Untitled-1తెలంగాణ కోటి రతనాల వీణ అని మనం అంతా కలలు కన్న తెలంగాణ వచ్చి రెండేళ్లయింది. ఆరు దశాబ్దాల స్వపాలన పోరాటం తరువాత కొత్త రాష్ట్రం పుట్టి రెండేళ్లు పురిటిగండాలు దాటి కొనసాగడం గొప్పవిషయమే అయినా, ఒక రాష్ట్ర చరిత్రలో రెండేళ్లు చాలా స్వల్ప కాలం. అయితే ఈ రెండేళ్ల కాలంలో వెలుగుకు పునాది పడింది, వ్యవసాయ వికాసానికి సాగునీటి ప్రవాహం మొదలైంది, ప్రగతికి బీజం నాటుకుంది.

తెలంగాణ ఉద్యమ నేపధ్యంలో హోం మంత్రి చిదంబరం డిసెంబర్‌ 9 నాటి వేర్పాటు ప్రకటన తరువాత జస్టిస్‌ బి.ఎన్‌. శ్రీకృష్ణ కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినపుడు, చాలా మంది ఇది కాలయాపన కోసం ఏర్పాటయిన కమిటీ కనుక వారికి ఏమీ చెప్పనవసరం లేదని వాదించారు. తెలంగాణకు జరిగిన అన్యాయాలు, నిర్లక్ష్యం వివరాలు డాక్యుమెంట్‌ చేసే అవకాశం కనుక బాయ్‌కాట్‌ చేయడం అర్థం లేని పని వాదించిన వారిలో నేను ఒకడిని. నేను కూడా సమయం కోరాను. కమిటీ నాకు 20 నిమిషాలు మాత్రమే ఇచ్చింది. నా మిత్రులు తెలంగాణ కోసం మనవారి ఆత్మహత్యల గురించి చెప్పాలని అన్నారు. నేను చాలా శ్రమించి 20 స్లయిడ్‌లు తయారు చేశాను. ఇరవై నిమిషాలు వివరించాను. నాకిచ్చిన టైం ముగిసింది. తరువాత జస్టిస్‌ శ్రీకృష్ణ నన్ను ప్రశ్నలు అడగడం మొదలు పెట్టారు. దాదాపు గంట సేపు మాట్లాడాను.

కొన్ని వేల మంది అన్యాయాలు వివరించారు. నేనూ అదే చెప్పడం వల్ల ప్రయోజనం లేదు. కానీ కొన్నింటిని మళ్లీ వివరించక తప్పదు. భారత రాజ్యాంగ ప్రకారం తెలంగాణకు ప్రాతినిధ్య అధికారం లేదు కనుక తెలంగాణ ను రాష్ట్రం గా ప్రకటించాలని నా నివేదిక సారాంశం. అదెట్లా అన్నారు జస్టిస్‌. అంతర్రాష్ట్రీయ నదీజలాల వివాదాలలో సుప్రీంకోర్టులో కేవలం ఒక రాష్ట్రం మాత్రమే మరొక రాష్ట్రంతో వివాదం రేకెత్తించ గలుగుతుంది. నదీజలాల ట్రిబ్యునల్స్‌లో కూడా అంతే. మనకు రావలసిన నదీజలాల వాటా ఇవ్వకుండా మహారాష్ట్ర గానీ కర్నాటక గానీ అన్యాయం చేస్తే. ప్రశ్నించవలసింది, కేసు వేయవలసింది కేవలం ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రమే. ఆయా రాష్ట్రాల అక్రమప్రాజెక్టుల వల్ల తెలంగాణ ప్రాంతానికే నష్టం కదా, పోతే పోనీ, మనకెందుకు అని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి వదిలేస్తే తెలంగాణ వెళ్లి సుప్రీంకోర్టులోనో లేక ట్రిబ్యునల్‌ లోనో కేసు పెట్టడానికి అధికారం లేదు. కేవలం రాష్ట్రం మాత్రమే కేసు పెట్టాలని రాజ్యాంగం వివరిస్తున్నది. ఎన్నో సంర్భాలలో తెలంగాణ ప్రయోజనాలను బలిపెట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మౌనంగా ఉన్న విషయం తెలిసిందే. తన నీటి వాటాగురించి తాను డిమాండ్‌ చేసేందుకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే నని నేను వివరించాను. ఇది చాలా లీగల్‌ వ్యవహారమని, అంతవరకు ఎవరూ చెప్పనేలేదని జస్టిస్‌ శ్రీకృష్ణ అన్నారు. కాని ఆయన ఈ అంశాన్ని అసలు ప్రస్తావించనేలేదు. అందుకే జస్టిస్‌ శ్రీకృష్ణ కమిటీ తీవ్రమైన విమర్శలకు గురైంది.

