తెలంగాణ-సంస్కృతికి-ప్రతీక...-జానపద-విశిష్టతల-వేడుక....-----ఎన్నెన్నో-ప్రత్యేకతల-ఏడుపాయల-జాతర7అది… చుట్టూరా పెద్దపెద్ద బండరాళ్లు దొంతర్లుగా పేర్చినట్టుండే ఎత్తైన గుట్టలు… నలువైపులా అడవిని తలపించేలా ఉన్న చెట్లు, చేమలు… నది ఏడు పాయలుగాచీలి ప్రవహించి మళ్లీ ఒకచోట కలిసే అరుదైన ప్రాంతం… రమణీయమైన సహజ ప్రకృతి అందాలతో అలరారే సుందర ప్రదేశం… అక్కడి బండరాళ్లను పలకరించినా… చెట్లు చేమల్ని కదిలించినా…. గలగలపారే నీటిని స్పృశించినా దుర్గమ్మా… దయ చూపమ్మా… అన్న మాట వినిపిస్తుంది. ఆ ప్రాంగణంలోకి అడుగిడితే చాలు మది భక్తిభావంతో నిండిపోతుంది. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా… వరాలిచ్చే వన దుర్గామాతగా… ఎందరో భక్తుల ఇలవేల్పుగా… వెలుగొందుతున్న ఏడుపాయల దుర్గాభవాని మాత దర్శనం కోసం ఎళ్లలుదాటి భక్తులు వెల్లువలా తరలివస్తారు. నల్లసరపు రాతితో చెక్కి కొట్టొచ్చినట్టుండే దుర్గామాత రూపాన్ని కనులారా దర్శించుకుని తరిస్తారు.

వందల ఏళ్ల చారిత్రక నేపథ్యాన్ని… సర్పయాగ స్థల ప్రాశస్త్యాన్ని కలిగి రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా… పర్యాటక కేంద్రంగా బాసిల్లుతున్న ఏడుపాయల్లో ఏటా మహాశివరాత్రి సందర్బంగా జరిగే జాతర తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలుస్తోంది. ఇక్కడ జరిగేది కేవలం జాతర మాత్రమే కాదు… జానపద విశిష్టతల వేడుక.
ఎక్కడ ఉంది… : మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సానిపల్లి గ్రామ సమీపంలో ఉంది ఏడుపాయల. మెదక్‌ పట్టణం నుంచి ఇక్కడికి 17 కిలోమీటర్ల దూరం. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నుంచి 114 కిలోమీటర్లు.
స్థల ప్రాశస్త్యం: ద్వాపర యుగాంతంలో పాండవ వంశపు కడపటి రాజు, అర్జునుడి మునిమనవడైన జనమేజయ మహారాజు తండ్రి అయిన పరిక్షిత్తు మహారాజు తక్షకుడు అనే పేరుగల సర్పరాజు కాటుకు గురై ప్రాణాలు కోల్పోయాడట. దీంతో కోపగించిన జనమేజయుడు తన తండ్రి మరణానికి కారణమైన సర్పసంతతిని అంతటిని సమూలంగా అంతమొందించాలని నిర్ణయించుకుని ప్రస్తుతం ఏడుపాయలుగా పేరొందిన ప్రదేశంలో సర్పయాగం తలపెట్టాడని చరిత్ర చెబుతోంది. యజ్ఞ గుండాలు నిర్మింపజేసి జమదగ్ని, అత్రి, కశ్యపి, విశ్వామిత్ర, వశిష్ట, గౌతమి, భరద్వాజ అనే సప్తరుషులతో సర్పయాగం నిర్వహించగా సర్పాలన్నీ వచ్చి యజ్ఞ గుండాల్లో పడి మృత్యువాత పడ్డాయని చరిత్ర చెబుతోంది. ఇక్కడ సర్పయాగం జరిగినట్టు ఇప్పటికీ ఆధారాలు కనిపిస్తాయి. ఏడుపాయల మధ్యలో ఉన్న బండరాళ్లపై యగ్నాగ్ని గుండాలు ఏర్పాటు చేసినట్టు వలయాకారంలో ఉన్న గుండాలు అగుపిస్తాయి. ఎల్లాపూర్‌ సమీపంలో మంజీరా నది ఒడ్డున తవ్వితే విభూతి భయటపడటం ఇక్కడ యాగం జరిగిందనడానికి బలం చేకూరుస్తోంది. జనమేజయుడు చేపట్టిన సర్పయాగం ప్రభావంతో సర్పాలన్నీ వచ్చి అగ్నికి ఆహుతవుతుండటంతో సర్పజాతి మొత్తం అంతమవుతుందని ఆందోళన చెందిన నాగుల తల్లి
దేవతల శరణు జొచ్చింది. ఈ మేరకు సూత పౌరాణికుని సూచన మేరకు నాగులకు పుణ్యలోక గతులు ప్రాప్తించేందుకు గరుత్మంతుడు పాతాళంలోని భోగవతీ నదిని తీసుకుని వస్తాడు. ప్రస్తుత ఏడుపాయల ప్రాంతానికి రాగానే ఏడుపాయలుగా చీలి ప్రవహించింది. సర్పయాజ్ఞ గుండాలను ముంచి ఓ పాయ ఒడ్డున ఉన్న రాతి గుహలో వెలసిన దుర్గామాత పాదాలను ప్రక్షాళన చేస్తూ ప్రవహిస్తూ వెళ్లి గోదావరి నదిలో కలిసింది.
