pustakaతెలంగాణ తన అస్తిత్వాన్ని గురించి, అన్ని రంగాల్లో తన ఉనికి ప్రాథమ్యాలను గురించి ఆలోచింప వలసిన సందర్భం వచ్చింది. ముఖ్యంగా అనేక కారణాల దృష్ట్యా సాహిత్య ‘సాంస్కృతిక’ కళారంగాల్లో ఉద్దేశ్య పూర్వకంగా వెనక్కి నెట్టే ప్రయత్నాలు అనేకం సంభవించాయి. పూర్తిగా ప్రామాణికమైన సాహిత్య చరిత్రలే తప్పు మార్గం పట్టి అవాస్తవాల మీద ఆధారపడి నిర్మించబడ్డాయి. విధిలేని పరిస్థితుల్లో ఆ గ్రంథాల్నే మనం చదవాల్సిన అగత్యం ఏర్పడింది.

కాలం మారింది, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం సాకారమైంది. ఈ తరుణంలో ప్రతి రంగంలోనూ కొత్త దృక్కోణాలతో పరిశోధించాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు లెక్కలేనంత మంది తమ తమ రంగాల్లో లోతులకు వెళ్ళి పరిశోధించి సత్య కథనాల నిగ్గు తేలుస్తున్నారు. ఆ క్రమంలో ఏర్పడ్డదే ‘తెలంగాణా సాహిత్య పరిశోధన కేంద్రము’. ప్రముఖ పరిశోధక పండితులు ఆచార్య ఎస్‌.వి. రామారావు సారథ్యంలో ఆచార్య రవ్వా శ్రీహరి, ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య, డా. శ్రీరంగాచార్య, డా. సంగనభట్ల నర్సయ్య వంటి మహా పందితుల సలహా సహాకారాలతో తెలంగాణ పరిశోధన కేంద్రము ముందడుగు వేస్తున్నది. శాస్త్రీయమైన ప్రమాణాలతో తెలంగాణా సాహిత్య రంగంలోని వాస్తవాలను వెలికిదీసే కార్యక్రమాన్ని తన భుజస్కంధాలత్తుెకున్న పరిశోదన కేంద్రము తొలి అడుగులోనే, తెలంగాణా సాహిత్య వైశిష్ట్యం, బూర్గుల రంగ నాథరావు సాహిత్యం వంటి పరిశోధనాత్మక గ్రంథాలతో బాటు తొలి తెలుగు కావ్యమైన ‘మల్లియరేచన’ కవిజనాశ్రయాన్ని సవ్యాఖ్యానంగా ప్రచురించి తెలంగాణా సాహితీ వైభవాన్ని వెలుగులోకి తెచ్చింది.

మొట్టమొదటగా ఈ ఛందోకావ్యం ప్రచురించడానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. చాలా మంది చరిత్రకారులు ఈ గ్రంథాన్ని వేములవాడ భీమకవి కృతిగా చెప్పి ఇది నన్నయ్య, తర్వాత కృతిగా నిరూపించే ఒక ప్రయత్నం చేశారు. కాని అనేక సాక్షాధారాలను అవి అంతర్గత సాక్ష్యాలు కావచ్చు. ఇతరేతర సాక్ష్యాలు కావచ్చు.’ దీన్ని మల్లియరేచన కృతిగా నిర్ధారించడం వల్ల తెలంగాణలోని వేములవాడ ప్రాంతపు కవియైన రేచన రచించిన ఈ కావ్యమే నన్నయ భారతం కన్నా ముందు వచ్చిన కావ్యంగా స్థిరీకరించారు.’ అంటే ఇదే తొలితెలుగు గ్రంథమౌతుంది. పైగా నన్నయ భారతం అనువాద రచన మాత్రమే కాని ఇది స్వతంత్ర రచన. అంతేకాదు దేశిఛందస్సైన ‘కదం’ ప్రధానంగా కనిపిస్తున్న రచనగా నిరూపించారు. అప్పటికే అంటే 10 వ శతాబ్దం నాటి ఈ ప్రాంతంలో స్థిరపడ్డ పద్య రచనా పద్ధతి ఎంత సుసంపన్నంగా ఉందో ఈ రచనే సాక్ష్యం.

