వి.ప్రకాశ్‌

1971 మార్చి రెండో వారంలో జరిగిన లోకసభ ఎన్నికల్లో తెలంగాణలోని 14 స్థానాలకుగాను 10 స్థానాల్లో గెలిచిన తెలంగాణ ప్రజా సమితి ఎం.పీలు మార్చి 22 నుండి ప్రారంభమైన సమావేశాల్లో చురుగ్గా పాల్గొన్నారు.

ఏప్రిల్‌ ఒకటిన హోం శాఖ స్టేట్‌ మంత్రి కె.సి. పంత్‌ ‘‘ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయమై కొత్త ప్రతిపాదనలేవీ ప్రభుత్వ యోచనలో లేవని’’ ప్రకటించారు. లోకసభలో జనసంఘ్ నాయకుడు వాజ్‌పేయీ ప్రశ్నకు కె.సి.పంత్‌ పై విధంగా జవాబిచ్చారు.

ఏప్రిల్‌ 2వ తేదీన తెలంగాణ ప్రజాసమితి ఎం.పి.లు ప్రధానమంత్రి ఇందిరాగాంధీ ని కలిసి ‘‘వెంటనే తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాల’’ని విజ్ఞప్తి చేశారు. ప్రధానికి అందజేసిన విజ్ఞాపన పత్రంలో ‘‘ప్రజా ఉద్యమానికి తెలంగాణ ప్రజా సమితి రాజ్యాంగ బద్దమైన, నిర్మాణాత్మకమైన ఒక రూపం ఇచ్చింది. తెలంగాణ లోని 14 స్థానాల్లో 10 స్థానాలకు ప్రజాసమితి అభ్యర్థునలు ఎన్నుకొనడం ద్వారా ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతిలో తమ ప్రత్యేక రాష్ట్రం వాంఛను వ్యక్త పరిచార’’ని పేర్కొన్నారు.

‘‘నాలుగు కోట్ల మంది తెలుగు ప్రజల శాంతి, సుహృద్భావాలతో పురోగతి చెందాలంటే రెండు తెలుగు రాష్ట్రాలు ఉండాలని ఎం.పిలు తమ విజ్ఞాపన పత్రంలో ప్రధానిని కోరినారు.

తెలంగాణ ప్రజా సమితి ఎం.పిల బృందానికి డా॥ జి.ఎస్‌. మేల్కోటే(హైదరాబాద్‌ ఎం.పి) నాయకత్వం వహించారు.

ప్రధానికి ప్రజాసమితి విజ్ఞప్తి
ఏప్రిల్‌ 2, 3, 4 తేదీల్లో తెలంగాణ ప్రజాసమితి రెండవ వార్షిక సమావేశాలు హైదరాబాద్‌లోని రెడ్డి హాస్టల్‌లో చెన్నారెడ్డి అధ్యక్షతన, మూడు రోజులు జరిగినవి. సభాస్థలికి కొండా వెంకట రంగారెడ్డి పేరు పెట్టారు.

ఏప్రిల్‌ 4 సాయంత్రం జరిగిన ముగింపు సభకు డా॥ చెన్నారెడ్డి అధ్యక్షత వహించారు. అంతకు ముందు జరిగిన ప్రజాసమితి ప్రతినిధుల సమావేశం ఆమోదించిన రాజకీయ తీర్మానంలో అఖండ విజయాన్ని సాధించినందుకు ప్రధానిని అభినందిస్తూ ‘‘ప్రజల అండదండతో ప్రధాని పదవీ బాధ్యతను స్వీకరించిన సిసలైన ప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు. ‘‘తెలంగాణలోని కోటిన్నర ప్రజల కోర్కెను మన్నించాలి’’ని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ఈ రాజకీయ తీర్మానాన్ని అసెంబ్లీలోని ప్రజాసమితి నాయకుడు నూక రామచంద్రారెడ్డి ప్రతిపాదించగా లోకసభలోని తెలంగాణ ప్రజాసమితి నాయకుడు డా॥ జి.ఎస్‌. మేల్కోటే బలపర్చారు. ఈ సందర్భంగా ఎన్‌. రామచంద్రారెడ్డి మాట్లాడుతూ గత 14 సంవత్సరాలలో తెలంగాణ ప్రజలు పడ్డ బాధను ప్రస్తావించారు. రాజకీయ తీర్మానంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం పుట్టు పూర్వోత్తరాలను, ఉద్యమం ఎలా కొనసాగిందో పేర్కొన్నారు.

