తెలుగు వెలుగు విరబూసిన తెలంగాణమూ
సకల కళలు శోభిల్లే స్వర్ణధామము
సమత మమత విలసిల్లే నందనవనమూ

అనురాగం ఆదరణలకాలవాలమూ
తెలుగు వెలుగు విరబూసిన తెలంగాణమూ
సకల కళలు శోభిల్లే స్వర్ణధామము తెలంగాణమూ

 

శాతవాహనులు, విష్ణుకుండినులు రాష్ట్రకూటుల శౌర్యప్రతాపం
కాకతీయులు, చాళుక్యులు, పద్మనాయకుల రాజ్య ప్రాభవం
భాగ్యనగర సౌభాగ్యవిధాతలు కుతుబుషాహీ నవాబులు
హైద్రాబాదు అభివృద్ధి ప్రదాతలు ఆసఫ్‌ జాహీ నిజాములు
|| తెలుగు వెలుగు ||

 

జానుతెలుగులో జాలువారినవి పాల్కురికి సోమన్న ద్విపదలూ
భాగవతము భవ్యముగ రచించిన పోతనార్యునీ దివ్యపద్యములు
కావ్యజగతికే కాంతి ప్రసారము మల్లినాథ వాఖ్యాన వైభవం
భాసురముగ శ్రీరామదాసుడు భజియించిన శ్రీరామకీర్తనం
|| తెలుగు వెలుగు ||

 

రాగభావము రంజిల్లే రామప్ప శిల్పము
ప్రమథగణముల సమరనృత్యము పేరిణీ శివతాండవం
యాఖుదా అని ఆలపించే ఖవాలీ సంగీతము
లలితకళలూ పరిఢవిల్లిన రమ్యరససామ్రాజ్యమూ
|| తెలుగు వెలుగు ||

 

శ్రామికజన సంగీతమె జీవధారయై
ప్రవహించెను జానపదం ప్రాణగానమై
ఒగ్గుకథా శారదకథ చిందుబాగోతాలూ…
బతుకమ్మ బోనాలు కోలాట పాటలూ…
నవ్య తెలంగాణ కళా ప్రభావిభవమూ
ప్రపంచ తెలుగు మహాసభల శుభారంభమూ
శుభారంభమూ…… శుభారంభమూ……

Other Updates