నదీజలాలను తెలంగాణ కు వినియోగించగల్గడమే తెలంగాణ రాష్ట్ర సాధనవల్ల లభించిన ఘన విజయం. ఈ రెండేళ్లలో నదీజలాలలో తెలంగాణ వాటాను వాడుకోవడానికి సమగ్ర పథకాలు రూపొందించడం మరొక ఘనవిజయం. నదీ జలాల కేటాయింపులకు లోబడి మాత్రమే ఎవరైనా నీటి పారుదల ప్రాజెక్టులను నిర్మించవలసి ఉంటుంది. అసలు తెలంగాణ ఏర్పాటుకు మూలమే నీటి వినియోగ సమస్య. కనుక నదుల నీటిని వాడుకునే విధంగా తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను ఏర్పాటుచేసుకోవడం అవసరం. కేటాయించిన నీటికన్న ఎక్కువ వాడుకుంటే అంతర్రాష్ట్రీయ నదీజల వివాదాల ట్రిబ్యునల్‌ ఉండనే ఉంది.

గలగలా గోదారి.. బిరబిరా కృష్ణమ్మ

మనకళ్ల ముందే గోదావరి గలగలా (ఆంధ్రకు) కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ (తెలంగాణ నోళ్లు బీళ్లు తడపకుండా) పరుగులిడుతుంటేనే బంగారు పంటలే పండుతాయి (ఆంధ్రలో). అందువల్ల మా తెలుగుతల్లికి మల్లె పూదండ పాటలో తెలంగాణకు స్ఫూర్తి దొరకలేదు. తెలంగాణకు విడిగా ఒక తల్లి, ఒక పాట కావలిసి వచ్చింది. ఈ ఒక ప్రాంతాన్ని ఎడారిగా వదిలేసి మరోప్రాంతంలో బంగారు పంటలు పండించేందుకు రెండునదులను తరలించుకుపోయే కుట్రలతో సాగిన పాలనలవల్ల మల్లె పూలదండలు ఎక్కడ అనే అనుమానాలు, సవాళ్లు తలెత్తాయి.

ఈ రోజు తెలంగాణ సొంతంగా రాష్ట్రమై నిలబడడం వల్ల, గోదావరి నీళ్లు, కృష్ణాజలాలు పొలాల్లో పారించుకోవడానికి పథకాలు వేసుకునే స్వాతంత్య్రం వచ్చింది. బహుశా ప్రపంచ చరిత్రలో తమ ప్రాంతంలో పారుతున్న నదుల నీళ్లను తమ పొలాలకు పారించుకోలేని దురవస్థ ఎవరికీ వచ్చి ఉండదు. ఇక్కడనుంచి నదులను తరలించి రెండో పంటకు, మూడో పంటకు నీళ్లు గ్యారంటీ చేసుకుని తెలంగాణ లో బోరు బావులు తవ్వుకుని నడుపుకోవడానికి కరెంట్‌ కూడా ఇవ్వని దుర్మార్గపు పాలన లో తెలంగాణ అణచివేతకు గురయింది.

