తెలంగాణలోని సామాజిక పరిస్థితుల ఆధారంగా విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన కులాలకు జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 2014 జూన్ 2న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ సామాజిక పరిస్థితులపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో అధ్యయనం నిర్వహించింది. ఎస్టీల స్థితిగతులపై చెల్లప్ప కమిషన్, మైనారిటీల స్థితిగతులపై సుధీర్ కమిషన్, బిసిల స్థితిగతులపై బి.ఎస్. రాములు నేతృత్వంలోని బిసి కమిషన్ క్షేత్ర స్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ప్రభుత్వానికి నివేదికలు సమర్పించాయి.
బిసిల జనాభా కూడా తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్నది. కానీ వారికి కేవలం 25 శాతం రిజర్వేషన్ మాత్రమే అమలవుతున్నది. వారికి కూడా రిజర్వేషన్ పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది.
2011 జనాభా లెక్కలతో పాటు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే కూడా అందుబాటులో ఉంది. దీని ప్రకారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పటికంటే ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ వర్గాల సంఖ్య తెలంగాణలో ఖచ్చితంగా ఎక్కువున్నదని తేలింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీల జనాభా కేవలం ఆరు శాతమే. కానీ తెలంగాణలో దాదాపు పదిశాతంగా ఎస్టీల జనాభా ఉన్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ముస్లింలు 5 శాతమని తేల్చి నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. కానీ తెలంగాణలో మైనారిటీల సంఖ్య 14 శాతం దాటగా, ముస్లింల సంఖ్య 12 శాతం దాటింది. అదే విధంగా ఎస్సీల శాతం 15 నుంచి 16 శాతానికి పైగా పెరిగింది. బిసిలు కూడా 50 శాతానికి పైగా ఉన్నారు. భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆయా కులాల నిష్పత్తి ప్రకారం.. సామాజికంగా, విద్యా పరంగా వారి వెనుక బాటును అనుసరించి విద్యాసంస్థల ప్రవేశాల్లో, ఉద్యోగ నియామకాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. అదే పద్ధతిన తెలంగాణలో కూడా ఇప్పటికే అమలవుతున్న రిజర్వేషన్లలో మార్పులు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 2017 ఏప్రిల్ 16న అసెంబ్లీలో తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ (రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్ స్టిట్యూషన్స్ అండ్ ఆఫ్ అపాయింట్మెంట్స్‌ఆర్ పోస్ట్స్ ఇన్ ద సర్వీసెస్ అండర్ ద స్టేట్) బిల్లు -2017ను ప్రవేశ పెట్టింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రవేశ పెట్టిన ఈ బిల్లుపై విస్తృతంగా చర్చ జరిపి శాసనసభ, మండలి ఒకే రోజు ఆమోదించి చట్టం చేశాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం, సిపిఎం పార్టీలు ఈ బిల్లుకు మద్దతు తెలిపాయి. దీని ప్రకారం తెలంగాణలో ఎస్టీల రిజర్వేషన్లు 6 నుంచి 10 శాతానికి, ముస్లింల రిజర్వేషన్లు 4 నుంచి 12 శాతానికి పెరిగాయి. మొత్తంగా తెలంగాణలో రిజర్వేషన్లు 50 నుంచి 62 శాతానికి పెరుగుతాయి.
