వెలపాటి రామరెడ్డి
ఇది తెలంగాణ.
తెలంగాణ బందగి రక్తం చిందిన క్షేత్రం. పోరాటాలకు పురిటి గడ్డ. ధిక్కారానికి పుట్టినిల్లు. ఉద్యమాలకు ఊపిరి. సాహితీ సాంస్కృతిక విన్యాసాలకు సభా వేదిక. కవి పండితులకు కార్యక్షేత్రం. స్వేచ్ఛా ఉద్యమాలకు జన్మస్థానం. నాటి మహాకవి పోతన నుండి నేటి ప్రజా కవి కాళోజి వరకు, నాటి సమ్మక్క సారలమ్మ నుండి నేటి చాకలి అయిలవ్వ వరకు, నాటి సర్వాయి పాపన్న నుండి నేటి దొడ్డి కొమురయ్య వరకు – ఒకరేమిటి, ఈ గడ్డపై ఊపిరిపోసుకున్న ఏ పసికూన ఐనా ఆ వారసత్వాన్ని పుణికిపుచ్చుకొన్నదే, ఆ పటిమను నిలబెట్టుకొన్నదే.
ఆ కోవలోని సమరయోధుడే రావెళ్ళ – రావెళ్ళ వేంకట రామారావు – ఢిల్లీ వకీళ్ళచే ‘షేర్’ – ‘తెలంగాణ షేర్’ అనిపించుకొన్న వీరుడు.
రావెళ్ళ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమంలో పని చేస్తున్నప్పుడు నేను మాధ్యమిక తరగతులలో ఉంటిని. ఆయన పరిచయం ఆయన ”వీరులకు కాణాచిరా! తెలగాణ ధీరులకు మొగసాలరా” అనే గీతం ద్వారా, అది తెలంగాణ ”తొలి మాతృగీతం”. సూర్యుని కంటే ముందే సూర్యకిరణాలు మనకు అందినట్లు కవికంటే ముందే మనకాయన కవితా పంక్తులందాయి. మాది జనగామ తాలూకా కొడకండ్ల మండలంలోని ‘రేగుల’ గ్రామం. అది తెలంగాణ సింహంగా పేరొందిన నల్ల నర్సింహులు నడయాడిన నేల. తెలంగాణ విప్లవ మాత పాదాల చెంత నలుగురు త్యాగమూర్తులను సమర్పించి, తుదకు నైజాం భస్మాసుర హస్తానికి భస్మమైన పల్లె, అక్కడ దళాల సభలు సమావేశాలు తరచుగా జరుగుతుండడం – ఆ సందర్భాన ఉద్యమ గీతాలు ప్రజలను సమరోన్ముఖులను చేయడం జరుగుతుండేది. రావెళ్ళ వారి పేరు తెలియకుండానే వారి గీతం ప్రజల నాల్కలపై నాట్యమాడేది. ఈ మధ్య, ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సందర్భాన ఆ గీతం ఫీనిక్స్ వలె మళ్ళీ పైకి వచ్చింది.
ఇక్కడొక విషయం తేటపరచ వలసిఉంది. ఈ మధ్య రచింపబడి, గానం చేయబడే యితర గీతాలు దేనికదే విశిష్టత సంతరించుకొన్నది. కాని తెలంగాణ ”తొలి మాతృ గీతం” మాత్రం రావెళ్ళ వారిదే. ఇది 1944లో వ్రాయబడి పెక్కు సభలలో గానం చేయబడింది. అంటే, నాటి తెలంగాణ విమోచనోద్యమం ముదిరి పాకానపడి ఫలించక ముందు నుండి – నేటి ప్రత్యేక తెలంగాణా సాకారమయ్యేంత వరకు అది సజీవంగా ఉంది, మన
ఉద్యమ భావాలకు జవజీవాలందిస్తున్నది. నాడు వర్ణింపబడిన తెలంగాణనే నేడు మనం కోరుకొంటున్నాం. దానిలో ‘విశాలాంధ్ర’ భావాలు మచ్చుకైనా లేవు. ఆయన దృష్టిలో – అంటే తెలంగాణీయుల దృష్టిలో – తెలంగాణ తెలంగాణయే. ప్రత్యేక తెలంగాణయే. నాటి ఉద్యమంలో ‘ఆంధ్ర’ బాబుల భాగస్వామ్యం ఉన్నా, ”మనది తెలంగాణ, తెలంగాణ ప్రత్యేకము” – అన్న భావనపై ఆంధ్రుల భావజాల ప్రభావం పడలేదు. రావెళ్ళకు ఆంధ్రప్రాంతీయులతో బంధుత్వం ఉన్నది. అయినా మన ‘ప్రత్యేకత’పై దాని నీడ పడలేదు. ఆంధ్రవారి ఫిలాసఫీ గురించి రావెళ్ళ అంటారు – ‘మా ఇంటికొస్తే ఏం తెస్తావ్… మీయింటి కొస్తే ఏమిస్తావ్’ అనేటటువంటిది. ఇది వారి దోపిడీ మనస్తత్వాన్ని సులభశైలిలో చెప్పడం.
