(భారతదేశంలో
అత్యంత ప్రాచీన భాషల్లో ఒకటయిన తెలుగుకు పట్టంకట్టాలని ఎప్పటినుంచో నినాదాలు వినిపిస్తున్నా, ఇప్పుడు 2017లో హైదరాబాద్‌ వేదికగా జరగబోతున్న ప్రపంచ తెలుగు మహాసభలపై పలువురు వారివారి అంచనాలు పెంచుకుంటూ పోతున్నారు. కారణం- స్వతహాగా రాజుకు తెలుగుపట్ల మక్కువ ఎక్కువగాఉండడం. ఇప్పటికే ఈ దిశగా కొన్ని చర్యలకు ప్రభుత్వం సన్నద్ధం కావడం దీనికి ప్రధాన కారణం.

తెలుగదేలయన్న దేశంబు తెలుగేను
తెలుగువల్లభుండ తెలుగొకండ
యెల్లనృపులగొల్వ నెరుగవేబాసాడి
దేశభాషలందు తెలుగులెస్స ||

శ్రీకృష్ణదేవరాయలు రచించిన ‘ఆముక్తమాల్యద’లోనిది ఈ పద్యం. దీన్ని ఇప్పుడు నెమరువేసుకోవడానికి అవసరమైన, అనువైన నేపథ్యాన్ని సృష్టించారు, వర్తమాన తెలుగు వల్లభుడు కె.చంద్రశేఖరరావు. పరాయిభాషల కాసారంలో చిక్కుకుపోయి,బక్క చిక్కిపోతున్న తెలుగును కాపాడడానికి ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఒకటినుండి 12వతరగతి వరకు తెలుగును ఒక పాఠ్యాంశంగా బోధించాలని సంకల్పించి, ఆమేరకు అమలుచేయడానికి చురుగ్గా సన్నా హాలు చేస్తున్నారు. అలాగే తెలుగును ఉద్ధరించడానికిగల అవకాశాలను అన్వేషించడానికి భారీ వ్యయప్రయాసలతో ప్రపంచ తెలుగు మహాసభలను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్నారు.

అతికొద్ది ప్రాచీన భారతీయ భాషల్లో ఒకటిగా గుర్తింపుపొందిన తెలుగుకు, దేశంలో ఎక్కువమంది మాట్లాడే రెండో అతిపెద్దభాషఅయిన తెలుగుకు పునర్‌వైభవం తీసుకువచ్చి పట్టంకట్టడం అత్యంత ఆవశ్యకం. అయితే మన భాషను కాపాడుకుంటూనే ప్రపంచవ్యాప్తంగా మారిన పరిస్థితులలో మనం పోటీకి సంసిద్ధంగా ఉంటున్నామా లేదా అనికూడా చూసుకోవడం అవసరం. అభిమానం అవసరమే కానీ దురభిమానం కూడదు కదా !

అనేక చిక్కుముళ్ళు :
‘భాష’ అనేది ఇతరులతో హావభావాలను పంచుకునే సాధనం -అనేది ఒక సాంకేతిక నిర్వచనం. అంతే కాదు…సంస్కృతి, చరిత్ర, సాహిత్యాలకు, సృజనాత్మక శక్తికి భాష ప్రాణప్రదం కూడా. 2001నాటి జనాభా సర్వేగణాంకాల ప్రకారం-మనదేశంలో 122 ప్రధాన భాషలున్నాయి. మరో 1599 ఇతర భాషలున్నాయి. (మాండలికాలతో ఈ లెక్కలు మారవచ్చు).10లక్షలమందికి పైగా స్థానికులు మాట్లాడే భాషలు 30వరకున్నాయి. 10వేలమందికి పైగా స్థానికులు మాట్లాడే భాషలు 122 వరకున్నాయి. ఒకప్పుడు సంస్కృతం పెత్తనం చలాయిస్తే మొగలాయీ దండయాత్రల తరువాత నుండి ఆంగ్లేయులపాలన ముగిసేవరకు పర్షియన్‌, ఇంగ్లీష్‌లు రాజ్యమేలాయి. స్వాతంత్య్రం వచ్చిన తరువాత భారత రాజ్యాంగం హిందీని దేవనాగరిలిపితో అధికారభాషగా ప్రకటించింది. ఇంగ్లీష్‌ను కూడా అధికారికంగా వాడుకోవడానికి అనుమతిచ్చింది. ఈ చరిత్ర, ఈ గణాంకాలన్నీ అందరికీ తెలిసినవే కాబట్టి వాటిని ఇక్కడ కట్టిపెట్టి అసలు చర్చనీయాంశాల్లోకి పోదాం. అవి-‘మాతృభాషలో విద్యాబోధన’, ‘పాలనాభాషగా తెలుగు’.

