూనికేషన్‌ బలహీనతకు సంకేతంగా ప్రచారం చేశారు. తమది మాత్రమే ప్రామాణికమైన తెలుగనీ, అదే మాట్లాడాలనే భావజాల ప్రచారం అంతర్లీనంగా ఉధృతంగా కొనసాగింది. చివరికి పట్టణ ప్రాంత తెలంగాణ ప్రజలు తమ యాసలో మాట్లాడడానికే జంకి, దాన్ని మరచిపోయే వాతావరణం నెలకొంది.

సరిగ్గా ఈ దశలోనే కేసీఆర్‌ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమం మొదలైంది. తెలంగాణ ప్రతీకల విధ్వంసం ద్వారా తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్రను మొట్టమొదట గుర్తించిన వ్యక్తి కేసీఆర్‌. తెలంగాణ ఉద్యమాన్ని పరిపుష్టం చేయాలన్నా, పోరాటంలో విజయం సాధించాలన్నా ‘మనం ఎవరికన్నా, దేనికన్నా తక్కువకాం’ అనే అనే ధీమాను కలిగించడం అత్యవసరమని సరైన సమయంలో ఆయన గుర్తించారు. ఇందుకు ఉద్యమంలో తెలంగాణ అస్తిత్వ ప్రతీకలను పరిపుష్టం చేయడం మొదటి అవసరంగా ఆయన గుర్తించారు. తెలంగాణ ఉద్యమంలో ఇది రెండో దశ. అత్యంత కీలకమైన దశ కూడా.

మన భాష, మన యాస

అందుకే తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిషు భాషల్లో అనర్గళంగా మాట్లాడే ప్రావీణ్యం ఉన్నప్పటికీ కేసీఆర్‌ తన ప్రసంగ భాషగా ‘తెలంగాణ యాస’ను ఎంచుకున్నారు. తద్వారా ‘సోకాల్డ్‌ పాలిష్డ్‌ తెలుగు’ మాట్లాడలేని సామాన్య జనంలోని న్యూనతను దూరం చేశారు. తాము మాట్లాడేది తప్పు కాదని, తక్కువ భాష అసలే కాదని భరోసా కల్పించారు. ఈ ప్రాంతానికి వచ్చి బతికే వారు ఇక్కడి భాషను అర్థం చేసుకోవాలని, పదాలు అర్థం కాకపోతే అది వారి సమస్యే తప్ప మన సమస్య కాదని తెలంగాణ పౌరుల్లో సందేశమిచ్చారు. ఈ ఒక్క దెబ్బతో తెలంగాణ భాషకు, యాసకు విస్తృత ప్రచారం లభించింది. కేసీఆర్‌ మాట్లాడే అచ్చమైన తెలంగాణ యాసలోని సౌందర్యాన్ని గమనించిన తెలుగు భాషా పండితులు, తెలంగాణ భాష ఎంత మధురమైనదని ప్రశంసించారు. ‘మీరు ఎక్కడికి వెళ్లినా తెలంగాణ యాసలోనే ప్రసంగించండి. దయచేసి ప్రామాణిక తెలుగు భాష వద్దు’ అని దేశ విదేశాల్లోని తెలంగాణ ప్రజలు కేసీఆర్‌ను ఇంటర్నెట్‌ ద్వారా కోరుకోవడం ఆయన సాధించిన విజయానికి నిదర్శనం. కేసీఆర్‌ స్వయంగా తెలంగాణ యాసలో ప్రసంగించడంతో కలిగిన ప్రధాన ప్రయోజనాలు రెండు. 1. నేరుగా మారుమూల పల్లెల్లోని జనానికి కూడా ఆయన సందేశం చేరింది. తెలంగాణ సాధించుకోవడం ఎందుకు అవసరమో వారికి విడమరిచి చెప్పింది. 2. తెలంగాణ యాసలో మాట్లాడడానికి సిగ్గుపడ్డవారికి ఆ భావనను, నామోషీని దూరం చేసింది. తెలంగాణ యాసలో మాట్లాడడం గర్వకారణం అనే ధీమాను కలిగించింది.

మన పండుగలు

ప్రతీకల పరిపుష్టతలో భాగంగా కేసీఆర్‌ చేపట్టిన రెండో అంశం, తెలంగాణ మాత్రమే ప్రత్యేకంగా జరుపుకొనే బతుకమ్మ, బోనాల పండుగలు. కుల మతాలకు అతీతంగా తెలంగాణ సమాజం ఒక్కచోట చేరి జరుపుకొనే ఈ రెండు పండుగలను ఆయన ఉద్యమ ఆయుధంగా మార్చుకున్నారంటే అతిశయోక్తి కాదు. దీంతో సాధారణంగా ఏటా ఈ పండుగలు జరిపే సమయంలో ఉద్యమం వాటిలో ప్రవేశించింది. ఉద్యమం సఫలం కావాలని, తెలంగాణ రావాలని బతుకమ్మ పాటలు పాడి, బోనాల నైవేద్యాలు సమర్పించే వాతావరణం ఏర్పడింది. అదే సమయంలో ఉద్యమం ఉధృతంగా మారినప్పుడల్లా, సభలు, సమావేశాలు, ర్యాలీలు, రాస్తారోకోల్లో బతుకమ్మలు, బోనాలు ప్రత్యక్షమయ్యాయి. ఇలా రెండు తెలంగాణ ప్రతీకలకు ఉద్యమంతోఅవినాభావ సంబంధం ఏర్పడింది.

