ప్రజలకోసం ఏదైనా చేయాలంటే.. నిబద్ధత కావాలి.. అంతకుమించిన ధైర్యం కావాలి.. వెరపులేని ముందడుగు వేయగలగాలి. ఏడు దశాబ్దాల స్వాతంత్య్ర భారత దేశంలో వాస్తవంగా జరగనిది అదే. ఏడు దశాబ్దాలలో దేశాన్ని పరిపాలించిన పాలకులెవరూ ఆ ధైర్యాన్నే చూపించలేకపోయారు. ప్రజలను కేంద్రంగా చేసుకొని.. వారి అవసరాలను కేంద్రం చేసుకొని.. తద్వారా దేశ ఆర్థిక పరిపుష్టిని సాధించే దిశగా ప్రయత్నాలు చేసినవారు బహుశా లేరనే చెప్పాలి. యావత్‌ దేశంలో ఈ డెబ్భై ఏండ్లలో జరిగిన పరిపాలన అంతా రాజకీయాలు.. వాటి సమీకరణాలను ఆధారం చేసుకొన్నదే. ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొన్నదంటే.. దాని వెనుక రాజకీయ ప్రయోజనాలను బేరీజు వేసుకోకుండా.. లెక్కలు కట్టుకోకుండా చేసింది ఒక్కటి కూడా కనిపించదు. భిన్న సంస్కృతులు, భిన్న మతాలు, భిన్న జాతులు ఉన్న మన దేశంలో అన్ని వర్గాలకు, అన్ని మతాలకు, అన్ని జాతులకు సమానంగా మేలుచేసే విధంగా పరిపాలన జరిగింది లేనేలేదు. ఎన్నికల వేళ నినాదాలు గాల్లో కలిసిపోవడమే తప్ప వాస్తవరూపం దాల్చింది కనపడదు.

దేశంలో సంస్కరణలు తీసుకోవాలని సాహసించిన ఏ ఒక్క పాలకుడినీ ఎక్కువకాలం అధికారంలో ఉండనీయని రాజకీయ వ్యవస్థ మనది. ఇలాంటి వాతావరణంలో రాజకీయాలకు అతీతంగా.. సమాజంలో సబ్బండ వర్ణాలకు సమష్టి ప్రయోజనం కలిగేలా భారీ ఎత్తున సంస్కరణలను ఏ పరిపాలకుడైనా చేపడతారని ఊహించడం కూడా కష్టమైన వాతావరణంలో ఉన్నాం మనం. పరిపాలన వ్యవస్థలో.. ప్రజాపాలన నిర్వహించే తీరులో.. ప్రజలు తమ జీవిక కోసం ఆధారపడే అనేకానేక వివిధ వ్యవస్థల్లో.. ప్రజల కోసం.. ప్రజలకు అనుకూలంగా.. అంతిమ ప్రయోజనం ప్రజలకు కలిగేలా చూసేందుకు అనువైన సంస్కరణలను తీసుకురావడం అంత తేలికైన పనేమీ కాదు. గ్రామస్థాయి నుంచి.. రాజధాని వరకు వచ్చే అనేక ఒత్తిళ్లు.. రాజకీయ నాయకులు.. అధికారులు.. కార్పొరేట్లు.. గుత్తేదారులు.. సమాజంలో పెద్దమనుషులు.. వీళ్లందరి నుంచి వచ్చే ఈ ఒత్తిళ్లను సమర్ధంగా ఎదుర్కొంటూ.. వీరందరినీ ఒప్పిస్తూ.. సంస్కరణలు తేవడం మనకు తెలిసిన కాలంలో ఏ పరిపాలకుడి వల్లా అయిన పని కాదు. అలా చేయడానికి పూనుకున్న వారెవరైనా అధికారాన్ని వదులుకోవలసిందే. ప్రజలు కూడా ఈ రకమైన వ్యవస్థకు ఒకరకంగా అలవాటుపడిపోయారు. ఇదింతేలే.. మారదులే.. బురదలో ఉన్నప్పుడు మనకు కూడా బురద అంటుకోకుండా ఉంటుందా అని రాజీపడిపోయే పరిస్థితికి చేరుకొన్నారు. చివరకు ప్రభుత్వమనేది రాజకీయ నాయకులకూ.. కార్పొరేట్లు.. కాంట్రాక్టర్లకు మధ్య వ్యాపారలావాదేవీలు నిర్వహించే వ్యవస్థగా మారిపోయింది.