మాతృభాషలో విద్యాబోధన :
ప్రపంచవ్యాప్తంగా 5.75కోట్లమంది పిల్లలు అసలు బడిమొహం ఎరగరని యునెస్కో (ఐరాస సంస్ధ)చెబుతున్నది. దీనికి ఒక ముఖ్య కారణం-ఆయా ప్రాంతాల్లోని బళ్ళల్లో విద్యాబోధన అక్కడ మాతృభాషల్లో కాక ఇతర ప్రధానభాషల్లో జరగడమేనన్నది వారి సర్వేల సారాంశం. మాతృభాష తల్లి పాలవంటిది. పరాయిభాష పోత పాలవంటిదని అనేకసార్లు మననం చేసుకున్నాం. నిజమే. మాతృభాష తల్లిపాలవంటిదే… కానీ జీవితాంతం కాదు. కాకూడదు. మొదటి 30రోజులు, మొదటి 30 నెలలు…మరి కాస్త విపులంగా చెప్పాలంటే… శిశుజననం అయిన క్షణం నుండి మొదటి దశ పెరుగుదలరేటు చాలా వేగంగా ఉంటుంది. ఆ తర్వాత రెండోదశలో కూడా పెరుగుదల రేటు వేగంగా ఉన్నా మొదటి దశకంటే కాస్త నెమ్మదిస్తూ పోతుంది. ఈ రెండు దశల్లో శరీరావయ వాలన్నీ సంపూర్ణంగా, సక్రమంగా, పుష్టిగా పెరగడానికి తల్లిపాలను మించిన ప్రత్యామ్నాయం మరొకటి లేదు. ఇది ప్రకృతి సహజం. ఆ తరువాత తల్లిదగ్గర వాటి ఉత్పత్తి ఆగిపోవడం కూడా అంతే సహజం.ఇక అక్కడినుండి పిల్లలు ఇతర అన్ని రకాల వనరులనుండి పోషకాలు ఎక్కువగా లభించే ఆహారంతో పెరిగి పెద్దయి స్వతహాగా తాము ఆహారాన్ని సమకూర్చుకోగల సామర్ధ్యాన్ని పెంపొందించుకుంటారు.

ఇదే సూత్రాన్ని మాతృభాషకు కూడా అంతవరకే వర్తింపచేయాలి. ప్రపంచమే ఒక కుగ్రామంగా మారిపోతుంటే…విద్యార్థుల చదువంతా డిగ్రీలు, ప్రొఫెషనల్‌ కోర్సులు (మెడిసిన్‌, ఇంజనీరింగ్‌వంటివి), పరిశోధనలవంటి హయ్యర్‌ స్టడీస్‌ మాతృభాషలోనే జరగాలన్న దురభిమానాన్ని ప్రదర్శించడం-బిడ్డ జీవితాంతం తల్లిపాలతోనే బతకాలని శాసించినట్లవుతుంది…ఇదెలా సాధ్యం ?