సభలో డాక్టర్‌ చెన్నారెడ్డి ప్రసంగిస్తూ ‘‘తెలంగాణ ప్రజల మనోవాంఛితాలన్ని నెరవేర్చాల’’ని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. ‘‘దేశ ప్రజల మద్దతుతో ప్రధాని పదవిని స్వీకరించిన ఇందిరా గాంధీ అసలైన ప్రధానిగా వ్యవహరించాలి. స్థానిక సుబేదారు, సామంతుల మీద ఆధారపడవలసిన అవసరం లేద’’ని డా॥ చెన్నారెడ్డి అన్నారు.

‘‘తెలంగాణ సమస్యను ఈ ప్రాంతంలోని ప్రజలకు ఆమోదకరంగా ఉండేటట్లు పరిష్కరించడానికి ప్రధానికి అవకాశం వుంది’’అని చెన్నారెడ్డి పేర్కొన్నారు. ప్రజా సమితి సభ ప్రారంభంలో కె.వి.రంగారెడ్డి, మాఢపాటి హన్మంతరావు మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ తీర్మానాలు ఆమోదించారు. ప్రజాసమితి క్రియాశీల సభ్యులు ఒక్కొక్కరు తమ నియోజకవర్గంలోని ఓటర్లలో కనీసం పదిశాతం మందినయినా ప్రజాసమితి సభ్యులుగా చేర్పించాలని ప్రజాసమితి మహాసభ నిర్ణయించింది. జూన్‌ నెలాఖరులోగా ఈ లక్ష్యం సాధించాలని నిర్ణయించారు.

ప్రజా సమితి కార్యవర్గానికి, పార్లమెంటరీ బోర్డు మొదలైన ఇతర కమిటీలకు సభ్యులను నియమించే అధికారాన్ని డా॥ చెన్నారెడ్డికి ప్రతినిధుల సమావేశం ఇవ్వడానికి నిర్ధేశించిన తీర్మానాన్ని ఎన్‌. రామచంద్రారెడ్డి ప్రతిపాదించారు.

1971 మే నెల 9 వ తేదీ నుంచి ఉద్యమాన్ని క్రమశిక్షణా పద్ధతులో నిర్వహించడానికి ప్రజాసమితి ఆధ్వర్యాన ఒక వంటీరు దళాన్ని ఏర్పాటు చేయడానికి ప్రతినిధుల సమావేశం నిర్ణయించింది.

నగర కార్పోరేషన్‌కు వెంటనే ఎన్నికులు నిర్వహించాలని ప్రజాసమితి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

తెలంగాణ రాష్ట్ర సాధనకు అవసరమైన చర్యలు తీసుకోవలసిందిగా అధ్యక్షుడు డా॥ చెన్నారెడ్డికి అధికారమిస్తూ ప్రజాసమితి తీర్మానించింది. బంగ్లాదేశ్‌ను భారత ప్రభుత్వం గుర్తించాలని డా॥ చెన్నారెడ్డి ప్రధానిని కోరినారు. తెలంగాణ ప్రజాసమితి ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఆ విధంగా చెప్పడం ప్రజలను వంచించడమే కాగలదని డా॥ చెన్నారెడ్డి అన్నారు. మతం కానీ, భాషకానీ వివిధ వర్గాలను సంఘటితంగా  ఉంచలేవనీ, మానవత, ఆర్థిక సమానత, సమానావకాశాలు మాత్రమే సంఘటితం చేయగలవని డా॥ చెన్నారెడ్డి అన్నారు.

ప్రజాసమితి ఉర్దూ భాషకు వ్యతిరేకం కాదనీ, ఆంధ్రప్రదేశ్‌ ఇదే విధంగా కొనసాగితే మరో ఐదు సంవత్సరాలలో ఉర్దూ భాషను మరచిపోవలసి వస్తుందని ఆయన అన్నారు.