దాదాపు ఆరుదశాబ్దాలపాటు నీటి దోపిడీ నదుల హైజాకింగ్‌ సాగింది. నిధులు, ఉద్యోగాల దోపిడీ కన్న నీటి దోపిడీ తెలం గాణకు కన్నీటి గాథ మిగిలించింది. ఆ కన్నీటి మీద పోరాటం, నీటిమీద విజయం సాధించే వీలు కలిగించింది, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు. ఆరుదశాబ్దాల పాటు దోపిడీకి గురైన ఒక రాష్ట్ర చరిత్రలో రెండేళ్లు చాలా తక్కువ కాలం. విద్యుచ్ఛక్తి, సాగునీటి పారుదల వంటి రెండు అత్యంత కీలకమైన మౌలిక వనరుల నిర్మాణానికి పునాదులు పడ్డాయి. విద్యుఛక్తి లేకపోతే అటు నగరాలు ఇటు వ్యవసాయం మనజాలవు. బొగ్గు ఇక్కడ ఉత్పత్తి అయినా, జల విద్యుదుత్పాదనకు వనరులు ఉన్నా, తెలంగాణను చీకటి కోణాల్లో మిగిల్చారు. మీ రాష్ట్రం ఏర్పడినా మీకు చీకటే అని చెప్పడానికి ఆంధ్ర నాయకులు అన్ని ఏర్పాట్లు చేశారు.అన్ని వనరులున్నా తెలంగాణకు ఆంధ్ర నాయకులమీద నిరంతరం ఆధారపడే దుస్థితిని కావాలని తెచ్చిపెట్టారు.

ఉనికి కోసం ఉధృతి కోసం ..

రెండేళ్ల తెలంగాణ, ఎన్నేళ్లుగానో కలలు గన్న తెలంగాణ వచ్చి రెండేళ్లయిందంటే ఆశ్చర్యం. ఉనికి కోసం ఉధృతి కోసం తెలంగాణ పోరాడింది. ప్రతి వ్యక్తి కాలు కదిపి కదనంలో పాల్గొంటేనే తెలంగాణ కల సాకారమైంది. వరంగల్లులో ఎం ఎస్‌ ఆచార్య అధ్వర్యంలో 1958లో ప్రారంభమైన జనధర్మ వారపత్రిక తెలంగాణకు జరిగిన అన్యాయాలను మొదట ఎలుగెత్తి చాటింది. తెలంగాణ ప్రజల అభీష్టానికి వ్యతిరేకంగా, ఫజల్‌ ఆలీ సూచనలను కాదని, హైదరాబాద్‌ సమస్య కశ్మీర్‌ వలె అంతర్జాతీయ సమస్య అవుతుందని అనవసరంగా భయపడి, హైదరాబాద్‌ పైన కన్నేసిన కొందరు దుర్మార్గ నాయకుల దురుద్దేశాలను గమనించకుండా, కేవలం పెద్దమనుషుల ఒప్పందం వల్ల తెలంగాణ అనుమానాలు తీరుతాయని అసంబద్ధమైన నమ్మకంతో 1956లో విశాలాంధ్ర ఏర్పాటయింది.

జనధర్మ హెచ్చరిక

పెద్దమనుషుల ఒప్పందం కేవలం అయిదేళ్లవరకే. 1960లో జనధర్మ వారపత్రిక ఆ ఒప్పందంలో అంశాలేవీ అమలు కాలేదని, విశాలాంధ్ర మీద విశ్వాసం కోల్పోకముందే ఆ షరతుల సంగతి చెప్పాలని ఎం ఎస్‌ ఆచార్య హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకోసం ఉద్యమించాలో లేక ఒప్పందాల కాలం మరోఅయిదేళ్లు పెంచాలని పోరాడతారో తేల్చుకోవాలని ఈ పత్రిక హెచ్చరించింది. ఒప్పందం అయిదేళ్లపాటు పొడిగించారు. కాని ఒరిగిందేమీలేదు. విశాలాంధ్ర వస్తే తెలంగాణకు కూడా ప్రయోజనాలు ఉన్నాయని భావించి సరే చూద్దాం అని అంగీకరించిన తెలంగాణ పెద్దలు కూడా అనుమానించారు. షరతులన్నీ గాలికొదిలేసిన ఆంధ్ర, రాయలసీమ ముఖ్యమంత్రులు తెలంగాణ ఉద్యమానికి మూల కారకులు. సోదరభావం లేని నేతల వల్ల తెలంగాణ భంగపడింది. వారు పెదాలకొసలనుంచి పలికే తేలిక పదమే సమైక్యత గాని వారి మన: పూర్వక లక్ష్యం, ఉద్దేశ్యం ఎన్నడూ కాలేదు.