ఇదిగో ఈ పరిస్థితిలో మార్పు కోసం ఒక బృహత్తర ప్రయత్నం మొదలైంది. ఐదేండ్ల క్రితం పుట్టిన తెలంగాణకు పాలకుడిగా వచ్చిన కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఈ రకమైన ప్రయత్నానికి నాందీ ప్రస్తావన చేశారు. మలిదశ తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించినవాడు కాబట్టి.. అనేక ఆటుపోట్లు తట్టుకొని నిలబడినవాడు కాబట్టి.. అదే ధైర్యంతో.. అంతే దూకుడుతో తెలంగాణను సంస్కరణ బాట పట్టించాడు. బూజుపట్టిన పరిపాలన వ్యవస్థను దులిపేసి.. అర్థంలేని విభాగాలను దునిమేసి.. పరిపాలనను వికేంద్రీకరించారు. రాష్ట్రం ఏర్పడిన వెంటనే పది జిల్లాల తెలంగాణను 33 జిల్లాల తెలంగాణగా మార్చడం అసాధారణం. ఈ ఒక్క నిర్ణయంతో ప్రజలు కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లాలంటే వందల కొద్దీ కిలోమీటర్లు ప్రయాణం చేసే బాధ తప్పింది. కేవలం 50-60 కిలోమీటర్ల లోపే కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి సమస్యలు పరిష్కరించుకొనే వీలు కలిగింది. అటు అధికారులకూ తమ పరిధి పరిమితం కావడం వల్ల ఆ పరిమితిలో క్షేత్రస్థాయిలో వెళ్లి పరిపాలన చేయడం అన్నది మునుపెన్నడూ లేనివిధంగా సులువైంది. గతంలో కలెక్టర్‌ ఒక జిల్లాకు బదిలీపై వచ్చారంటే.. ఆయన పదవీకాలంలో జిల్లా మొత్తం తిరిగే అవకాశం కూడా ఉండేది కాదు. ఇప్పుడా పరిస్థితిలో వచ్చిన మార్పు మామూలు కాదు. నిన్న మొన్నటిదాకా వరంగల్‌ వంటి జిల్లాలో ఒక కలెక్టర్‌ చేసిన పనిని ఇప్పుడు ఆరుగురు కలెక్టర్లు చేస్తున్నారు. ఈ పని విభజన పరిపాలనను మరింత సమర్ధంగా నిర్వహించడానికి వీలయింది.

ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేపట్టిన మరో సంస్కరణ పంచాయతీరాజ్‌ వ్యవస్థను వికేంద్రీకరించడం. ఇదేమీ చిన్న నిర్ణయం కాదు.. పంచాయతీరాజ్‌ చట్టాన్ని సమూలంగా ప్రక్షాళన చేసి.. సరికొత్త చట్టంద్వారా ఒక నూతన సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక పరిపుష్టిగల పల్లెపట్టులను పునర్నిర్మాణం చేసే దిశగా తీసుకొన్న నిర్ణయం. ఈ ఒక్క నిర్ణయంతో తెలంగాణలో గ్రామపంచాయతీలు రెట్టింపు అయ్యాయి. ఇంతకాలం సమాజానికి దూరంగా.. ఎవరూ పట్టించు కోకుండా.. విసిరేసినట్లు ఉన్న తండాలు, గూడేల్లో వెలుగు మొగ్గలు విరిశాయి. అవన్నీ స్వతంత్ర గ్రామపంచాయతీలయ్యాయి. ఏ రాజ్యాధికారం కోసం దేశంలో.. రాష్ట్రంలో విప్లవోద్యమాలు నడి చాయో.. ఏ హక్కుల కోసం పీడిత సమాజం ఇంతకాలంగా ఎదురుచూస్తున్నదో.. ఆ సమాజం సర్వ స్వతంత్రంగా పరిపాలనను చేపట్టింది. ఆ సమాజం నుంచి దాదాపు మూడు వేలమంది ప్రజాప్రతినిధులు గ్రామస్థాయిలో పాలనాపగ్గాలు చేపట్టే దిశగా ఎదిగివచ్చారు. గత ఏడు దశాబ్దాలలో ఏ ఒక్క పాలకుడూ చేయలేని, చేయడానికి సాహసించని అతి గొప్ప పరిపాలనా సంస్కరణ ఇది.

