– టి. ఉషాదేవి
శ్రీకృష్ణదేవరాయ తెలుగు భాషా నిలయం తరతరాల తెలుగు జాతి వైభవానికి మచ్చుతునక, ఈ నాటికీ మిగిలిన ఆనవాలు. నిజాం రాష్ట్రంలోని మొట్టమొదటి తెలుగు గ్రంథాలయమిది. పేరుకు గ్రంథాలయం కాని తెలుగువారికి ఒక కూడలి స్థానంగా అవతరించిన ఒక అపూర్వ ఆధునిక దేవాలయం, ఒక సార్వత్రిక విశ్వవిద్యాలయం ఇది.
ఇప్పటికి 118 సంవత్సరాల క్రితం తెలుగు మాట్లాడడమే నేరంగా పరిగణించే గడ్డుకాలంలో తెలుగు భాషాభివృద్ధికి, సంస్కృతీ వికాసానికి పట్టుకొమ్మగా ఈ సంస్థ వెలిసింది. ఆలనాపాలనా లేని తెలుగువారి కాళ్ళకు పారాణి అద్దింది ఇక్కడే. ఎందరో తెలుగు బిడ్డలు సుప్రసిద్ధ మేధావులుగా, కవి పండితులుగా రూపుదిద్దుకున్నది ఇక్కడే.
తొలుదొలుత హైదరాబాద్ నగరంలోని రాంకోటి వీధిలోని రావిచెట్టు రంగారెడ్డి జాగీర్దార్ బంగళాలలో ఆవిర్భవించిన ఈ అపురూప సంస్థ వ్యవస్థాపకుల ఆశయాలకు అనుగుణంగా తెలుగు ఉద్యమానికి జయపతాకగా ఎదిగి, ఈనాటికీ శిఖర ప్రతిష్టగా నిలిచి ఉన్నది. తెలుగువారిలో నూతన చైతన్యాన్ని కలిగిస్తూ ఒక వంక జాతీయోద్యమానికి, మరోవంక గ్రంథాలయోద్యమానికి నిలయంగా విశాల దృక్పథంలో ఒక నమూనాగా దీన్ని ఆనాటి పెద్దలు తీర్చిదిద్దారు. ఈ సంస్థను ఒక గ్రంథాలయంగా నడుపుతూ తెలుగు పుస్తకాలను చదివే అవాటును వృద్ధి చేశారు. కొందరికి వ్యసనం చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ఈ నిలయాన్ని చిరునామా చేశారు.
ఉత్తేజితులైన తెలుగువారు ఇక్కడే ప్రథమ నిజాం ఆంధ్రోద్యమానికి శ్రీకారం చుట్టారు. ఈ భాషా నిలయాన్ని కేంద్ర స్థానంగా చేసుకుని ఆనాటి యువకులు ఇక్కడ ఎన్నో సంస్థలను నెలకొల్పారు. ఎన్నో ఉద్యమాలు నడిపారు.
