“పరిపూర్ణ పావనాంభస్తరంగోద్వేగ
గౌతమీ గంభీర గమనమునకు
ఆలంపురీ నందనారామ విభ్రాజి
మల్గోబ ఫలరాజి మధుర రుచికి
ఆంధ్రీకుమారీ సమాయుక్త పరిపూత
తుంగా పయస్సు మాధుర్యమునకు
ఖండ శర్కర, జాతి ఖర్జూర, గోక్షీర
ద్రాక్షాదియుత రామ రసమునకును
అమ త నిష్యంది వల్లకీహ్లాదమునకు
రాగిణీ దివ్య సమ్మోహరాగమునకు
తేనెతేటల నవకంపు సోనలకును
సాయగును మా తెనుగు భాషామతల్లి”

అంటూ తెలుగు భాష గొప్పతనాన్ని, సౌందర్యాన్ని వర్ణించే ఈ పద్యం సురవరం ప్రతాపరెడ్డి రచించింది. ఇందులో ఉపయోగించిన పదాలు, వారి భాషా పరిజ్ఞానంతో పాటు, స్వంత ప్రాంతంపై మక్కువను కూడా చూపుతుంది. సురవరం ప్రతాపరెడ్డి రచయితగా, పండితుడిగా, చరిత్ర పరిశోధకుడుగా, పత్రికా సంపాదకుడిగా, సామాజిక కార్యకర్తగా, కార్యకర్తలకు ప్రేరకుడుగా, స్వాతంత్య్రోద్యమకారుడిగా అన్ని రంగాలలో తనదైన ప్రత్యేక ముద్రను వేసి భావి తరాలవారికి ఆదర్శంగా నిలిచాడు.

సురవరం వారి జన్మస్థలం మహబూబ్‌నగర్‌ జిల్లాలోని బోరవెల్లి గ్రామం. క్రీ.శ. 1896లో నారాయణరెడ్డి, రంగమ్మ దంపతులకు జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయినా, చిన్నాన్న ప్రోత్సాహంతో స్వగ్రామంలో ప్రాథమికవిద్యను కొనసాగించి, హైద్రాబాద్‌లో ఇంటర్మీ డియట్‌, మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో బి.ఎ, తిరువాన్‌కూరులో లాయర్‌ విద్యను అభ్యసించాడు. నిజాం రాష్ట్రంలో ఉండడం వల్ల ఉర్దూ తప్పనిసరిగా వచ్చేది. తెలుగు, సంస్క తం, ఇంగ్లీషు, ఉర్దూ భాషల్లో పాండిత్యం సంపాదించినాడు. సురవరం రచనల్లో వారి బహుభాషా పటుత్వం మనకు కన్పిస్తుంది.

1916లో పద్మావతిని పెండ్లి చేసుకున్నారు. వీరికి నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. సురవరం వారు చదువు పూర్తి గానే జీవనాధారం వెతుక్కుంటూ హైద్రాబాద్‌ వచ్చారు. ఆనాటి హైద్రాబాద్‌ కొత్వాల్‌ రాజా బహదూర్‌ వెంకటరామారెడ్డి రెడ్డిహాస్టల్‌ను నిర్వహిస్తున్నారు. కొత్వాల్‌ కోరిక మేరకు రెడ్డిహాస్టల్‌కు 10 సంవత్సరాలు పనిచేశారు. ఆ సమయంలో ఉన్న విద్యార్థులందరిలోను దేశభక్తి భావాలను పెంపొందించి, ఇక్కడి నిజాం రాష్ట్ర ప్రజల దుస్థితిని మార్చాలన్న సంకల్పంతో పనిచేశారు. కార్యదర్శిగా రెడ్డిహాస్టల్‌ నిర్వహణలో పూర్తిస్థాయి శక్తిని వినియోగించారు. హాస్టల్‌కు అనుబంధంగా ఉన్న లైబ్రరీలో పుస్తకాల సంఖ్యను వెయ్యినుండి పదకొండు వేలకు పెంచి, విద్యార్థులు భాషాజ్ఞానాన్ని, విషయ పరిజ్ఞానాన్ని పెంచుకోవడంలో కషిచేశారు.