తెలంగాణ జనాభా – రిజర్వేషన్లు
కులం 2011లెక్కలు ఎస్.కె.ఎస్. ప్రస్తుతం కొత్త చట్టం ప్రకారం
ఎస్.సి. 15.45 17.50 15 శాతం 15 శాతం
ఎస్.టి. 9.08 09.91 06 శాతం 10 శాతం
బిసి (ఎ,బి,సి,డి) 51.08 25 శాతం 25 శాతం
మైనారిటీ 14.46 4 శాతం 12 శాతం
మొత్తం 92.95 50 శాతం 62 శాతం
ఎస్సీ, బిసిలకు కూడా పెరగనున్న రిజర్వేషన్లు:
సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన కులాలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రభుత్వం సుముఖంగా ఉంది. ఎస్సీలు, బిసిలకు కూడా రిజర్వేషన్లు పెంచుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు అసెంబ్లీలో ప్రకటిం చారు. తెలంగాణలో ఎస్సీల జనాభా 16 శాతానికి పైగా ఉంది. వారికి 15 శాతం మాత్రమే రిజర్వేషన్ అందుతున్నది. ఎస్సీలకు ఒక శాతం రిజర్వేషన్ పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. బిసిల జనాభా కూడా తెలంగాణలో 50 శాతానికి పైగా ఉన్నది. కానీ వారికి కేవలం 25 శాతం రిజర్వేషన్ మాత్రమే అమలవుతున్నది. వారికి కూడా రిజర్వేషన్ పెంచడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఎంత మేరకు పెంచాలనే విషయంలో ప్రభుత్వానికి బిసి కమిషన్ త్వరలో నివేదిక సమర్పిస్తుంది. దాని ఆధారంగా రిజర్వేషన్ పెంచుతారు. ఎస్సీలు, బిసిలకు రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి మరోసారి అసెంబ్లీలో చట్టం తెస్తారు. వీటితో పాటు కాయిత లంబాడీలు, వాల్మీకిబోయలాంటి కులాలను ఎస్టీలలో చేర్చే అంశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది.
రాష్ట్రపతి, పార్లమెంటు ఆమోదం తప్పనిసరి:
తెలంగాణలో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రూపొందించిన బిల్లును గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమో దానికి పంపుతారు. రాష్ట్ర పరిధిలో రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి రాష్ట్ర అసెంబ్లీ చట్టం చేసినప్పటికీ రిజర్వేషన్ల శాతం 50 శాతానికి మించవద్దనే సుప్రీంకోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. తమిళనాడు రాష్ట్రంలో 69శాతం రిజర్వేషన్లు అమలవుతున్న అంశంపై నమోదైన కేసుల్లో విచారణ సాగుతున్నది. రాజ్యాంగ ధర్మాసనం కూడా ఈ విషయంపై విచారణ జరుపుతున్నది.తెలంగాణ రాష్ట్రంలో కూడా తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లు అమలు చేయా లని రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నది. తెలంగాణ అసెంబ్లీ చేసిన కొత్త చట్టం ముందుగా రాష్ట్రపతి ఆమోదానికి వెళుతుంది. ఆ తర్వాత పార్లమెంటుకు వెళ్తుంది. పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసి రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో రిజర్వేషన్ల పెంపు అంశాన్ని చేర్చాల్సి ఉంది.
రిజర్వేషన్ల ఆమోదానికి ప్రధానిని కలిసిన ముఖ్యమంత్రి
ఎస్టీలు, ముస్లింలకు రిజర్వేషన్లు పెంచుతూ అసెంబ్లీ చట్టం చేసిన నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు 2017 ఏప్రిల్ 24న కలిశారు. తెలంగాణ సామాజిక పరిస్థితులను, రిజర్వేషన్ పెంచడానికి కారణాలను వివరించారు. పెంచిన రిజర్వేషన్లు అమలయ్యే విధంగా సహకరించాలని కోరారు. రాష్ట్ర పరిధిలో అక్కడి సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించుకునే వెసులుబాటు పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాలకే ఉండేలా చట్టం చేయాలని కూడా ప్రధానిని తెలంగాణ ముఖ్యమంత్రి కోరారు.
రిజర్వేషన్ల పెంపు – రాజ్యాంగ స్పూర్తి:
ఆర్టికల్ 46(ఆదేశిక సూత్రాలు): వివక్షకు, అణచివేతకు గురైన వర్గాలను ప్రోత్సహించడానికి అవసరమైన చర్యలు తీసుకునే విషయంలో ప్రభుత్వానికి ఎలాంటి పరిమితులు లేవని రాజ్యాంగం(ఆర్టికల్ 46) స్పష్టం చేస్తున్నది. రాజ్యాంగ బద్ధంగా శాసనాలు చేసే హక్కు చట్టసభలకు ఉంటుంది.
