ఆకుపచ్చని-పొద్దు-పొడువాలేకేంద్ర ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ నేతల డిమాండ్లను, ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలను పట్టించుకోవడంలేదని ఇందిర, చవాన్‌ల హైదరాబాద్‌ పర్యటనల తర్వాత అర్థమవుతున్నది. బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయకపోగా ఆయనకు మరింత మద్దతును అందించే దిశగా కేంద్రంలోని మంత్రులు, జాతీయ కాంగ్రెస్‌ నేతలు పావులు కదుపుతున్నారు. అవసరమైతే మరిన్ని సాయుధ బలగాలను హైదరాబాద్‌కు పంపి ఉద్యమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడానికే కేంద్రం సిద్ధపడుతున్నది. పూర్తి మెజారిటీ వున్న తమ ప్రభుత్వాన్ని తామే బర్తరఫ్‌ చేసి రాష్ట్రపతి పాలన పెట్టడం తమకు తలవంపు చర్య కాగలదని కాంగ్రెస్‌ జాతీయ నేతలు భావిస్తున్నారు.

మరోవైపు తెలంగాణ ప్రాంత శాసనసభ్యులను, మంత్రులను తనకు మద్దతుగా నిలిచేలా సి.ఎం. బ్రహ్మానందరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేసారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకుడైన నూకల రామచంద్రారెడ్డికి ఉపముఖ్యమంత్రి పదవిని ఆశజూపాడు. కానీ ఉద్యమ ఉధృతిని గమనించిన నూకల ప్రస్తుత పరిస్థితులలో ఆ పదవిని చేపట్టజాలనని, చేపట్టినా న్యాయం చేయలేనని సున్నితంగా తిరస్కరించారు. ఆయన తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడంలేదు.

కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా జూన్‌ 16న తెలంగాణ బంద్‌ జరపవలసిందని తెలంగాణ ప్రజా సమితి, ఉద్యమ సంఘాలు, కార్మిక సంఘాలు ప్రజలకు విజ్ఞప్తి చేసినవి. రాష్ట్రపతి పాలన, తెలంగాణ రాష్ట్రం ప్రధాన డిమాండ్లు.

తెలంగాణ సమస్యపై చర్చించడానికి కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని కూడా జూన్‌ 16వ తేదీన ఏర్పాటు చేశారు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ. జూన్‌ 19న కాంగ్రెస్‌ జాతీయ కార్యవర్గ సమావేశానికి ముందే తెలంగాణ విషయమై స్పష్టత రావాలని ఇందిరాగాంధీ భావిస్తున్నారు.

జూన్‌ 10న మొదలైన తెలంగాణ ఎన్‌.జి.ఓ.ల సమ్మె అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఉధృతంగా సాగుతున్నది. విద్యుత్‌ కార్మికుల సమ్మె వల్ల వ్యవసాయదారులకు ఇబ్బందులు ఏర్పడుతున్నందున సమ్మెను నిలిపివేసినారు.
విద్యార్థులు చురుగ్గా ఉద్యమంలో పాల్గొంటున్నారు. మార్చి, ఏప్రిల్‌లో జరగాల్సిన విద్యార్థుల పరీక్షలు ఉద్యమం కారణంగా ప్రభుత్వం నిర్వహించలేకపోయింది. ఒక విద్యా సంవత్సరాన్ని నష్టపోవడానికి కూడా తెలంగాణ విద్యార్థులు సిద్ధపడి ఆందోళనలలో ముందు వరుసలో నిలుస్తున్నారంటే దీని వెనుక చాలా బలమైన కారణాలున్నాయి. విద్యార్థులను ఉద్యమంలోకి వెళ్ళకుండా వారి తల్లిదండ్రులు ఆపే ప్రయత్నాలేవీ చేయలేదు పైగా వారు కూడా విద్యార్థులకన్న ఎంతో ఉత్సాహంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమరంలో క్రియాశీలకంగా పాల్గొంటున్నారు. ‘విజయమో`వీరస్వర్గమో’ అన్నరీతిలో యువకులు పోలీసులతో తలపడుతూ తుపాకులకెదురు నిలుస్తున్నరు.

తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసి అప్పటికి13 సంవత్సరాలైంది. ఈ పదమూడేళ్ళ కాలంలో ఆంధ్రపాలకుల దోపిడీ, తెలంగాణయెడ వివక్షవలన తామెంత నష్టపోతున్నామో ఈ ప్రాంతంలోని ప్రతి కుటుంబానికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చింది. ఉద్యమం ప్రారంభమైనదగ్గరినుంచి పత్రికలు, రేడియో తదితర వార్తా ప్రసార సాధనాలద్వారా, ఉద్యమనేతల ప్రసంగాల ద్వారా తెలంగాణకు జరిగిన అన్యాయాలను తెలుసుకుంటున్న ప్రజలకు తెలంగాణ సాధనయెడ రోజురోజుకూ పట్టుదల మరింత పెరుగుతున్నది. ఒకనాడు తమిళుల వివక్షకు గురై ప్రత్యేక ఆంధ్రరాష్ట్రాన్ని సాధించుకున్న ఆంధ్రులు ఇప్పుడు తెలంగాణ ప్రాంతం యెడ వివక్ష చూపుతున్నారు.

భావజాల వ్యాప్తి:

తెలంగాణకు జరిగిన, జరుగుతున్న అన్యాయాలగురించి, వనరుల దోపిడి గురించి విద్యావంతులు, ఉద్యమ సంస్థలు తమకు తోచిన రీతిన కరపత్రాలు, పుస్తకాలు ముద్రించి పంచుతున్నారు. 1969 మే 20న హైదరాబాద్‌ నారాయణగూడలోని వై.ఎం.సి.ఏ. హాలులో ఉస్మానియా విశ్వవిద్యాలయం వైస్‌ ఛాన్సలర్‌ డా॥ రావాడ సత్యనారాయణ ఆధ్వర్యంలో తెలంగాణ యూనివర్సిటీ, కళాశాలల ఉపాధ్యాయుల కన్వెన్షన్‌ జరిగింది. దీనిలో వివిధ రంగాల్లో జరిగిన అన్యాయాలపై ప్రొ॥ బషీరుద్దీన్‌, ప్రొ॥ జయశంకర్‌, ప్రొ॥ శ్రీధరస్వామి, ప్రొ॥ తోట ఆనందరావు తదితరులు ప్రసంగించారు. విద్య, ఉద్యోగ, నీటిపారుదల రంగాలలో జరుగుతున్న అన్యాయాలపై గణాంకాల ఆధారంగా వివరించారు. ప్రతి ఏటా తెలంగాణ ఆదాయం వివరించారు. ప్రతి ఏటా తెలంగాణ ఆదాయం ఆంధ్రకు ఏ విధంగా తరలిపోతున్నదీ వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వక్తలందరూ ఆంధ్రుల దోపిడీ గురించి తిరుగులేని ఆధారాలను ప్రజల ముందుంచారు. నాగార్జున సాగర్‌ ఎడమకాల్వ, పోచంపాడు ప్రాజెక్టుల నిర్మాణంలో జాప్యం, తెలంగాణ యెడ సాగునీటిరంగంలో వివక్ష మొదటిసారిగా చర్యనీయాంశాలైనాయి.
రోజురోజుకూ ఉద్యమం తీవ్రరూపం దాల్చడం, రవాణా వ్యవస్థ దాదాపు స్తంభించిపోవడం, కోపోద్రిక్తులైన యువకులు, పోలీసుల దౌర్జన్యాలను, ఆంధ్ర ప్రాంత గుండాల దురాగతాలను ప్రతిఘటిస్తూ అక్కడక్కడ హింసాయుత చర్యలకు పూనుకోవడం, దీన్నే అదనుగా తీసుకొని కొందరు ఆంధ్రప్రాంతానికి చెందినవారి ఆస్తులపై దాడులకు దిగడం వంటి కారణాలవలన హైదరాబాద్‌నుండి తమ ప్రాంతాలకు వందలాది బస్సుల్లో వలసాంధ్రులు తరలివెళ్ళినారు. తమ ప్రాంతాలకు తమను బదిలీ చేయాలని 200మందికి పైగా ఆంధ్ర ప్రాంత ఉద్యోగులు రాష్ట్ర ప్రభుత్వానికి దరఖాస్తులు పెట్టుకున్నారు. పోలీసులు విచ్చలవిడిగా కాల్పులు జరిపి జూన్‌ రెండవవారం నాటికే వందమందికిపైగా యువకులను, పిల్లలను బలితీసుకోవడంతో ఎక్కడికక్కడ పోలీసు జులుంకు వ్యతిరేకంగా గుంపులు, గుంపులుగా విద్యార్థులు, యువకులు నిరసన తెలుపుతూ వీధుల్లోకి వస్తున్నారు. ఈ నిరసన చర్యలకు, తెలంగాణ ప్రజాసమితి నాయకత్వానికి సంబంధంలేకుండా పోయింది. గౌలిగూడా, క్లాక్‌టవర్‌, ఇసామియాబజార్‌, పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ప్రజలు నిరసనలకు దిగుతున్నారు. పోలీసులను, గుండాలను ప్రతిఘటిస్తున్న సందర్భంగా అక్కడక్కడ హింస చెలరేగుతున్నది. ఇవి అప్రయత్న ఘటనలే.