సామాజికపరంగా, రాజకీయంగా, సంఘంలో ఉన్న దుస్థితులను, ఇక్కడి తెలుగు ప్రజల అవస్థలను కళ్ళారా చూసిన సురవరం ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా ప్రయాణం సాగిస్తూ అందుకు సాధనంగా పత్రికారంగాన్ని ఎంచుకున్నారు. ఆనాటి పరిస్థితుల్లో ఇక్కడి ప్రాంతీయ వార్తలు కూడా మీజాన్‌, జమీన్‌, రయ్యత్‌ వంటి పత్రికల్లో ఉర్దూలోనే ప్రచురితమయ్యేవి. గోలకొండ పత్రిక రాకముందు రెండే రెండు పత్రికలు, ఒకటి నల్లగొండ నుండి, మరొకటిి వరంగల్లు నుండి వెలువడేవి. సురవరం వారు ఎంతో ధైర్యంతో గోలకొండ పత్రికను 1926లో ప్రారంభించారు. ఈ పత్రికలో వార్తలు సాంస్కతికంగా తెలుగు ప్రజల వికాసానికి, రాజకీయ చైతన్యానికి దోహదపడినాయి. సురవరం వారి సంపాదకీయాలు ప్రజల్లో నిజాంకు వ్యతిరేకంగా పోరాడాలనే ధైర్యాన్ని ఇచ్చేవి. అదేవిధంగా నిజాం గుండెల్లో దడ పుట్టించేవి. ఆ కారణంగానే సంపాదకీయాలు సమాచారశాఖ అనుమతితో ప్రచురించాలనే నిబంధన పెట్టినారు. ఆ నిబంధనను సురవరం వారు చాలా తేలికగా తీసుకొని, ప్రపచంలోని మేధావుల గొప్ప గొప్ప సూక్తులతో సంపాదకీయం పుటను ప్రచురించారు. అవి ఇంకా ఉత్తేజపూరితంగా ఉండేవి.

గోలకొండ పత్రిక ద్వారా తెలుగుభాష ఉనికిని కాపాడే ప్రయత్నంచేశారు. ఉర్దూ ప్రభావం నుండి కొంతవరకైనా తెలుగుభాషను రక్షించగలిగారు. పత్రికా స్వేచ్ఛ అంతగా లేని కాలంలో తెలుగు భాష పరిరక్షణకు, ఇక్కడి ప్రజల సాంస్కతిక చైతన్యానికి, రాజకీయ విషయ పరిజ్ఞానానికి తెలుగు పత్రిక అవసరం అనే ఉద్దేశంతోనే పత్రికా స్థాపనకు బీజం ఏర్పడింది. ఎన్నో అవరోధాలు ఏర్పడ్డాయి. అన్నింటినీ అధిగమించి పత్రికను స్థాపించి సుమారు 24 సంవత్సరాలు సంపాదకత్వం నెరపినారు.

కొన్ని సంవత్సరాలు లాయర్‌ వత్తిని చేపట్టి అనేక కేసులు వాదించి విజయం సాధించారు. పత్రికా సంపాదకుడిగా సమాజంలో నూతన ఆలోచనలను, సంస్కరణలకు మార్గం సుగమం చేశారు. ఒకవైపు ఈ బాధ్యతలను నిర్వహిస్తూనే తన సాహిత్య వ్యాసంగాన్ని కొనసాగించారు.

‘సురవరం ప్రతాపరెడ్డి రచనలు అన్నీ విశిష్టమైనవే. సుమారు 40 వరకు వీరి రచనలు ఉన్నట్లు తెలుస్తుంది. ఒక్కో రచనకు ఒక్కో ప్రత్యేకత ఉంది. వీరి రచనల్లో ఇతిహాస పురాణాలకు సంబంధించినవి, మన ధర్మానికి సంబంధిం చినవి, సమకాలీన సామాజిక స్థితిగతులకు అద్దం పట్టేవి ఉన్నాయి. పద్యం, కవిత్వం, కథలు, నాటకాలు, వ్యాసాలు ఆయా ప్రక్రియల్లో వీరి రచనా వ్యాసంగం కొనసాగింది. వీరి రచనల్లో ముఖ్యమైనవాటిని గూర్చి పరిచయం చేసుకుందాం.

