”శతేన ప్రోక్తం శతకం” – నూరు శ్లోకాలు లేదా పద్యాల సమాహారమే శతకం. శతకమంటే నూరైనా రాసే కవి ప్రతిభను అనుసరించి అంతకంటే ఎక్కువ శ్లోకాలు లేదా పద్యాలు ఉండవచ్చు. పద్యగద్యాలతో పరిపుష్టమైన భారతీయ సాహిత్యంలో శతక రచన సాధారణంగా పద్యభాగానికి చెందిన విశేష రచనా ప్రక్రియ. సంస్కృత సాహిత్యంలో దీనికి మూలాలున్నట్లు మనకు నిర్దిష్టమైన ఆధారాలున్నాయి.
తెలుగు భాషలో భక్తి, నీతి,శృంగార, హాస్య, వైరాగ్య, కథాత్మక, అనువాద, చారిత్రక ప్రక్రియలో శతకాలు రచించబడినయి. శతక రచనా విధానంలో కొన్ని ప్రత్యేకతలున్నాయి. ఛందో నియమయుక్తంగా వివిధ వృత్తాలలో రచించబడటం ముఖ్య లక్షణం. అంతే కాదు ఇవి ” మకుట రహిత శతకాలు” అలాగే ”మకుట సహిత శతకాలు” అని రెండు విధాలు.
” మకుట ” శబ్దాన్ని సంస్కృతం నుండి తీసుకున్నా M.B.Emeneanu, T.Burrow, R.I.Tuner అనే పాశ్చాత్య పండితులు ఇది ద్రవిడ శబ్దమని తరువాత సంస్కృత పదకోశంలో చేరిందని సిద్ధాంతీకరించారు.
శతకాలను ”ముక్తక”, ”అముక్తక” శతకాలని రెండు రకాలుగా విభజించవచ్చు. విషయ ప్రాధాన్యాన్ని బట్టి రాసిన శ్లోకాలు గాని పద్యాలు గాని ఒకదానితో మరియొకదానికి సంబంధం లేకుండా స్వతంత్ర భావాన్నిచ్చేవి ” ముక్తకాలు” అంటారు. అలాకాక ధారావాహిక విషయ వివరణాత్మకమైనవి ” అముక్తక” శతకాలు అలాగే శతకాలను ” ధార్మిక శతకాలు”, ”లౌకిక” శతకాలు” అని రెండు రకాలుగా విభజించవచ్చు.
శతక వాజ్మయం తెలుగు భాషలో 12వ శతాబ్దంలో ప్రారంభమైనట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. ఇతర భాషలలో శతక రచనలు ఉన్నప్పటికీ ఛందోబద్ధమై, వృత్త ప్రాధాన్యం కలిగి, అలంకార యుక్తమై, మకుట నియమాన్ని మకుటాయమానంగా కలిగిన ప్రత్యేక రచనాశైలి తెలుగువారి సొంతం అనటంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు. తెలుగు సాహిత్యంలో నాటి నుండి నేటివరకు పదివేలకు పైగా శతకాలున్నాయని విమర్శకుల అంచనా ప్రాచీన స్తుతి శతకాల నుండి ఆధునిక విషయ పరిజ్ఞాన బోధక శతకాల వరకు రచింపబడిన ఈ అనేకానేక శతక రచనల్లో తెలంగాణా ప్రాంత కవుల, పండితులు తోడ్పాటు (జశీఅ్‌తీఱపబ్‌ఱశీఅ) శ్లాఘించదగిన స్థాయిలో ఉన్నది.
క్రీ.శ. 1025-1100 మధ్య జీవించిన మల్లికార్జున పండితారాధ్యుడు రచించిన ”శ్రీగిరి మల్లికార్జున శతకం” తెలుగులో మొదటి శతకంగా ప్రసిద్ధి చెందింది. శివతత్త్వాన్ని చెపుతూ జీవులను పశువులుగా శివుని పశుపతిగా కవి ఇలా వర్ణింస్తున్నాడు.
జీవులనేకులు పశువులు
భావింపగ బ్రకృతి వికృతి బంధము పాశం
బావృతములనం బశువులు
నీవారెంటికిని బతివి నిరుపమహేశా!
