కవిగా, కథారచయితగా, విశ్లేషకుడిగా, అనువాద పరిశోధకుడిగా, సుపరిచితులైన వుప్పల నరసింహం కథలు ప్రతి మనిషిని ఆలోచింపజేస్తాయి. వారి అనుభవ ఆలోచనల నుండి వెలువడిన ఈ కథలను చక్కగా – చిక్కగా తెలంగాణ ప్రజా జీవితాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి మనకందించారు.
ఇందులో ‘తిరుగబడ్డ భూమి’, మొదలు ‘అనామకురాలు’ వరకు తెలంగాణ గ్రామీణ జీవితం మనకు స్పష్టంగా అగుపడుతుంది. మొదటి కథలోనే కొమ్రయ్య బుడ్డగోని గొర్రెబూరుతో దారితీసే విధానం బాగుంది అంతేకాక మృత్యుగానంలో కొండయ్య కథను చెపుతూ దుర్గయ్య తన భార్య కడుపులో దాచుకున్న దుఃఖాన్ని నిజంగానే ప్రతి మనిషికి కన్నీరు తెప్పిస్తుందనుటలో ఏ మాత్రం సందేహంలేదు. ఈ కథలలో సామెతలు చాలా ఉన్నాయని ఆడెపు లక్ష్మీపతి చెప్పినట్టుగా, కదిలించిన కథలు – వ్యధలు-సుధలు, బాధలు ఈ మట్టి మనిషి కథలలో నిండి ఉన్నాయి దండిగా.
కథలలో కథా శిల్పంతో పాటుగా చక్కటి కథనంతో పొందికగా తమ భావాలను సైతం స్పష్టంగా పొందుపరిచారు రచయిత.
నైజాం నిరంకుశపాలనలో మగ్గిన మన తెలంగాణ ప్రజల మనోభావాలను చిల్లర దేవుళ్లు కథలో చెప్పినారు. ఇందులో మరికొన్ని చిన్న కథలు, మన నగరాలలో జరుగుతున్న నేపథ్యంలోని ఏడు కథలు కూడా బాగున్నాయి. ఉత్తరాంధ్ర కథలు రెండు తీసుకున్నప్పటికినీ మౌఖిక కథాజలముద్రలలో 22 కథలు ప్రతివారిని బాగా అలోచింపజేస్తాయి. చేయి తిరిగిన అనుభవరచయిత నరసింహం ఒక చోట అంటాడు హరికథా మేళంలా…
అయ్యో నందనా… తెల్ల గన్నేరు పూవసుంటి తిగుళ్లపల్లి పేదసాదల నోట్ల్లె నాలికే లేని బీద బిక్కినోటికాడి బుక్క ఎత్తగొట్టిండ్రు. ఆశ పడ్డ కండ్లళ్ళ మన్నుగొట్టిండ్రు… వాళ్ళకి కంటి శోకమే మిగిలింది తండ్రులారా!
అని చెప్పిన కథ ”బుక్క ఎత్త గొట్టిండ్రు”లోని కథా శిల్పంలో పాటుగా రచనా పటిమ అమోఘం అద్వితీయం… అందరూ (ప్రతివారు) చదవదగ్గ మంచి కథల సంపుటి ”మట్టి మనిషి వుప్పల నరసింహం కథలు” జ్ఞానం పబ్లికేషన్స్ ముద్రించిన ఈ కథల పుస్తకాన్ని మీరందరూ ఆస్వాదించండి.
– డాక్టర్ కావూరి శ్రీనివాస్
ప్రతులకు :
జ్ఞానం పబ్లికేషన్స్, మిలీనియం హోమ్
ఇ.నం. 2-3-764/1/4, తులసీ నగర్ కాలనీ,
హైదరాబాద్ – 13.
పుస్తకం : మట్టి మనిషి-వుప్పల నరసింహం కథలు
రచయిత : వుప్పల నరసింహం
పేజీలు : 392 ధర : 300/-