1. ఆంధ్రుల సాంఘిక చరిత్ర 2. రామాయణ విశేషాలు 3. సురవరం కథలు 4. మొగలాయి కథలు 5. హైందవ ధర్మవీరులు 6. సురవరం ప్రతాపరెడ్డి వ్యాసాలు 7. సురవరం కవిత్వం 8. ఉచ్ఛల విషాదము (నాటకం)

9. శుద్ధాంతకాంత (నవల, అముద్రితం) 10. భక్త తుకారాం (నాటకం)

11. గోలకొండ కవుల సంచిక (సంపాదకత్వం), 12. ప్రజాధికారములు

13. యువజన విజ్ఞానం…

ఆంధ్రుల సాంఘిక చరిత్ర :

తెలుగు వారి చరిత్ర ఉన్నతమైనది. నేటి, భావి తరాలవారికి ఆ చరిత్ర, సంస్కతులు, ఆచార వ్యవహారాలు తెలియాలనే ఆకాంక్షతో సుమారు 20 సంవత్సరాల సుదీర్ఘ పరిశ్రమ, పరిశోధన ఫలితంగా వెలువడ్డ గ్రంథమే ఆంధ్రుల సాంఘిక చరిత్ర. 1949లో మొదటి సారిగా ఆంధ్రసారస్వత పరిషత్తు పక్షాన ముద్రితమైన ఈ గ్రంథం నేటి వరకు 7,8 ముద్రణలు పొందింది.

దక్షిణభారత దేశంలో సాంఘిక చరిత్ర రాసినవాళ్ళలో మొదటివారు సురవరంవారు. ఇందులో సురవరం వారు అనేక నూతన అంశాలు పేర్కొన్నారు. సంఘ నియమాలు, కట్టుబాట్లు, స్త్రీ పురుషుల వేషధారణ, భాష, సాహిత్యం, శిల్పం, గ్రామ వ్యవస్థ, మతం, పన్నుల వివరాలు తదితర అన్ని అంశాలు ఇందులో సుమారు 1000 సంవత్సరాల చరిత్ర మనకు కన్పిస్తుంది. ఈ గ్రంథాన్ని గూర్చి మధునాపంతుల సత్యనారాయణ తమ ఆంధ్రకవుల చరిత్రలో ‘…రెడ్డిగారి సాంఘిక చరిత్రము నేటి సారస్వత కతి సంభారమున కొక వెలుగునిచ్చి, మెచ్చుకోలు పడయదగిన గ్రంథమై, వారి యశోలతకు మాఱాకు హత్తించునదిగనున్నది” అని ప్రశంసించారు. ఈ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది.

రామాయణ విశేషాలు :

తెలుగు సాహిత్యంలో వెలువడ్డ మరో ఆణిముత్యం సురవరం వారి రామాయణ విశేషాలు ఇందులో రామాయణానికి సంబంధించి సుమారు 160 వ్యాసాలు ఉన్నాయి. 1943లో మొదటి ముద్రణ కాగా 1987లో రెండవ ముద్రణ సారస్వత పరిషత్తు పక్షాన జరిగింది. ఇందులోని వ్యాసాలన్నీ విబూతి పత్రికలో 2 సంవత్సరాలు వరుసగా ప్రచురించబడ్డాయి. రామాయణం – ఇలియడ్‌ పురాణం, వాల్మీకి యెవరు? దేశ విదేశ పురాణాలు, వివిధ రామాయణ కథలు, హనుమంతుని జన్మకథ, సీతా న్వేషణము, లక్ష్మణుని పెండ్లి అయ్యేనా, వర్ణ వ్యవస్థ, ఆర్యుల సంస్క తి, స్త్రీల వేదాధికారము, వక్షపూజ, లంక యెచ్చట, రాక్షసులెవరు, పూర్వం విమానాలుండెనా, రాక్షసుల నాగరికత, సీత, రాముడు తదితరుల రామాయణంలోని అన్ని పాత్రల విశ్లేషణలతో కూడిన వ్యాసాలు ఉన్నాయి. ఈ వ్యాసాలు చదివితే భారతీయ జీవన విధానం, ప్రాచీన ఆధునికతల మధ్య సురవరం సాధించిన అనుసంధానాన్ని మనం గమనించవచ్చు.

సురవరం కథలు :

ఇందులో మొత్తం 9 కథలు ఉన్నాయి. ప్రతాపరెడ్డి 1930 నుండి కథలు రాయడం ప్రారంభించారు.

