tsmagazine

వేయ్యేళ్లకు పైబడిన తెలుగు సాహిత్యంలో అసంఖ్యాకంగా కవులు, రచయితలు, వేలకొద్ది ప్రసిద్ధ రచనలు, బహుళ విస్తృత సంఖ్యలో ప్రక్రియలో శాసనకాలం నుంచి మొదలుకొని ఆధునిక కాలం వరకు సాగిన తెలుగు భాషా సాహిత్య పరిణామం విస్మయాన్ని కలిగిస్తుంది. ఎన్నో ప్రక్రియలుగ, ఉద్యమాలుగా వికసించి, విస్తరించిన తెలుగు సాహితీ సౌరభాలను ఒకే చోట గుదిగుచ్చే యత్నం అంత సుభమైందేమీ కాదు.

సాహిత్యంలోని వివిధ రంగాలలో నిష్ణాతుల నుంచి రచనలు కావాలి. ఈ రచనలన్నింటిని క్రోడీకరించే వ్యవస్థ ఉండి తీరాలి.n ఇవన్నీ జరిగినా వాటిని పాఠకావళికి కానుకగా అందించాలనే సత్సంకల్పం ఉన్న ప్రచురణ కర్తలు ముందుకు రావాలి. ఇవన్నీ అంత సులువుగా జరిగే పనులు కావనే అనుకుంటాం.

మన భావన తప్పని నిరూపిస్తుంది ఈ బృహత్‌ గ్రంథం. కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతలు మొదలుకొని, భావి సాహితీ వేత్తలు వరకు దాదాపు నలభైకి పైగా రచయితల సమష్టి కృషి ఈ పుస్తకం.

నన్నయ పూర్వకాలం మొదలుకొని ప్రాంతీయ అస్తిత్వవాదాల కాలం వరకు, ప్రాచీన కావ్య జగత్తునుండి ఆధునిక నవ్య జగత్తువరకు వివిధ కాలాలలో వెల్లివిరిసిన సాహితీ సర్వస్వం ఉంది ఈ పుస్తకంలో..

వేయి సంవత్సరాలకు పైబడిన భాషా సాహిత్య చరిత్ర తెలుగు వారి సొంతం. రాళ్లూ రప్పలపై నిద్రించిన శాసనస్థ తెలుగు భాష మొదలుకొని, ఆధునిక ఎలక్ట్రానిక్‌ సంచికలతో వెల్లివిరుస్తున్న ప్రాపంచిక భాష వరకు – భాషా పరిణామాన్ని, భాషా ప్రమాణాల ఎగుడు దిగుళ్లనూ చూస్తే విస్మయం కలుగకమానదు. నన్నయ, పాల్కురికి సోమన, శ్రీనాథుడు, పోతన రామాయణ రచయితలతో బాటుగా అష్టదిగ్గజాలూ, దక్షిణాంధ్ర, సంస్థాన పోషిత కవులు – కవిరాజులూ – రాజకవులూ ఇలా అందరినీ స్పృశించారు ఈ సంకలనంలో.

సన్నజాజి తీగగా మొదలైన సాహిత్యం కాలాన్ని చీల్చుకొని, సంస్కృతిని పొదుగుకుని క్రమక్రమంగా వటవృక్షంగా విస్తరిస్తుంది. ఒక్కో కాలంలో ఒక్కో ప్రక్రియ చివుళ్లు తొడిగి, మారాకులు వేసి, తీగలుగా సాగి, ఊడలుగా విస్తరించి – సాహితీక్షేత్ర వైశాల్యాన్ని ఇనుమడింప జేస్తుంది. తెలుగు భాషలో లేని ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కాదు.

పురాణం, కావ్యం, ప్రబంధం, కథాకావ్యాల లాంటి ప్రాచీన ప్రక్రియలు, ద్విపద, శతకం, అవధానం లాంటి నిండైన తెలుగుదనపు ప్రక్రియలు, విమర్శ, నవల, కథ, కథానిక, ఖండకావ్యం మొదలైన ఆంగ్ల భాషా ప్రభావిత ప్రక్రియలు, స్వపర సంప్రదాయాలనన్నింటినీ జీర్ణం చేసుకున్న నాటకం లాంటి ప్రక్రియలు – ఇంకా – సంకీర్తనం, వచనం – మినీకవిత్వం-ఇలా ఎన్నో ప్రక్రియలు తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేశాయి. వివిధ ప్రక్రియల ప్రాదుర్భావ వికాసాలను గురించి తెలుసుకోవాలనుకునే వారికి ఇదొక చక్కని ఆకర గ్రంథం.

సాహిత్యంలోని ప్రతి ప్రస్ఫుటమైన మార్పువెనకా, ప్రగాఢమైన భావ విప్లవం చోదక శక్తిగా పనిచేస్తుంది. ఈ చోదక శక్తే – సాహిత్యంతోఉద్యమాలకూ ధోరణులకూ కారణభూతమౌతుంది. మతావేశ స్ఫూర్తితో వెల్లువెత్తిన శివకవితోద్యమం నుండి మొదలుకొని మతాతీతంగా ఎదిగిన స్త్రీవాద, ప్రాంతీయ వాద ఉద్యమాల వరకు – ప్రతి ఉద్యమమూ – ప్రతి వాదమూ సరికొత్త సాహితీ స్వరంగా – భావ విస్తృతికి వరంగా పరిణమించింది. తెలుగు సాహిత్యాన్ని ఒక కుదుపు కుదిపి కాలగర్భంలో కరిగిపోయిన ఉద్యమాల నుండి మొదలుకొని, కాలాన్ని ధిక్కరించి వెక్కిరించిన ఉద్యమాల వరకు – ఉద్యమాల బాగోగులన్నీ ఉన్నాయీ పుస్తకంలో.

కొన్ని ప్రక్రియలు వాటి పరిధిని దాటి ప్రత్యేక శాఖగా నిలదొక్కుకున్నాయి. జానపదం, విమర్శలాంటివి. వీటి సోదాహరణ విశ్లేషణ ఈ గ్రంథానికే వన్నె తెచ్చింది. అలాగే దాదాపుగా లఘుపుస్తకంగా విస్తరించిన సంస్థానాల సాహితీ సేవ కూడా!

తెలుగు భాషాభిమానులు, సాహితీ పిపాసులతోబాటు నీట్‌, ఎస్‌ఎల్‌ఈటి, జెఆర్‌ఎఫ్‌, సివిల్‌ సర్వీసెస్‌, డిగ్రీ లెక్చరర్స్‌, జూనియర్‌ లెక్చరర్స్‌, టిఆర్‌టి మొదలైన పోటీ పరీక్షల నుండి మొదలుకొని, కళాశాల స్నాతక, స్నాతకోత్తర స్థాయి విద్యార్థుల వరకు అందరికీ అత్యవసరమైన అంశాలన్నీ ఇందులో ఉన్నాయి.

అందమైన అచ్చు, మన్నికైన బైండిగ్‌ అదనపు ఆకర్షణలు. తెలుగు సాహిత్యాన్ని భాషను కాపాడుకోవాలనే నినాదం, నినాదప్రాయంగా కాకుండా ఆచరణాత్మకంగా ముందుకెళ్ళడానికి ఈ బృహత్‌ ప్రయత్నం ప్రేరణనిస్తే వీరి కృషి సార్థకమైనట్టుగా చెప్పవచ్చు.

– శరదిందు

Other Updates