ఉద్యమకారుల్లో అనైక్యత….

చెన్నారెడ్డి నాయకత్వం అంగీకరించని శ్రీధర్‌రెడ్డి, పుల్లారెడ్డి తదితరులు మరొక ప్రజాసమితిని ఏర్పాటు చేయగా, తెలంగాణ ప్రజా సమితి నుండి వేరుపడ్డ జి.పి. సక్సేనా, జగన్‌మోహన్‌రెడ్డి తదితరులు ‘తెలంగాణ ప్రజా సంఘం’పేరుతో వేరొక సంస్థను ఏర్పాటు చేసారు. చెన్నారెడ్డితో పొసగని కొండా లక్ష్మణ్‌ బాపూజీ తెలంగాణ పి.సి.సి.ని ఏర్పాటు చేసారు. సోషలిస్టు భావాలుగల సంస్థలు, యువకులు తమంతతాముగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. విద్యార్థులు మల్లికార్జున్‌ నాయకత్వాన బలమైన గ్రూపు, చెన్నారెడ్డి ప్రజాసమితితో కలిసి పనిచేస్తుంటే, సికింద్రాబాద్‌లో మరికొందరు విద్యార్థులు పి.జె. సూరి ఆధ్వర్యంలో వేరొక విద్యార్థి సంస్థను ఏర్పాటు చేసి ఆందోళనల్లో పాల్గొంటున్నారు.

తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సి.పి.ఐ.పార్టీ సికింద్రాబాద్‌ బూరుగు మహదేవ్‌ హాల్లో విద్యార్థులతో జరిగిన ఘర్షణల తర్వాత కొంచెం తగ్గి, ప్రజలకు దూరంకాలేక, ఉద్యమాన్ని సమర్థించలేక ‘బ్రహ్మానందరెడ్డిని బర్తరఫ్‌ చేయాలి, రాష్ట్రపతి పాలనను వెంటనే ఏర్పాటు చేయాల’నే ప్రజాసమితి నినాదాలను సమర్థిస్తూ రాష్ట్రవ్యాప్తంగా నిరాహారదీక్షలకు, ఆందోళనలకు పిలుపునిచ్చింది.