సురవరం కథల్లో ఇతివత్తాలు నిజాం కాలంనాటి సామాజిక పరిస్థితులకు అద్దం పడతాయి. ఈ కథల్లో ముఖ్యంగా స్త్రీ జీవితంలో ఎదుర్కొనే సమస్యలు, స్త్రీలను వేశ్యలుగా మార్చడం, బాల్యవివాహాలు, మత మార్పిడి, స్త్రీ ఉద్ధరణ వంటి అంశాలతో ఈ కథలు కొనసాగుతాయి.

మొగలాయి కథలు :

ఇందులో మొత్తం 11 కథలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం మొగలులు ఆధీనంలో ఉన్నప్పటికి వాటికి సంబంధించిన కథలు ఎక్కువగా ఉన్నాయి. ఇందులో ‘గ్యారా కద్దూ బారా కొత్వాల్‌’, ‘రంభ’ కథలు ప్రముఖమైనవి. ఈ కథల్లో అధికారుల లంచగొండితనం, క్రూరత్వం, ప్రజల నిస్సహాయత, పాలకుల దుష్టపాలన చిత్రించబడినది.

సురవరం కథల్లో ఉపయోగించిన పదాలు ముఖ్యంగా తెలంగాణ ప్రాంతానికే పరిమితమైన పలుకుబడులు, ఉర్దూ పదాలు ఎక్కువగా కనిపిస్తాయి. కథల్లో వీరు ఉపయోగించిన భాష తెలంగాణ ప్రామాణిక భాషగా పరిశోధకులు భావిస్తున్నారు.

ఉచ్ఛల విషాదము (నాటకం) :

సంస్క తంలో కల్హణుడు రచించిన ‘రాజతరంగిణి’ అనుసరించి ప్రతాపరెడ్డి ఉచ్ఛల విషాదమనే ఈ నాటకాన్ని రచించాడు. ఉచ్ఛలుడు కల్హణుడి సమకాలీకుడు. 1921లోనే ఈ నాటకాన్ని రాసినా చాలారోజుల వరకు ప్రకటించలేదు. 5 అంకాల ఈ నాటకము మూలకథను అనుసరించి రాసినా, అవసరమైన మార్పులు చేసినారు. ఆ విషయం సురవరం వారు నాటక ప్రారంభంలో స్వయంగా చెప్పారు.

హిందువుల పండుగలు :

భారతదేశంలో భిన్న మతాలవారు ఉన్నారు. హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, జొరాస్ట్రియన్లు, బౌద్ధులు, జైనులు మొదలైన మత సంప్రదాయాలు, పద్ధతులు అన్నీ వేరుగా ఉంటాయి. హిందువుల్లో కూడా భిన్న శాఖలున్నాయి. అందరూ అన్ని రకాల ఆయా ప్రాంతాల్లో ఉత్సవాలు పండుగలు నిర్వహించుకుంటారు. ఎవరు ఏరోజు ఏవిధమైన పండుగను చేసుకుంటారో వివరంగా, ఆ పండుగ ఆరోజు చేసుకోవడానికి కారణాలు, దానికి పూర్వ సాహిత్యపు ఆకరాలను చూపి, ఒక సామాజిక, సాంస్క తిక ఉత్సవంగా, భక్తిశ్రద్ధలతో పండుగను చేసుకోవాలి కాని మతోన్మాదంతో కాదని ప్రజలకు మంచి సందేశాన్నిచ్చే విధంగా ఈ గ్రంథం మనకు మార్గనిర్దేశనం చేస్తుంది.

గోలకొండ కవుల సంచిక (సంపాదకత్వం) :