మాతృభాషఅంటే…అమ్మ మాట్లాడే భాష అని కాదు. రక్తసంబంధీకులు, కుటుంబ సభ్యులు మాట్లాడే భాషవుతుంది. పిల్లలు అప్పటివరకు ఎరగని భాష తొలిసారిగా బడిలో ఎదురయితే అది పరాయిభాషగా భావించాలి. తొలిదశలో…బిడ్డ తన హావభావాలను తన కుటుంబసభ్యులతో వ్యక్తపరచడానికి భాషను సాధనంగా చేసుకునే సమయంలో -అంటే ఇంటిపట్టున, ప్రీస్కూలు, నర్సరీ దశలో మాతృభాష మాత్రమే బోధనా మాధ్యమంగా ఉండాలి. తన చుట్టూ ఉన్న ప్రజలను, ప్రకృతిని పరిచయం చేసుకునే దశలో…అంటే ప్రాథమిక తరగతులలో, తరువాత సమాజాన్ని పరిచయం చేసుకునే దశలో అంటే మాధ్యమిక స్థాయిలో కూడా బోధనాభాషగా ‘మాతృభాష’ తప్పనిసరి. ఇది కేవలం తెలుగు భాష ఒక పాఠ్యాంశంగా కాదుసుమా ! బోధనాభాషగా అన్ని సబ్జెక్టులను తెలుగులో నేర్చుకోవడం తప్పనిసరి. అలాగే విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులమధ్య జరగాల్సిన మాటలన్నీ మాతృభాషలో జరిగినప్పుడు పిల్లల ప్రాథమిక విద్య వికాసవంతంగా సాగుతుంది.

మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన వల్ల ప్రయోజనాలు

  •  పాఠాలను త్వరగా, బాగా అర్థం చేసుకోగలుగుతారు.
  • స్కూల్లో ఆనందంగా ఎక్కువసేపు ఉండడానికి ఇష్టపడతారు. కారణం-ఇంటి వాతావరణానికి భిన్నంగా ఉండదు కనుక.ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
  •  తల్లిదండ్రుల భాగస్వామ్యం పెరుగుతుంది.
  •  చదువుల్లో, పరీక్షల్లో చాలా చురుగ్గా ఉంటారు.
  •  నేరుగా ఇంగ్లీష్‌ నేర్చుకునే పిల్లల కంటే, ఒకసారి మాతృభాషపై పట్టుపెం చుకున్న పిల్లలు ఇంగ్లీష్‌వంటి ఇతర భాషలను త్వరగా నేర్చుకోగలుగుతారు.
  • పిల్లలు వారి మాతృభాషద్వారా అందే సంస్కృతిని, గుర్తింపుని గర్వకారణంగా భావిస్తారు

మరి ఆ తరువాత ???
ఇప్పటివరకు కుటుంబం, ఊరు, సమాజం పరిచయమయ్యాయి. అవగతమయ్యాయి. కానీ అవి పైపైనే. వాటి లోతు తెలియదు. కేవలం పరిచయాలే. లోతుకు వెళ్ళాలంటే…తన కుటుంబం, తన ఊరు, తన సమాజం ఒక్కటే తెలుసుకుని ఉంటే సరిపోదు. ఇతర కుటుంబాలు, ఇతర ఊళ్ళు, ఇతర సమాజాలు పరిచయం కావాలి, వాటితో బేరీజువేసుకుని చూసుకునే సామర్ధ్యం కావాలి. అప్పుడు ఆ దశలో…అంటే ఇంటర్‌..ఆపైన …అంటే తనకు అప్పటిదాకా అందిన సమాచారాన్నిబట్టి తన మనోభీష్టానికి అనుగుణమైన అంశాలను అధ్యయనం చేయడానికి ఉద్యుక్తమయ్యే దశ…ఆ సమయంలో హయ్యర్‌ స్టడీస్‌లో విద్యార్థుల ఎదుగుదలకు మాతృభాష అడ్డంకి కాకూడదు. ప్రాధాన్యతకూడా కాకూడదు. రెక్కలు గట్టిపడేవరకే తల్లి పక్షితోపాటూ అదే గూటి పక్షిగా ఉంటుంది. ఆ తర్వాత ఎగిరిపోవాలంటే… మనోభావాలకు, వాటి వేగానికి బంధాలు ఉండకూడదు. జాతీయ, అంతర్జాతీయ భాషలలోకి, సమాజాలలోకి ఒదిగిపోగలగాలి.