ఈ పరిస్థితులలో తెలంగాణ ప్రజాసమితి జూన్‌ 16న ‘తెలంగాణ బంద్‌’కు పిలుపునిచ్చింది. 1969 మార్చి 3న మొదటిసారి బంద్‌ జరుపగా, ఈ బంద్‌ ఆరవది. గతంలో బంద్‌లన్నీ హింసాయుతమైనందున కాల్పుల్లో విద్యార్థులు, బాటసారులు బలైనందున ఈ బంద్‌ హింసాయుతం కాకూడదని ప్రజలు కోరుకున్నారు. నిజానికి గతంలో జరిగిన బంద్‌లలో పోలీసులు రెచ్చిపోవడానికి వెనుక ముఖ్యమంత్రి బ్రహ్మానందరెడ్డి ‘ఆదేశాలు’ ఉన్నాయి. గుండాల దౌర్జన్యాల వెనుక కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన మంత్రుల పాత్ర ఉందనేది బహిరంగ రహస్యమే. తెలంగాణ ప్రజలు శాంతికాముకులు. ఇంకొకరికి నష్టం చేయాలనే తలంపు ఏ కోశానా ఈ ప్రాంత వాసులకుండదు.

కాంగ్రెస్‌పార్టీలో గ్రూపు రాజకీయాలు..

కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలని, రాష్ట్రపతిపాలన విధించాలనే డిమాండ్లతో జూన్‌ 16న బంద్‌కు ప్రజాసమితి పిలుపునిచ్చింది. కేంద్ర నాయకత్వం బ్రహ్మానందరెడ్డిని దింపేసి, తెలంగాణ ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా నియమించే అవకాశాలున్నాయని గంటగంటకి ఢల్లీినుండి పతాకశీర్షికల్లో పత్రికల్లో వార్తలు వెలువడుతున్నాయి.

కాంగ్రెస్‌ పార్టీలోవున్న అంతర్గత విభేదాలవలన కొందరు నేతలు (రఘురామయ్య, సంజీవయ్య మొ॥) ముఖ్యమంత్రిని మార్చాలని కేంద్ర నాయకత్వంపై వత్తిడి పెంచారు. మరొకవైపు వారి ఒత్తిళ్ళను ఎదుర్కోవడానికి మెజారిటీ నిరూపణకవసరమైన సంఖ్యకోసం తెలంగాణకు చెందిన ఎం.ఎల్‌.ఏ.లకు పలువురికి మంత్రి పదవులు ఎర చూపి లోబర్చుకోవడానికి బ్రహ్మానందరెడ్డి తన శక్తిమేరకు ప్రయత్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంలో, కాంగ్రెస్‌ జాతీయ నాయకుల్లో కొందరు ముఖ్యనేతలను తనకు మద్ధతుగా నిలుపుకొనే ప్రయత్నాలు ముమ్మరం చేశారు కాసు బ్రహ్మానంద రెడ్డి. ఇదే సమయంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు, మద్రాసు మాజీ ముఖ్యమంత్రి రాజాజీ తెలంగాణపై ‘స్వరాజ్‌’ పత్రికలో స్పందించారు. ‘‘తెలంగాణ ఆందోళన గుండాల చర్య మాత్రమేనని చెబుతున్న బ్రహ్మానందరెడ్డి విధానాన్ని కేంద్రం సమర్థించరాద’’న్నారు. ప్రత్యేక తెలంగాణ కోర్కెను రాజకీయ అభ్యర్థనగా గుర్తించి దాని పరిష్కారానికి తగిన మార్గాన్ని కనుగొనాలని సూచించారు. కేంద్రం తెలంగాణయెడ అనుసరిస్తున్న విధానం సంతృప్తికరంగా లేదన్నారు.

