– డా|| నలిమెల భాస్కర్‌

తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం… ఈ నాలుగు లిపి కల్గిన ద్రావిడ భాషలు. తుళు, తుద, కువి మొదలైనవి కూడా ద్రావిడ భాషలే! అయితే వీటిలో కొన్నింటికి ఇటీవల కొందరు లిపి కనుకున్నప్పటికీ యివి దాదాపు లిపి బద్ధం కాని భాషలు. ఈ భషలన్నింటి మధ్యా సన్నిహిత సంబంధాలున్నై. ఇక.. తెలుగులో ఉత్తరాంధ్ర తెలుగు, దక్షిణాంధ్ర తెలుగు, రాయలసీమ తెలుగు, తెలంగాణ తెలుగులు అని స్థూలంగా చెప్పుకోవడానకి వీలున్నది. ఈ అన్ని విధాల తెలుగులకూ, తమిళానికీ దగ్గరి సంబంధాలు ఉన్నాయి. అయితే యిక్కడ ప్రస్తావించుకోదగిన అంశం తెలంగాణ భాషకూ, తమిళానికీ వున్న సంబంధబాంధవ్యాల గురించే!

”నువ్వు ఎవల తెరువుకు పోవద్దు బిడ్డా! అన్ని రోజులు మనయి కావు, పాడుకాలం” అని పెద్దలు, హితైషులు తమ పిల్లలకు చెబుతుంటారు. అనవసరంగా ఎవరి జోలికి వెళ్ళ కూడదనీ, ఎవరితోనూ జోక్యం కల్గించుకోరాదనీ, ఎవరి హద్దుల్లో వారుండటమే మంచిదనీ పై తెలంగాణ వాక్యాల సారం. ఆ వ్యాక్యాల్లోని ”తెరువు”ను పరిశీలించాలి. ఇది తమిళ పదం. దానికి అర్థం ”మార్గం, దారి, త్రోవ”అని. మన మార్గంలో మనం మన మానాన మనం పడివుండటమే మంచిదని చెప్పటం. ఎవరి మార్గానికి వెళ్లకూడదని చెప్పటం. ఇప్పటికీ మొదలియార్‌ తెరు, చెట్టియార్‌ తెరు అనే పేర్లుంటాయి వీధులకు.

రాత్రిపూట వండిన అన్నం అందరూ తినగా ఇంకా మిగిలిపోయినప్పుడు పెద్దవాళ్ళు ”తెల్లారికి ఏంకాదు. కరాబు కాకుండ అన్నం గిన్నెకు వాయి కట్టుండ్రి, ఉట్టి మీద పెట్టుండ్రి” అని చెప్పేవాళ్ళు. ఈ నాటిలాగా అప్పట్లో ఫ్రిజ్‌లు లేవు కనుక అన్నం పారేయడానికి మనసొప్పక గిన్నెకు వాయి కట్టేవాళ్ళు. అంటే గిన్నె మీద మూతపెట్టకుండా దాని అంచుల్ని కప్పుతూ ఒక సన్నని గుడ్డను చుట్టే

5వాళ్ళు. ఆ బట్టలోంచి గాలి తగిలి ఆహారపదార్థాలు పాచి పోకుండా వుండేవి. మరిక్కడ ”వాయి” అంటే ఏమిటి? తమిళంలో ”వాయి” అంటే నోరు, ”గిన్నెకు సంబంధించిన నోటిని గుడ్డతో కట్టడమే ”వాయి కట్టుడు”, తెలుగులోని ”ప్లిలన గ్రోవి” తెలంగాణలో ”పుల్లంగొయ్య” అవుతుంది. నిజానికిది తమిళంలోని ”పుల్లాంగుళల్‌” నుండి వచ్చింది. కుళల్‌ అంటే గొట్టము. అదే తెలుగులో క్రోవి. తెలంగాణలో కొయ్య. గొట్టమైనా, కొయ్య అయినా వెదురు బాబతే కదా! ”వారీ! రాత్రిపూట చిమ్మచీకట్ల ఎటు పోతున్నవ్‌రా! జెర్ర పైలం. పురుగు బూశి వుంటది”. ఇటువంటి మాటలు తెలంగాణలో వింటాం. ఈ ”పురుగు బూశి”లోని ”బూశి” ఏమిటో కాదు. తమిళంలోని ”పూచ్చి”. ”పూచ్చి” అంటే ”పురుగు” అనే అర్థం. అది కాస్తా తెలంగాణలో ”బూశి” అయ్యింది. ”పురుగు పుట్రా” వంటి జంటపదం ”పురుగు బూశి” విత్తనాలు, కర్రా మొదలైనవి పుచ్చిపోవడం వల్ల జరుగుతుంది? ”పూచ్చి” కారణంగానే (పురుగువల్లనే) విత్తనాలు మొదలైనవి చెడిపోతాయి. తెలుగు పుచ్చి పోవడానికీ, తమిళం ”పూచ్చి”కీ అదీ చుట్టరికం !