మిగిలిన సబ్జెక్టులను మాతృభాషలో చెప్పే ఏర్పాట్లు చేయకుండా కేవలం మాతృభాష (తెలుగు)ను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా(పాఠ్యాంశంగా)పెడితే జరిగేదేమిటి ? భాషాపాండిత్యం అబ్బవచ్చు. జీవితంలో స్వశక్తితో ఎదగాలంటే.. తన నైపుణ్యాలకు. తన అభీష్టాలకు అనుగుణమైన వృత్తులను, పనులను ఎంచుకుని వాటిలోని మౌలిక సూత్రాలను ఒంటబట్టించుకోవాలి కదా ! మాతృభాషలో ఆయా సబ్జెక్టులు పరిచయమయినప్పుడే అది సాధ్యమవుతుంది.

కాబట్టి….విద్యాబోధనలో మాతృభాష తప్పనిసరే కానీ ఒక దశవరకే దానిని పరిమితం చేయాలి. అదికూడా పాఠ్యాంశంగా కాదు, బోధనామాధ్యమంగానే. ఇక్కడ ఒక విషయం గమనించాలి. పొరుగు రాష్ట్రాల్లో, ప్రపంచదేశాల్లో మాతృభాషకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వడాన్ని గమనిస్తూనే ఉన్నాం. ప్రపంచంలోని అగ్ర దేశాలతో పోటీపడి ముందుకు దూసుకువెడుతున్న ఎన్ని దేశాల్లో ఉన్నతవిద్యలో మాతృభాషలో మాత్రమే విద్యాబోధన జరుగుతున్నది ? అన్న ప్రస్తావన వచ్చినప్పుడు రష్యా, చైనావంటి దేశాలను ప్రస్తావిస్తుంటారు. అవి అంతగా ఎదగడానికి మాతృభాష ఒక్కటే కారణమా ?అసలు వారి అభివృద్ధికి కారణాల్లో మాతృభాష స్థానంఎంత ? అనికూడా చూడాలికదా ? మరి హయ్యర్‌ స్టడీస్‌లో మాతృభాషలో విద్యాబోధన జరగని కొన్ని వర్ధమాన దేశాలు అభివృద్ధిచెందిన దేశాలతో ఎలా పోటీపడగలుగుతున్నాయి. రష్యా, చైనాలను కూడా తోసిరాజని ముందుకెలా దూసుకెళ్ళగలుగుతున్నాయి. తల్లిపాలు తల్లిఒడిని వీడనంతవరకే. ఆ తర్వాత ప్రకృతి సహజంగా, ప్రపంచపోటీకి దీటుగా ఎదిగే అవకాశం కల్పించాలి.

స్థానిక భాషలో పాలన :
తెలంగాణలో తెలుగును పాలనాభాషగా చేయాలన్న డిమాండ్‌ వినడానికి బాగానే ఉంటుంది. కానీ ఈ ప్రాంతాన్ని భిన్న మతస్థులు, భిన్న వంశీకులయిన రాజులు వందల సంవత్సరాలు పాలించడం, ఆదీగాక భౌగోళికంగా ఉత్తర, దక్షిణ భారత్‌ల సంగమస్థలంగా ఉండ డంవల్ల, గతంలో అఫ్ఘానిస్థాన్‌, ఇరాన్‌ దేశాలనుంచి కూడా వలసల కారణంగా వీటి ప్రభావం మొత్తం దక్కను పీఠభూమిఅంతటా వ్యాపించి ఇక్కడి సంస్కృతి దక్కనీ తెహజీబ్‌గా ప్రసిద్ధిచెందింది. ఇది తెలుగు, కన్నడ, మరాఠీ, ఉర్దూ, హిందీ, అరబిక్‌, పార్శీ, ఇంగ్లీష్‌ వంటి పలుభాషలు, స్థానికతలతో కలగాపులగంగా మారినా, దక్కనీ పేరిట ప్రత్యేకత చాటుకుంటూ తెలంగాణ ప్రజల వేషభాషల్లో, ఆచారవ్యవహారాల్లో బాగా ప్రస్ఫుటంగా కనబడుతుంటుంది. హైదరాబాద్‌ సంస్థానంలోని విద్యాలయాల్లో చాలాకాలం ఉర్దూ, దాని సంబంధ భాషలయిన అరబీ, పారసీలు రాజ్యమేలాయి. అందువల్ల ఇటువంటి ప్రాంతంలో తెలుగువారు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ తెలంగాణలో తెలుగులో పాలన సాగించినా, ఇతర భాషలవారికి (ముఖ్యంగా ఉర్దూ మాట్లాడేవారికి) ఇబ్బంది లేనివిధంగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఆ రోజుల్లోనే నిజాం – ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలల పాఠ్యపుస్తకాలన్నింటినీ ఉర్దూభాషలోకి అనువదింపచేసి అమలు చేశాడు. మరి 60ఏళ్ళు దాటినా మనం ప్రొఫెషనల్‌ కోర్సుల్లో సబ్జెక్టులను స్థానికభాషలో తెలుగులో ప్రవేశపెట్టలేకపోయాం. భారతదేశాన్ని ఆంగ్లేయులు వదిలిపోయినా వారిభాషనే పట్టుకుని వేలాడడం తప్ప ప్రత్యామ్నాయాలు అభివృద్ధి చేసుకోలేకపోయాం.