తెలంగాణ ప్రాంతంలో కవులు పూజ్యమన్న ఒక పండితుని వాక్యాలకు చాలా బాధపడి సురవరం వారు ఇక్కడి ప్రాంత అస్థిత్వాన్ని సాహిత్యలోకంలో నిరూపించే క్రమంలో చేసిన సాహసోపేతమైన కార్యానికి ప్రతిరూపమే గోలకొండ కవుల సంచిక. ఈ సంచిక ద్వారా తెలంగాణ ప్రాంతంలో వెలుగుచూడని ప్రతిభామూర్తులను, భిన్న కోణాల్లో వారి ఆలోచనలను వెలుగులోకి తెచ్చారు. ఇక్కడ అచ్చతెనుగు కావ్యాలు రాసిన పండిత ప్రకాండులు ఉన్నారు, అనేక ప్రక్రియల్లో రాయగలిగే సామర్ధ్యమున్న కవులు ఉన్నారు. కానీ వీరందరు పల్లెటూరివారు. ఆధునిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోలేక, పత్రికా ప్రచారం చేసుకోలేక మరుగున ఉన్నారు. ఈ కారణంగానే వారందరికీ ఉత్తరాలు రాసి, సమాచారాన్ని సేకరించి సుమారు 354 మంది కవుల రచనలు ఒక దగ్గర చేర్చి గోలకొండకవుల సంచికకు అక్షరరూపం కల్పించారు. కవుల సమాచారాన్ని సేకరించడంలో వీరు ఎదుర్కొన్న సమస్యలను, ఏ విధంగా అందరినీ సంప్రదించారో గ్రంథం మొదట్లో సురవరం వారి మాటల్లో మనం చూడవచ్చు. 354 మంది రచనలు 11 శాఖలుగా విభజించుకుని మొత్తం 1418 పద్యాలను ఇందులో ముద్రించారు. ఇంకా చాలామంది కవుల పద్యాలు, కవితలు ఇందులో గడువు లోపల రాలేనందున ప్రచురించలేకపోయారు.

సురవరం సంపాదకీయాలు :

గోలకొండ పత్రికా సంపాదకుడిగా సురవరం అనేక స్ఫూర్తివంతమైన, ఉత్తేజపూర్తిమైన సంపాదకీయాలు రచించారు. 1926 నుండి 1947 వరకు గోలకొండ పత్రిక సంపాదకులుగా ఉన్న సురవరంవారి సంపాదకీయాల్లో 1926 నుండి 1936 వరకు మొత్తం 96 సంపాదకీయాలతో కలిపి మొదటి భాగంగా ఆంధ్రసారస్వత పరిషత్తు పక్షాన 1989లో ప్రచురించబడింది. దేశసేవకు పత్రికను సాధనంగా స్వీకరించి, సంపాదక వృత్తికి తన జీవితాన్ని త్యాగం చేసిన ప్రతాపరెడ్డి ధృక్పథాన్ని ఈ సంపాదకీయాల్లో మనం చూడవచ్చు.

తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో సురవరం వారి కవిత్వం, కథలు, వ్యాసాలు సంగిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు పుస్తకరూపంలో తెచ్చి సురవరం వారి సాహిత్య పరిధులను అందరికీ పరిచయం చేశారు.

సాహిత్యపరంగా అనేక రచనలు చేసిన సురవరం వారు సామాజిక కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని సమాజసేవకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఏ ఉద్యమమైనా ముందుండి నడిపించేవారు. గ్రంథాలయోధ్యమంలో ప్రముఖ పాత్ర వహించి 1942లో ఆంధ్ర గ్రంథాలయ మహాసభకు అధ్యక్షత వహించారు. జోగిపేటలో జరిగిన ప్రథమాంధ్ర మహాసభలకు అధ్యక్షత వహించి సభలను విజయవంతం చేశారు. గోలకొండ పత్రిక సంపాదకత్వ బాధ్యతలనుండి తప్పుకున్నాక 1951లో ప్రజావాణి పత్రికను ప్రారంభించారు.

1952లో హైద్రాబాద్‌ రాష్ట్రానికి జరిగిన మొదటి ఎన్నికల్లో వనపర్తి నియోజకవర్గం నుండి శాసనసభకు పోచేెసి విజయం సాధించారు. తెలంగాణాలో భాషాభిమానాన్ని, ఉద్యమస్ఫూర్తిని, సామాజిక చైతన్యాన్ని, రాజకీయ స్థిరతను సాధించే ప్రయత్నం చేసి సఫలీకతుడైన సురవరం ప్రతాప రెడ్డి 1953 ఆగస్టు 25న మరణించారు. నేడు వారిని ఈవిధంగా స్మరించుకోవడం అంటే మన అస్తిత్వాన్ని నిలుపుకోవడమే. మన భాషను, సంస్కతిని పునరుజ్జీవింపజేసుకోవడమే.

తెలంగాణ ప్రజలందరూ సర్వదా, సర్వవేళలా ప్రాతఃస్మరణీయంగా పూజించే వ్యక్తిగా సురవరం చరిత్రలో నిలిచిపోతారు.
– సాగి మనోహరి
(మే 28న సురవరం జయంతి)

Other Updates