విద్యుత్‌శాఖ ఉద్యోగులనుద్దేశించి సీఎం చేసిన ప్రసంగం పూర్తి పాఠం
”మూడుంబావు సంవత్సరాల క్రితం నేనే స్వయంగా చూశాను. ఒక పెద్ద మనిషి కర్రపట్టుకుని టీవీ ముందు నిలబడి, ‘తెలంగాణ వస్తే మీకు చిమ్మని చీకటైతది. అంధకారమైతది. మీరు ఎందుకు కొరగాకుండా అయితరు’ అని రకరకాల శాపాలు పెట్టిన్రు. అంతటి దుస్థితినుంచి మీ అందరి కృషితో అంధకారమైతదన్న తెలంగాణ బ్రహ్మాండమైన రాష్ట్రంగా తయారైంది. చాలా అద్భుతమైన విజయం సాధించాం. దేశమే ఆశ్యర్యపడే విషయం.24 గంటలు మీరంతా కష్టపడి పనిచేశారు. ఇబ్బందులు అధిగమించారు. పాలసీగా అధికారులు, గవర్నమెంటు చేసేది చేసినా, ఇవాళ రాష్ట్రానికి ఇంతటి పేరు రావడానికి ప్రధాన కారణం మా లైన్‌మెన్ అన్నదమ్ములు, జూనియర్ లైన్‌మెన్ అన్నదమ్ములు, మా ఇంజినీర్లు” అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు పేర్కొన్నారు.
విద్యుత్‌శాఖలో కొత్త ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, పదోన్నతులు కల్పించాలని నిర్ణయం తీసుకున్నందుకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావును అభినందించి, కృతజ్ఞతలు తెలుపడానికి విద్యుత్ ఉద్యోగులు పెద్ద ఎత్తున ప్రగతిభవన్‌కు తరలివచ్చారు. ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ డి. ప్రభాకర్‌రావు, జాయింట్ ఎండీ శ్రీనివాసరావు, ఎన్పీడీసీఎల్ సీఎండీ గోపాలరావు, ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి తదితరుల ఆధ్వర్యంలో పెద్దఎత్తున తరలివచ్చిన విద్యుత్ ఉద్యోగులు సీఎంను అభినందించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వారినుద్దేశించి ప్రసంగించారు. యాక్సిడెంట్ జరిగి ప్రాణాలు కోల్పోయిన అనేక సందర్భాలను చూశాం. లైఫ్‌రిస్క్ తీసుకుని అద్భుతంగా పనిచేశారు. కాబట్టే ఈ విజయం మనకు సాధ్యమైంది. ఈ రోజు అందరి అంచనాలు తారుమారుచేసి ఒక్క వ్యవసాయానికి తప్ప అందరికీ 24 గంటలు కరెంటు ఇస్తున్నాం. రైతు సోదరులకు కూడా 24 గంటల కరెంటు ఇవ్వాలని ప్రభాకరరావుగారిని అడిగాను. అయితే ఒక్కమాట వినండి సార్ అన్నారు. గతంలో 2012నుంచి వున్న ఖాళీలు పూర్తి చేయాలి. కొత్తగా సిబ్బంది లేకుంటే ఇబ్బంది అవుతది. కాబట్టి దయచేసి వాటిని భర్తీ చేయండి అని అడిగారు. దాంతోపాటు మీరు పర్మిషన్ ఇస్తే 13500 ఉద్యోగాలు రిక్రూట్ చేసుకుంటే, మాకొక 10వేలమందికి ప్రమోషన్లు కూడా వస్తయి. మేం మీ ఆశయాన్ని నెరవేరుస్తాం అన్నారు. దానికి నేను సరే అన్నాను.
భర్తీకి పోయే ముందు ప్రమోషన్ల ప్రక్రియను పూర్తి చేయండి. మనముందు రెండు పనులున్నాయి. ఒకటి.. ఔట్ సోర్సింగ్‌లో ఉన్న 24వేలమంది ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయాలి. ఆ ప్రక్రియ ముగిసిపోవాలి. గతంలో రెండువేల మందిని కొత్తగా నియమించుకొన్నాం. ఇప్పుడు 13,500మందిని తీసుకుంటున్నాం. అంటే దాదాపు 16వేమంది అవుతున్నారు. మీ దగ్గర 27వేలమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నరు. 16 వేల మందిని కొత్తగా తీసుకుంటున్నాం. మొత్తం 43వేలమంది అవుతరు. ఇంకో 24వేల మంది ఔట్ సోర్సింగ్ వాళ్లున్నారు. వాళ్లను రెగ్యులరైజ్ చేస్తున్నాం. అంటే 75వేలమంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉండేటటువంటి దేశంలోనే అతిపెద్ద కరెంటు సంస్థగా నిలవబోతున్నాం. ఈ రోజు తెలంగాణ ప్రభుత్వంలో 3 లక్షలమంది ఉద్యోగులుంటే, దాని తర్వాత అంత స్థాయిలో ఎంప్లాయీస్ ఉన్న ఏకైక సంస్థ విద్యుత్ సంస్థ. దీని తర్వాతనే ఆర్టీసీ, సింగరేణి ఉంటయి. కాబట్టి గవర్నమెంటు తర్వాత గవర్నమెంట్ అంతటి సంస్థ. విద్యుత్ సంస్థలో ఉన్న క్యాజువల్ లేబర్ వాళ్లకు న్యాయం చేయాలి. వాళ్లను పిలుచుకుని మాట్లాడండి. వాళ్లు కూడా మన పిల్లలే కాబట్టి న్యాయం చేయండి. ప్రభాకర్‌రావు అందరితో మాట్లాడతారు. మీ అందరితో నాదొక్కటే ప్రార్థన. ఈ రోజు తెలంగాణలో టీఎస్‌ఐపాస్ అని ఇండస్ట్రియల్ పాలసీ తెచ్చినం. మొన్న ఒక మీటింగ్ జరిగింది. పారిశ్రామిక వేత్తలు సమావేశమయ్యారు. వాళ్లు ఏమంటున్నారంటే.. ఇండియాలో ఆరు నెలల్లోపల ఉత్పత్తికి రాగలిగే అవకాశం ఉన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని వాళ్లు చెప్తున్నారు. అటువంటి మంచిపేరు మనకు రాగలిగింది. కంటిరెప్పవాలినంతసేపు కూడా కరెంటు కోతలేదు. మూడు షిఫ్టుల్లో పనిచేసుకోగలిగే కరెంటు ఇస్తున్నాం. డొమెస్టిక్‌కు ఇస్తున్నాం, కమర్షియల్‌కు ఇస్తున్నాం. ఇవ్వాల్సిందల్లా రైతాంగానికి. వచ్చే యాసంగి పంటకు, వచ్చే ఎలక్షన్లకు ముందే 24 గంటల కరెంటు ఇచ్చే ప్రయత్నం చేస్తే ఎట్ల ఉన్న తెలంగాణ ఎట్ల అయిందనే గౌరవం దక్కుతుంది. దానికి అందరూ సహకరించాలి.