ఆర్టికల్ 15(4) (ప్రాథమిక హక్కులు): విద్యాపరంగా, సామాజికంగా వెనుకబడిన వారిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. ఇది సమానత్వం హక్కుకు విరుద్ధం కాదు.
ఎస్సీ, ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ:
ఎస్సీ, ఎస్టీలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించాలని రాజ్యాంగం చెబుతున్నది. తెలంగాణలో 9 శాతానికి పైగా ఉన్న ఎస్టీలు కేవలం 6 శాతం రిజర్వేషన్‌ను మాత్రమే పొందుతున్నారు. కాబట్టి అనివార్యంగా వారి రిజర్వేషన్ శాతాన్ని పెంచితీరాలి. అలాంటప్పుడు 50 శాతం మించకూడదనే నిబంధన తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎట్టి పరిస్థితుల్లో వర్తించదు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు సీట్లతో సహా అన్ని ఉద్యోగ, విద్య అవకాశాల్లో ఎస్సీ(15), ఎస్టీ(7.5)లకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ కల్పిస్తున్నది.
ఎస్టీ రాష్ట్రాల్లో సుప్రీం ఆదేశాల ప్రభావం లేదు :
ఎస్టీలు అధికశాతంలో ఉన్న ఈశాన్య రాష్ట్ర్రాలైన అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరాం లాంటి రాష్ట్రాల్లో 80 శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే సుప్రీం ఆదేశాలు ఆ రాష్ట్రాలపై ప్రభావం చూపట్లేదు.
తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు:
ఇక తమ రాష్ట్రంలో 87 శాతం మంది బలహీన వర్గాలే అని తమిళనాడు రాష్ట్రం వాదించింది. కాబట్టి తమ రాష్ట్రంలో 69 శాతం రిజర్వేషన్లు అమలు చేసుకుంటామని చట్టం చేసి కేంద్ర ప్రభుత్వ ఆమోదం కూడా పొందింది. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రంలో బిసిలకు 30 శాతం, అత్యంత వెనుకబడిన తరగతులకు 20 శాతం, ఎస్సీలకు 18 శాతం, ఎస్టీలకు 1 శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బిసి, వర్గాలే పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఎస్సీలకు మినహా మిగతా వర్గాలకు వారి జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు అమలు కావడం లేదు. 9 శాతమున్న ఎస్టీలకు 6 శాతం, 50 శాతం ఉన్న బిసిలకు 25 శాతం, 12శాతమున్న ముస్లింలకు కేవలం 4 శాతం రిజర్వేషన్ అమలవుతున్నది.
తమిళనాడులో బలహీన వర్గాలు ఎక్కువగా ఉన్నారనే కారణంతో అక్కడ 69శాతం రిజర్వేషన్ అమలు చేసినప్పుడు, అదే సామాజిక పరిస్థితులున్న తెలం గాణలో రిజర్వేషన్ పెంచడానికి ఎవరికీ అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు.
రాజస్థాన్లో 68 శాతం రిజర్వేషన్ల కోసం చట్టాలు :
రాజస్థాన్ లోని బిజెపి ప్రభుత్వం గత ఏడాది తమ రాష్ట్రంలో రిజర్వేషన్లను 68 శాతానికి పెంచుతూ రెండు చట్టాలు చేసింది. గుజ్జర్లకు 5 శాతం, ఇబిసిలకు 14 శాతం రిజర్వేషన్లు కల్పించింది. తమ రాష్ట్ర సామాజిక పరిస్థితులకు అనుగుణంగా రిజర్వేషన్లు పెంచుకున్నామని, రాజ్యాంగ సవరణ చేసి అమలయ్యేలా చూడాలని ఆ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి కేంద్రానికి పంపింది.
