tsmagazine
తొవ్వ బాట ఏ పేరుతో పిలిచినా అదొకదారి. ఇంటింటికీ దారి ఉన్నట్టే ఊరూరికి తొవ్వ ఉంటది. తొవ్వలు లేని ఊర్లు ఉండనే ఉండయి. రెండూర్లకు మధ్యన తొవ్వలు, నాలుగూర్లకు కలిపే బాటలు అనేకం. తొవ్వలు ఊర్లను కలిపేందుకు కాదు మనుషులను కలిపేందుకూ ఉంటాయి. ఎవసాయ బాయిలకాడికి పోయేందుకు చిన్నచిన్న తొవ్వలుంటాయి. వాటిని పిల్లబాటలు అంటరు. పిల్లబాటలకెల్లి నడుస్తుంటే అటూ ఇటూ చెట్లుంటయి. నడుమకెల్లి సన్నని బాట అండ్ల ఎవలు ఎదురైనా ఒగలకొగలు అడ్డం జరగాలె. బాటలు ఎట్లుంటాయంటే ఒగల బాయిలమీదనుంచి ఇంకొకల చెల్క లమీంచి ఇంకో ఊరికి పోతది. ఆ ఊరును ఈ ఊరుని బాట కలుపు తది. పిల్లబాట అంటే అది

తయారైన బాట అన్నట్లు, నడుస్తుంటే నడుస్తుంటే గడ్డిపోయి మట్టి బాట ఏర్ప డుతది. అట్లనే బండ్ల బాటలు ఉంటయి. అంటే ఎడ్లబండ్లు పోయేం దుకు వీలుగా రెండు గేదెలకు అనుగుణంగా ఉంటయి. వీటిని బండ్ల బాట అంటరు. అవి గాకుండా కచ్చబాట అని కూడా అంటరు. అంటే మన్ను మాత్రమే ఉండే బాట. పూర్వ కాలంల నడవడం ఎడ్ల బండ్లమీంచి పోవడమే కాబట్టి మట్టిబాటలు ఉండేటివి.

ఇప్పుడైతే అన్ని దారులు రహదారులై పోయినయి. దారి అంటే డాంబర్‌ పోసినవి, తారు పూసినది లేదా సిమెంట్‌తో వేసినది. బస్సులు, కార్లు, వాహనాలు పోయేందుకు రోడ్‌లు వేస్తున్నరు. రహదారులు అభివృద్ధికి కొలమానాలు అయిపోతున్నాయి. ఈ దారులు లేకపోతే సరుకుల రవాణా మనుషుల రాకపోకలకు వీలు ఉండేదికాదు. ఇప్పటి వాహనాలకు అనుకూలంగా చేస్తున్న నాలుగు వరసల దారులవల్ల దానిమీద సవ్వడిగా, రువ్వడిగా పోయే వాహనాలవల్ల ప్రమాదాలు తీవ్రంగానే సాగుతున్నాయి. పల్లెలను కలిపేదారుల్లో ప్రశాంతతపోయి కొత్తదారులవల్ల ప్రమాదభరితం అవుతున్నవి. అభివృద్ధికై రెండంచుల కత్తి ప్రమాదం ఉంటది, ప్రమోదం ఉంటది. దానిని వాడుకున్న తీరు. ఎనకటి పిల్లబాటలకెల్లి సుట్టాలదగ్గరిపోయివచ్చే వాల్లు, జాతరలకు, తీర్థాలకు పోయేవాల్లు, వచ్చేవాల్లు, అంగట్లకు పోయేవాల్లు ఇప్పుడు వేరు అంతటి ప్రశాంతతను కోల్పోతున్న సందర్భం.

అసలు మనిషి తొవ్వలో నడిచిపోతుంటే ఎదురంగ వచ్చిపోయేవాల్లు ఇంటి ముందు అరుగుమీద కూసున్నవాళ్ళ పలకరింపులు ఉండేవి. మాటల మధురిమలూ ఉండేవి. మంచి చెడుమాటల కాసేపు ఆగి మాట్లాడిపోయే సందర్భాలు అనేకం ఉండేవి. మనుషులకు మనిషి ఎదురైతే నవ్వుమొకంతో పలకరింపులు ఉంటయి. అయితె ఇప్పటి స్పీడ్‌ యుగంలో అవేవిలేవు. ఎవని పని, ఎవని స్పీడ్‌ వాల్లదే. మనిషి మనసు మాటలు కలిపే తొవ్వల స్థానంల సిసిరోడ్లు, సిమెంట్‌ రోడ్లు రావడంవల్ల మనుషుల మధ్యన దూరం ఎక్కువ అవుతుంది. మనిషిని మనిషి సూసి సూడనట్టుగ పోతున్న సందర్భం. మనుషులకు ఉన్నట్టే బాటలు జంతు జాలాలకు ఉంటయి.

బాటల సంగతి పశువులకు తెలుసు. ఒక్కసారి చూసిన దారిన అవి తిరిగి రాగలవు. ఊర్ల బర్లను కొట్టుపోయిన ఆయన తిరిగి ఎవల ఇండ్లడ్లకువాల్ల పంపేప్పుడు అవే వాల్ల వాకిలి రాగానే ఇంట్లోకు పోతయి. వాటి దారి వాటికె ఎరుక. అట్లనే ఒక వాడకు ఎన్ని కోడిపిల్లలు కల్సి తిరిగిన రాత్రి కాగానే ఎవల ఇంటికి అవే పోతయి. అట్లనే పిల్లులు సుత ఎక్కడ ఉండేటివి అక్కడికి పోతయి. వాటి తావు వాటికి ఎరుక. అట్లనే వాటిదారీ వాటికి ఎరుకున్నట్టే అయితే కోతు లకు మాత్రం దారులు గానీ, స్థలాలుగానీ లేవు. అవి నిరంతరం తిరుగుతనేఉంటయి. పక్షులకు, కొంగ లకు, ఊరపిష్కలకు

కూడా ఎక్కడ రాత్రి ఉండాలనో, ఎక్కడ గూడు పెట్టాలనో అక్కన్నే ఉంటయి. తన పిల్లలకు ఆహారం తీసుకపోతయి. భూమి మీదినుంచి అయిన ఆకాశం నుంచి అయిన ప్రకృతి వాటికి బాటలు వేసింది. ఆ బాటలు ఆ తొవ్వలనుంచే అవి చేరుకుంటున్నాయి.

ఊర్లల్ల వాడవాడకూ దారులు ఉంటయి. కొన్ని వాడకట్టుకు తక్కువమంది నడుస్తుంటే సన్నబాట అయి మిగతా చోట్ల చెట్లు మొలుస్తయి. నడవకుంటే బాట కూడుకపోతది. మైదానం ప్రాంతంలోనేకాదు గుట్టమీదికి ఎక్కేందుకు ప్రత్యేకమైన బాటలు ఉంటయి. సూస్తాంటే అన్ని గుట్టలు గుండ్లు రాళ్ళు కన్పిస్తాయి కని అందులోనుంచి ఎక్కి నడిచేందుకు వీలుగా ఒక బాట ఉంటది. ఆ గుట్టల బాట ఎక్కేవాళ్లకే తెలుస్తది. అక్కడదారి తప్పితే తిప్పలే. అందుకే తొవ్వపొంట నడుస్తుంటేనే తొవ్వ తప్పని నడక.

అన్నవరం దేవేందర్‌

Other Updates