పక్షులు
ఎగురడానికి రెక్కలెట్లనో
నడవడానికి కాళ్ళెట్లనో
తెలుగు భాషట్ల
తెలుగు తియ్యదనమట్ల!
పంచభూతాలకు మూలం భూమే
పుట్టుకకు మూలం తల్లే
భాషకు మూలం మాతృభాషే
ఆకాశం ఆంగ్లమైతే
తెలుగే భూమి భాష!
గాలి మోటారు ఎంతెత్తుకెగిరినా
చూపు భూమి మీదనే
ఎన్ని దేశాలు మనల్ని సన్మానించినా
తల్లి కొంగు పరిమళం కిందనే
మన బాట మాతృపాట
మన యాస తల్లి బాస!
ఎన్ని కిలోలు
బూస్ట్ హార్లిక్స్ తాగితేం
ఓ బుక్క అమ్మపాలు తాగిచూడు
తియ్యదనం బోధపడుతది
తెలుగులో మాట్లాడిచూడు
అమ్మతనం అల్లుకుంటది
నుడికారాలే గుడులు గోపురాలు
పలుకుబడులే బతుకు క్షేత్రాలు
మాండలికాలే మన వొడ్డాణాలు
జాతీయాలే దండె కడియాలు
అలంకారాలే నిర్మాణానికి పునాదులు
పాల బుగ్గల పాట తల్లి
వొడిలో జోల పాట!
ఎన్ని దేశాలు బొట్టు పెట్టినా
అమ్మబొట్టే సాదు బొట్టు
ఎన్ని చెలిమల నీళ్లు తాగినా
జాన మాటలే పెరుగు మూటలు
అమ్మ భాషే జీవ భాష!
ఎంతటి మహావృక్షమైనా
వేర్లు భూమిలోననే
హిమాలయ పర్వతమైనా
కుదుర్లు భూమిలోననే
ఎన్ని అంతస్థులు పొదిగినా
మన ల్యాండ్‌మార్క్ మదర్ టంగే
మహా సభలప్పుడో
భాషా దినోత్సవమప్పుడో
ఉగాది కవి సమ్మేళనాలప్పుడో
తెలుగుకు అభిషేకం చేస్తే
భాష బోనమెత్తుతదా!
మన మట్టి తోరణాలై
మన భాష ఇంద్రధనుస్సు కావాలంటే
మనది మనం నిలబెట్టుకొని
మనది మనం పోషించుకోవాలి
అడుగడుగున ఆదరించి
మన భాషను గౌరవించాలి
జానపదమే జన స్వరమై
కదలాలి తెలుగు నేల
జయహో ప్రపంచ తెలుగు మహాసభలు
వనపట్ల సుబ్బయ్య