క్రీ.శ 1170-1240 మధ్య పాలకుర్తికి జీవించిన పాల్కురిని సోమనాథుని ” వృషాధిప శతకం” సంపూర్ణ శతకన లక్షణాలు కలిగి తొలి తెలుగు శతకంగా పండిత పరిశోధకులు ప్రామాణీకరిస్తున్నారు. ” బసవా! బసవా! వృషాధిపా!” మకుటంలో ఈ మహాకవి శతకాన్ని రచించాడు. నాటి సమాజంలోని ప్రజల ఆచార వ్యవహార నడవడిని కవి హృద్యంగా ఎన్నో పద్యాలలో వర్ణించాడు.
సరస వచస్క నిర్మలయశస్క శివైక్య మనస్క భక్త హృ
త్సరసిజ గేహక్లప్ల భవదాహ దయా పరివాహ చిత్సుఖో
త్తర నిజ శిల్ప భక్త పరతల్ప మహావృషకల్ప మన్మనో
వరద శరణమయ్య బసవా బసవా బసవా వృషాధిపా!
క్రీ.శ 1242 ప్రాంతంలో జీవించిన యథావాక్కుల అన్నమయ్య శైవ శతక సాహిత్య కవిత్రయంలో ఒకరు. ఈయన రచించిన ”సర్వేశ్వర శతకం”లో 142 పద్యాలున్నాయి. ”సర్వేశ్వరా” అనే మకుటంతో ఈ శతకం ప్రసిద్ధమైంది.
జలజాత ప్రభ్వండ భాండములు, దుశ్చారిత్రులంబాత్రులం
జెలువైయుండ యథా ప్రమాణములు శిక్షింపరక్షింపని
శ్చల లీలం బ్రభవించు రాజు భవదాజ్ఞాశక్తిగా కింతవ
ట్టెలమిన్ జేకొని నిర్వహింప మఱి రాజెవ్వాడు సర్వేశ్వరా!
అంటూ అన్మమయ్య రాజధర్మాన్ని వివరించాడు
13వ శతాబ్ధనికి చెందిన భద్రభూపాలుడు(బద్దెన) నీతి ప్రబోధకమైన ”సుమతి” శతకాన్ని రచించాడు. కమలాసన బిరుదాంకితుడైన ఈ కవి ” సుమతీ” మకుటంతో108 పద్యాలు రచించాడు.
తన కోపమె తన శత్రువు
తన శాంతమె తనకు రక్ష, దయ చుట్టంబౌ
తన సంతోషమె స్వర్గము
తన దు:ఖమె నరకమండ్రు తథ్యము సుమతీ!
జీవితంలో అనుక్షణం మనలను జాగృతపరిచే విధంగా బద్దెన రాసిన సుమతీ మకుట పద్యమిది
అలాగే కంచర్ల గోపన్న ” దాశరథీ శతకాన్ని ” రచించాడు ఆదర్శ పురుషుడైన శ్రీరాముని గుణగణాలను ఇలా కీర్తిస్తున్నాడు
శ్రీరఘురామ చారు తులసీదళధామ శమక్షమాదిశృం
గార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్యరమాలలామ దు
ర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో
త్తారక నామ భద్రగిరి దాశరథీ కరుణా పయోనిథీ!
ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామిని ధ్యానిస్తూ బమ్మెర పోతన ” నారాయణ శతకాన్ని” రచించాడు కరీంనగర్ జిల్లా ధర్మపురిలో జన్మించిన తాతామనువలు – ” నరసింహ శతక” కర్త శేషాచలదాసు(శేషప్ప), ”కృష్ణ శతక” కర్త కాకుత్థ్సం నరసింహదాసు. ” భూషణ వికాస శ్రీ ధర్మపురి నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూర” అన్న మకుటంతో ” నరసింహ శతకాన్ని” రాసి శేషాచలదాసు ఖ్యాతిని గడించాడు. ఇంకా ” నరహరి శతకం”, ” నృకేసరి శతకం” కూడా ఈయన రచనలే, ఇతని మనుమడైన కాకుత్థ్సం నరసింహదాసు రచించినది ” కృష్ణ శతకం”.
యమునికి నికనే వెఱవను కమలాక్ష జగన్నివాస కామిత ఫలదా
విమలమగు నీదు నామము నమరగ దలచెదను వేగ ననిశము కృష్ణా!