భాషా నిలయానికి అనుబంధంగా ఒక తెలుగు పాఠశాల కూడా నెలకొల్పి కొన్నాళ్ళు జయప్రదంగా నడిపారు. తాను స్వయంగా సంస్కృతాంధ్ర భాషల్లో పాండిత్యం కలిగి ఉండడమే కాకుండా తరతరాలకు కరదీపికలైన మహాకావ్యాలకు శ్రీకారం చుట్టిన అష్టదిగ్గజాలైన మహాకవులకు నెలవైన శ్రీకృష్ణ దేవరాయల స్వర్ణయుగాన్ని ముందు తరాలకు మరుపురాకుండా చేయాలనే తలంపుతో శ్రీకృష్ణ దేవరాయల పేరున ఈ భాషా నిలయం స్థాపించినట్టు స్థాపకులలో ప్రముఖులు తొలి నలభై సంవత్సరాలు భాషానిలయం అధ్యక్షులుగా సేవలందించిన పోషకులు రాజా నాయని వెంకటరంగారావు 1952లో భాషా నిలయం స్వర్ణోత్సవాల సందర్భంగా తెలిపారు. స్వర్ణోత్సవ స్వాగత సమితి అధ్యక్షులుగా వారు చేసిన ప్రసంగంలో అప్పుడే మార్కెట్ లోకి తాజాగా వచ్చిన రాబర్ట్ సీవెల్ వ్రాసిన ”ఫర్‌గాటెన్ ఎంపైర్” గ్రంథంలో శ్రీకృష్ణ దేవరాయల శౌర్య ప్రతాపాలు, రాజనీతి దురంధరత్వం తనను, తన మిత్రులు – కొమర్రాజు వెంకట లక్ష్మణరావు, రావిచెట్టు రంగారావులను ఎంతగానో ఆకర్షించిందనీ, సంస్కృతాంధ్ర భాషల వికాసానికి రాయల వారు చేసిన సేవలు తమను తన్మయులను చేసిన ఫలితంగా ఆ ఆంధ్రభోజుని అజరామరుణ్ణి చేయడానికి, ఆంధ్రభాషకు తొంటి వికాసము సాధించడానికి ”శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం” స్థాపించినట్టు వారు వివరించారు.
ఆ తర్వాత తెలుగువారి పురోగమనాన్ని కాంక్షిస్తూ హనుమకొండలో రాజరాజనరేంద్ర భాషా నిలయం, నాంపల్లిలో వేమనాంధ్ర భాషా నిలయం, గౌలిగూడలో బాల సరస్వతీ గ్రంథాలయం, వరంగల్‌లో మరో భాషానిలయం ఏర్పాటుకు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం దోహదం చేసింది. తెలుగు భాషామతల్లిని సుసంపన్నం చేసింది. అనంతర కాలంలో ఆంధ్ర భాషా నిలయం రజతోత్సవాలు చేసుకున్న నాటికి తెలుగు ఉద్యమం తెలంగాణ అంతటా వ్యాపించింది. అప్పటికి హైదరాబాద్‌లో ఏడు గ్రంథాలయాలు, సికిందరాబాద్‌లో నాలుగు గ్రంథాలయాలు నెలకొల్పడం జరిగింది.
అంతటితో ఆగకుండా వరంగల్ జిల్లాలో పదిహేను గ్రంథాలయాలు, కరీంనగర్ జిల్లాలో తొమ్మిది గ్రంథాలయాలు, నల్గొండ జిల్లాలో పదమూడు గ్రంథాలయాలు, మహబూబ్‌నగర్ జిల్లాలో అయిదు గ్రంథాలయాలు, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఒక్కో గ్రంథాలయం చొప్పున శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషా నిలయం ఊపుతో రూపు సంతరించుకున్నాయి. ఈ భాషా నిలయం ప్రభావం వల్లనే ఇలా తెలంగాణలో అల్లుకుపోయిన లతలు దినదిన ప్రవర్ధమానమై, పుష్పించి ఫలించాయి. అంతేకాదు ఆనాడు జాతీయోద్యమానికి ఈ గ్రంథాలయాలే కేంద్రాలయ్యాయి.
ఇంతటి వైశిష్ట్యాన్ని పుణికి పుచ్చుకున్న ఈ భాషా నిలయం స్థాపించిన రాజానాయని వెంకటరంగారావు, కొమర్రాజు వెంకట లక్ష్మణ రావు, రావిచెట్టు రంగారావులకు తోడుగా అదిపూడి సొమనాథారావు, మైలవరపు నరసింహ శాస్త్రి నిలిచారు. ఆ తర్వాత కాలంలో హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన సాహిత్యవేత్త బూర్గుల రామకృష్ణా రావు చేయూత కూడా ఈ భాషా నిలయానికి లభించింది. వీరు భాషా నిలయానికి అధ్యక్షులుగా మూడు సార్లు, కార్యదర్శిగా ఒక సారి సేవలందించారు.