ప్రజా సమితికి నూతన కార్యవర్గం:
ఏప్రిల్‌ 17న ప్రజాసమితి కార్యవర్గం ఏర్పాటైంది. గత మార్చి 28 న డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి ప్రజాసమితి అధ్యక్షుడిగా తిరిగి ఎన్నికైనారు. అన్ని జిల్లాలో ప్రజాసమితి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకుంది. రాష్ట్ర కమిటికి కూడా నూతన కార్యవర్గాన్ని డా॥ చెన్నారెడ్డి నామినేట్‌ చేశారు.

టి. హయగ్రీవాచారి, ఎన్‌. నరోత్తమ రెడ్డి, పి.నరసింగారావును ప్రధాన కార్యదర్శులుగా నామినేట్‌ చేశారు. కె. అచ్యుతరెడ్డి, లాయక్‌ అలీ, బి.సి జైన్‌ను ఉపాధ్యక్షులుగా, మాచర్ల రామారావును కోశాధికారిగా నామినేట్‌ చేశారు.

కార్యవర్గ సభ్యులు: రామకృష్ణ ధూత్‌, డా॥ జి.ఎస్‌.మేల్కోటే, సంగెం లక్ష్మీబాయి, వి.బి.రాజు, ఎన్‌. రామచంద్రారెడ్డి, శాంతాబాయి, ఎం. ఎం. హాషీం, ఎస్‌.బి. గిరి, జి.వెంకటస్వామి, జి.వి. సుధాకర్‌ రావు, ఎస్‌. వెంకట్రామారెడ్డి, కె.వి.కేశవులు, తాహెర్‌ అలీ ఖాన్‌, జి. రాజారామ్‌, ఎం. మాణిక్‌రావు, ఎం. నారాయణ రెడ్డి, బి. సీతారామయ్య, కె. జితేందర్‌ రెడ్డి, ఎం. మదన్‌ మోహన్‌, నరిసిరెడ్డి, శ్రీపతి రావు, కె.ఎస్‌.నారాయణ. రాష్ట్ర పార్లమెంటరీ బోర్డుకు డాక్టర్‌ చెన్నారెడ్డి అధ్యక్షులు. వి.బి.రాజు, ఎస్‌.బి.గిరి, ఎస్‌. వెంకట్రామారెడ్డి, ఎం.మాణిక్‌ రావు, కె.వి.కేశవులు, బి. రామ్‌దేవ్‌, జి.వెంకటస్వామి ఎం.సత్యనారాయణ రావు, ఎ. మదన్‌ మోహన్‌, ఎన్‌. రామచంద్రా రెడ్డి సభ్యులు.

సివిక్‌ కమిటీకి డా॥ చెన్నారెడ్డి అధ్యక్షులు. కుముద్‌ నాయక్‌, కె. లక్ష్మీ నారాయణ, శివప్రసాద్‌, అబ్దుల్‌ ఖాదర్‌, సి. కాశయ్య, విశ్వనాథ్‌ సభ్యులు. క్రమ శిక్షణ కమిటీకి ఎం. రామిరెడ్డి అధ్యక్షులు. సులోచనా రెడ్డి, పార్శీ ఈశ్వరయ్య, ఎన్‌. రామదాస్‌, సి. మాణిక్‌ రావు సభ్యులు. సికింద్రాబాద్‌ ప్రజాసమితి శాఖ అధ్యక్షునిగా ఎం.ఎల్‌.ఏ. నాగం కృష్ణారావు ఎన్నికైనారు. కరీంనగర్‌ టి.పి.ఎస్‌ అధ్యక్షుని గా ఎం.పి ఎం.సత్యనారాయణరావు ఎన్నికైనారు. ఖమ్మం జిల్లా అధ్యక్షులుగా సర్వదేవభట్ల విశ్వనాథం ఎన్నికైనారు. హైదరాబాద్‌ నగర టి.పి.ఎస్‌ అధ్యక్షునిగా బి. రాందేవ్‌ తిరిగి ఎన్నికైనారు. ఆదిలాబాద్‌ జిల్లా తూర్పుమండలానికి (మంచిర్యా) అధ్యక్షునిగా కె.వి.కిషన్‌ రావు (న్యాయవాది) ఎన్నికైనారు.

ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకై లోకసభలో మేల్కోటే విజ్ఞప్తి
ఏప్రిల్‌ ఒకటిన రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ప్రజాసమితి పక్షాన డా॥ జి.ఎస్‌. మేల్కోటే పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ ప్రజల ప్రజాస్వామిక నిర్ణయాన్ని గౌరవించి వెనువెంటనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని మేల్కోటే విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయకపోతే యువకుల పరిస్థితిని తమ చేతిలోకి తీసుకుని మనకు, ప్రభుత్వానికి కూడా నచ్చని మార్గాలను అవలంభించగలరని డా॥ మేల్కోటే హెచ్చరించారు. దేశమంతా ‘‘ఇందిరా జాల్‌’’ పనిచేసినది కానీ తెలంగాణలో పని చేయలేదని, 14 స్థానాల్లో 10 స్థానాలు నుండి అత్యధిక మెజారిటీతో ప్రత్యేక రాష్ట్ర వాదులను ఎన్నుకొని పంపించారని, మేల్కోటే సభలో తెలిపారు. ప్రజాస్వామిక పద్ధతుల ద్వారా ఎన్నికల్లో గెలిచి ఇక్కడకు వచ్చాం. రెండు కోట్ల మంది తెలంగాణ ప్రజల అభీష్టాన్ని గుర్తించి ప్రత్యేక రాష్ట్రాన్ని తక్షణం ఏర్పాటు చేయాల’’ని మేల్కోటే సభలో విజ్ఞప్తి చేశారు.

మేల్కోటే ప్రసంగాన్ని అడ్డుకున్న కాంగ్రెస్‌ సభ్యులు
అధికార కాంగ్రెస్‌ సభ్యులకు తెలంగాణ ప్రజాసమితి సభ్యులకు మధ్య తీవ్ర వాగ్వాదాలు జరిగాయి. అధికార కాంగ్రెస్‌ సభ్యుడు రాంగోపాల్‌ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ప్రజాసమితి సభ్యులు అభ్యంతరాలు చెబుతూ అడ్డుతగలగా, డాక్టర్‌ మేల్కోటే మాట్లాడుతున్నప్పుడు లక్ష్మీకాంతమ్మ అభ్యంతరం చెప్పారు. సుమారు 15 నిముషాల సేపు సభలో తీవ్ర గందరగోళం చెలరేగింది.

ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలు ఇచ్చే ప్రసక్తే లేదన్న సి.ఎం.
ఒకవైపు తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలంతా కొద్దిరోజుల క్రితం జరిగిన లోకసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను చిత్తుగా ఓడించి ప్రజాసమితికి బ్రహ్మరథం పట్టినా, ఇదేమీ పట్టనట్లు సి.ఎం బ్రహ్మానందరెడ్డి మాత్రం రాష్ట్ర ఏర్పాటేమోగానీ కనీసం తెలంగాణ ప్రాంతీయ సంఘానికి చట్టబద్దమైన అధికారాలను కూడా ఇచ్చే ప్రసక్తే లేదని ఏప్రిల్‌ 5న పత్రికా ప్రతినిధులతో అన్నారు. ప్రాంతీయ సంఘం ముందు అపరిష్కృత సమస్యలేవీ లేవన్నారు. తెలంగాణ సిబ్బంది సమస్యలు, తెలంగాణ మిగులు నిధులను వినియోగించకపోవడం మొదలైన సమస్యలను ఇప్పుడు పరిష్కరించడమైందని, ఇప్పుడు పరిస్థితులు చక్కబడినందున ఎలాంటి సమస్యలు లేవన్నారు.