”కేవలం 500 సంవత్సరాల చరిత్ర ఉన్న అమెరికాలో – ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇప్పటికీ లాటిన్‌నే అధికారికంగా ఉపయోగిస్తున్నారట. అమెరికాకు, రోమ్‌కు మతం తప్ప మరో సంబంధం ఏమీ లేదు. వారి మత గ్రంథాలు లాటిన్‌లో ఉండడం ఒక్కటే సంబంధం. కానీ సంస్కృతం అలా కాదు. సంస్కృతం అంటే హిందూమతం కాదు. ఇంగ్లీష్‌అంటే క్రైస్తవ మతం ఎలా కాదో అలాగే సంస్కృతం అంటే హిందూమతం అని అర్థం కాదు. వేదాల్నీ, దేవుడినీ అంగీకరించని బౌద్ధులు, జైనులు, అలాగే పూర్తిగా నాస్తికులైన చార్వాకులు మొదలైన వాళ్ళందరూ సంస్క ృతంలోనే రచనలు చేశారు. మొదట్లో బౌద్ధులు పాళీభాషలో పుస్తకాలు రాశారు. అయితే అవి ఒక చిన్న ప్రాంతానికే పరిమితమయ్యాయి. ఈనాడు ఇంగ్లీషులో రాయటం వల్ల ప్రపంచమంతా ఎలా చదవగలరో అలాగే ఆనాడు వారందరూ పాళీభాష వదిలి సంస్కృతంలోరాయటం మొదలుపెట్టారు.లాజిక్‌, తత్త్వశాస్త్రం, గణితం, ఖగోళశాస్త్రం, రసాయనశాస్త్రం, దండనీతి శాస్త్రం, ధర్మశాస్త్రాలు, ఆయుర్వేదంవంటి విషయాలపై రచనలన్నీ సంస్కృతంలోనే ఉన్నాయి. ఒక వర్గంవారే దీన్ని నేర్చుకున్నారనడం కూడా బొత్తిగా అవగాహనలేని వాదన. ప్రపంచంలోని మొట్టమొదటి నిఘంటువును శ్లోకాలరూపంలో రాసిన అమరసింహుడు జైనుడు. పాణిని వ్యాకరణానికి వ్యాఖ్యలు రాసినవారు బౌద్ధులు, జైనులు. అనేకమంది రాజులు కావ్యాలు, నాటకాలు రాశారు. క్రమక్రమంగా సంస్కృతం భరతఖండం మొత్తానికి కూడా కొనసాగింది….సంస్కృతం మనజాతి మొత్తానికి చెందిన భాష. కేరళనుండి గాంధారదేశం (అఫ్ఘానిస్థాన్‌) వరకూ వ్యాపించిన భాష. స్వతంత్రం వచ్చిన సమయంలో జాతీయభాష ఏది

ఉండాలి అనే ప్రశ్నపై పార్లమెంటులో అంబేద్కర్‌కూడా సంస్కృతాన్ని సమర్ధించడం మనం గమనించాలి.” -అని భారతీయ సంస్కృతిని లోతుగా అధ్యయనం చేసిన మాజీ డిజిపి అరవిందరావు ఒక వ్యాసంలో వ్యాఖ్యానించారు.

