తేనె కంటె తీయన తేట తెలుగు వెలుగు అజంతా భాష ఇది అమృతమీ తెలుగు

ఆంధ్రభోజ కృష్ణరాయ అచ్చ తెలుగు వెలుగు
దేశ భాషలందు లెస్స ఘనమైనది తెలుగు
ద్రవిడ భాష సోదరి ఇది మన అందరి వెలుగు
సుబ్రహ్మణ్య భారతీల సుందరమీ తెలుగు
/ / తేనె కంటె తీయన ..//

నన్నయాది తిక్కనల భారతం తెలుగు
పాల్కురికి సోమన్నల పలుకుబడులు తెలుగు
భక్త కవి పోతన్నల భాగవతం వెలుగు
శ్రీనాథుల సిరివెలుగుల సాహిత్యం తెలుగు
// తేనె కంటె తీయన..//

అష్టదిగ్గజాల తెలుగు ప్రబంధాల వెలుగు
అన్నమయ్య క్షేత్రయ్య కీర్తనలా వెలుగు
మొల్ల రామాయణాల మురిపాల తెలుగు
రామదాసు త్యాగయ్యల రమ్యత ఈ తెలుగు
// తేనె కంటె తీయన….//

విశ్వ కవి వేమన్నల పద్యాల వెలుగు
బ్రౌన్‌ దొర మెకంజీల భావి బాట తెలుగు
ఆధునికం గురజాడల అడుగుజాడ తెలుగు
కందుకూరి సంస్కరణ భావి బాట వెలుగు
// తేనె కంటె తీయన….//

విశ్వనాథ జాషువాల పద్య కవిత తెలుగు
శ్రీ శ్రీ శేషేంద్రల కవిత్వపు వెలుగు
దాశరథి కాళోజిల సృజనాత్మక తెలుగు
సినారె భరద్వజల సాహిత్యపు వెలుగు
// తేనె కంటె తీయన….//

శాస్త్రీయం జానపదం సమ్మిళితం తెలుగు
ప్రాచీనత నవీనతల సంపన్నం తెలుగు
మాండలికాలెన్నున్నా ముమ్మాటికి తెలుగు వెలుగు
కోస్తాంధ్ర తెలంగాణ సీమలదీ తెలుగు
// తేనె కంటె తీయన….//

ఉత్తరాది దక్షిణాల తూర్పు పడమరా వెలుగు
పాశ్చాత్యపు గడ్డ మీద పరిమళించె తెలుగు
దేశదేశాల లోన దివ్య ప్రభల వెలుగు
భాషను ప్రేమించు మన తెలుగును ప్రేమించు
// తేనె కంటె తీయన….//

సబ్బని లక్ష్మీనారాయణ

Other Updates