శాంతి భద్రతల పరిస్థితిగురించి, తెలంగాణ ఉద్యమం తీరుతెన్నులపై ఇంటెలిజెన్స్‌ బ్యూరో తరఫున పి.ఎస్‌. రాంమోహన్‌రావు నిష్పక్షపాతంగా ఇచ్చిన రిపోర్టును పరిశీలించి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిని మార్చాలనే నిర్ణయానికి దాదాపుగా వచ్చినారని బ్రహ్మానందరెడ్డి వ్యతిరేకవర్గం నేతలు, పరిశీలకులు, తెలంగాణ ప్రజా సమితి నేతలు అభిప్రాయపడినారు. వెంటనే ఢల్లీికి రమ్మని ప్రధాని, హోంమంత్రి పిలిచినా ముఖ్యమంత్రి తనకు ఉద్వాసన ఖాయమేమోనని భయపడి ఏవో కుంటిసాకులు చూపి ఢల్లీి ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ఒకవేళ తనను తప్పించాలని కేంద్ర నాయకత్వం భావిస్తే ఆంధ్రప్రదేశ్‌ కాంగ్రెస్‌ లెజిస్టేచర్‌పార్టీలో బలనిరూపణకు సిద్ధపడాలని బ్రహ్మానందరెడ్డి ప్రయత్నిస్తున్నారు.

జూన్‌ 16న బంద్‌ పిలుపు.. ముఖ్యమంత్రికి కలిసివచ్చిన అవకాశం:

సరిగ్గా ఈ సమయంలో తెలంగాణ ప్రజా సమితి 16న బంద్‌కు పిలుపునివ్వడం, అదేరోజు పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఇందిరాగాంధీ ఏర్పాటు చేయడం బ్రహ్మానందరెడ్డికి కలిసివచ్చింది. ఈ బంద్‌ ప్రశాంతంగా జరిగేలా చూస్తే తనకు లాభమని బ్రహ్మానందరెడ్డి భావించారు. ఎక్కడా ఎవ్వరు కూడా ఆందోళనాకారులను రెచ్చగొట్టకూడదని, హింసకు దిగరాదని పోలీసులను ఆదేశించారు. గుండాలను దింపవద్దని తన అనుయాయులను ఆదేశించినారు. పరిస్థితి పూర్తి అదుపులో ఉందని, శాంతి భద్రతలకు వచ్చిన ముప్పేమీలేదనే సంకేతాన్ని కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి పంపాలనుకున్నారు. ఆ విధంగా తన పదవిని సుస్థిరపర్చుకోవాలని కాసు భావించారు. మరోవైపు బంద్‌ ప్రశాంతంగా జరపాలని తెలంగాణ ప్రజాసమితి నాయకులు, పి.సి.సి. నేతలు, ఉద్యోగ, విద్యార్థి, కార్మిక నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేసారు.

జూన్‌ 16న బంద్‌ ప్రశాంతంగానే జరిగింది. ‘‘పోలీసుల నుండి లేదా గుండాలనుండికానీ కవ్వింపు చర్యలులేనిపక్షంలో తెలంగాణ ప్రజలు క్షమశిక్షణతో శాంతియుతంగా ఆందోళన జరపగలరన్న విషయం నేటిబంద్‌ ద్వారా రుజువైంద’ని తెలంగాణ ప్రజా సమితి నేత మర్రి చెన్నారెడ్డి అన్నారు.

