తెలంగాణ ఆత్మగౌరవంతోని నిటారుగ నిలబడటం పది పదిహేనేండ్ల నుంచి మొదలైంది. తెలంగాణ సంస్కృతి, భాష పండుగలు పబ్బాలు పరాయికరణ నుంచి పురాగ బయటపడ్డట్టే. సొంత రాష్ట్రం సాధించుకున్నంక మన పండుగలు మనం జోర్‌దార్‌గ చేసుకుంటున్నం. బతుకమ్మ పండుగనే తెలంగాణ పెద్ద పండుగ. తెలంగాణ ఉద్యమం మొదలుగాకముందు బతుకమ్మ పండుగంటే దుర్గాష్టమి అని పేపర్లల్ల వచ్చేది.. టీవీలల్ల దాని పత్తగూడ ఉండకపోయేది. ఏమంట తెలంగాణతనం సుర్వయ్యిందో అప్పుడే మన పండుగలు మస్తు జరుగుతన్నయి. బతుకమ్మ పండుగకు గౌరవం పెరిగింది.
బతుకమ్మ పండుగసోంటి పండుగ కలీగంలనే లేదు ఇది పూల పండుగ.. ఆడపిల్లల పండుగ.. అక్కచెల్లెల్ల పండుగ.. అమ్మ.. అమ్మమ్మల పండుగ.. నీళ్ళ పండుగ.. చెర్ల పండుగ.. పెద్ద సంబురమైన పండుగ.. దేశం పోయినోల్లు దసర బతుకమ్మలకే మల్ల ఊల్లెకు వచ్చేది లెక్క. దేశం అంటే విదేశం కాదు బొంబాయి, సోలాపురం, బీవండికి బతుపోయినోల్లు మల్ల బతుకమ్మ పండుక్కే వస్తరు. అప్పుడే అవ్వగారింటికి బిడ్డలు వస్తరు. కొత్త బట్టలు కట్టుకుంటరు. ఇదొక గీటురాయి లెక్కనే. పండుగ అంటే పిల్లలకు బొడ్డెమ్మ, పెద్దోల్లకు బతుకమ్మ. సద్దులకు ఊరు ఊరంత ఒక్కతానకు వచ్చి ఆడుకుంటది. ఎప్పుడో పెండ్లిల్లు అయిపోయి అత్తగారిండ్లకు పోయినోల్లు మల్ల కల్సుకుంటరు.. మాట్లాడుకుంటరు. చిన్నపిల్లలు బొడ్డెమ్మ పండుగకు పీటమీద మన్నుతోని చేసుకోని నాలుగిండ్లకాడ బెట్టుకుని ఆడుకునేది. కని ఇప్పుడు ఆడుతలేరు. ఆ తర్వాత ఎంగిలిపూలు ఉంటయి. ఎంగిలిపూలు అంటే సివాంట బతుకమ్మ ఆడేదినం. అట్లనే రోజు ఆడుకుంట. తొమ్మిదిరోజుల్ల పెద్ద బతుకమ్మ వస్తది. రోజూ పూలకు పోవుడు తెచ్చుడు అదొక పాత జ్ఞాపకం వస్తది ఎవలకైనా!
తంగేడుపూలు, గునుగు, కట్లపూలు, చామంతి, దసన్న, గన్నేరు, పట్టుకుచ్చులపూలు తెచ్చి బతుకమ్మ పేరుస్తరు. బతుకమ్మ ఆడోల్ల ఆట అంటరుగని ఇందులో పని ఎక్కువ మొగోల్లదే ఉంటది. పువ్వు చెల్కకు గుట్టలకు పోయి తెచ్చుడు.. పేర్చుడు.. ఇదంత మొగోళ్ళ పనే… పెద్ద బతుకమ్మ మొగోల్లు పేరుస్తరు.. చిన్నవాటిని ఆడవాల్లు పేర్సుకుంటరు. ఇగ రోజు బతుకమ్మ ఆడినంక పలారం ఉంటది. పల్లీలు, బెల్లం, నువ్వుల బెల్లం, తియ్య ముద్దలు ఉంటయి.. చెరువు కట్టమీదికిపోయి ఆడినంక ఇచ్చుకోవైనం.. పుచ్చుకోవైనం అంటూ అందరూ ఒగలకు ఒగలు ఇచ్చుకుంటరు. ఈ పండుగ వచ్చిందంటే బట్టల దుకాన్లకు గిరాకీ ఉంటది. అందరూ చీరలు కొనేది ఇప్పుడే. అట్లనే బతుకమ్మ తెల్లారి మరునాడే దసర పండుగ వస్తది. దాని జోరు ఇంక గమ్మతిగ ఉంటది.
తెలంగాణలో దసర అంటే గమ్మత్తుగనే ఉంటది. తెల్లారి లేవంగనే యాట పిల్లను కోసుడు.. కోళ్ళు కోసెతందుకు దొరకపట్టువచ్చుడు జరుగుతది. ఇంటినిండ సుట్టాలు.. అల్లుండ్లు.. బావలు వస్తరు. ఇల్లు వాతావరణమే సందడి సందడిగ ఉంటది. బతుకమ్మ, దసరా రెండు చాలా ముఖ్యమైన పండుగలు. అయితే దసర పండుగను దుర్గాష్టమి పేరుతో క్యాలెండర్లలో వలస పాలకుల కాలంలో చలామణి అయ్యేది. మన కల్చర్ కనపడకపోయేది కని తెలంగాణ సంస్కృతిక చైతన్యం వెల్లి విరిసినంక మన పండుగలు మనకు కన్పిస్తన్నయి. తెలంగాణ వచ్చినంక జరుగుతన్న పరిణామాలు ఇంకా జోరుగా నడుస్తున్నయి. అయితే కాలంతోపాటు పండుగల తీరు కూడా మారుతది. బతుకమ్మ ఆట ఇన్నొద్దులు సప్పట్లు కొట్టుకుంట సుట్టు తిరిగి ఆడేది ఇప్పుడు కూడా ఆడుతండ్రు గని కోలాటం కూడా ఈ బతుకమ్మ పండుగల కల్సిపోయింది. ఇదొక ఆట గుజరాత్, మరాఠా ప్రాంతంలో ఆడే గమ్మత్తైన ఆట మస్తు అన్పిస్తది. ఈ ఆట ఇప్పుడు తెలంగాణ బతుకమ్మ స్థానంలో వచ్చి కూసున్నది. కొత్తగా ఎదిగివస్తున్న మహిళలకు ఇది నచ్చుతుంది. ఇందులో లయాత్మకమైన ధ్వని కోలలతో ఆడటం, పాట కల్సి ఉంటాయి. ఇందులోఎన్నోతీర్లుగ ఉన్నాయి. అన్నీ నేర్చుకోని పట్టణాలల్ల ఆడుతుండ్రు అట్లనే ఊర్లల్ల వినాయకుని మంటపాల దగ్గర కూడా ఆడుతుండ్రు. ఆడొచ్చు మనదైన బతుకమ్మను పురాగ విస్మరించకుండా కొనసాగిస్తే బాగుంటదని అన్పిస్తది. ఏదీ ఏమైనా మన బతుకమ్మ.. మన బొడ్డెమ్మ.. మన దసరా పండుగోలె మన సంబురం.. ఇదొక పునర్జీవనం..
అన్నవరం దేవేందర్