స్వార్థ రాజకీయాల ఉద్యమం ప్రత్యేక తెలంగాణం సిఎం విమర్శ:
ఏప్రిల్‌ 14న గాంధీ భవన్‌లో (కొత్త) కాంగ్రెస్‌ ప్రజా ప్రతినిధులు, పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓడినవారు, రాష్ట్ర నేత సమావేశంలో సి.ఎం. ప్రసంగించారు. ‘తేలినా, మునిగినా మనమంతా ఒక్క తాటిపై వుండాలి. మనలో ఒకరు పోతే రెండవ వారు దక్కుతామనుకోవడం భ్రమ. తెలంగాణ ఉద్యమం రాజకీయా వల్ల సృష్టించబడిందే తప్ప ఇప్పుడు ఆ సమస్య లేనేలేదని పునరుద్ఘాటిస్తున్నాన’’ని బ్రహ్మానంద రెడ్డి అన్నారు.
పి.సి.సి అధ్యక్షుడు పి. నరసారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నిజామాబాద్‌ ఎం.పి. ఎం.రామగోపాలరెడ్డి, కరీంనగర్‌ నుండి పోటీ చేసిన వి. జగపతి రావు తమ ప్రసంగాల్లో చొక్కారావు పై పలు విమర్శలు చేశారు. ‘‘ప్రజా సమితిలో చేరక, ప్రత్యేక రాష్ట్రం అనే మాట అనకుండా, కాంగ్రెస్‌ శిబిరంలోనే వుంటూ, ఆ రథాన్నే ఎక్కి శల్య సారధ్యం చేస్తున్నా’’రని చొక్కారావును విమర్శించారు రాంగోపాల్‌ రెడ్డి. చొక్కారావు ప్రకటను చూస్తే సమసిపోయిన సమస్యను తిరగతోడడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపిస్తున్నదని, వి.బి. రాజు మాటలా వుందని రాంగోపాలరెడ్డి అన్నారు.

ఈ విమర్శ పై అక్కడే వున్న చొక్కారావు స్పందించారు. తెలంగాణ ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు పరిచినట్లయితే తెలంగాణ ఉద్యమం పెరిగేది కాదని, తెలంగాణకు న్యాయం చేయడానికి తెలంగాణ ప్రాంతీయ సంఘాధ్యక్షుడుగా తాను కృషి చేస్తున్నానని చొక్కారావు వివరించారు. ఏళ్ళతరబడి కొన్ని విషయాలు తేలకపోయినా, తెలంగాణ సమస్యను గురించి తాను ఎన్నడూ పత్రికకు ఎక్కలేదని, యిప్పుడు కూడా ఈ సమస్యనంతటినీ ప్రధాని ఇందిరాగాంధీ నిర్ణయానికే వదిలివేయాలని కోరుతున్నామని చొక్కారావు అన్నారు. ప్రధాని అష్టసూత్ర ప్రణాళిక (పథకం) ప్రభావం ప్రజలపై పడలేదని, దానికి మించి ఏదో చేయాలని చొక్కారావు అన్నారు.

చొక్కారావు ప్రసంగానికి అడ్డు పడుతూ ఒక మంత్రి ‘‘తెలంగాణ అభివృద్ధిని కేవలం చొక్కారావే గుత్తకు తీసుకున్నారా?’’ అని ప్రశ్నించారు.

సి.ఎం. బ్రహ్మానంద రెడ్డి మాట్లాడుతూ.. ‘‘ఆంధ్ర ప్రదేశ్‌ ఏర్పడి 15 సంవత్సరాలు దాటింది. మద్రాసు రాష్ట్రంలో వున్న ఆస్తి, అప్పు తగాదాలు యింకా తేలలేదు. మహారాష్ట్ర, మైసూరు రాష్ట్రాలతో కూడా ఇంకా తేలని సమస్యలు కొన్ని ఉన్నాయి. అవి తేలినప్పటికి తెలుతాయి. అందువల్ల ఉద్యోగాలు, నిధులు అనేవి ఒక సమస్యగా చిత్రించి లేని సమస్యలు వున్నట్లు చెప్పడం సరికాదు. అందుకోసమే నేను తెలంగాణ సమస్య అనేది లేదని చెప్పాను’’ అన్నారు.