ప్రజల్లో సంతృప్తిస్థాయి పెరగాలి.. అప్పుడే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. తద్వారా ఆ ప్రజలు మానవ వనరులై రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ఊతంగా నిలుస్తారు. ఇది ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖర రావు చేసిన మరో ఆలోచన. ఈ ఆలోచన తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థను పరిపుష్టం చేసే దిశగా నిర్ణయాలు తీసుకొనేలా చేసింది. పేద ప్రజలు తమ పిల్లలకు పెండ్లి చేసే స్థోమత లేక.. ఆ పెండ్లి గురించే ఆలోచిస్తూ.. అప్పులు చేస్తూ కునారిల్లిపోకుండా.. అక్షరాలా లక్షా నూటపదహార్లతో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌ పథకాలు తీసుకొచ్చారు. దీనివల్ల తమ ఆడపిల్లల పెళ్ళిళ్ల గురించి ఆందోళన చెందే అవసరమే లేకుండా పోయింది. వ్యవసాయంపైనో.. ఇతరేతర వృత్తుల నిర్వహణపై దృష్టి సారించేందుకు వీలు కలిగింది.

ఈ మార్గం ఇక్కడితో ఆగలేదు. కార్పొరేట్ల మాయాజాలంలో కుంగిపోయిన కులవృత్తులను అత్యాధునిక రీతిలో అభివృద్ధి చేసే దిశగా అనేక నిర్ణయాలు తీసుకొన్నారు. ముదిరాజులకు గొర్రెల పంపిణీ కానీ, యాదవులకు బర్రెల పంపిణీ కానీ, మత్స్యకారులకు చేపల పంపిణీ కానీ, నాయీ బ్రాహ్మణులకు అత్యాధునిక సెలూన్లు కానీ.. రజకులకు అత్యంత ఆధునిక యంత్రపరికరాలు కానీ, చేనేతలకు సబ్సిడీలు, కొనుగోలు వ్యవస్థల ఏర్పాటు కానీ.. ఒకటా రెండా.. అనేక మార్గాల్లో ఈ వృత్తుల పునర్నిర్మాణం జరిగే బృహత్ప్రయత్నం అసాధారణ రీతిలో జరిగింది. ఈ నిర్ణయాలను తిరస్కరించిన వాళ్లున్నారు. ఎద్దేవా చేసిన వాళ్లు న్నారు. కానీ ముఖ్యమంత్రి మాత్రం వెనుకడుగు వేయలేదు. నా దృష్టిలో ఇవేవీ సంక్షేమ పథకాలు కావు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొచ్చిన ఆధునిక సంస్కరణలు మాత్రమే.

ఉదాహరణకు మన రాష్ట్రానికి రోజు ఆరేడు వందల లారీల లోడ్‌లలో గొర్రెలు దిగుమతి అవుతున్నాయి. బావార్చికో.. మరో ఫైవ్‌స్టార్‌ హోటల్‌కో వెళ్లి బఫెట్‌ ఆర్డర్‌ ఇచ్చి తినేస్తారు. కానీ ఆ నాన్‌వెజ్‌ ఎక్కడి నుంచి వస్తున్నదన్న ఆలోచన ఎవరికీ రాదు. ఇలా దిగుమతి చేసుకొంటే వస్తున్నది. దీనివల్ల ఎన్ని కోట్ల రూపాయలు ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్నదో ఒక్కసారి ఆలోచించాలి. అదే ఇక్కడే మాంసం ఉత్పత్తి అయి.. ప్రాసెసింగ్‌ అయితే.. రాష్ట్రానికి, వాటిని ఉత్పత్తి చేసిన వారికి ఎంత ఆదాయం వస్తుందో ఊహించగలమా?

