టి. ఉడయవర్లు
చిత్ర లేఖనంలో కేంద్ర లలిత కళా అకాడమీ యేటేటా ఇస్తున్న జాతీయస్థాయి అవార్డును మూడున్నర దశాబ్దాల క్రితమే గెలుచుకున్న సృజనాత్మక చిత్రకారుడు పి.యస్. చంద్రశేఖర్. ఎంతో అరుదుగా రాష్ట్ర చిత్రకారులకు వచ్చిన ఈ అవార్డు చంద్రశేఖర్‌కు అలనాడే రావడం హర్షణీయమైన విషయం.
వానరాల్లో, విహంగాల్లో మానవత్వం ఉందనీ, మానవుల్లో జంతువులను మించిన క్రూరత్వం ఉందని భావించిన చంద్రశేఖర్, అదే అంశాన్ని తీసుకుని చిత్రాలు, చిత్ర విచిత్రంగా వేశాడు. అనూహ్యమైన వాటిలోను అందాలు చూపవచ్చనీ, రోమపూర్వక, ఈకలతో కూడిన జంతువుల్లో-నగ్న స్త్రీ ఒంపులను చూపి ‘ఓహో’ అనిపించాడు. అట్లాగే తోలు సంచిలోని మనిషిలో జంతుప్రవృత్తిని కళ్ళకు కట్టాడు. వానర చిత్రాలకు మనిషిని నమూనాగా తీసుకొని కామ ప్రకోప చిత్రాలు పరంపరగా వేశాడు. ఈ విశ్వంలో జీవులున్నాయంటే కేవలం మైధునం ఫలితమేననీ, సృష్టిలో తీయనిది, ప్రాథమిక అవసరం మనిషికి మైధునమేనని భావించి బహు చిత్రాలు వేశాడు. కానీ సమకాలీన సమాజం మైధునాన్ని ఒక అసభ్య చర్యగా పరిగణించి, చంద్రశేఖర్ చిత్రాలను ప్రదర్శనలో చూడడానికి పరుగెత్తు వచ్చారు. కానీ, సేకరించడానికి వెనకాముందాడారు. దాంతో క్రమంగా ఆయన వస్తువులో వైవిధ్యం చూపవలసి వచ్చింది.
వాస్తవానికి అతి దగ్గరగా ఉండే రేఖా చిత్రాలతో ప్రారంభమైన చంద్రశేఖర్ చిత్రకళా జీవితం కొంతవరకు సరియలిస్టిక్ పద్ధతికి చేరువగా జరిగింది. తొలుత వారి చిత్రాలలో ఆకారాలు మనిషిలాగా తోస్తాయి. వాటికి మృగాల తలలు. వాటి మానసిక ప్రవృత్తి ఒకసారి జతచేస్తే మరోసారి వాటి శరీరాలు, వారి
జీవనశైలి జత చేశారు. ఏమైనా చంద్రశేఖర్ గీసే చిత్రాలలో పనితనం, చురుకుదనం ద్యోతకమవుతుంది. తోకలేని కోతులను ప్రతిబింబిస్తూ ఆయన వేసిన అనేక చిత్రాలు ఆయన భావనాశక్తిగా, సృజనకు గీటురాళ్ళు.
సమకాలీన చిత్రకారుల రచనలను సాధారణ ప్రజానీకం అర్థం చేసుకోలేక పోతున్న అంశాన్ని ఆయన దృష్టికి తెచ్చినప్పుడు-అది నిజమేనని, ప్రజానీకానికి-కళాకారుడికి మధ్య అఖాతం ఉందని, అది తొలగిపోవాలంటే చాలాకాలం పడుతుందని ఆయన చెప్పేవారు. పాఠశాల స్థాయినుంచే డ్రాయింగ్‌ను విద్యార్థుల పాఠ్యాంశంలో చేర్చితే ఈ సమస్య త్వరగా తొలగిపోతుందన్నారు. పైగా డ్రాయింగ్ ప్రాథమిక దశలో నేర్చుకుంటే-సాంకేతిక, వృత్తి విద్యా కోర్సుల విద్యార్థులకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందనేవారు. డ్రాయింగ్ అభ్యాసంవల్ల విద్యార్థులలో ఓపిక, గ్రహణశక్తి దానంతట అదే అభివృద్ధి అవుతుందనేవారు.
రాష్ట్రంలో హైదరాబాద్-సికిందరాబాద్ జంటనగరాలను మినహాయిస్తే సిద్ధిపేటలాంటి ఒకటి రెండు పట్టణాలు మినహా మరెక్కడా సృజనాత్మకమైన చిత్రకళపట్ల ఆసక్తి కనబడడంలేదని, స్థానిక సంస్థలు ఈ కళపట్ల శ్రద్ధ వహించాలని, కళా ప్రదర్శనలు ఏర్పాటు చేసి, ఆయా చోట్ల ప్రజానీకంలో చిత్రకళపట్ల అభిరుచి పెంపొందించాలని ఆయన ఆకాంక్షించేవారు.