పోలీసు ఆక్షన్‌కు ముందు 1940 నుంచి కీలక సమయంలో హైదరాబాద్ నగర కోత్వాల్‌గా పనిచేసిన రాజబహద్దూర్ వెంకట్రామారెడ్డి ఈ భాషా నిలయానికి పదేండ్ల పాటు అధ్యక్షులుగా ఉన్నారు. ఆంధ్రపితామహ మాడపాటి హనుమంతరావు, ఆదిరాజు వీరభద్ర రావు మొదలగువారు కార్యదర్శులుగా ఈ సంస్థ ప్రగతికి ఎంతగానో పాటుపడ్డారు.
1911లో రావిచెట్టు రంగారావు ధర్మపత్ని శ్రీమతి లక్ష్మీ నర్సమ్మ భాషానిలయం కోసం స్వంత గృహం అవసరమని భావించి భూమి కొనుగోలు నిమిత్తం మూడువేల రూపాయల విరాళం ఇచ్చారు. ఆ సొమ్ముతోనే ఇప్పుడు భాషా నిలయం ఉన్న చోట పెంకుటిల్లుకొని, కొన్ని మార్పులు చేసి గ్రంథాలయాన్ని నెలకొల్పారు.
1915లో మాడపాటి హనుమంతరావు భాషా నిలయం కార్యదర్శిగా వున్నతరుణంలో ఇంతకు ముందుగల భవనం తొలిదశ నిర్మాణం ప్రారంభమైంది. 1921 సెప్టెంబర్ 30వ తేదీన విఖ్యాత ఆంధ్ర ప్రముఖుడు, విద్యావేత్త, కట్టమంచి రామలింగారెడ్డి భవనానికి ప్రారంభోత్సవం చేశారు. ఆనాటి నుంచి దినదిన ప్రవర్ధమానమై నగరం నడిబొడ్డున ఉన్న ఈ భాషా నిలయం అనేక మంది సాహితీ ప్రియులను ఆకర్షిస్తూ తెలుగువారి సమగ్రతను కాపాడుతూ ఎంతో వైవిధ్యమైన పురోగమన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అందుకే ఈ సంస్థను దర్శించని ఆంధ్ర ప్రముఖులు లేరనవచ్చును. అంధ్ర దేశంలోని నలుమూలలకు చెందిన వివిధ రంగాలలోని నిష్ణాతులలో కాశీనాథుని నాగేశ్వర రావు పంతులు, చిలకమర్తి లక్ష్మీనరసింహం, దువ్వూరి రామిరెడ్డి, చెళ్ళపిళ్ళ వెంకటశాస్త్రి, జాషువా, అక్కినేని, కాంతారావు, కావ్యకంఠ గణపతిముని, టంగుటూరి ప్రకాశం, బులుసు సాంబమూర్తి, సర్వేపల్లి రాధాకృష్ణన్, అనంతశయనం అయ్యంగార్, పి.వి. నరసింహరావు, జగదేకవీర కోడి రామమూర్తి, షబ్నవీస్ రామనరసింహరావు, సురవరం ప్రతాపరెడ్డి, విశ్వనాథ సత్యనారాయణ, శ్రీశ్రీ, దాశరథి, సినారే, ఆరుద్ర, వానమామలై వరదాచార్యులు, కాళోజీ సోదరులు, కుందుర్తి, ఆచార్య రంగా, బెజవాడ గోపాల రెడ్డి, దామోదరం సంజీవయ్యలాంటి ఎందరో మహానుభావులు ఈ సంస్థను సందర్శించి, ఇక్కడ సత్కారాలు పొందారు.