‘‘పోలీసులు ఈ బంద్‌ రోజు నిష్పక్షపాతంగా వ్యవహరిం చార’’ని పత్రికలు రాసినవి, ప్రజలు భావించారు.
జూన్‌ 16న బంద్‌లో జంటనగరాల్లోని అన్ని పరిశ్రమలు మూసివేశారు. సుమారు లక్షాయాభైవేలమంది కార్మికులు బంద్‌లో పాల్గొన్నారు. రిక్షాలు కూడా నడవలేదు. హమాలీలు సైతం బంద్‌లో పాల్గొన్నారు. సినిమాహాళ్లు మూసి వేసారు.టి.ఎన్‌.జి.ఓల సమ్మెవల్ల ఉద్యోగులు విధులకు హాజరుకాలేదు. హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులు, పబ్లిక్‌వర్క్స్‌ ఉద్యోగులు బంద్‌లో పాల్గొన్నందున నగర వీధుల్లోని చెత్త అలాగే ఉండిపోయింది. బస్సులు నడపలేదు. ఆర్‌.టి.సి. కార్మికులు విధులకు హాజరు కాలేదు. దుకాణాలు, హోటళ్ళు తెరవలేదు.
డా॥ మర్రి చెన్నారెడ్డి, కొండా లక్ష్మణ్‌, బద్రీ విశాల్‌ పిట్టి తదితర నేతలు నగర వీధుల్లో తిరుగుతూ దుకాణాలు, వ్యాపార సంస్థలు తెరువవద్దని కోరినారు. సింగరేణి గనుల్లోని వేలాది కార్మికులు బంద్‌లో పాల్గొన్నారు. ప్రముఖ కార్మిక నాయకులు జి. వెంకటస్వామి, అంజయ్యలు మౌలాలీ, సనత్‌నగర్‌, అజామాబాద్‌, కూకట్‌పల్లి పారిశ్రామిక వాడల్లో తిరుగుతూ కార్మికులు విధులకు హాజరు కారాదని, పరిశ్రమలు బంద్‌కు మద్ధతుగా మూసివేయాలని యాజమాన్యాన్ని, కార్మికులను కోరినారు. విద్యార్థులు, టి.ఎన్‌.జి.వోలు కూడా బంద్‌ శాంతియుతంగా జరపడానికి తమవంతు ప్రయత్నం చేసినారు. వివిధ తెలంగాణ సంస్థల ప్రతినిధులు బంద్‌ను జయప్రదం చేయాలని వీధుల్లో తిరిగినారు.

జంటనగరాల్లోని ప్రధాన వీధుల్లోనే కాకుండా చిన్నచిన్న గల్లీల్లోకూడా పోలీసులు, సైన్యం వందలాది జీబుల్లో తిరుగుతూ హింసకు అవకాశం లేకుండా బందోబస్తు నిర్వహించినారు.

కొన్ని చెదురు మదురు సంఘటనలు తప్ప తెలంగాణ అంతటా బంద్‌ ప్రశాంతంగా జరిగింది. వనపర్తిలో జరిగిన పోలీసు కాల్పుల్లో ఇద్దరు గాయపడినారు. మేడ్చల్‌, రాయిగిరి రైల్వే స్టేషన్లపై ఆందోళనకాకారులు దాడి చేసారు. దీనికి కారణం రైల్వేశాఖ రైళ్ళను నడపడం. వీధుల్లోకి వచ్చిన నాయకులను, విద్యార్థులను ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టుచేసి ఎక్కడికి తీసికెళ్ళి ఉంచాలో తెలియక కొద్దిసేపటి తర్వాత విడిచిపెట్టినారు. అప్పటికే ఆందోళనాకారులతో జైళ్ళన్నీ నిండిపోయినవి. తెలంగాణలోని స్కూళ్ళను, హాస్పిటల్స్‌ను, ప్రభుత్వ కార్యాలయాలను జైళ్ళుగా మార్చినారు. అవన్నీ ఆందోళనాకారులతో నిండిపోయి ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో అరెస్టులు జరిగినా వేలాదిగా జనం ప్రతి పట్టణంలో ‘జై తెలంగాణ’ అంటూ రోడ్డుమీదికి వస్తూనే ఉన్నారు.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, మున్నూరుకాపులకు పెద్దదిక్కయిన బొజ్జ నర్సింహులును సుల్తాన్‌బజార్‌లోకి ఈడ్చుకొచ్చి పోలీసులు జీబులో పడేయడాన్ని ప్రతి ఒక్కరూ ఖండిరచారు. పెద్ద మనుషల ఒప్పందంపై సంతకంచేసిన ఆంధ్ర ప్రాంత నేతల్లో ఒకరైన గౌతు లచ్చన్న, బొజ్జ నర్సింహులు అరెస్టుపై, పోలీసులు అమర్యాదగా వ్యవహరించడంపై తీవ్రంగా స్పందించారు.