ఎందుకూ పనికి రాని ఉపముఖ్యమంత్రి పదవి కూడా తెలంగాణకు ఇవ్వడం ఇష్టం లేదు. ఉద్యమం తీవ్రదశకు ఏర్పడిన సందర్భంలో తెలంగాణ నాయకుడికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. తెలుగుదేశం పాలనలో కూడా తెలంగాణకు తీరని అన్యాయాలు కొనసాగాయి. ఎవరికీ ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వడానికి ఎన్‌టిఆర్‌ గానీ, చంద్రబాబు నాయుడు గానీ ఇష్టపడలేదు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడగానే ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చుకున్నారు. ఉపముఖ్యమంత్రి పదవితో జరిగేదేమీలేదు. అది ఆరోవేలు బరాబర్‌. అయినా అదీ ఇవ్వడానికి మనస్కరించకపోవడం ఆంధ్ర నాయకుల్లో తెలంగాణ పట్ల గూడుకట్టుకున్న వ్యతిరేకతకు ఒక ఉదాహరణ మాత్రమే.

అర్ధరాత్రి మార్పులు, న్యాయవ్యవస్థకు అన్యాయం

ఆంధ్ర- తెలంగాణ అనే పేరుతో రాష్ట్రం ప్రతిపాదనకు ఒప్పుకున్న ఈ స్వార్థ నాయకులు రాత్రికి రాత్రి తెలంగాణ పేరు తీసేసారు. గుమాస్తాలను, తదితర అధికారులను కలుపుకుని ప్రలోభాలకు గురిచేసి బిల్లులో పదాలు మార్చారు. డిల్లీలో లంచగొండితనాన్ని పెంచి పోషించిన చరిత్ర వీరిది. సరిగ్గా అదేపని 2014లో కూడా భ్రష్టాచారపరులైన కొందరు ఆంధ్ర వ్యక్తులు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవస్థీకరణ బిల్లు తయారైంది. కాని అందులో హైకోర్టుకు సంబంధించిన నియమాన్ని రాత్రికి రాత్రి మార్చారు. దొంగచాటుగా, మోసపూరితంగా. దాని ఫలితం, తెలంగాణలో న్యాయవ్యవస్థ ఇంకా ఏర్పడకుండా ప్రచ్ఛన్న ప్రయత్నాలు పై స్థాయిలో కొనసాగుతున్నాయి. తెలంగాణకు అంటూ ఒక న్యాయవ్యవస్థ ఏర్పరచకపోవడం ద్వారా తెలంగాణను బాధించే దుర్మార్గం కొనసాగుతున్నది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిజానికి పూర్తిగా జరగలేదు. కార్యనిర్వాహక వ్యవస్థలో ఇంకా విభజన సగం కూడా సాగలేదు. పూర్తిగా విభజన అయింది శాసనవ్యవస్థ ఒక్కటే. ఇక ఏ మాత్రం విభజన జరగని వ్యవస్థ న్యాయవ్యవస్థ. మొత్తం మీద చూస్తే మూడు వ్యవస్థల్లో ఒకటిన్నర విభజనే జరిగింది. ఇది సగం తెలంగాణ. పూర్తి తెలంగాణ ఎప్పుడు ఏర్పడుతుందో వేచి చూడాలి. అందుకే రెండు సంవత్సరాలుగడిచిన సగం తెలంగాణ ఉత్సవాల వైభవం సంపూర్ణం కాదు. అయితే సగం విభజన కూడా సామాన్యమైంది కాదు. ఒక రాజకీయ వ్యక్తిత్వం, సార్వభౌమ గుర్తింపు, స్వపాలనా అవకాశం ఏర్పడింది.

విభజన చట్టంలో ఉమ్మడి రాజధాని పదేళ్లు ఉండాలని స్పష్టంగా ఉంది. కాని హైకోర్టు ఉమ్మడిగా ఎన్నాళ్లయినా ఉండొ చ్చనే విధంగా నియమాలను రచించారు. తెలంగాణ ఏర్పాటు కోసం తుది దశ పోరాటం సాగిస్తున్నసమయంలో అర్థరాత్రి ప్రచ్ఛ న్నంగా జరిగిన కార్యక్రమాల్లో కొందరు పెద్దలు, పలుకు బడిగలిగిన వారు ఈ నియమాన్ని రూపొందించారు. పాలన ప్రజలకు సమీపంలో ఉండాలని రాజధానిని తరలించడానికి ఉద్యోగులను అమరావతికి తీసుకు వెళ్లడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రయ త్నాలు చేస్తున్నది. కాని న్యాయాన్ని ప్రజల సమీపానికి చేర్చడానికి ప్రయత్నాలు ఇంకా జరగవలసి ఉంది. శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి అమరావతికి వెళ్లడం సులువా లేక, హైదరాబాద్‌ హైకోర్టుకు రావడం సులువా అన్న ఆలోచన అందరికీ రావాలి. న్యాయం అందుబాటులోకి రాకపోతే అన్యాయం విజృంభిస్తుంది.

