విలీనం నుండి విభజన దాకా..22
1969 సెప్టెంబర్ 30న తెలంగాణా సమస్యపై శాసనమండలిలో చర్చను దివి కొండయ్య చౌదరి ప్రారంభించారు.
”ప్రత్యేక తెలంగాణా విషయంలో రానున్న పంచాయతి సమితి ఎన్నికల ఫలితాలను, తెలంగాణా ప్రాంతంలోని ప్రజల అభిప్రాయాలుగా పరిగణించా”లని దివి కొండయ్య చౌదరి సూచించారు.
తెలంగాణా ప్రాంతానికి పోచంపాడు, నాగార్జున సాగర్ జలాల వినియోగం విషయంలో ఏ విధంగా అన్యాయాలు జరిగాయో కె. రామచంద్రారెడ్డి వివరించారు. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని కోరారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌ను జనసంఘ్ సభ్యుడు వి. రామారావు వ్యతిరేకించారు. ఉద్రేకాలతో కూడిన వాతావరణంలో అభిప్రాయ సేకరణ జరపాలన్న కోరిక సంమంజసం కాదన్నారు. నష్టాలకు కాంగ్రెస్‌దే బాధ్యత అని రామారావు అన్నారు.
ఆంధ్ర – తెలంగాణా ప్రాంతాల ప్రజలు సఖ్యతతో వుండడానికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడాలని రఘోత్తమరెడ్డి అన్నారు. (ఆంధ్రప్రభ అక్టోబర్ 1, 1969)
కొత్తగా మండలికి ఎన్నికైన రాజమణీదేవి అక్టోబర్ 3న జరిగిన చర్చలో పాల్గొంటూ ”బ్రహ్మానందరెడ్డి సి.ఎం.గా కొనసాగితేనే తెలంగాణ అభివృద్ధి చెందుతుంద”న్నారు. తెలంగాణలో అభివృద్ధి, వ్యయం పర్యవేక్షణకై జిల్లాకొక కమిటీని ఏర్పాటు చేయాలని ఆమె ప్రతిపాదించారు. శాసన మండలిలో సమైక్యవాదాన్ని సమర్ధించిన సభ్యులలో ఏ. కోటయ్య, వి.పి. రాఘవాచారి, వై.వి. కృష్ణారావు, ఎన్. ప్రసాదరావు, సి. నాగభూషణం, హీరాలాల్ మోరియా, జోసెఫ్ తదితరులున్నారు. మండలి సభ్యులు లింగయ్య తెలంగాణ ఏర్పాటును గట్టిగా సమర్ధించారు. సభ్యులు కూర్మాచార్యులు మాట్లాడుతూ ”ప్రాంతీయ సంఘాన్ని రద్దుచేసి రాష్ట్రం పేరును ‘అఖిల తెలంగాణ’గా మార్చి తెలంగాణ ప్రజలను సంతృప్తి పర్చాల”న్నారు.
తెలంగాణపై మండలిలో జరిగిన చర్చపై ముఖ్యమంత్రి సమాధానం:
మండలిలో తెలంగాణపై జరిగిన చర్చకు 1969 అక్టోబర్ 4న ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి జవాబిస్తూ తెలంగాణ ప్రజలను సంతృప్తి పరచడానికి, ఉద్యోగాలు, మిగులు నిధులు వంటి విషయాల్లో చేపట్టవలసిన చర్యల గురించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలను సభ్యులకు వివరించారు.
అవి: 1. చట్టబద్ధమైనటువంటి, తెలంగాణ ప్రాంతానికి సముచితమైన ప్రాతినిధ్యాన్ని కలిగించగలిగే సబార్డినేట్ సర్వీసులకు సంబంధించి నియామకపు సూత్రాలను రూపొందించే బాధ్యతను ప్రాంతీయ సంఘానికి అప్పగించాలి.
2. ఉద్యోగ విషయాల గురించి పరిశీలన చేయడానికి ఉన్నతాధికార సంఘాన్ని నియమించాలి.
3. తెలంగాణకు సంబంధించిన ఆదాయ, వ్యయాల నిర్ణయం, తెలంగాణ ప్రాంత వ్యయానికి సబంధించిన నిధులను మరో ప్రాంతానికి మళ్ళించకుండా ఉండేందుకు వీలు కలిగించాలి.