సమైక్యతాఫ్రంట్‌ కార్యకర్తలు బంద్‌కు వ్యతిరేకంగా కరపత్రాలు పంచినారు. జనసంఘ్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన బంగారు లక్ష్మణ్‌, శాసనమండలి జనసంఘ్ పక్షనేత వి. రామారావు ‘బంద్‌’లకన్నా ఇతర నిరసన పద్ధతులను ఉద్యమకారులు అనుసరించాలని హితవు పలికినారు.

ఢల్లీిలో కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గ సమావేశం…

ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ అధ్యక్షతన కాంగ్రెస్‌ పార్లమెంటరీ కార్యవర్గ సమావేశం జూన్‌ 16న జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ప్రాంత పార్లమెంట్‌ సభ్యుల్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొంటున్న ఎం.పి.లను ఒక్కరిని కూడా ఆహ్వానించలేదు. కానీ తెలంగాణ ఉద్యమంపై అడుగడుగునా విషం చిమ్ముతూ బ్రహ్మానందరెడ్డికి తొత్తులుగా వ్యవహరిస్తున్న శ్రీమతి లక్ష్మీకాంతమ్మను, శ్రీమతి యశోదారెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించడం బ్రహ్మనందరెడ్డి పలుకుబడి ఏ స్థాయిలో ఉన్నదో అర్థం చేసుకోవచ్చు.

సమావేశం ప్రారంభంలోనే హోంమంత్రి వై.బి. చవాన్‌ తెలంగాణలో తన పర్యటనకు సంబంధించిన విశేషాలను వివరించారు. ‘‘ముల్కీ నిబంధనలను సుప్రీంకోర్టు కొట్టివేయడంతో తెలంగాణలో ఉద్యమం తీవ్రమైందని, తమను రెండవ శ్రేణి పౌరులుగా ఆంధ్రప్రాంతంవారు పరిగణిస్తున్నారని, తమ ప్రాంత ఆదాయాన్ని తెలంగాణలో ఖర్చు పెట్టకుండా ఆంధ్రకు తరలిస్తున్నారని తమ ఉద్యోగాలను ఆంధ్ర ప్రాంతీయులు కబళించారని, పెద్ద మనుషుల ఒప్పందాన్ని అమలు చేయడంలేద’’ని తనను కలిసిన తెలంగాణ నేతలంతా చెప్పారని చవాన్‌ కార్యవర్గ సమావేశంలో తెలిపినారు. ‘‘మరింత వ్యవధినిచ్చి అవసరమైన సమాయాన్ని అందిస్తే పరిస్థితిని అదుపులోకి తెస్తాన’’ని ముఖ్యమంత్రి తనతో అన్నారని చవాన్‌ చెప్పారు. ఉద్యమనేతల ఆరోపణలను అబద్దాలుగా ముఖ్యమంత్రి ఖండిరచారని, మూడింట ఒకవంతు ఆదాయాన్ని తెలంగాణలో ఖర్చు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తనకు చెప్పారని చవాన్‌ అన్నారు.

కాశీనాథ్‌పాండే ప్రసంగిస్తూ ‘‘రాజకీయపక్షాలు గుండాల సహాయంతో ఆందోళనను నిర్వహిస్తున్న మాట నిజమేనా’’ అని ప్రశ్నించగా చవాన్‌ త్రోసిపుచ్చుతూ ‘‘ఇట్టి పరిస్థితిని సంఘ విద్రోహశక్తులు ఉపయోగించుకోవడం సహజమే’’నన్నారు.