చేపల వ్యాపారమూ చిన్నదేమీ కాదు. మనం రోజూ దిగుమతి చేసే బదులు ఎగుమతి చేసే స్థాయికి చేరుకొంటే.. దాని వల్ల ఆర్థిక ప్రయోజనం అటు ప్రజలకు, ఇటు ప్రభుత్వానికి పెద్ద ఎత్తున జరుగుతుందనడంలో సందేహం లేదు. ఇంతెందుకు.. హైదరాబాద్‌ లాంటి నగరాల్లో హబీబ్‌ సెలూన్లు.. మేకోవర్‌ సెంటర్లు అద్దాల మేడల్లో యూనిఫామ్‌ సిబ్బందితో అందంగా నెలకొల్పి లక్షల కొద్దీ ఆదాయాన్ని సంపాదిస్తున్నారు. మన నాయీ బ్రాహ్మణులే తమ వ్యాపారాన్ని ఆ విధంగా అభివృద్ధి చేస్తే.. పరిస్థితిని ఊహించుకోవచ్చు. వీటిని కేవలం సంక్షేమ పథకాలుగా చూడవద్దు.. వివిధ రూపాల్లో.. వివిధ రంగాల్లో.. మానవ వనరుల్లోని నైపుణ్యాన్ని.. ఆర్థిక వ్యవస్థలోకి పరివర్తనం చేయడం.. నిస్సందేహంగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు మాత్రమే ఈ విధమైన దార్శనికత ఉన్నది. వాటిని అమలుచేసే ధైర్యమూ ఉన్నది.

ఇప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్ర శేఖర రావు అసాధారణమైన, అనూహ్యమైన సంస్కరణ పథాన్ని ఎంచుకొన్నారు. బహుశా భారత దేశంలో ఏ ముఖ్యమంత్రి, ఏ ప్రధానమంత్రి కూడా ఈ రకమైన నిర్ణయానికి సాహసించి ఉండరు. మనది కృషి ప్రధానదేశమని ఎప్పుడో చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకొన్నాం. కానీ.. ఇంతటి ప్రధానమైన వ్యవసాయరంగాన్ని ఇంతకాలం పట్టించుకున్నదే లేదు. ఈ ఒక్క రంగాన్ని గురించి పాలకులు దేశవ్యాప్తంగా దృష్టి పెట్టి ఉంటే.. ఇవాళ ఎన్నికల సభల్లో భారత్‌ విశ్వగురువు.. అని మైకుల ముందు ఊదరగొట్టే మాటలు అక్షరాలా నిజమయ్యేవి. మనకున్న భూ సంపద తక్కువేమీ కాదు. జల సంపద తక్కువేమీ లేదు.. అలాగే సేద్యానికి అవసరమైన మానవ వనరుల సంపదా తక్కువ కాదు. మరి ఎందుకు వ్యవసాయం విధ్వంసమైంది? రైతులు బలవన్మరణాలకు ఎందుకు పాల్పడాల్సి వస్తున్నది? కేవలం పాలకుల్లో చిత్తశుద్ధి, నిబద్ధత లేకపోవడమే. దేశంలో 70 శాతం మంది ప్రజలకు జీవనాధారమైన వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చి ఉంటే.. అందుకు అనుగుణంగా జలవనరుల వినియోగాన్ని చేసి ఉంటే.. అన్నదాతలకు సంపూర్ణంగా అండగా నిలిచి ఉంటే.. ఇవాళ యావత్‌ ప్రపంచం భారతదేశంపైనే ఆధారపడి ఉండేది. కానీ అలా జరుగకపోవడానికి కారణం.. పరిపాలన ప్రజలకోసం కాకుండా రాజకీయం కోసం జరుగడం వల్లనే.

