telangana-souruతీయ తేనియ పల్కు తెలగాణ యాసలో

అనురాగ పరిమళ ధునులు గనుము

సింగార మొలికించు సింగరేణియలోని

కడునల్ల బంగారు గనులు గనుము

సకల జనుల సమ్మె సాగించి గర్జించు

కదన యోధులైన ఘనుల గనుము

ప్రాణమ్ములను తృణ ప్రాయమ్ముగా నెంచి

ధన్యులైన త్యాగ ధనుల గనుము

సీమ కుట్ర లింక చెల్ల నేర వటంచు

మేలుకొనుము పుడమి నేలుకొనుము

కన్న నేల రుణము కడ తేర్చగా రమ్ము

స్వర్ణ యుగము వంక సాగి పొమ్ము”

నాలోవర్ణసువర్ణ దీధితులు నానా వర్ణ సంక్రాంతులై

యాలాపించె సమస్త రాగముల నేనానంద విద్యుల్లతా

జాలమ్మున్‌ మెరిపించి నవ్య కవితా సంసృష్టికై సాగ ప

ర్యాలోకింతు సమస్త మానవ సమాహ్లాదమ్ము శోభిల్లగన్‌

పాల్కుర్కి సోమన్న పదములో ప్రవహించె

జానుతెలుగులోని జ్ఞాన గంగ

బమ్మెర పోతన్న పల్కు లోపలజిల్కె

మందార మకరంద మధుర వృష్టి

వసుధలో వేములవాడ భీమన వాక్కు

కవిజనాశ్రయ తతి గణన కెక్కె

అచ్చతెనుగు కబ్బ మవలీలగా వ్రాయు

పొన్నగంటి మహిమ పొంగి పొరలె

నాటి నుండి నేటి మేటికవులదాక

తరలి వచ్చె కవిత ధరణి యందు

తొలివెలుగులు జిమ్ము తెలగాణ కావ్యాలు

మేను పులకరింప వినితరింతు

జ్ఞాన సరస్వతిన్‌ ధ్యానమ్ములోనిల్పి

బాసర గంగ లోపల మునింగి

భిక్నూరు సిద్ధరామేశ్వరు సేవించి

నాచగిరి నృసింహు నతులనర్చి

వరగంటి కొండపై కరములు ముకుళించి

విద్యా సరస్వతిన్‌ వినుతి జేసి

కొమురెల్లి మల్లన్న కోటి మొక్కులుదీర్చి

మర్పడ్గ మల్లన్న మహిమ నెంచ

సిద్ధిపురి కోటి లింగేషు స్థితిని బగిడి

ఏములాడ రాజేశ్వరు నిచ్ఛగొలిచి

కొండగట్టున అంజన్న గుడికి మ్రొక్కి

సాగిపోయేద తెలగాణ సౌరు నెంచ

Other Updates