ముస్లింలకు రిజర్వేషన్ వల్ల బిసిలకు అన్యాయం జరగదు
బిసిలకు ప్రస్తుతం 29 శాతం రిజర్వేషన్లు
బిసి ఎ : 7 శాతం
బిసి బి : 10 శాతం
బిసి సి : 1 శాతం
బిసి డి : 7 శాతం
బిసి ఇ : 4 శాతం
– ముస్లింలకు రిజర్వేషన్ పెంచితే బిసి ఇ లో పెరుగుతాయి. మిగతా ఎ, బి, సి, డి లకు రిజర్వేషన్లు తగ్గవు. ముస్లింలతో కలిపి ప్రస్తుతం బిసిలకు అందుతున్న 29 శాతం రిజర్వేషన్లు కూడా పెరుగుతాయి.
మండల్ కమిషన్‌తో పెరిగిన రిజర్వేషన్లు
సామాజిక, విద్యారంగాల్లో వెనుకబాటుతనం ఆధా రంగా రిజర్వేషన్లు కల్పించే వెసులుబాటును కూడా రాజ్యాంగమే కల్పించింది. రాజ్యాంగం చెప్పిన ఎస్సీ, ఎస్టీల కే కాక… రాజ్యాంగంలో పొందు పరచకపోయిన ప్పటికీ వెనుకబడిన కులాలకు దేశంలో 27 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నారు. వెనుకబడిన తరగతుల్లోని పేదరికం ఆధారంగా మండల్ కమిషన్ సిఫారసులను అనుసరించి ఓబిసిలకు రిజర్వేషన్ కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు ఇదే సూత్రం తెలం గాణకు కూడా వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బిసి వర్గాలతో పాటు తెలంగాణలో పెద్ద సంఖ్యలో ఉన్న ముస్లింలలో కూడా అత్యంత పేదరికం ఉన్నది. ఆ వర్గాలు విద్యాపరంగా, ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నాయి. వారికి రిజర్వేషన్ కల్పించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రభుత్వం ముస్లింల స్థితిగతులపై అధ్యయనం చేయడానికి కమిషన్ వేసింది. ఆ కమిషన్ నివేదిక కూడా ఇచ్చింది. బిసి కమిషన్ కూడా ముస్లిం కులాల్లోని వెనుకబాటు ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలని సిఫారసు చేసింది. దాని ప్రకారమే రిజర్వేషన్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుకుంటున్నది. ముస్లింలకు మతపరంగా కాకుండా వారి వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన. ఇది రాజ్యాంగ స్పూర్తికి అనుగుణమైనదే. పైగా పేదరికం భూమికగా ముస్లింలకు కొన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు.
ఏడు రాష్ట్రాల్లో 50 శాతానికి మించి రిజర్వేషన్లు:
1. తమిళనాడు – 69 శాతం
2. చత్తీస్ గఢ్ – 58 శాతం
3. మహారాష్ట్ర – 52 శాతం
4. అరుణాచల్ ప్రదేశ్ – 80 శాతం
5. మేఘాలయ – 80 శాతం
6. నాగాలాండ్- 80 శాతం
7. మిజోరం – 80
7 రాష్ట్రాల్లో ముస్లింలకు రిజర్వేషన్లు
బిసిలు, ఎంబిసిలకు అమలు చేస్తున్న 50 శాతం రిజర్వేషన్లలో తమిళనాడు ప్రభుత్వం ముస్లింలు, క్రిస్టియన్లకు 3.5 శాతం చొప్పున సబ్ కోటాగా నిర్ణయించి రిజర్వేషన్లు అమలు చేస్తున్నది.
పశ్చిమ బెంగాల్, కర్ణాటక, మణిపూర్ రాష్ట్రాల్లో ముస్లింలను ఓబిసిలుగా పరిగణించి రిజర్వేషన్లు కల్పించారు. కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాల్లో ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వెనుకబడిన ముస్లింలను బిసి ‘ఇ’ కేటగిరీగా పరిగణించి నాలుగు శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నారు. కాబట్టి ముస్లింలకు వారి పేదరికం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం సాధ్యమే అని తేటతెల్లమవుతోంది.