ఈ పరిస్థితుల్లోంచే.. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు తెలంగాణలో ఆవిర్భవించాయి. జలవనరులే మృగ్యమైన చోట గొలుసుకట్టు చెరువుల నీటి నిర్వహణ విధానంతో మూడు పంటల సుసంపన్న వ్యవసాయ రాష్ట్రంగా ఎదిగే మార్గంలో తెలంగాణ ముందుకు పోతున్నది. ఇంతటితో ఆగకుండా రైతుకు ఆలంబనగా నిలిచేందుకు రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలు అమల్లోకి వచ్చాయి. దాదాపు ఎనిమిది దశాబ్దాల తర్వాత తెలంగాణ భూ రికార్డుల ప్రక్షాళనకు నోచుకొన్నది. రాష్ట్రంలో భూముల వివరాల స్పష్టత కోసం చేపట్టిన ఈ కార్యక్రమం చాలా మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఇప్పుడు దీన్ని మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అత్యంత సాహసోపేతమైన నిర్ణయమే తీసుకోబోతున్నారు. రాష్ట్రంలో అత్యంత అవినీతి వేళ్లూనుకొని పోయిన విభాగంగా రెవెన్యూ శాఖపై మాయలేని మచ్చ ఉన్నది. కిందిస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారుల వరకు కాసులకు కక్కుర్తి పడటం వల్ల రాష్ట్రంలో అత్యంత దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.

గతంలో పనిచేసిన ఏ పాలకుడికీ భూ సంస్కరణలు చేపట్టడం సాధ్యం కాలేదు. 1970లలో ఒకసారి ఈ ప్రయత్నం జరిగినప్పటికీ.. అది విఫలమైంది. ఇందుకు కారణం ఆనాడు శాసనకర్తల్లో అత్యధికులు భూస్వాములే ఉండటం.. రాజకీయ చిత్తశుద్ధి లేకపోవడం ఒకటైతే.. భూ రికార్డులు సక్రమంగా లేకపోవడం. గ్రామాల్లో వీఆర్వోలు, తాసిల్దార్లు, ఆర్డీవోలు ఇష్టారాజ్యంగా భూముల రికార్డులను తారుమారుచేస్తూ.. అటు రైతులకు శోకం కలిగించడమే కాకుండా ప్రభుత్వానికీ స్పష్టత లేకుండా చేశారు. చివరకు భూ సంస్కరణలు అన్న పదాన్ని

ఉచ్చరిస్తే అదొక ముళ్లకంపగా భావించి ఏ పరిపాలకుడు కూడా దాన్ని ముట్టుకోలేదు. రెవెన్యూ అధికా రుల లీలలు ఒక్కో ఊళ్లో ఒక్కో కథ. సేత్వార్‌లో ఉండే భూమి పహాణీలో ఉండదు. పహాణీలో ఉన్న భూమి పట్టాలో కనిపించదు. ఒకరి భూమి మరొకరికి పట్టాచేస్తారు. ఉన్న భూమిని తక్కువచేసి రికార్డుల్లో రాస్తారు. సర్వేనంబర్లు తొలగిస్తారు. ఒకే భూమిని ఇద్దరికి మ్యుటేషన్‌ చేస్తారు. రైతు కొన్న భూమి తనకే సొంతమన్న గ్యారంటీ లేదు. ఎప్పటికప్పుడు రెవెన్యూ ఆఫీసుకు వెళ్లి చెక్‌చేసుకొంటుండాలి. అతని భూమి ఎప్పుడు ఎవరిపేరుమీదకు మారుతుందో తెలియదు. ఏ రికార్డునైనా.. ఏ విధంగానైనా మార్చగల సత్తా, సామర్ధ్యం రెవెన్యూ అధికారులకు మాత్రమే ఉన్నది.