పై విషయాలను ముఖ్యమంత్రి వివరిస్తూ ”రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సూచించిన ఈ ప్రతిపాదనలు ప్రాంతీయ సంఘం తీర్మానంలో సూచించిన వాటికి మించి ఉన్నా య”న్నారు. ప్రధాని ప్రకటించిన అష్టసూత్ర పథకం అమలుకు సహకరించాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు.
భాషా రాష్ట్రాల ఏర్పాటుకు జరిగిన పోరాటం పై ముఖ్యమంత్రి మాట్లాడుతూ… ”1953లో మద్రాసు నుండి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు అయిందంటే ఆంధ్రులకు ఏవో అన్యాయాలు జరిగినందుకు కాదు” అన్నారు. ఆంధ్ర – తెలంగాణ నాయకుల మధ్య 1956లో కుదిరిన పెద్దమనుషుల ఒప్పందం విశాల రాష్ట్రం ఏర్పాటుకు షరతు కాదనీ అది ఏకీకృత రాష్ట్రానికి అనుబంధ చర్య అని బ్రహ్మానంద రెడ్డి అన్నారు. ఈ పెద్దమ నుషుల ఒప్పందం అమలులో కొన్నిలోపాలు జరిగాయి. వాటిని సరిదిద్దుకోవలసి ఉందన్నారు.
తెలంగాణపై ప్రజాభిప్రాయ సేకరణ జరపాలన్న డిమాండును ముఖ్యమంత్రి త్రోసిపుచ్చారు. ప్రధాని ఇందిరాగాంధీ నేతృత్వాన తీసుకోబడుతున్న వివిధ చర్యల వల్ల తెలంగాణ సమస్య పరిష్కరించబడుతుందని అంటూ ఆయన తన సుదీర్ఘ ప్రసంగాన్ని ముగించారు. శాసన మండలిలో జరిగిన ఈ చర్చను తెలంగాణ ప్రాంత సభ్యులు (ఇండి) జి.వి. సుధాకర రావు ప్రతిపాదించారు. ముఖ్యమంత్రి జవాబుపై ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ”ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కొనసాగించడం కంటే రెండుగా విభజించడం సముచితం. రాష్ట్రంలోని ప్రతి ప్రభుత్వ శాఖలోనూ, ప్రతి రంగంలోనూ వేర్పాటు భావం నెలకొని వుంద”న్నారు.
తెలంగాణ ఉద్యమాన్ని రెండు భాగాలుగా విడదీసి మిగులు నిధులు, ఉద్యోగాలు అని వేరు చేస్తూ ముఖ్యమంత్రి మాట్లాడడాన్ని సుధాకర్ రావు తప్పుబట్టారు. ”తెలంగాణ చారిత్రికమైన, సాంస్కృతికమైన వాస్తవం. దేశంలోని ఏ ఇతర ప్రాంతం కంటే కూడా ఈ విషయంలో తెలంగాణ ప్రాంతం వాస్తవికమైనద”ని ఆయన అన్నారు. ”తెలంగాణ అభివృద్ధి గురించి తప్పుడు వాదనలు తెచ్చి ప్రజల న్యాయమైన కోర్కెలను గాయపర్చరాద”ని ఆయన అన్నారు. ఇది మిగులు నిధులు, ఉద్యోగాల వంటి సమస్యల వల్ల మాత్రమే తెలంగాణలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం రాలేదని ఇతర కారణాలు కూడా ఉన్నాయని సుధాకర్ రావు అన్నారు. పరిపాలనలో పెత్తనం, ఆర్థికంగా ఒక ప్రాంత ప్రజలపై మరొక ప్రాంతం వారు దోపిడీ చేయడం వంటి కారణాలున్నాయని ఆయన అన్నారు. ”ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు కావడం వాస్తవం” అంటూ సుధాకర్ రావు తన ప్రసంగాన్ని ముగించారు.