రావెళ్ళ వారు తెలంగాణ విమోచనోద్యంలో చేరడం ఒక విచిత్ర సంఘటనతో జరిగింది. ఆయన మధ్య తరగతి వ్యవసాయ కుటుంబీకుడు. ఒకసారి ఆయన తన పొలంలోని కలుపు మొక్కలు పెరికి వేస్తుంటే, వ్యవసాయ కార్మికుడొకరు ‘మీకెందుకీ పొలం పను’లనగానే ఆయన స్పాంటేనియస్‌గా – ‘కలుపు మొక్కలు ఏరివేస్తే చేనుకు బలం – రజాకార్లను తరిమివేస్తే మనకు బలం’ అన్నాడు. అలా ఏ ఘడియన అన్నాడో కాని, అది కార్యరూపం ధరించింది. రజాకార్ల దుష్కృత్యాలు మితిమీరడంతో 14 ఏళ్ళ ఆ పిన్న వయస్కుడు ఆంధ్రమహాసభలో చేరి ఉద్యమ కార్యకలాపాలు చేయడం ప్రారంభించాడు. స్వగ్రామమైన గోకినేపల్లి (ముదిగొండ మండలం, ఖమ్మం జిల్లా – అప్పుడది వరంగల్ జిల్లాలో ఉండేది)ని కేంద్రంగా చేసుకొని, చుట్టుపట్టున గల దాదాపు వంద గ్రామాల్లో పోరాట దళాల నిర్మాణం కావించాడు. ఆయన నిర్మాణ దక్షత ఎట్టిదంటే రెండున్నర సంవత్సరాలలోనే కమాండర్ స్థాయికి ఎదిగి వందలాది కార్యకర్తలకు శిక్షణ ఇచ్చాడు.
ఆయన పెన్ను ఎంతటి పదనుగలదో, గన్ను అంతటి గురిగలది. ఒకసారి ఆయన దళం నేలకొండ మండలం పొదరుబండలో రాత్రివేళ సేదదీర్చుకొంటుంది. సెంట్రీ (కావలి) యానాది వెంకన్న అనే దళ సభ్యుడు. రావెళ్ళ తన తుపాకిని వెంకన్నకిచ్చి నిద్రకుపక్రమించాడు. వీరి ఉనికిని తెలిసికొన్న నైజాం మూకలు దాదాపు 300 మంది వీరిని చుట్టుముట్టారు. వెంకన్న భయపడి, తుపాకిని అక్కడే పడవేసి పారిపోయాడు. పడుకున్న రావెళ్ళపై ఒక సైనికుడు కాల్పులు జరుపగా ఒక తూటా ఆయనకు తాకింది. నిత్య జాగృతుడు, సమయ స్ఫూర్తియు గలవాడైన రావెళ్ళ వెంటనే తన పాతరకం తుపాకితోనే వానినెదిరించి, వాని తుపాకినే లాగుకొని ఎదురుదాడికి పూనుకొన్నాడు. శత్రువులు పలాయనం చిత్తగించారు. తన తుపాకీలో నాల్గే బుల్లెట్లున్నవని ఆయన సాహసించకుండా ఉంటే దళం మొత్తం తుడిచివేయబడేది. అదీ కమాండర్ లక్షణం, గురిపెట్టడంలోని కుశలత.
రావెళ్ళ వ్యవహార దక్షతగల దళ కమాండర్లలో గణనీయుడు. బెంగాల్‌కు చెందిన రాహుల్ సాంకృతాయన్ ఇక్కడి పరిస్థితులను, పోరాట వివరాలను, స్వయంగా దర్శించి ప్రత్యక్షంగా ప్రజలతోను సమర వీరులతోను కలిసి, తెలుసుకోవడానికి వచ్చినప్పుడు ఆయనకు వాస్తవ విషయాల గురించి అవగాహన కలిగించే బాధ్యత ఉద్యమ పార్టీ రావెళ్ళకు అప్పగించింది, రావెళ్ళ ఆయన వెంట 8 – 10 రోజులు తిరిగి నిరాయుధులైన ప్రజలు సాయుధులైన సర్కార్ మూకలనెట్లు ఎదుర్కొంటున్నారో విశదపరిచాడు. క్షేత్ర స్థాయి విషయాలు తెలిసికొన్న రాహుల్ విషణ్ణవదనుడై ఉద్విగ్నతకు లోనైనాడు. ఇక, ఆయన నిత్య జాగరూకత కు, సమయస్ఫూర్తికి మరొక ఉదాహరణ. రాహుల్‌ను తిరిగి బెంగాల్‌కు పంపించేక్రమంలో ఆయనను బెంగాల్‌కు పంపించి, సూర్యాపేట నుండి వస్తుండగా, రజాకార్లు రావెళ్ళపై కాల్పులు జరిపారు. ఆయన ముందు జాగ్రత్తతో శరీరాన్ని వెనుకకు వంచడంతో తూటా పై భాగాన్ని మాత్రమే తాకుతూ వెళ్ళింది. లేకుంటే గుండెలో దిగేది.