ఏడుగురు రుషులతో యాగం జరగడం, గంగాదేవి ఏడుపాయలుగా చీలి ప్రవహించడం వల్ల ఈ ప్రాంతానికి ఏడుపాయల అనే పేరువచ్చింది. గంగాదేవి కాలి అందె(మంజీరా) మూలంగా ఏర్పడినందున ఇక్కడ ప్రవహించే నదికి మంజీరా నది అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి.

కాశీనాథ యోగీంద్రుల తపస్సుతో పునరుద్ధరణ
చారిత్రక ప్రసిద్ధి చెందిన ఏడుపాయల వనదుర్గామాత దేవాలయం కాలక్రమంలో కొన్నేళ్ల పాటు ప్రాభవం కోల్పోయింది. ఈ నేపథ్యంలో క్రీ.శ.1870 సమయంలో కాశీనాథ యోగీంద్రుడు అనే అవధూత కాశీ నుండి 16 కళశాలను తీసుకుని వచ్చి ఏడుపాయల దుర్గామాత ఆలయంలో విడిది చేశారు. ఆ రాత్రి దుర్గామాత అతని కలలో దర్శనమిచ్చి ఈ క్షేత్రాన్ని పునరుద్దరించమని ఆజ్ఞాపించిందని ప్రతీతి. ఈ మేరకు కాశీనాథ యోగీంద్రులు కాశీకి తిరిగి వెళ్లకుండా రాతిపై యంత్రము వేసి, దుర్గా మహా మంత్ర పుణశ్చరణ చేసి అమ్మవారిని భక్తితో కొలవాలని సూచించి అంతర్ధానమైపోయాడు. అతని యంత్ర మహిమ వలన ఏడుపాయల వనదుర్గామాత కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతోంది. నిత్య దీపదూప నైవేద్యాలతో అలరారుతూ ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది.
ప్రకృతి సౌందర్యం… పర్యాటక కేంద్రం
ఏడుపాయల పుణ్యక్షేత్రమే కాదు పర్యాటక కేంద్రం కూడా. సహజమైన ప్రకృతి అందాలకు నెలవైన ఏడుపాయల ప్రాంతం ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునే ప్రదేశం. నదీపాయల మధ్య రాతి గుహలో వెలసిన ఆలయం… వంకలు తిరిగి ఉండే ఘనపూర్‌ ఆనకట్ట… గలగల పారే మంజీరా నది పాయలు… ఎటుచూసినా విబిన్న ఆకృతుల్లో కనిపించే రాతి గుట్టలతో ఏడుపాయల ప్రాంతం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఏడుపాయలకు వెళ్లే దారివెంట పచ్చని పంట పొలాలు పలకరిస్తాయి. ప్రకృతి ఆరాధకులు ఏడుపాయల అందాలు చూసితీరాల్సిందే. ఆధ్యాత్మికతతోపాటు, ఆహ్లాదాన్ని పంచే ఏడుపాయల సందర్శనం పర్యాటకులకు మరచిపోలేని మధురానుభూతులను మిగులుస్తుందనడంలో సందేహం లేదు. ఏడాది పొడగునా సందర్శకుల రాక పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం ఏడుపాయలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు మాస్టర్‌ ప్లాన్‌ రూపొందిస్తోంది. పర్యాటకులకు, జాతర సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి ప్రణాళికలు తయారవుతున్నాయి.
