తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు తెలంగాణా భాషా సాహిత్యాలకు ఏంతో మేలు చేకూర్చింది. ఎందరో గొప్ప సాహిత్య కారులు,కవులు వివిధ రంగాల ప్రముఖులు పరాయి పాలనలో విస్మరించబడి చరిత్రలో చోటు దక్కించుకోలేక పోయారు. గొప్ప చారిత్రిక సాంఘిక నేపథ్యం కలిగిన ప్రముఖులనెందరినో వెలుగు లోనికి తీసుకుని వచ్చే అవకాశం రాష్ట్ర ఏర్పాటు మనకు కలిగించింది. అదే దిశలో ప్రయత్నం చేస్తూ, శ్రమనెంతో భరించి తెలంగాణలో వివిధ రంగాల ప్రముఖులను గురించిన జీవిత విశేషాలను పరిచయం చేస్తూ ప్రముఖ విశ్లేషకులు జి.వెంకట రామారావు రచించిన గ్రంథం ”తెలంగాణ ప్రముఖులు”.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురించిన గ్రంథాలలో తెలంగాణ ప్రముఖులు ఒకటి. ఈ గ్రంథంలో 54 మంది తెలంగాణా రాష్ట్ర ప్రముఖుల గురించి వివరించడం జరిగింది. ఈ గ్రంధంలో వివిధ రంగాల ప్రముఖులను ఎన్నుకుని వారి జీవిత విశేషాలను అందించిన రచయిత ప్రశంసనీయుడు. దాశరథి, సినారె, పీ. వీ.నరసింహా రావు లాంటి ప్రముఖుల జీవితాల గురించి పాఠకులకు కొంత తెలిసే ఉంటుంది. కాని వల్లూరి బసవరాజు,తోటపల్లి సుబ్బారావు,రాందేవ్, పాగ పుల్లారెడ్డి లాంటి ప్రముఖుల పేర్లనైనా వినని వారే ఎక్కువ. ఇక వారు చేసిన కషి వారి జీవిత విశేషాలు తెలిసే అవకాశం ఎక్కడిది?. ఇతర రాష్ట్రాల నుండి వలసవచ్చినా తెలంగాణా అభివద్ధికి, ప్రజల స్వేచ్చా స్వాతంత్య్రాలకై కషి చేసిన స్వామి రామానంద తీర్థ,రాజ్ బహదూర్ గౌడ్ లాంటి వారి కషిని, మహమ్మద్ అలీ జిన్న నిజాం నవాబుల ప్రలోభాలకు లొంగక తాను నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడినటువంటి అక్బర్ అలీఖాన్, బాపూజీ అనుచరుడిగా భారత స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ఎం.ఎస్.రాజలింగం ,ప్రజా సేవకురాలు జెట్టి ఈశ్వరీబాయి లాంటి వారి గురించిన వివారాలెన్నింటినో ఈ గ్రంథంలో మనం చదవవచ్చు.
చరిత్ర విస్మరించిన ఎందరో తెలంగాణ ప్రముఖుల గురించి నేటి తరం తెలుసుకునే అవకాశం ఈ గ్రంథం కల్పించింది. ఒక్కరి జీవితాన్ని పరిచయం చేయడమే ఎంతో కష్టం అలాంటిది 54 మంది జీవిత విశేషాలను సేకరించి మనకు అందజేసిన రచయిత కషి బహుధా ప్రశంసనీయము.
గుళ్ళపల్లి తిరుమల కాంతికష్ణ