పూర్వ పరిశోధకులైన నిడదవోలు వెంకటరావు, ఆరుద్ర, పి.పి. పరబ్రహ్మశాస్త్రి వంటి మహామహులందరూ సప్రమాణంగా ఇది నన్నయకు పూర్వమే వెలువడ్డ రేచన రచనగా తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. రేచనకు ఆత్మీయుడైన జినవల్లభుని సోదరుడు పంపమహాకవి కన్నడ భాషాకవులలో  అగ్రగణ్యుడు. రచనకు కన్నడ కావ్యాలతో, శాస్త్రాలతో గాఢమైన పరిచయం ఉందనడానికి ‘కవిజనాశ్రయ’మే నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తుంది.

నన్నయ, నన్నెచోడుల వంటి కవులకిది మార్గదర్శనం చేసిన గ్రంథంగా పరిశోధకులు గుర్తించారు. తెలుగులో ‘శ్రీ’ కారంతో తొలిపద్య పాదాన్ని ప్రారంభించే గొప్ప ఆచారానికి ఈ రచనే తొలి అడుగు వేసి నిలిచిందని నిరూపించారు. కావ్యాల్లో అవతారికను సంతరించడం, అశ్వాసాంత గద్య చెప్పడం, కావ్యరచన చంపూ పద్ధతిలో నిర్వహించడం వంటి అనేక అంశాలకు మల్లియ రేచనే తొలివ్యక్తి అన్న సత్యం ఈ రచన ద్వారా ఆవిష్కృతం అయింది.

అనవద్య కావ్య లకణ మొనరంగా గవి జనాశ్రయుడు మల్లియరే చన సుకవి కవిజనాశ్రయ మను ఛందము తెనుగు బాస నరుదుగ నొప్పెన్‌ 

అన్న పద్యం ఒక్కటి చాలు- ఇది రేచన రచనేయని నిర్ణయించడానికి. భీమన కుమారుడైన రచన రచించిన ఈ కవిజనాశ్రయాన్ని ‘భీమనఛందం’ గా ఎందుకు పేర్కొన్నారో, దాని ఆంతర్యాన్ని గురించి కూడా ప్రచురణ కర్తలు తమ పీఠికలో విస్తృతంగా చర్చించడం ప్రామాణిక సత్యాలను ఇష్టపడేవారికి ఆనందం కలిగించే అంశం.

సంజ్ఞాధికారము, వృత్తాధికారము, జాత్యధికారము, షట్ట్రు యాధికారము, దోషాధికారము- అనే అయిదు భాగాలుగా విభజించి’ తగిన ఉదాహరణలతో నున్న ఈ ఛందోగ్రంథానికి ప్రముఖ విద్వాంసులైన డా. వైద్యం వెంకటేశ్వరాచార్యుల వారు భావదీపిక’ పేరుతో సరళమైన రీతిలో వ్యాఖ్యను సంతరించారు. ఆ వ్యాఖ్యానం వారి శేముషీ వైభవానికి ప్రత్యక్ష ప్రమాణం. సామాన్య పాఠకునికి కూడా సులభగ్రాహ్యంగా ఉండే పద్ధతిలో ఈ వ్యాఖ్యానం సమూర్చడం ఈ గ్రంథానికి అదనంగా అద్దిన అలంకారం. అంతేకాదు దీనికి అనుబంధంగా ప్రక్షిప్త పద్యాలు, సాహిత్యానుబంధం, చారిత్రకానుబంధం కూడా జతచేయడం ఉత్తమ పరిశోధనా దృష్టికి నిదర్శనం.

‘నన్నయభట్టు, నన్నెచోడుని వంటి ప్రాచీన కవులను ప్రభావితం చేసిన మల్లియ రేచన తెలుగులో ప్రప్రథమ కవి అని నిర్ధారించడానికి..’ తెలంగాణా సాహిత్య పరిశోదన కేంద్రము ప్రచురించిన ఈ గ్రంథం తెలుగు సాహితీ జిజ్ఞానువులకు పాధేయమై నిలుస్తుందనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

– గిరిజా మనోహర్‌

Other Updates