తెలంగాణ రాష్ట్రం అవతరించిన అనంతరం రాష్ట్ర ఆర్థికశాఖామంత్రి ఈటల రాజేందర్ శాసనసభలో రెండవసారి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. 2014`15 సంవత్సరానికి కేవలం 10 మాసాల కాలానికే బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి, తొలిసారిగా 2015`16 సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్‌ను మార్చి 11న శాసనసభకు సమర్పించారు. మొత్తం 1,15,689 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్‌లో ప్రణాళికా వ్యయం రూ. 52,383 కోట్లుగాను, ప్రణాళికేతర వ్యయం రూ. 63,306 కోట్లుగా ప్రతిపాదించారు.
పూర్తి అవగాహనతో, సమన్వయంతో, స్పష్టతతో ఈ బడ్జెట్‌ను రూపొందించినట్టు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఉజ్వల భవిష్యత్తుకోసం, అట్టడుగువర్గాల నిజమైన అభివృద్ధికోసం రూపొందించిన పథకాల సమాహారమే ఈ బడ్జెట్ అని కూడా చెప్పారు.
రాష్ట్ర ప్రజల శ్రేయస్సు, సంక్షేమాలే గీటురాయిగా రూపొందించిన ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రధానంగా మూడు అంశాలకు ప్రాధాన్యత కల్పించింది. ఇందులో మొదటిది బలహీనవర్గాల సంక్షేమం కాగా, రెండవది వ్యవసాయరంగం, దాని అనుబంధ రంగాల వికాసం. మూడవది పారిశ్రామికరంగ అభివృద్ధి. ఈ మూడు రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు మిగతా రంగాలకు కూడా బడ్జెట్‌లో సముచిత కేటాయింపులు జరిపారు. ఉద్యోగులతో స్నేహభావంతో మెలగాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వారి ఆశలకు అనుగుణంగా 43శాతం ఫిట్‌మెంట్‌ను ప్రకటించింది. దానికి అనుగుణంగా ఈ బడ్జెట్‌లో ఉద్యోగుల జీతభత్యాలకు రూ. 22,889 కోట్లు ప్రతిపాదించారు.
తెలంగాణ పల్లెలకు మళ్లీ జవసత్వాలు కల్పించేందుకు ప్రారంభించిన ‘మిషన్ కాకతీయ’ పనులకు రూ. 2,000 కోట్లు పైగా ప్రతిపాదించారు. అంతేకాదు, మార్చి 12న నిజామాబాద్ జిల్లా సదాశివనగర్‌లోని పాత చెరువులో మిషన్ కాకతీయ పనులకు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు శ్రీకారం చుట్టారు. స్వయంగా పార, పలుగు చేతబట్టి మట్టితట్ట నెత్తిపైమోసి ముఖ్యమంత్రి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ‘వాటర్ గ్రిడ్’ పథకానికి 4,000 కోట్ల రూపాయలు కేటాయించారు. దళితులకు భూ పంపిణీ, విద్య, వైద్యం, ఆరోగ్యం, ఆహారభద్రత, ఆసరా, రోడ్ల అభివృద్ధి, పట్టణాభివృద్ధి, విద్యుత్, నీటిపారుదల, తదితర రంగాలకు కూడా బడ్జెట్‌లో తగిన ప్రాధాన్యం కల్పించారు.
కేంద్రంనుంచి వచ్చే ప్రణాళికా నిధులశాతం తగ్గినప్పటికీ, ప్రజా సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా రూపొందించిన ఈ బడ్జెట్ ప్రజల ఆశలని, ఆకాంక్షలను నిజం చేస్తుందని ఆశిద్దాం. ‘బంగారు తెలంగాణ’ లక్ష్యసాధనలో ఇది మరో ముందడుగు కావాలని ఆకాంక్షిద్దాం!