”ఇగో! గాడ గిన్నెలున్నయి చూడు, అవ్వీటిని తీసి ప్రిజ్‌ల పెట్టు” అనే మాటల్లోని ”అవ్వీటిని” అనే పదాన్ని పరిశీలించాలి. అంటే.. ”వాటిని” అనకుండా తెలంగాణలో ”అవ్వీటిని” అనే తమిళంలోని ”అవట్ట్రై” తెలంగాణలో ”అవ్విటిని”గా వుంది. అట్లాగే ”ఇవట్ట్రై” ఇవ్వీటిని, ”ఎవట్ట్రై” ఎవ్వీటిని అవుతున్నది.

”తెనుగుదెంకరోల్లు” తెలంగాణలో మామూలుగా కాయాకసరూ తెంపుకొచ్చి పండో పలమో అమ్ముతుంటారు. ఇక్కడ ”తెకంరోల్లు” (తెంకర్లు) ఏమిటి? తమిళులు తెలుగు వాళ్లను ”వడగర్లు” అంటారు. ”వడగు” అంటే ఉత్తరం దిశ. తమిళనాడుకు తెలుగువాళ్ళు ఉత్తరంగా నివసిస్తున్న కారణాన ”వడగర్లు” అన్నారు. మరి ”తెంకర్లు” ఏమిటి? వీళ్ళు దక్షిణం వైపు వాళ్ళు. తెలుగు వాళ్ళు ఉత్తరాది వాళ్ళకు దక్షిణంగా వున్న కారణంగానో, లేదా తెలుగు వాళ్లలోనే ఈ తెనుగు వాళ్ళు (ముదిరాజులు) దక్షిణ దిశలో వుండిన హేతువు చేతనో వీళ్ళను తెంకర్లు అన్నారు. అసలు ”తెనుగు” అంటే దక్షిణం అని, తెంకర్లు కూడా తెన్నుకర్లు కదా!

ఊయలమంచాన్ని తెలంగాణలో ”టుంగుటుయ్యాల” అంటారు. నిజానికిది ”తూగుటుయాల”. ఈ ”తూగు”లో ”తూ” తర్వాత మొదట సున్నా, పిదప అరసున్నా వుండేది. అంటే అది ‘తూంగుటూయాల’. మరి ‘తూంగు’ అంటే? నిద్రపోవు అని అర్థం.

తమిళంలో ”తూంగువుదు” అనే క్రియ ఈ అర్థంలోనే వుంది. అది కాస్తా తెలంగాణలో ”టుంగుటుయ్యాల” అయ్యింది.

మధ్యతరగతి మనుషులను తెలంగాణలో ”నడితర్ర మనుషులు” అంటారు. తమిళంలో దీనికి మాతృక ”నడుతర మనిదర్‌గళ్‌”. మమిళ ”కావల్‌” తెలంగాణ ”కావలి”, మిళ ”తలైవర్‌” తెలంగాణ ”తలారి” అవుతున్నడు. ”పిల్ల పిన్మడు ఎంత ముద్దుగున్నరు” అంటుంటారు. అందమైన వధూవరుల్ని చూసి ఈ ”పిన్మడు” తమిళ ”పెణ్‌మగడు” నుండి వచ్చింది. పెణ్‌ అంటే స్త్రీ, భార్య అని అర్థాలు. ఆ ఆలిమగడే పిన్మడు, తమిళంలో ”పొదుకొప్పు” అంటే రక్షణ అని అర్థం. ఆ పదంలోని ”కాప్పు” తెలంగాణ కాపోల్లు, కాపుదనపోల్లు అనే పదాల్లో వుంది. ”పాదుకాప్పు”లోని మొదటి సగం ”పాదు” అనేది బీర, సొర, మొదలైన గింజలు మొలిచి పెద్దగ అవుతున్న తరుణంలో వాటి చుట్టు రక్షణగా చిన్న చిన్న కర్రలు పాదులుగా నాటుతారు. తెలంగాణలోని చాలా మాటలకు తమిళం తల్లిగారిల్లు.

Other Updates