మామిడాల రాము

tsmagazineఅది న్యూఢిల్లీలోని ఐఐటి ప్రవేశ పరీక్షా కేంద్రం. ఎగ్జామ్‌ హాల్‌లో అందరూ ఒక విద్యార్థివైపు ఆశ్చర్యంగా చూస్తున్నారు. అందుకు కారణం ఆ విద్యార్థి సాదాసీదా దుస్తులతో, కాళ్లకు తెగిన స్లిప్పర్లతో వచ్చి ఐఐటి ప్రవేశ పరీక్ష రాయడమే. అంత సామాన్యమైన పేదకుటుంబంలో పుట్టిన ఆ విద్యార్థి స్థితిమంతులకు తప్ప సాధ్యంకాని ఐఐటి ప్రవేశ పరీక్షకు హాజరు కావడమే….

ఆ విద్యార్థి ఎవరోకాదు, అమెరికా అధ్యక్షుడు జార్జ్‌ హెచ్‌డబ్ల్యు బుష్‌ (సీనియర్‌ బుష్‌) చేతుల మీదుగా ఉత్తమ శాస్త్రవేత్త అవార్డు అందుకున్న మన తెలంగాణ బిడ్డ మామిడాల రాములు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్న చందంగా ఎక్కడో తెలంగాణ మారుమూల పల్లె తరిగొప్పుల నుండి అమెరికా అధ్యక్షుని అవార్డు అందుకునే వరకు ఎదిగిన రాములు యువతకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. తెలంగాణ రాష్ట్ర నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉత్తమ శాస్త్రవేత్త అవార్డును అందుకోవడానికి హైదరాబాద్‌ వచ్చిన సందర్భంగా రాములు తెలంగాణ మాస పత్రికతో ముచ్చటించారు.

తన జన్మ భూమి తెలంగాణ అయితే కర్మ భూమి అమెరికా అని అన్నారు. కర్మ భూమిలో ఎన్ని అవార్డులు వచ్చినా జన్మభూమిలో వచ్చిన అవార్డుకు ఏదీ సాటిరాదని రాములు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమెరికా అధ్యక్షులు ఇచ్చిన అవార్డు కంటే తనకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన అవార్డే గొప్పదని అన్నారు.

తరిగొప్పుల గ్రామంలో సోమయ్య, వెంకటమ్మ దంపతులకు ఏకైక సంతానంగా జన్మించిన రాములు తన విద్యాభ్యాసాన్ని అదే గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రారంభించారు. ఆరవ తరగతి వరకు చదివి ఏడవ తరగతి నర్మెట, ఎనిమిది నుండి పదకొండు వరకు జనగామలో విద్యాభాసం చేశారు. పియూసీ హైదరాబాద్‌ వివేక వర్ధిని కాలేజీలో పూర్తి చేశారు. ఆ సమయంలో తనకు ఫీజు చెల్లించే స్తోమతకూడా లేదని, ప్రిన్సిపల్‌ సత్యలేఖర్‌ తన ప్రతిభను గుర్తించి ఫీజు లేకుండానే కళాశాలలో చేర్చుకున్నారని తెలిపారు. ఈ సందర్భంలో తన అనుభవాన్ని చెబుతూ, ఎందరో స్నేహితులు, గురువులు, శ్రేయోభిలాషులు సహాయం చేయడం వల్లనే తాను ఈ స్థాయికి ఎదిగానన్నారు. కష్టంలో ఉన్నవారికి ఆపన్న హస్తాన్ని అందించే మహానుభావులు సమాజంలో ఉన్నారని. సమాజాన్ని ఎప్పుడూ వ్యతిరేక భావంతో కాకుండా ఈ సమాజం తమకు సహకరిస్తుందనే సానుకూల భావంతోనే చూడాలని ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పియూసీ అనంతరం

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ సమయంలో ఆర్ధిక ఇబ్బందుల వల్ల రావూస్‌ ట్యుటోరియల్‌లో 35 రూపాయల వేతనానికి గణితం, ఫిజిక్స్‌ బోధించే ఉపాధ్యాయునిగా చేరడం జరిగిందన్నారు. అది తనకు కొంత ఆర్ధికంగా వెసులుబాటు కల్పించిందన్నారు.

పియూసీ అనంతరం ఉస్మానియా యూనివర్సిటీలో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణులయ్యారు. ఆతర్వాత ఎం.టెక్‌ కోసం ఢిల్లీలో ఐఐటి ఎంట్రెన్స్‌ టెస్ట్‌ కోసం దరఖాస్తు చేయడం జరిగిందని, ఢిల్లీ వెళ్లడానికి, సీటు దొరికితే ఫీజు చెల్లించడానికి డబ్బులు లేకపోవడంతో తాను పరీక్ష రాయడం విరమించుకున్నట్లు తెలిపారు. ఆ సమయంలో తన స్నేహితుడైన నల్లగొండ జిల్లాకు చెందిన రాంమనోహర్‌ రెడ్డి తనను ప్రోత్సహించి ఫీజు డబ్బులు, ట్రైన్‌ టికెట్‌ డబ్బులు ఇచ్చి తనను ప్రోత్సహించి ఢిల్లీకి పంపించినట్లు చెప్పారు. అప్పుడు తాను పరీక్ష రాయడానికి ఢిల్లీ ట్రైన్‌ ఎక్కానన్నారు. ఢిల్లీ స్టేషన్‌లో దిగిన తర్వాత బస్సు, ఆటోలకు డబ్బులు లేక నడుచుకుంటూ పరీక్షా కేంద్రానికి వెళ్లానని అప్పటి తన బాధలను పంచుకున్నారు.

