ఇక్షు రసంబోలె ఇంపైన భావాలు
మదిలోని రాగాల మాయ తెలుగు
మందార మకరంద మాధుర్యమున దేలి
పోతన్న భక్తిలో పొంగిపొరలిన తెలుగు
దేశ భాషలందు తెలుగు లెస్స యన్న
కృష్ణ రాయలతోటి కీర్తికెక్కిన తెలుగు
కోటి కాంతుల తెలంగాణ కోటలోన
కాకతీయులు నాటె రాజభాషగ తెలుగు
పాశ్చాత్యులను గూడ పరవశింప చేసె
పరువాలు విరబూయు పాన్పు తెలుగు
ఖండాంతరాలకు ఖ్యాతి పారించె
కమనీయ కావ్యాల సుమగుచ్ఛము తెలుగు
లోకాన సంస్కృతికి పట్టంబు గట్టిన
అమ్మ పాలకు సరియైన కమ్మనైనది తెలుగు
గోదావరి కృష్ణ మంజీర నాదాలు
పారేటి సెలయేర్ల పరుగు తెలుగు
చందమామను అందరింటిమామను చేయు
పాపాయి నగవుల పాల వెలుగు తెలుగు
స్మృతిలోను, గతిలోను దీపాల వరుసల
మదిలోని భావాల పెన్నిధీ మన తెలుగు
తీయ తేనియ తెలుగు తీపైన కళ వెలుగు
తెలుగు వెలుగుల పూదోట తెలుగు
కనుమరుగు కాకుండ కాపాడు కొనుటకు
ప్రపంచ తెలుగు మహాసభలలో వెలుగాలి మన తెలుగు
ఎం. రవికుమార్