తెలంగాణ వచ్చేనాటికి జెన్కో నుంచి 4వేల మెగావాట్ల కరెంటే ఉండేది ఇంకో రెండువేలు కలుపుకుంటే 6500 మెగావాట్లు అయింది. ఈ రోజు మరో 4200 వరకు యాడ్ చేసుకున్నం. ఖచ్ఛితంగా ఇంకో రెండు సంవత్సరాల్లో సోలార్ కూడా కలుపుకుంటే 27-28వేల మెగావాట్ల కరెంటుకు చేరుకుంటాం. అంటే ఎక్కడో ఉన్నవాళ్లం కష్టం చేసుకుని ఇక్కడిదాకా వచ్చాం. ఛత్తీస్‌గఢ్ కరెంటు కూడా కొంత కొనుక్కున్నం. ఇంకో శుభవార్త ఏమంటే, రేపు జూన్ తర్వాత కొంత, 2018 జూన్ తర్వాత కొంత దాదాపు 10వేల మెగావాట్లు లిఫ్ట్ ఇరిగేషన్ కోసం తీసుకుంటం. అంటే ఉచితంగా కాదు. లిఫ్ట్ ఇరిగేషన్ కరెంటు ఛార్జీలభారం రూపాయి కూడా మీమీద పడదు. ఇరిగేషన్ డిపార్టుమెంటే మీకు బడ్జెట్‌లో కేటాయిస్తుంది. పాలమూరు ఎత్తిపోతలు కావొచ్చు, కాళేశ్వరం కావొచ్చు, భక్తరామదాసు కావొచ్చు, సీతారామా, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, డిండి తదితర ప్రాజెక్టులకు కరెంటు వచ్చే ఏడాది చివరనుంచి అవసరమొస్తది. దానికి మనం సిద్ధంగా ఉండాలి. ఇవాళ మహబూబ్‌నగర్ జిల్లాలో చరిత్రలో మొట్టమొదటిసారిగా ఐదున్నర లక్షల ఎకరాల్లో వరిపంట పండింది. అది కల్వకుర్తి, నెట్టెం పాడు, బీమాకు మీరు పవర్ ఇవ్వడం, ఇరిగేషన్‌శాఖ పనిచేయడం, అది పూర్తి కాకుండానే ఇంత పంట పండింది. ఈ సంవత్సరం పూర్తి కాబోతున్నాయి.
200 మెగావాట్ల పవర్ మీరు సప్లయ్ చేస్తే ఇంటింటికీ నల్లా కార్యక్రమం ఏ రాష్ట్రంలో లేనివిధంగా మిషన్ భగీరథ పూర్తవుతుంది. అభ్యుదయ ప్రపంచాన్ని చూడాలంటే కరెంటు ఉండాలి. కరెంటు లేని ప్రపంచాన్ని మనం చూడలేం. కరెంటు అంత ముఖ్యమైన భూమిక. కాబట్టి మీరు చేసేటటువంటి సేవ అద్భుతమైన సేవ. ఒక్కొక్కరు ఒక్కో కేసీఆర్ కావాలని కోరుతున్నాను. దయచేసి.. ఆ అవతారం ఎత్తాలే. తెలంగాణ ఉద్యమం లో ఏ స్ఫూర్తి చూపించామో… అదే స్ఫూర్తితో పని చేయాలి. ఐదేండ్లలోపలనే ఇట్లున్నదాన్ని ఇట్ల చేశారా అనే విధంగా పనిచేయాలి. తెలంగాణ భేష్ అనేటట్టుగా చేయాలే.. రాష్ట్రం పేరు నిలబెట్టాలి. మీరు చేస్తరనే విశ్వాసం నాకుంది. మీ బిడ్డగా ఈ రోజు ఈ సంతోష సమయంలో 75వేలమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉండే సంస్థగా మీరు రూపాంతరం చెందేటైంలో.. పేరు పేరునా ప్రతీ ఒక్కరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా”.