ఇలా ” కృష్ణా” మకుటంతో ఉన్న ఈ ఈ శతకం కూడా ప్రసిద్ధమైంది. ఇవేకాక ప్రతాపరుద్రుని మంత్రి శివదేవయ్య రాసిన ” శివదేవ ధీమణీ శతకం”, శరభాంక కవి రాసిన శరభాంక లింగ శతకం”, త్రిపురాంతక కవి రాసిన ” అంబికా శతకం”, వెన్నెల కంటి చంద్రశేఖర కవి రాసిన ” హరిశ్చంద్ర శతకం” పరశురామ రామ్మూర్తి పంతులు రాసిన ” పరశురామ శతకం”, ఠంయాల లక్ష్మీనరసింహాచార్యులు రాసిన ” ముకుంద శతకం”, సముద్రాల లక్ష్మీనరసింహాచార్యులు రాసిన ”లక్ష్మీ నృసింహ శతకం”, శేషాద్రి రమణ కవుల ”సూర్య శతకం” ప్రసిద్ధమైన అనేక శతకాలలో కొన్ని.
ఆధునిక కాలంలో తెలంగాణలో శతక సాహిత్యం భక్తి, జ్ఞాన, వైరాగ్య, నీతి బోధక మార్గోపదేశకంగా వెల్లివిరిసింది. వానమామలై వరదాచార్యులు రాసిన ” స్తవరాజ పంచశతి”, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్యుల ” అంతర్మథనం”, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్యులు రాసిన ” శ్రీపాంచాల రాయశతకం”, హరిరాధా కృష్ణమూర్తి ” శ్రీ శ్రీనివాస శతకం” డా|| సి.వి. జయరాజు ” చారుచర్య” ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ” శ్రీ కర్మన్‌ఘాట్ అంజనేయ స్వామి మొదలైనవి తెలంగాణా నుండి వెలువడిన శతకాలలో కొన్ని.అలాగే డా|| ఇందారం కిషన్‌రావు రాసిన ” శ్రీనివాస శతకం ” శ్రీనివాస ప్రభో అనే మకుటంతో వెలువడింది.
దైవారాధన, సత్యభాషణము, విద్యావృత్తి దీనప్రజా
సేవాసక్తి మహాజనాళి విమల స్నేహంబు, జ్ఞానాప్తి, స
ద్భావోత్సాహము, కోపవర్జనము, గర్వచ్ఛేదమున్, సత్కళా
ప్రావీణ్యంబును ద్వత్కృపానిధికి త్రోవల్ శ్రీనివాస ప్రభో||
అంటూ ఇహపరాలను పొందే మార్గాలను వివరించారు.
ఆచార్య యస్. లక్ష్మణమూర్తి ” గోపికా వల్లభా శతకం”. గాదె వేంకట మధుసూదనరావు ” మధుశతకం”, డా|| తిరునగరి ”తిరునగరీయం”, వరిగొండ కాంతారావు ” ఏలికకు ఒక లేఖ” ఈ ప్రాంతం నుండి వెలవడిన మరికొన్ని శతకాలు.
అన్ని పార్టీల కధ్యక్షులచటి వాళ్ళే
జెండపట్టి నినాదాలు సభలు చేసి
ఓట్లు వేయించు వరకెగా నీదు పాట్లు
తెలుసుకొండయ్య తెలగాణ ధీరులారా
అంటూ! ”తెలంగాణా శతకం” లో నేటి రాజకీయ పరిస్థితులను నల్ల ఉపేందర్ కళ్ళకు కట్టినట్లు వర్ణించారు.
సాహిత్యంలో కాలానుగుణంగా ఎన్ని మార్పులు చోటు చేసుకున్నా శతక ప్రక్రియ మాత్రం తన ఉనికిని కోల్పోక నేటికీ నిలచి ఉన్నది. శతక రచనల ద్వారా నాటి నుండి నేటి వరకు సరస్వతీ ఉపాసన చేస్తున్న కవులు, పండితులు తెలంగాణలో ఎందరో ఉన్నారు. దర్పణశైలి న్యాయంగా కొందరిని పేర్కొనడం జరిగింది
ఎందరో శతక కర్తలు – అందరికి సహస్రాధిక వందనాలు
డా|| ఇందారం శ్రీనివాస్ రావు