కాంగ్రెస్‌వాదుల మధ్యగల వ్యక్తిగత స్పర్థలే ఈ ఆందోళనకు కారణమని బి.కె.డి.సిన్హా అన్నారు. ప్రత్యేక తెలంగాణ ఆందోళన జరుపుతున్న కాంగ్రెస్‌ వాదులపై ఎట్టి చర్య గైకొననందుకు బి.కె.డి.సిన్హా నాయకత్వాన్ని విమర్శించారు.

యశోదారెడ్డి ఎంతో ఆవేశంగా సంజీవయ్యపై (ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి) మండిపడుతూ ‘‘బ్రహ్మానందరెడ్డిని డిస్మిస్‌ చేయమనడానికి మీరెవరు’’ అని కోపంగా ప్రశ్నించారు. ఈ అంశంపై ఆయన రేడియోలో మాట్లాడడాన్ని కూడా ఆమె తప్పుపట్టారు. శ్రీమతి లక్ష్మీకాంతమ్మ మాట్లాడుతూ ‘‘తెలంగాణలో ప్రజలెవ్వరూ తెలంగాణ కావాలనడంలేద’’ని అన్నారు. తమ ఉపన్యాసాల్లో అనేక రకాలుగా బ్రహ్మానందరెడ్డిని పొగిడినారు ఈ ఇద్దరు మహిళా నేతలు.

తెలంగాణ సమస్యను పరిశీలించే బాధ్యతను నిజలింగప్ప (ఏఐసీసీ అధ్యక్షుడు), కామరాజ్‌నాడార్‌గార్లకు అప్పగించాలని ఎస్‌.ఎన్‌. మిశ్రా, సుచేతా కృపలానీతోసహా కొందరు సభ్యులు సూచించారు.

ప్రత్యేక తెలంగాణను ఆమోదిస్తే దేశంలో విదర్భ, సౌరాష్ట్రతోసహా అనేక రాష్ట్రాల్లో ఇలాంటి ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌లు పుట్టుకువస్తాయని బి.కె.డి. సిన్హాతోసహా పలువురు అన్నారు. ‘పంజాబ్‌ విభజన గురించి ముందుగా పంజాబ్‌ కాంగ్రెస్‌ పార్టీకి తెలియజేయనందువల్ల కొత్త పంజాబ్‌ రాష్ట్రంలో అది పలుకుబడిని సంపాదించుకోలేకపోయింద’’ని కృష్ణకాంత్‌ అన్నారు.

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోర్కెను రణధీర్‌సింగ్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రాంతీయ సంఘానికి చట్టబద్ధమైన అధికారాలివ్వాలని, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఒక పర్యాయం ఆంధ్రప్రాంత వ్యక్తి వుంటే మరో పర్యాయం తెలంగాణ వ్యక్తి ఉండాలని రణధీర్‌సింగ్‌ సూచించారు.

రాష్ట్రపతిపాలన విధించాలనే డిమాండ్‌ను అనేకులు వ్యతిరేకించారు. రాష్ట్ర శాసనసభలో మెజారిటీ తనకు ఉన్నంతవరకు బ్రహ్మానందరెడ్డి రాజీనామా చేయవలసిన అవసరం లేదని కార్యవర్గం అభిప్రాయపడింది.
కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ కార్యవర్గం అభిప్రాయాల గురించి వెంటనే వ్యాఖ్యానిస్తూ ‘‘మా వైఖరిలో మార్పు లేద’’ని చెన్నారెడ్డి ప్రకటించారు. ‘‘జూన్‌ 19న జరుగబోయే జాతీయ కాంగ్రెస్‌ కార్యవర్గ సమావేశంలో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటారో ముందుగానే తెలిసిపోయింద’’ని చెన్నారెడ్డి అన్నారు.

Other Updates