స్వతంత్య్రానికి పూర్వం నుంచి భారత్‌లో రిజర్వేషన్లు:
ఇతర దేశాల రాజ్యాంగాల్లోని చాలా అంశాలను భారత రాజ్యాంగంలోకి తీసుకున్నప్పటికీ, రిజర్వేషన్ల అంశం మాత్రం ఖచ్చితంగా ఈ దేశ సామాజిక స్థితిగతులకు అనుగుణంగా పొందుపరిచిందే. స్వాతంత్య్రం రాకముందు నుంచే భారతదేశంలో రిజర్వేషన్లు అమలు చేసిన చరిత్ర ఉంది.
1882లోనే కొల్హాపూర్ రాజ్యంలో అప్పటి రాజు సాహు బ్రాహ్మణేతరులకు రిజర్వేషన్ కల్పించారు.
బ్రిటన్ ప్రధాని ప్రతిపాదించిన కమ్యూనల్ అవార్డులో కూడా ముస్లింలు, సిక్కులు, ఇండియన్ క్రిస్టియన్లు, ఆంగ్లో ఇండియన్లకు రిజర్వేషన్లు కల్పించాలని చెప్పారు.
బ్రిటిష్ ప్రభుత్వం 1909లో రూపొందించిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్టులో కూడా రిజర్వేషన్ కల్పించారు. రౌండ్ టేబుల్ సమావేశాల్లోనూ రిజర్వేషన్ల అంశంపైనే ప్రధానంగా చర్చించారు. ఈ దేశంలో అనేక మతాలు, కులాల వారున్నారు. వారిలో పేదలున్నారు. వారిలో వెనుకబాటుతనం పోగొట్టడానికి, ఇతరులతో సమానంగా వారిని తీర్చిదిద్దడానికి రిజర్వేషన్లు కల్పించాలన్నది రాజ్యాంగ స్పూర్తి మాత్రమే.
కేంద్రంలో, రాష్ట్రంలో వేర్వేరుగా రిజర్వేషన్లు :
రిజర్వేషన్లు కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే రకంగా లేవు. ఆయా రాష్ట్రాల్లోని సామాజిక పరిస్థితులను, కులాల జనాభాను బట్టి రిజర్వేషన్ల శాతం మారుతుంది కూడా. కేంద్ర సర్వీసుల్లో ఎస్టీలకు 7.5 శాతం రిజర్వేషన్ అమలవుతున్నది. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలకు 80 శాతం రిజర్వేషన్ ఉన్నది. ఓబిసిలకు 27 శాతం రిజర్వేషన్ కేంద్రంలో ఉంటే, చాలా రాష్ట్రాల్లో ఇంతకంటే ఎక్కువే
ఉన్నది. కాబట్టి రిజర్వేషన్లు 50 శాతానికి మించవద్దనే అభిప్రాయం రాజ్యాంగ స్పూర్తికి విరుద్ధం. ఈశాన్య రాష్ట్రాల్లో 80 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నప్పుడు, తమిళనాడులో 69 శాతం రిజర్వేషన్లు అందుతున్నప్పుడు తెలంగాణలో కూడా రిజర్వేషన్ల పెంపు సాధ్యమే.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రిజర్వేషన్లు
ఎస్.సి. : 15 శాతం
ఎస్.టి. : 7.5 శాతం
ఓబిసి : 27 శాతం
వెనుకబాటే ప్రామాణికం :
విద్యాపరంగా, సామాజికంగా వెనుకబాటు కారణంగానే కొన్ని వర్గాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించ డానికి అవకాశం కల్పిస్తున్న వ్యవస్థలు, అవే లక్షణాలు కలిగిన ఇతర వర్గాలకు కూడా జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు కల్పించడం సహజ న్యాయ సూత్రం.