న్యాయం అర్థించడంలో అసౌకర్యాలు, ఆలస్యాలు, ప్రయాణాలు, ఇతర కష్టాలు అడ్డుపడితే, పాలకులు ప్రజా వ్యతిరేక చర్యలు తీసుకునేందుకు సాహసిస్తారు. న్యాయం అందుబాటులో దగ్గరగా ఉంటే, న్యాయార్జన సులువైతే, అన్యాయం చేసే వాడు కాస్త భయపడతాడు. లేకపోతే లేనే లేదు.

అమరావతిలో ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఉండడం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజల అత్యవసర అంశం అని గుర్తించక తప్పదు. తెలంగాణ పోరాటం సుదీర్ఘంగా సాగడం వల్ల, మూడు ప్రాంతాలలో కొంత విభేదాలు ఏర్పడిన మాట వాస్తవమే. అయితే ప్రజల మధ్య ద్వేషాగ్నులు లేవు. ఎంతగా దుష్టశక్తులు జనాన్ని విడదీయడానికి ప్రయత్నించినా స్నేహం అంతరించలేదు. కాని ఉద్యోగులు, అధికారులు, న్యాయాధికారులు, కోర్టు అధికారుల లో ప్రాంతీయ విభేదాలు నాటుకుని పోయాయి. ప్రమోషన్‌ కోసం ఇంక్రిమెంట్‌ కోసం పక్కవాడిని దాటి పోవడం కోసం అణచివేసే దుర్మార్గాలు సాగాయి. లంచాలు ఇచ్చి రాజకీయ వత్తిడులు తెచ్చి నియమాలను ఉల్లంఘించడం వల్ల ఉద్యోగులలో వ్యతిరేకతలు ద్వేషం స్థాయికి వెళ్లాయి. న్యాయవ్యవస్థ లో కూడా ఈ భావాలు పాతుకుపోయాయి. వీటికి పరిష్కారం రెండు హైకోర్టుల ఏర్పాటు, రెండు రాష్ట్రాల న్యాయాధికారుల పోస్టుల న్యాయమైన విభజన మాత్రమే. ఇది తెలంగాణకు ఆంధ్రకు సంబంధించిన వివాదంమాత్రమే కాదు, న్యాయవ్యవస్థ అన్యాయం కాకూడదనే నియమం. న్యాయానికి న్యాయం చేయవలసిన బాధ్యత అందరిమీదా ఉంది.

తెలంగాణ వస్తే చీకటి రోజులే అన్న ప్రచారోద్యమాలనుంచి బయటపడి, వెలుగు వైపు నడిచే శక్తిని తెలంగాణ సముపార్జించుకున్నది. తడితాకని బీళ్లకు, దప్పితీరని నోళ్లకు నీళ్లిచ్చే ఆలోచనను సంతరించుకున్నది. పథకాలు తీర్చి దిద్దుకుంటున్నది. తప్పటడుగులు కాకుండా లెక్కతప్పని రీతిలో అభివృద్ధి ప్రణాళికలు రచించుకుంటూ తెలంగాణ స్వపాలన మూడో సంవత్సరంలోకి ధీమాగా అడుగుపెడుతున్నది.

తెలంగాణ ఏర్పాటు రెండు రాష్ట్రాల వికాసానికి పునాది అంటే ఆనాడు నమ్మలేదు. ఈనాడు అదే నిజం రుజువవుతున్నది. ఆంధ్ర తెలంగాణ రాయలసీమల్లో తెలుగు వాడు సాధికారికంగా ముందుకు సాగడానికి తెలంగాణ ఏర్పాటు కారణం కావడం తెలుగువారంతా గర్వించదగిన విషయం.

Other Updates