అక్కడ తాను పరీక్ష రాయడానికి వెలితే తన ఆహర్యం చూసి అధ్యాపకులు, విద్యార్థులు ఆశ్చర్యపోయారన్నారు. ఆ సమయంలో పంజాబ్‌కు చెందిన ప్రొఫెసర్‌ ప్రేమ్‌రతన్‌ ఎంతో సహకరించారని తెలిపారు. పరీక్ష ఫలితాలు తెల్లవారు వెలువడనుండగా ఆ రోజు రాత్రి తాను లాడ్జిలో ఉండలేని స్థితిలో కాలేజీలోని లైబ్రరీలో పడుకునే విధంగా పంజాబ్‌కు చెందిన ప్రేమ్‌ రతన్‌ అనే అధ్యాపకుడు వీలుకలిపించారని తెలిపారు. తెల్లవారి తనకు సీటు రావడంతో తన వద్ద ఉన్న 600 రూపాయలను ఫీజుగా చెల్లించి హైదరాబాద్‌ తిరిగి వచ్చానని తెలిపారు.

ఢిల్లీ ఐఐటిలో కోర్సు పూర్తి అయిన తర్వాత అక్కడే ఢిల్లీ ట్రాఫిక్‌ సిగ్నల్‌ వ్యవస్థపై ప్రాజెక్టు వర్క్‌ పూర్తి చేశానని తెలిపారు. ఐఐటి చదువుతుండగా దేశం మొత్తంలో మూడవ ర్యాంకు సాధించి మెరిట్‌ స్కాలర్‌ షిప్‌ పొందినట్లు తెలిపారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఓవర్‌సీస్‌ స్కాలర్‌ షిప్‌తో అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీలో రిసెర్చ్‌ స్కాలర్‌గా అవకాశం వచ్చింది. తన ఆర్ధిక పరిస్థితి, తన చదువును దృష్టిలో ఉంచుకుని అమెరికా వెల్లడానికి సంశయిస్తుండగా ఐఐటి ప్రొఫెసర్‌ నాక్రా తనను ప్రోత్సహించి అమెరికా వెల్లడానికి మార్గం సుగమం చేశారన్నారు.

1977లో రీసెర్చ్‌ స్కాలర్‌గా అమెరికా వెల్లడం జరిగిందన్నారు. 1985లో తాను భారత దేశానికి తిరిగి వచ్చి ఉద్యోగ ప్రయత్నాలు చేసినా తనకు ఉద్యోగం లభించలేదన్నారు. ఈ క్రమంలో తన కుటుంబ సభ్యులు, స్నేహితులు కుదిర్చిన అమ్మాయి ‘వినతి’ని వివాహం చేసుకున్నాని తెలిపారు. తన వివాహం ఎలాంటి ఆర్భాటాలు లేకుండా స్టేజి మ్యారేజీ జరిగిందన్నారు. దీనికి ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ తోట ఆనంద రావు, గజ్వేల్‌కు చెందిన విఠల్‌ రెడ్డి, బొజ్జా తారకం, తదితరులు హాజరైనారని తెలిపారు.

అనంతరం అమెరికా వెళ్ళి ఉద్యోగంలో చేరానని, 1986లో యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్నాతకోత్సవంలో యూనివర్సిటీ స్థాయిలో అత్యుత్తమ ప్రొఫెసర్లలో 8వ స్థానం పొందినట్లు ఆయన తెలిపారు. 1989లో జాతీయ స్థాయిలో సొసైటీ ఆఫ్‌ ఆటోమేటివ్‌ ఇంజనీర్స్‌ ప్రెసిడెన్షియల్‌ యంగ్‌ ఇన్వెస్టిగేటర్‌ అవార్డును అమెరికా ప్రెసిడెంట్‌ సీనియర్‌ బుష్‌తో అవార్డు అందుకున్నారు. దీనికి నగదు బహుమతి లభించిందన్నారు. అమెరికాలో ఫ్రొఫెసర్లకు రిటైర్మెంట్‌

ఉండదని, తను ఇప్పటికీ అమెరికాలోని రక్షణ శాఖలో కీలక పదవిలో కొనసాగుతున్నట్లు ఆయన తెలిపారు. తనకు తోచిన విధంగా తన జన్మభూమి అయిన తరిగొప్పులలో ప్రతి సంవత్సరం మెరిట్‌ స్కార్‌షిప్‌లను ఇస్తున్నట్లు చెప్పారు. ఈ సమాజంలో విద్యా, వైద్యం ఎక్కడ మెరుగ్గా ఉంటుందో ఆ ప్రాంతం త్వరగా అభివృద్ధి చెందుతుందని ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం కూడా కృషి చేయాలని కోరారు. గతంలోలాగా ప్రస్తుతం గ్రామాలలో అణచివేత లేదని కష్టపడి చదవుకునే విద్యార్థులకు ఎన్నో అవకాశాలున్నాయని అన్నారు.

తాను విద్యనభ్యసించిన కాలంలో కిర్రు చెప్పుల బుర్రమీసాల సంఘం ఉండేదని, పెత్తందార్ల ముందు సామాన్యులు చెప్పులతో నడవడానికి జంకేవారన్నారు. అలాంటి నిర్భంద, నియంతృత్వ సమాజంలోనే తాను కష్టపడి ఈ స్థాయికి వచ్చానన్నారు. ఇప్పటి పరిస్థితులలో అట్టడుగు వర్గాల యువకులు తమకు అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకొని కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మామిడాల రాములు యువతకు పిలుపునిచ్చారు.

Other Updates