tsmagazineతెలంగాణ సాహిత్యంలో, సాహిత్య ప్రక్రియలన్నీ సంగడిం చాయి. కానీ భావ కవితలు రచింపబడ్డా, భావ కవితా ప్రక్రియ ఫలానా అని ప్రత్యేకంగా పరిగణింపబడలేదు ఆ లోపం పూరించడానికి పాత్రికేయుడు సామిడి జగన్‌రెడ్డి విశేష పరిశ్రమతో 1920-43, 1948-66 వరకు రెండు తరంగాలుగా వచ్చిన భావ కవితలను అన్వేషించి, విశ్లేషించి, సమీకరించి ‘తెలంగాణలో భావ కవితా వికాసం’ అనే ఉద్గ్రంథానికి సంపాదకత్వం వహించి వెలుగులోకి తెచ్చారు. ఈ గ్రంథ ప్రాముఖ్యతను పరిగణనలోనికి తీసుకొని తెలంగాణ సాహిత్య అకాడమీ పక్షాన ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రచురించిన ఛైర్మన్‌ నందిని సిధారెడ్డి అభినందనీయులు.

అసలు భావ కవితంటే ఏమిటి? చాలాకాలం కిందట తెలుగు సినిమా పాట ‘భావ కవుల వలె ఎవరికి తెలియని ఏవో పాటలు పాడా లోయ్‌’-అని వినిపించేది. ఈ చరణం పూర్తిగా కాకున్నా భావ కవితా లక్షణాన్ని కొంత పట్టిస్తుంది. భావం అంటే ఊహ. ఆ ఊహకు స్వేచ్ఛగా శబ్దాల రెక్కలు తొడిగి, తన్మయత్వంతో వెలువరించే ‘ఆత్మాశ్రయ కవితే’ భావ కవిత్వం అని నిర్వచించవచ్చు. 1875 వరకే సంప్రదాయ మూస కవిత్వంపట్ల సాహితీపరుల్లో పొడ సూపిన విముఖత ఆంగ్ల కవితా ప్రక్రియ రొమాంటినిజం ప్రభావంతో కాల్పనిక కవిత్వంగా భావకవిత్వం రూపుగొన్నది.

సంపాదకులు జగన్‌రెడ్డి తాను పరి శోధించి విశ్లేషించిన భావ కవిత్వాంశాలు ప్రణయకవిత్వం, నిరాశాకవిత్వం, దేశభక్తి కవిత్వం, ప్రకృతి కవిత్వం, సంఘ సంస్కరణ కవిత్వం, భక్తి కవిత్వం, స్మృతి కవిత్వం.. ఈ భావ కవితల్లో తెలంగాణ ప్రముఖులు బూర్గుల రామకృష్ణారావు, సురవరం ప్రతాపరెడ్డి, కాళోజీ రామేశ్వరరావు, శేషాద్రి రమణ కవులు, మాడపాటి హనుమంతరావు, వానమామలై వరదా చార్యులు ఒద్దిరాజు సీతారామచంద్రరావుతోపాటు కవయిత్రులు సరోజినీనాయుడు, వి. లక్ష్మీదేవి, రూఫ్‌ఖాన్‌పేట రంగమాంబ దేశాయి ఆదిగా మహిళలున్నారు. ఈ గ్రంథం అరుదైన రచన, సాహితీ పిపాసులు తప్పక పరిశీలించాల్సిన గ్రంథం ఇది.

– జి. యాదగిరి

Other Updates