చాలా భారతీయ భాషలకు మాతృక అయిన సంస్కృతం నిజంగా ఆ రోజున పార్లమెంటులో ఆమోదం పొంది జాతీయభాష అయిఉంటే పరిస్థితి ఇప్పటికి ఎలా ఉండేదో ! ! ! అది వేరుగా విపులంగా జరగాల్సిన చర్చ. కానీ ఆ రోజున అది ఆమోదం పొందలేదు. కానీ భాషాప్రయుక్త రాష్ట్రాలుగా ఏర్పడినప్పుడు-ఎక్కడికక్కడ ఒక నిర్దిష్ట భాష మాట్లేడేవారు అత్యధిక సంఖ్యాకులున్నచోట వారి భాష ప్రాతిపదికగా ఒక రాష్ట్రాన్నే ఏర్పరచగలిగినప్పుడు అక్కడి భాషను పాలనా భాషగా ఎందుకు అభివృద్ధిచే యలేదు ? (కొన్ని రాష్ట్రాలను మినహాయిస్తే). అంటే ఒక్కొక్క ప్రధాన భాషకు ప్రత్యేకంగా ఒక రాష్ట్రమే
ఉన్నా అక్కడ ఆయా భాషలను ఇకనయినా స్థానికంగా అభివృద్ధిపరచడం తక్షణ కర్తవ్యం.

నిజానికి సాంకేతికత ఈ వేళ ఎంత వేగంగా అభివృద్ధిచెందుతున్న దంటే.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ‘భాషల’వంటి అడ్డంకులనుకూడా సాంకేతికత పటాపంచలు చేస్తున్నది. డిజిటలైజేషన్‌ పుణ్యమా అని-ఐటి వేదికగా, ఇంటర్‌నెట్‌, మొబైల్‌వంటి అస్త్ర,శస్త్రాలతో -వీలయినన్ని ప్రపంచ భాషల్లోకి వరదలా ప్రవహించి సస్యశ్యామలం చేస్తున్నది.

మరి అత్యాధునిక టెక్నాలజీని అన్ని ప్రభుత్వ విభాగాల్లో, న్యాయస్థానాల్లో, వీలయినంత వేగంగా అమలు పరచగల్గుతున్నప్పుడు.. ఎక్కువ శ్రమపడకుండానే ఇతరత్రా ప్రభుత్వ పాలనలో, న్యాయస్థానాల్లో మన స్థానిక భాషలయిన తెలుగును, ఉర్దూను అమలుచేయడానికి ఉన్న అభ్యంతరాలేమిటో అర్థంకాదు. కాబట్టి – తెలంగాణ ప్రభుత్వంలో… గ్రామ పంచాయతీలనుండి మొదలుపెట్టి, న్యాయస్థానాల్లో ముఖ్యంగా దిగువ న్యాయస్థానాల్లో (లోయర్‌ కోర్టులలో)కూడా తెలుగును అధికారికంగా వినియోగించాలంటే… జరగాల్సింది ఏమిటి ?

అది చాలా సింపుల్‌..
ఆలోచించడానికి కూడా సాహసంచేయలేని కొన్ని నిర్ణయాలను అవలీలగా ప్రజల ముందుంచి అభినందనలు అందుకుంటున్న వర్తమాన తెలుగు వల్లభుడు సంకల్పిస్తే చాలు…. తెలుగులోపాలన, తెలుగుమాధ్య మంలో బోధన రెండూ సుసాధ్యమవుతాయి. శ్రీకృష్ణదేవరాయల వారి లాగా చరిత్రలో చిరంజీవిగా మిగిలిపోతారు.

Other Updates