ఈ గ్రంథాలయంలో ప్రస్తుతం సుమారు ఏభైవేల గ్రంథాలు వున్నప్పటికీ ఒక స్పష్టమైన ఆలోచనా వికాసానికి, కార్యాచరణకు కట్టుబడి ఈ గ్రంథాలయం కృషి చేస్తున్నది. తెలుగు, సంస్కృత భాషల్లోని పురాణ, వేదాంత, అలంకార, తత్వశాస్త్రాలతో పాటుగా ఆధునిక కావ్యాలు, నాటకాలు, కథలు నవలలు, సాహిత్య విమర్శ, విజ్ఞాన శాస్త్ర గ్రంథాలున్నాయి. రెఫరెన్స్ (పరామర్శ) విభాగం పరిశోధకుల పాలిట తంగెటు జున్ను. బంకుపల్లి మల్లయ్య శాస్త్రి తెనిగించిన మూడు వేదాలు – సామవేదం, కృష్ణ యజుర్వేదం, ఋగ్వేదం కేవలం ఈ గ్రంథాలయంలోనే
ఉన్నాయి. అనేక పురాణాలు, పలువురు కవులు వ్రాసిన రామాయణ గ్రంథాలు, అపురూప ప్రబంధాలు, అపురూప కావ్యాలను ఈ భాషా నిలయంలో భద్రపరచడం జరిగింది. అంధ్ర పత్రిక ఉగాది సంచికలు 1910 నుంచి, భారతి 1933 నుంచి ఉన్నాయి. కృష్ణా పత్రిక, సమదర్శిని, సుజాత, ప్రతిభ, తెలుగు స్వతంత్ర, జయంతి, శారద, ఆంధ్ర పత్రిక, ఆంధ్ర ప్రభ, ఆంధ్రజ్యోతి, వారపత్రికల సంపుటాలు, ఇంకా ఎన్నో పురాతన పత్రికలు, గ్రంథాలు ఇక్కడ ఉన్నాయి.
తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి అహరహం అంకితమైన ఈ సరస్వతీ నిలయం రజతోత్సవాలు 1927 ఫిబ్రవరి 16,17,18 తేదీలలో ప్రేరణాత్మకంగా జరిగాయి. మహాముని కావ్యకంఠ గణపతిముని ఈ ఉత్సవాలకు అధ్యక్షత వహించారు. ఆ తర్వాత ఈ సంస్థ స్వర్ణోత్సవాలు 1952 సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి మూడు రోజులపాటు వైభవంగా జరిపారు. అప్పుడు హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న బూర్గుల రామకృష్ణరావు ఈ ఉత్సవాలకు అధ్యక్షత వహించారు. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వ ఆస్థాన కవిగా ఉన్న శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆనాటి తెలంగాణలోని 114 గ్రంథాలయాల ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
భాషా నిలయం వజ్రోత్సవాలు 1962లో అప్పటి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య అధ్యక్షతన వేడుకగా మూడు రోజులపాటు జరిగాయి.
1976లో భాషా నిలయం అమృతోత్సవాలను అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ప్రారంభించారు. ఇకపోతే ఈ భాషా నిలయం శతాబ్ది
ఉత్సవాలను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు 2002లో ప్రారంభించారు. సెప్టెంబర్16వ తేదీనుంచి నాలుగు రోజుల పాటు తెలుగు భాషా, చరిత్ర సంస్కృతికి సంబంధించిన వివిధ అంశాలపై ఆసక్తిదాయకమైన చర్చాగోష్ఠులు, సదస్సులు నిర్వహించారు. అప్పటి హోం, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి టి. దేవేందర్‌గౌడ్ అధ్యక్షతన ఏర్పాటైన శతాబ్ది
ఉత్సవ కమిటీ నిర్విరామంగా కృషి చేయగా ఉత్సవాలు విజయవంతమయ్యాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఈ సంస్థ అభివృద్ధికి 30 లక్షల రూపాయల గ్రాంటు ప్రకటించారు.