గులాల్‌ గుబాళింపు

తెలంగాణ ప్రజలకు అత్యంత ఇష్టమైనది గులాల్‌. పసుపు, కుంకుమతో పోలిస్తే, కొంచం అగ్వకే లభించే గులాల్‌, అంతమంచి సుగంధ ద్రవ్యం కానప్పటికీ, రంగు పరంగా అంత అందమైనది. హోలీ పండుగ మొదలుకుని ఏ చిన్న వేడుక అయినా గులాల్‌ చల్లుకోవడం ఇక్కడ ఆనవాయితీ. డెక్కనీ సంస్కృతిలో భాగంగా మధ్య భారతం నుంచి, ముఖ్యంగా మహారాష్ట్ర నుంచి గులాల్‌ తెలంగాణలోకి ప్రవేశించినట్టు అంచనా. తెలంగాణలో విస్తృతంగా వాడుకలో ఉండే గులాల్‌ రంగును కేసీఆర్‌ తన పార్టీ జెండాగా ధరించారు. సాధారణ ప్రజానీకంతో మమేకం కావడానికి ఇది ఎంతో ఉపయోగపడింది. విజయ సంకల్పానికి మారుపేరుగా నిలిచే దసరా దట్టీని భుజానికి కట్టిగానీ కేసీఆర్‌ ఏనాడూ కార్యరంగానికి కదల్లేదు. తెలంగాణ ప్రతీకలకున్న శక్తిని పరిపుష్టం చేయడానికి ఆయన ఎంత పట్టుదలగా ఉండేవారో ఆ ఒక్క దట్టీని చూస్తే తెలుసుకోవచ్చు.

జానపదం ఉర్రూతలు

తెలంగాణకు మరో ప్రధాన ప్రతీక జనపదం. దాన్నుంచి ఉద్భవించిన జానపద గీతం. కష్ట జీవుల స్వేద వేదంలోంచి ఉద్భవించిన పల్లె పాట అనేక ఏళ్ల పాటు తెలంగాణ సమాజాన్ని ఆటపాటల్లో ఓలలాడించింది. కొంతకాలం పల్లెవాసుల నాలుకలపై నర్తించిన పాట, వామపక్ష ఉద్యమ సమయంలో ఎర్రరంగు పులుముకుని ఉర్రూతలూగించింది. కాలక్రమేణా వామపక్ష భావజాలం బలహీనపడిన తరుణంలో, కేసీఆర్‌ ఆధ్వర్యంలో మొదలైన తెలంగాణ ఉద్యమంతో తెలంగాణ జానపదానికి మళ్లీ మంచిరోజులు వచ్చాయి. తెలంగాణ ఉద్యమం అంటే పాట ఉండాల్సిందే. పాట వినిపిందంటే అక్కడ ఉద్యమ కార్యాచరణ ఏదో ఉన్నట్టే. ఎందరో కవులు. ఎన్నో పాటలు. ఎన్నని చెప్పగలం? ఎందరికని మొక్కగలం! ఎర్ర జెండాల నీడలోనే తెలంగాణ పాటలెన్నో పదం పాడాయి. కదం తొక్కాయి.

ఇలా ప్రతీకల పరిష్వంగంతో తెలంగాణ ఉద్యమం పరిపుష్టమైంది. తెలంగాణ సమాజంలోని సబ్బండ వర్ణాలను ఉద్యమంలో మమేకం చేయడానికి, సామాన్య ప్రజలు కేసీఆర్‌ను మనస్ఫూర్తిగా నమ్మడానికి, ఈసారి రాకపోతే తెలంగాణ ఇంకెప్పుడూ రాదు అని భావించి చావో రేవో అంటూ యుద్ధ రంగంలోకి దూకడానికి ఈ ప్రతీకలు అందించిన స్ఫూర్తి అంతాఇంతా కాదు. దీంతో కేసీఆర్‌ ఎన్నికల రాజకీయాలకు సమాంతరంగా బలమైన ప్రజా ఉద్యమం కూడా సిద్ధమైంది. మరోమాటలో చెప్పాలంటే ఉద్యమం, ఎన్నికలు, బతుకమ్మ- బోనాల వంటి తెలంగాణ ప్రతీకాత్మక పండుగలు ఒకే బాటలో అడుగు అడుగు వేసి పదం కలిపాయి.

(సశేషం)

Other Updates