చివరకు ఎలా తయారైందంటే.. కంప్లయింట్‌ ఇస్తే ఏమవుతుంది.. సస్పెండ్‌ చేసి వదిలేస్తారు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ రావచ్చు.. సస్పెన్షన్‌ కాలాన్ని సెలవులుగా ఎంజాయ్‌ చేయవచ్చన్న స్థాయిలో కొందరు రెవెన్యూ అధికారులు ముదిరిపోయారు. ఈ రకమైన చర్యల వల్ల రాష్ట్రంలో భూముల నిర్వహణ అత్యంత సంక్లిష్టంగా మారింది. తమ భూమిని తాము కాపాడుకోవడానికి దశాబ్దాల తరబడి అధికారుల చుట్టు తిరుగుతున్నవారిని చూస్తుంటే బాధ కలుగనివారుండరు. అత్యంత భద్రతా ఫీచర్లతో కూడిన పాస్‌బుక్‌లు ఇచ్చినా.. వాటిలోనూ రెవెన్యూ అధికారుల చేతివాటం ప్రదర్శించి ప్రభుత్వ లక్ష్యం నెరవేరకుండా చేశారు. పాస్‌బుక్‌ల విషయంలో నిక్కచ్చిగా, నిబద్ధతతో అధికారులు పనిచేసిఉంటే.. భూముల సమస్యలన్నీ ఈ సరికి పరిష్కారమై ఉండేవి. కానీ.. భూ రికార్డుల ప్రక్షాళనలో అధికారుల నిర్వాకం వల్ల పాత సమస్యలకు తోడు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. గతంలో రుణాలైనా వచ్చేవి. ఇప్పుడు రైతుబంధు మాట దేవుడెరుగు.. బ్యాంకు రుణాలు కూడా తీసుకోలేని పరిస్థితిని రైతులకు కల్పించారు.

అందుకే.. ఈ వ్యవస్థపై కొరడా ఝళిపించడానికి ముఖ్యమంత్రి పూనుకొన్నారు. రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు. దేశంలో ఏ రాష్ట్రంలో.. ఏ ముఖ్యమంత్రి కూడా చేయడానికి దుస్సాహసంగా భావించే సంస్కరణలను అత్యంత సాహసోపేతంగా చేపట్టారు. ప్రతి రైతుకు కంక్లూజివ్‌ టైటిల్‌ గ్యారంటీ ఇచ్చే దిశగా చర్యలు ముందుకు సాగుతున్నాయి. భూమికి పదులకొద్దీ రికార్డులు కాకుండా.. ఒకే ఒక్క రికార్డుతో.. అది కూడా టైటిల్‌ గ్యారంటీ ఇవ్వడంవల్ల ప్రతిరైతుకూ ఊరట కలుగుతుంది. అంతకు మించిన భరోసా లభిస్తుంది. తన భూమి తనకే ఉన్నదన్న ధీమా కలుగుతుంది. ఆ ధీమా అతణ్ణి సంతృప్తిగా వ్యవసాయం చేసుకోనిస్తుంది. భూమి ఎక్కువ తక్కువలన్నీ మాయమవుతాయి. రికార్డులు సక్రమమవుతాయి. దేవాదాయ, అటవీ, మున్సిపల్‌, ఇనాం, భూదాన్‌, అసైన్డ్‌.. ఇలా రకరకాలుగా ఉన్న భూములన్నీ ఒక గొడుగు కిందకు వస్తాయి. భూముల నిర్వహణ మొత్తం ఒక విభాగం చేతిలో కన్సాలిడేట్‌ కావడం అత్యంత అవసరం.

భూములకు సంబంధించి లావాదేవీ ఒక్కచోటనే.. ఒక్కసారే.. ఒక్క రికార్డుతోనే జరగడం అవసరం. ఇందుకు రెవెన్యూ సహా కొన్ని శాఖల్లో వ్యవస్థీకృత మార్పులు సమూలంగా జరుగడం అవసరం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈ దిశగా అడుగులు కదుపుతున్నారు. చర్యలు చేపడుతున్నారు. ఆయన తీసుకోబోయే నిర్ణయాలకు, చేపట్టబోయే సంస్కరణలకు సర్వజనామోదం ఇప్పటికే లభిస్తున్నది. రాష్ట్ర శ్రేయస్సు దృష్ట్యా ఇది అవసరం. ఈ సంస్కరణ అవినీతిని అంతమొందించే దిశలో తీసుకోబోయే అతి పెద్ద చర్య అవుతుంది. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి వేగంగా బాటలు పరుస్తుంది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంస్కరణల సారథి, దేశానికి మార్గదర్శి.
– కోవెల సంతోష్‌కుమార్‌

Other Updates