దానితో భాషా సాహిత్య అభిమాని, అప్పుడు ఉన్నతపదవిలో ఉన్న ఐఏఎస్ అధికారి కె.వి. రమణాచారి నేతృత్వంలో ప్రస్తుతం గల నాలుగంతస్తుల భవనం నిర్మాణం 2007 మార్చి 31న చేపట్టాము. దీని నిర్మాణానికి రాజా రామమోహన రాయ్ ఫౌండేషన్ (కలకత్తా) పెద్ద మొత్తంలో ఆర్థిక సహాయం చేసింది. అప్పుడు రాజ్యసభ సభ్యుడుగా ఉన్న జి. సంజీవరెడ్డి తమ ఎంపి నిధుల నుంచి సహాయం అందించారు. అట్లాగే అప్పుడు తెలంగాణ ప్రాంతీయ సంఘం అధ్యక్షుడుగా ఉన్న ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కూడా కొరత ఆర్థిక సహాయం చేశారు. ఇక కొత్తగా వెలసిన ఈ నాటి నాలుగంతస్థుల నూతన భవనంలో శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేక పంచ శతాబ్ది ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వానికి ఆ ఆలోచన రాకముందే 2009 సెప్టెంబర్ మాసంలో ఘనంగా నిర్వహించారు.
ఇదిలా ఉండగా, ఇప్పటికీ తెలుగు కవి పండితులు, సంగీత నాటక కళాకారుల ప్రసంగాలు, గోష్ఠి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా తెలుగువారిని భాషా నిలయం ఎంతగానో ప్రభావితం చేస్తున్నది.మారుతున్న కాలానికి అనుగుణంగా యువతీ యువకులను ప్రేరేపితం చేయడానికి వీలుగా పలువురు తెలుగు ప్రముఖుల జయంతులను భాషానిలయం స్ఫూర్తిదాయకంగా యేటేటా నిర్వహిస్తున్నది. వీటిలో ప్రధానంగా హైదరాబాద్ రాష్ట్ర ప్రథమ ప్రజా ముఖ్యమంత్రి, దేశ మొత్తం మీద భూ సంస్కరణలు ప్రప్రథమంగా ప్రవేశ పెట్టిన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు జయంతిని 1988 మార్చి 13 నుంచి ప్రతియేటా నిర్వహిస్తూ ఒక ప్రముఖుడికి ”బూర్గుల రామకృష్ణారావు ప్రతిభా పురస్కారం” ప్రదానం చేస్తున్నాము.
అట్లాగే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ప్రబోధాత్మకంగా, ప్రజారంకంగా కవిత్వం చెప్పిన మహాకవి దాశరథి జయంత్యుత్సవం జరుపుతూ యేటా జూలై 22న దాశరథి కృష్ణమాచార్య సాహితీ పురస్కారం” రెండున్నర దశాబ్దాలుగా బహూకరిస్తున్నాము. భాషా నిలయం స్థాపనకు వెన్నముకగా నిలిచిన భాషానిలయం మొట్టమొదటి కార్యదర్శి – రావిచెట్టు రంగారావు జయంతిని 2016, డిసెంబర్ 10వ తేదీ నుంచి నిర్వహిస్తూ ‘రావిచెట్టు రంగారావు తెలుగు భాషా వికాస పురస్కారం యేటా ఒక తెలుగు ప్రముఖుడికి అందచేస్తున్నాము.స్థితప్రజ్ఞుడు, భారత పూర్వ ప్రధాని పి.వి. నరసింహరావు జయంతి సందర్భంగా పి.వి. నరసింహారావు స్మారక పురస్కారం 2017 జూన్ 26 నుంచి ఒక ప్రముఖుడికి ప్రదానం చేస్తున్నాము. కీలక దశలో భాషా నిలయానికి దశాబ్ద కాలం అధ్యక్షులుగా ఉన్న హైదరాబాద్ నగర తొలి కొత్వాల్, రాజా బహద్దూర్ వెంకట్రాంరెడ్డి జయంతిని సైతం 2016 ఆగస్టు 22 నుంచి నిర్వహిస్తున్నాము.