ప్రత్యేక రాష్ట్రం అంశం పై సి.ఎం. తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేశారు. ‘‘చిన్న రాష్ట్రాలనేవి దేశ శ్రేయస్సుకు, భద్రతకు మేలు కాదు. ఇది జాతీయ సమస్య. ఒక రాష్ట్రంలో తేలేది కాదు. ఉత్తర ప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర అన్నీ ముక్కలు చేస్తే ఆంధ్రప్రదేశ్‌ కూడా మూడో, నాలుగో ముక్కలవుతుంద’’న్నారు బ్రహ్మానంద రెడ్డి.

పార్లమెంట్‌ ఎన్నికలో ఓటమి గురించి మాట్లాడుతూ ‘‘తెలంగాణ ప్రాంతం నుంచి గల 14 స్థానాలలో కాంగ్రెస్‌కు కనీసం ఆరు స్థానాలయినా వస్తాయనుకున్నాను. మూడు స్థానాలకు మించిరాలేదు. దీనికి కారణం కొంత వరకు ద్రోహం, కొంతవరకు అలసత్వం. ప్రతి ఎన్నికలోనూ ఎంతో కొంత ద్రోహం, వుంటుందనుకోవచ్చు. కానీ, గట్టిగా పనిచేసినట్లయితే ఈ రెండూ అడ్డు రావు. నేనేమీ సంకుచిత దృష్టి కలవాన్ని కాదు. నేను సి.ఎం.గా వున్న కాలంలో జరిగిన మేలు మరొకప్పుడు జరగలేద’’ని బ్రహ్మానందరెడ్డి అన్నారు.

తన ప్రసంగంలో సి.ఎం చొక్కారావును తప్పుబట్టారు ‘‘చొక్కారావు నాచేత ఎన్నో పొరపాట్లు చేయించారు. (నేనేమి చేయించానంటూ చొక్కారావు ఎదురు ప్రశ్నించారు) ప్రభుత్వం అనేది ఎవరు చేస్తున్నప్పటికీ మానవ సహజమైన లోపాలు ఉండడం సహజం. గాంధీ పద్ధతిలో కూడా ఇలాగే కొన్ని లోపాలున్నవని ఒప్పుకుంటే సమస్య తీరిపోతుంది. నేను మొదట పొరపాటు ఒప్పుకోవడం మొదటి తప్పు. తరువాత సమస్యలేవో తీరిపోతాయని వారి మాటలు నమ్మి, వారు చెప్పిన ప్రకారం కొన్ని పొరబాట్లు చేయడం రెండో తప్పు’’ అంటూ చొక్కొరావు పై విరుచుకుపడ్డారు.

‘‘కేవలం ఉద్యోగాలు, నిధుల సమస్యల వల్ల తెలంగాణలో ఉద్యమం వచ్చిందంటే నేను నమ్మను… అదేదో ఒక మాదిరి అయింది. ఇక్కడ ఉద్యమానికి మొదలు ప్రజా సమితి కాదు, వేరేవారూ కారు. మనవారే కొందరు కారణం. దానికి రాజకీయాలు ఆధారం. తర్వాతే ప్రజా సమితి వచ్చింద’’ని అన్నారు బ్రహ్మానంద రెడ్డి. ‘తెలంగాణ ఉద్యమానికి కారణం భూస్వామ్య శక్తులు, రాజకీయవేత్తలే’నని అన్నారు ముఖ్యమంత్రి.

సాక్షాత్తూ ముఖ్యమంత్రే చొక్కారావు పై ప్రత్యక్షంగా దాడికి దిగడంతో ఆ తర్వాత మాట్లాడిన మరికొందరు ఎంపిలు చొక్కా రావుపై విమర్శలు చేశారు. ఈ విమర్శకు స్పందిస్తూ.. రాజకీయాల్లో వున్నప్పుడు ఎవరేమి నిందలువేసినా భరించాలని, ఈ నిందవల్ల తాము ఎంతమాత్రం కలత చెందక, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగడానికి తమ ధర్మాన్ని నిర్వహిస్తున్నామని చొక్కారావు అన్నారు.
వచ్చే సంచికలో…
చెన్నారెడ్డికి ప్రధాని ఆహ్వానం

Other Updates