మహా జాతర
ఏటా మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఏడుపాయల్లో పెద్ద ఎత్తున జాతర జరుగుతుంది. అంగరంగ వైభవంగా జరిగే జాతరకు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రలతోపాటు పొరుగున ఉన్న కర్నాటక, మహారాష్ట్రల నుంచి భక్తులు లక్షలాదిగా తరలివస్తారు. ధనిక, పేద అనే తారతమ్యం లేదు. తెలుగు, కన్నడ, మరాఠీ భాషా భేదం లేదు. పట్నం, పల్లె అనే తేడా లేదు. అన్ని ప్రాంతాల నుంచి పట్నం బాబులు, పల్లె జనాలు భక్తి భావంతో ఏడుపాయలకు తరలివస్తారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు చేసి అమ్మను దర్శించుకుని భక్తిపారవశ్యంలో ఓలలాడతారు. చెట్లు, చేమలు, రాళ్ల గుట్టలు, నదీ పాయలతో కూడిన విశాలమైన ఏడుపాయల ప్రాంగణం జాతర జరిగినన్ని రోజులు అశేష జనవాహినితో జనసంద్రంగా దర్శనమిస్తుంది. సుదూర ప్రాంతాల నుంచి పిల్లా,జెల్ల, ముల్లె,మూటతో సకుటుంబ సమేతంగా తరలివచ్చే వారు బస చేసేందుకు ప్లాస్టిక్‌ కాగితాలతో, చీరలతో ఏర్పాటు చేసుకునే తాత్కాలిక గుడారాలు, పెద్ద ఎత్తున వెలిసే దుకాణాలు, వినోద సాధనాలతో ఏడుపాయల ప్రాంగణం కొత్త శోభను సంతరించుకుంటుంది. అనేక దశాబ్దాల తరబడిగా ఇక్కడ జాతర జరుగుతుండగా 2007లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం జాతరను అధికారికంగా రాష్ట్ర ఉత్సవంగా ప్రకటించింది. జాతర సందర్భంగా లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం కల్పిస్తుంది.
బండ్లు… బోనాలు.. సిగాలు…
ఏడుపాయల జాతర తెలంగాణ సంస్కృతి, సంప్రదా యాలకు ప్రతీకగా నిలుస్తుంది. ఎడ్లబండ,్ల గుమ్మటాల బండ్ల ఊరేగింపు జాతర వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణ. ఇక అమ్మవారికి మొక్కుబడులు సమర్పించుకోవడంలో బోనాలు ప్రధానమైనవి. భక్తి ప్రపత్తులతో పటాలు వేసి, బోనాలు తీసి మొక్కులు చెల్లించుకుంటారు. సంప్రదాయబద్దంగా కొత్తకుండకు సున్నం రాసి, పసుపు, కుంకుమ బొట్లుపెట్టి, వేపకొమ్మలు చుట్టి, పైన గండదీపం వెలిగించి బోనాలు తయారు చేస్తారు. కొత్త బట్టలు ధరించి.. ముఖానికి, చేతులకు పసుపు పులుముకుని, కాళ్లకు గజ్జెలు కట్టుకుని, జుట్టు విరబోసుకుని, మెడలో గవ్వల హారాలు ధరించి చేతిలో చెర్నా కోలాలు పట్టుకుని… తలపై బోనంతో… డప్పు చప్పుళ్లకు అనుగుణంగా లయబద్ధంగా నాట్యం చేస్తూ అమ్మవారి ఆలయం వైపుసాగిపోయే దృశ్యాలు జాతరలో కనువిందు చేస్తాయి. ఈ సందర్భంగా శివసత్తుల సిగాలు ఆకట్టుకుంటాయి. పిల్లలు కలగని దంపతులు ప్రధాన ఆలయం ముందున్న సంతాన గుండంలో స్నానాలు చేసి అమ్మను దర్శిం చుకుంటారు. దుర్గామాత దయతో సంతానం కలిగిన వారు ఆలయంలో తొట్టెలు కట్టి మొక్కులు తీర్చుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక జరుగుతున్న తొలి జాతరను మరింత వైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

Other Updates