ఆ రోజుల్లో పట్టుబడిన దళనాయకులను, దళ సభ్యులను జైలులో బంధించడం మామూలు. అయితే, రావెళ్ళ ముఖ్యనాయకుల్లో ఒకడయినందున ఏ జైలులోను దీర్ఘకాలం ఉంచకుండా జైలు జైలుకు తిప్పారు. ఖమ్మం, వరంగల్, హైద్రాబాద్, ఢిల్లీ, ఔరంగాబాద్, గుల్బర్గా, బీడ్, జాల్నా జైళ్ళకు – ఇలా 7-8 జైళ్ళకు – రెండు మూడు నెలలకొకసారి తిప్పి సతాయించారు. చిత్రహింసల పాలుజేశారు. అయినా ఆయన పార్టీ రహస్యాలు గాని, దళ రహస్యాలు గాని బయటకు చెప్పలేదు. బంధువుల ఇండ్లల్లో, మిత్రుల వద్ద రహస్యంగా దాక్కొన్నా, నిజాం మూకలు ఆయనను వదిలిపెట్టలేదు. ఆయనను 4 ఏండ్ల 4 నెలలు జైల్లో బంధించి ఉంచారు.
ఢిల్లీ కోర్టులోని అనుభవాలు ఆయన మాటల్లోనే – ”సుప్రీం కోర్ట్” న్యాయవాదులు మాట్లాడుతున్న అబద్దాలకు విసిగి ఆగ్రహించాను. కోర్ట్ హాల్‌లో న్యాయమూర్తి వెనుక ఉన్న మహాత్మాగాంధి చిత్రపటాన్ని చూపిస్తూ – ‘ఉస్కూ పల్టాదో’. ముఝే శరం ఆ రహా హై, ఉస్కా మూ, మై నై దేఖ్నా చాహతా హూ, ఓ తో ఝూట్ బాత్ హై” – అన్నాను, గట్టిగా. ఖంగుతిన్న న్యాయవాదులు నావైపు చూసి ‘యే తెలంగాణ షేర్ హై’ అన్నారు. అలా ఆయన ‘తెలంగాణ పులి’గా ప్రసిద్ధుడైనాడు. అది సార్థక నామధేయం.
రావెళ్ళ వేంకట రామారావుది ఖమ్మం జిల్లా, ముదిగొండ మండలం, గోకినేపల్లి గ్రామం. సుబ్బమ్మ – లక్ష్మయ్య గార్ల సుపుత్రుడు. 1924 జనవరి 31న జన్మించి 2013 డిసెంబర్ 10న దివంగతులైనారు. కమాండర్‌గా ఈయన ప్రతిష్ఠను జూచి, ఈయననెలాగైనా పెళ్ళి చేసికొని తామూ పేరు ప్రతిష్ఠలనొందాలని చూచీ – చూచీ –
యువతులెందరో వేరే వారిని పెండ్లాడి వెళ్లిపోగా, పట్టుదలతో వేచి చూస్తున్న ధీరవనిత – సుగుణ – గారితో ఈయనకు 1951 జులై 2న వివాహమయింది. వీరికి నలుగురు కొడుకులు.
‘మాతృ గీతం’తో పాటు ఈయన ఇతర రచనలు – జీవన రాగం, పల్లె భారతి, తాండవహేల, అనల తల్పం వగైరా. ఈయన (తెలంగాణ) భాషను, ఆంధ్రకు చెందిన యీయన బంధువులు చులకన భావంతో చూసేవారట. అందువల్ల ఈయన కసితో భాషపై పట్టుపెంచుకొన్నారట.
ఒక విషయం: ఈయన గీతాన్ని ‘కదనాన శత్రువుల’ అనే చరణంతో ప్రారంభించి పాడుతున్నారు. అంతకు ముందు రెండు చరణాలున్నవి. అసలు గీతం ఇది:
వీరులకు కాణాచిరా!
తెలగాణ ధీరులకు మొగసాలరా!
కదనాన శత్రువుల కుత్తుకల నవలీల
నుత్తరించిన బలోన్మత్తులేలిన భూమి!
వీరులకు కాణాచిరా!
తెలగాణ ధీరులకు మొగసాలరా!
అబలయని ……………..
తెలంగాణ జాతిరత్నానికి జోహార్లు! రత్నం ప్రకాశవంతమైనది – దృఢమైనది.