ప్రధాన న్యాయమూర్తిగా రాధాకృష్ణన్‌
tsmagazine
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఎదురుచూస్తూ, పోరాటం కొనసాగిస్తున్న హైకోర్టు విభజన ప్రక్రియ ఎట్టకేలకు పూర్తయింది. ఇంతకాలంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న హైకోర్టును రెండు రాష్ట్రాల మధ్య విభజిస్తూ రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ 2018 డిసెంబరు 26న ఆదేశాలు జారీచేశారు. 2019 జనవరి 1 నుంచి హైదరాబాద్‌ లో ఉన్న న్యాయస్థానం తెలంగాణ రాష్ట్ర హైకోర్టుగా సేవలందిస్తుంది. అమరావతి కేంద్రంగా ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు కార్యకలాపాలు ప్రారంభిస్తుంది.

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 214 ప్రకారం ప్రతి రాష్ట్రానికి ప్రత్యేక హైకోర్టు ఉండాలన్న నిబంధన మేరకు ఆంధ్రప్రదేశ్‌ లో కొత్త హైకోర్టు ఏర్పాటు చేస్తున్నట్టు ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రస్తుతం ఉమ్మడి హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌గా ఉన్న తొట్టతిల్‌ బి. రాధాకష్ణన్‌ను నియమించారు. ఆంద్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ సి. ప్రవీణ్‌ కుమార్‌ను నియమించారు. తెలంగాణ హైకోర్టుకు 13 మంది న్యాయమూర్తులను, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు 14 మంది న్యాయమూర్తులను కేటాయించారు.
tsmagazine

దీనితోపాటుగా రెండు హైకోర్టులకు న్యాయాధి కారుల విభజన కూడా జరిగింది. మొత్తం 901 మంది న్యాయాధికారులలో తెలంగాణకు 362 మంది, ఆంధ్రప్రదేశ్‌కు 539 మందిని కేటాయించారు. తెలంగాణకు కేటాయించిన 362 మందిలో 90 మంది జిల్లా జడ్జీలు (క్యాటగిరి -1), 71 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీలు (క్యాటగిరి – 2), 201 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జిలు (క్యాటగిరి-3) ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ కు కేటాయించిన 539 మందిలో 110 మంది జిల్లా జడ్జీలు (క్యాటగిరి -1), 132 మంది సీనియర్‌ సివిల్‌ జడ్జీలు (క్యాటగిరి – 2), 297 మంది జూనియర్‌ సివిల్‌ జడ్జీలు (క్యాటగిరి -3) ఉన్నారు. జనవరి ఒకటి నుంచి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టులు స్వతంత్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తాయి.

ఉమ్మడి హైకోర్టును విభజించడంతో తెలంగాణ న్యాయవాదులు ఆనందంతో పటాకులు కాల్చి సంబురాలు చేసుకున్నారు.

Other Updates