భాషా నియం అభివృద్ధికి ఎంతగానో దోహదం చేసిన దేశికుడు, ఆంధ్ర పితామహ మాడపాటి హనుమంతరావు జయంతి సందర్భంగా 2017 జనవరి 22 నుంచి వారి స్మారక ప్రసంగాన్ని ఏర్పాటు చేస్తున్నాము. భాషా నిలయానికి అర్ధ శతాబ్దం పాటు కార్యదర్శిగా సేవలు అందించిన యం.ఎల్. నరసింహరావు జయంతి సందర్భంగా యం.ఎల్. నరసింహరావు సాహితీ సేవా పురస్కారం” 2016 నవంబర్ 7 నుంచి ఒక సాహితీ వేత్తకు యేటేటా జహూకరిస్తున్నాము.
ఇవే కాకుండా ప్రతియేటా సెప్టెంబర్ ఒకటోతేదీన శ్రీకృష్ణ దేవరాయ తెలుగు భాషా నిలయం స్థాపన దినోత్సవం నిర్వహిస్తూ కొందరు ప్రముఖులను సత్కరిస్తున్నాము. అయితే ఈ యేడాది 2018 నుంచి భాషా నిలయానికి స్థలం కొనుగోలు చేయడానికి చేయూత ఇవ్వడంతో పాటుగా భాషా నిలయ స్థాపక కార్మదర్శి, ఆమె భర్త రావిచెట్టు రంగారావు కన్నకలలు నిజం చేయడానికి నిరంతరం శ్రమించిన కీర్తిశేషులు రావిచెట్టు లక్ష్మీనర్సమ్మ స్మారకార్థం 2018 సెప్టెంబర్ 1 నుంచి ఒక ప్రముఖ మహిళకు పురస్కారం అందిస్తున్నాము.
ఈ జయంతి ఉత్సవాలు ఆయా ప్రముఖుల పేరున ప్రదానం చేస్తున్న పురస్కారాలకు గాను వారి అభిమానులు, బంధువులు, కుటుంబ సభ్యులు అందజేసిన విరాళాలను ‘ఫిక్స్‌డిపాజిట్” చేసి ఆ మొత్తం పై వచ్చే వడ్డీ సొమ్ము తో సభలు నిర్వహిస్తూ, పురస్కారాలు ప్రదానం చేస్తున్నాము. ఇవి కాకుండా మరో ఒకటి, రెండు పురస్కారాలు ఏర్పాటు చేసే ఆలోచన కూడా ఉంది.
ఇలాంటి భాషా సాహిత్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న సందర్భాలను కేవలం పెద్దలకు, కవులు, పండితులకే పరిమితం కాకుండా యువకులను, విద్యార్థులను కూడా భాగస్వాములను చేస్తూ వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి, విజేతలకు ఆకర్షణీయమైన బహుమతులు ఇస్తున్నాము. అంతే కాకుండా రేపటి పౌరులైన యువకులు, విద్యార్థులకు, తెలుగువారికి గర్వకారణమైన ఈ గ్రంథాలయం ఉపకరించడానికి వీలుగా, గ్రంథాలను ఆధునిక పద్ధతిలో క్యాటలాగింగ్ చేస్తున్నాము. మారుతున్న అవసరాలను దూరభారాన్ని దృష్టిలో ఉంచుకుని భాషా నిలయంలోని అపురూప గ్రంధాలను డిజిటలైజ్ చేసి, భాషాభిమానులు, సాహిత్యాభిమానులు, అందరికీ అందుబాటులో ఉంచడానికి ప్రణాళికలు సిద్ధం చేశాము. నిధుల నిమిత్తమై ప్రయత్నం చేస్తున్నాము. ఏమైనా నూటా పద్దెనిమిదేండ్ల ఈ భాషా నిలయాన్ని ఆధునిక సౌకర్యాలతో కూడిన ఒక బహుళార్థక, బహుళ ప్రయోజన కళా నిలయంగా తీర్చి దిద్దాలని సంకల్పించాము. ఇది కార్యరూపం దాల్చడానికి ప్రభుత్వం చేయూతనిస్తే తెలుగు భాష, సాహిత్యం, చరిత్ర, లలితకళల వికాసానికి ఎంతగానో దోహదం జరుగుతుంది.