తెలంగాణ కోసం సామూహిక సత్యాగ్రహం:
తెలంగాణ ఉద్యమాన్ని కొనసాగించడంలో భాగంగా 1969 అక్టోబర్ పదవ తేదీన రాష్ట్ర సాధన డిమాండ్‌తో మూడు లక్షల మంది సామూహిక సత్యాగ్రహం చేయాలని డా|| చెన్నారెడ్డి పిలుపునిచ్చారు. ఈ సత్యాగ్రహం పూర్తిగా శాంతియుతంగా జరుగుతుందన్నారు. ఆ రోజు అన్ని పట్టణాలలో, ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రదర్శనలు, ఊరేగింపులు నిర్వహించాలని ఆయన ప్రజలను కోరినారు. ‘ఆంధ్రప్రదేశ్ విభజన జరగదని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినా ప్రజాభిప్రాయం చివరికి నెగ్గకమానద’ని డా|| చెన్నారెడ్డి అన్నారు. చెన్నారెడ్డి ప్రకటనకు మూడు రోజుల ముందే తెలంగాణ ప్రజా సమితి అక్టోబర్ 10న సామూహిక సత్యాగ్రహానికి పిలుపునిస్తూ పది అంశాలు గల ఒక కార్యక్రమాన్ని ప్రకటించింది. వీటిలో… ప్రభుత్వ లేదా జిల్లా పరిషత్తులు ప్రారంభించి కొనసాగిస్తున్న నిర్మాణ పనులను అడ్డుకోవడం, పన్నుల సేకరణ చేయకుండా అధికారులను నిరోధించడం, ప్రభుత్వ, స్థానిక సంస్థల కార్యాలయాల ముందు, ఎన్నికైన ప్రజాప్రతి నిధుల ఇండ్ల ముందు ధర్నాలు, ప్రభుత్వ అధికారులు విధులు నిర్వహించ కుండా అడ్డుకోవడం, తెలంగాణ ఉద్యమంలో చేరని వారి ఇండ్లముందు ధర్నాలు, ఎక్సయిజు శాఖ మార్కు చేసిన తాటి చెట్లను కొట్టి వేయడం, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం సమకూరుస్తున్న కల్లు, సారా దుకాణాల్లోకి ప్రజలు ప్రవేశించకుండా నిరోధించడం వంటి చర్యలున్నాయి.
మల్లికార్జున్ ఆమరణ దీక్ష:
అక్టోబర్ పదవ తేదీ నుండి విద్యార్థి నాయకుడు మల్లికార్జున్ తెలంగాణ రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ పరిణామాలను గమనించిన కేంద్ర ప్రభుత్వం తెలంగాణ సమస్యపై దృష్టి సారిస్తున్నట్లు హోం మంత్రిత్వ శాఖ సంప్రదింపుల సంఘం చే ప్రకటన చేయించింది. ఈ సంఘం అక్టోబర్ 8న దేశీయాంగ (హోం) మంత్రి వై.బి. చవాన్ అధ్యక్షతన సమావేశమై కేంద్ర ప్రభుత్వానికి చేసిన సూచనలలో ”తెలంగాణ సమస్యకు సంబంధించిన వివిధ అంశాలను వివిధ దృక్పథాలు గల నాయకులతో చర్చించడానికి త్వరలో ఒక సమావేశం ఏర్పాటు చేయాల”ని కోరింది. ఈ సమావేశం తర్వాత సాధ్యమైనంత త్వరలో సమస్య పరిష్కారానికి కేంద్రం నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ సంఘం సిఫార్సు చేసింది.
మరోప్రక్క నాగార్జున సాగర్‌ను సందర్శించిన రాష్ట్రపతి వి.వి.గిరి అక్టోబర్ 8న పత్రికల వారితో మాట్లాడుతూ ”తెలం గాణ సమస్యపై అభిప్రాయాలు ఎప్పుడో చెప్పాను. అందరికీ సంతృప్తికరమైన పరిష్కారాన్ని కేంద్ర ప్రభుత్వం కనుగొనగలదని నాకు గట్టి నమ్మకమున్నద”ని అశాభావం వ్యక్తం చేశారు.
అక్టోబర్ మొదటి వారంలో తెలంగాణ ప్రాంత కాంగ్రెస్ సీనియర్ నాయకులైన జె. చొక్కారావు, నూకల రామచంద్రరెడ్డి, కొండా లక్ష్మణ్ బాపూజీ, వి.బి.రాజు తదితరులు విడివిడిగా ప్రధాని ఇందిరను కలిసి జూలై 6న కామరాజు, నిజలింగప్పల సమక్షంలో కాంగ్రెస్ శాసన సభాపక్షం చేసిన తీర్మానం ప్రకారం తెలంగాణ ప్రాంతానికి చెందిన వ్యక్తికి ముఖ్యమంత్రి పదవిని ఇవ్వాలని కోరినారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశం నిర్ణయిస్తుందని ప్రధాని ఇందిర వారికి హామీ ఇచ్చారు. అక్టోబర్ 8న జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి కామరాజు హాజరు కాలేదనే కారణంతో తెలంగాణ సమస్య చర్చకు రాలేదు. జూలై 6న నిజలింగప్పతోబాటు కామరాజు కూడా పరిశీలకులుగా హాజరైనందున ఆయన సమక్షంలోనే ఈ సమస్యపై చర్చించాలని బోర్డు నాయకులు అభిప్రాయపడినట్లు పత్రికలు వెల్లడించాయి.
విజయవాడ లయోలా క్లబ్‌లో తెలంగాణ పై చర్చ:
అక్టోబర్ మొదటి వారంలో విజయవాడ లయోలా క్లబ్ ఆసక్తికరమైన చర్చను నిర్వహించింది. సమైక్య ఆంధ్ర ప్రదేశ్ – తెలంగాణా” అనే అంశం పై లయోలా కాలేజీ ఆడిటోరియంలో జరిగిన చర్యలో తెలంగాణను సమర్ధిస్తూ ముందుగా స్వతంత్ర పార్టీ నాయకులు గౌతు లచ్చన్న మాట్లాడుతూ ”ప్రత్యేక తెలంగాణ కొద్దిమంది రాజకీయ నాయకులు సృష్టించిన ఉద్యమం కాదు, ఇది ప్రజాఉద్యమం. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ఆంధ్రజాతి అభివృద్ధికి గానీ, భాషాభి వృద్ధికి గానీ, సాంస్కృతికాభివృద్ధికి గానీ ఎట్టి హాని కలిగించదు. హిందీకి ఆరు రాష్ట్రాలున్నప్పుడు తెలుగుకు రెండు రాష్ట్రాలుండటంలో అభ్యంతరం ఉండరాదు. ఇటువంటి సర్దుబాట్లు, ఒప్పందాల వల్ల విశాలాంధ్ర నిలబడదు. సమస్య పరిష్కారం కాదు. అన్నదమ్ములవలె మంచిగా విడిపోవడం శ్రేయస్కరం. 50 రాష్ట్రాలైనా ఫర్వాలేదు. దేశ సమైక్యతకెట్టి హానిలేదు” అంటూ అమెరికా, రష్యాలనుదహరించారు. సమైక్య రాష్ట్రాన్ని సమర్ధిస్తూ సి.పి.ఎం. నాయకులు మోటూరి హనుమంతరావు మాట్లాడుతూ ”ఈనాడు తెలంగాణలో జరిగే కొద్దిమంది వ్యక్తులు, భూస్వాముల, పదవీ భ్రష్టులైన రాజకీయ నాయకుల కుతంత్రమ”ని అన్నారు.
లయోలా కాలేజీ రాజకీయ శాస్త్ర ఆచార్యులు కేశవరావు మాట్లాడుతూ ”తెలంగాణ ప్రజలు ప్రజాస్వామ్య పద్ధతుల ద్వారా విడిపోవుటయో, సమైక్య రాష్ట్రంలో కొనసాగుటయో నిర్ణయించుకోవాల”న్నారు. అంతకు ముందు ఆయన ఆంధ్ర – తెలంగాణ ప్రాంతాల మధ్యగల సాంస్కృతిక విభేదాలను, ఆర్థిక వ్యత్యాసాలను వివరించారు.
– వి. ప్రకాశ్
(”తెలంగాణ కోసం మల్లికార్జున్, రమాదేవిల నిరాహార దీక్ష” వచ్చే సంచికలో…..)