లలితకళల కళాశాలల్లోనూ విద్యార్థులకు సరైన శిక్షణ ఉండడం లేదని, దీనివల్ల ఒకతరం కళాకారులలో నైపుణ్యంపాలు తగ్గే ప్రమాదం పొంచి ఉందని ఆయన ఆందోళన చెందేవారు. అయితే మన రాష్ట్రంలో ఎవ్వరికీ తీసిపోని ఉన్నత కళాకారులు ఉన్నారన్నారు. వారు సైతం శ్రద్ధ తీసుకుని తర్వాత తరానికి మార్గదర్శనం చేస్తే మన చిత్రకళారంగం మరెంతో పురోగమించగలదనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేసేవారు.
యన్.టి. రామారావు హయాంలో రాష్ట్ర లలితకళా అకాడమి తెలుగు విశ్వవిద్యాలయంలో విలీనం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత తెలుగు విశ్వవిద్యాలయం రాష్ట్రంలో చిత్రకళ, చిత్రకారుల వికాసానికి చర్యలేమి తీసుకున్నదని సింహావలోకనం చేస్తే-ఒకరకంగా సున్నకు సున్నా, హళ్ళికి హళ్ళి అని చెప్పవచ్చు. ఆనాడు చంద్రశేఖర్ వ్యక్తం చేసినట్టుగా లలిత కళా అకాడమి విశ్వవిద్యాలయంలో విలీనం కాకుండా వేరుగా ఉంటే – అకాడమి కార్యక్రమాలు పరంపరగా సాగేవి. మన చిత్రకళారంగం నిస్సందేహంగా సుసంపన్నమయ్యేది.
మన యువ చిత్రకారుల గురించి చంద్రశేఖర్ ఎప్పుడూ యోచించేవారు. వారు కేవలం కొంగ్రొత్త ధోరణులలో చిత్రించడం అలవాటు చేసుకోవాలనే యావకన్నా, ముందుగా మన సంప్రదాయ చిత్ర లేఖనం గురించి విపులంగా తెలుసుకోవాలనేవారు. మన ప్రాచీన శిల్పుల పనితనంలోని ఔచిత్యాన్ని అర్థం చేసుకోవాలని సూచించేవారు. ఆ తర్వాతనే ఇతర రాష్ట్రాలలో, ఇతర దేశాలలో వస్తున్న ధోరణులను అధ్యయనం చేయాలని చెప్పేవారు. ఇవన్నీ గ్రహించిన యువ చిత్రకారులు ప్రయోగాత్మక పద్ధతిలో, కళావిలువలను మరువకుండా, సమకాలీన సమాజం నుంచి ఎంతమాత్రం వేరు పడకుండా నిరంతర కృషి చేయాలనే ఆయన అభిప్రాయాన్ని పదేపదే చెప్పేవారు.
1940, ఫిబ్రవరి 2వ తేదీన సికింద్రాబాద్‌లో పుట్టిన చంద్రశేఖర్ ఎవరూ ఊహించనంత పిన్న వయస్సులోనే చిత్రాలు గీయడం ప్రారంభించాడు. ఎర్రమట్టితో అలికిన ఇంట్లో సుద్ద ముక్కతో బొమ్మలు వేయడంలో చంద్రేశేఖర్ చిత్ర కళా జీవితం ప్రారంభమయిందనవచ్చు. చూడచక్కని బొమ్మలు వేస్తున్న కొడుకుకు రంగురంగుల సుద్దముక్కలు కొనిచ్చి తండ్రి ప్రోత్సహించాడు. దీనితో మెట్రిక్‌దాకా గురువు లేకుండానే చిత్రాలు వేయడం చంద్రశేఖర్ సాధన చేశాడు. ఎందరో ప్రముఖ చిత్రకారుల చిత్రాలు, క్యాలెండర్లు నకళ్ళు చేశాడు.
ప్రముఖ చిత్రకారుడు సంజీవరావు బకెల్ చిత్రాలు చూశాక ఆయన చిత్రకళనే తన జీవిత లక్ష్యంగా మలచుకోవాలని తపించి, 1969లో హైదరాబాద్‌లోని కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్‌లో చేరి ప్రథమశ్రేణిలో డిప్లొమా పొందాడు. చిత్ర లేఖనంలోని అన్ని ప్రక్రియల్లో చిత్రాలు వేయడంలో నైపుణ్యం పొందాడు. డ్రాయింగ్స్ గీయడంలో మాత్రం చంద్రశేఖర్ గీత చంద్రశేఖర్‌దే. జీవితచిత్రాలు, వ్యక్తి చిత్రాలు, ప్రకృతి చిత్రాలు, స్టిల్ లైఫ్‌లో వేసిన చంద్రశేఖర్ ఒక్కసారిగా ఒక దశలో అన్ని ఆపివేసి, కేవలం డ్రాయింగ్స్ వేయడమే సాధన చేశాడు. ఒకసారి వారి కళాశాలకు అప్పటి గవర్నర్ పట్టంథాన్ పిళ్ళేవస్తే-కేవలం నాలుగున్నర నిమిషాల్లో ఆయన చిత్రం గీసి గవర్నర్‌ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాడు. అలాంటి సమయస్ఫూర్తిగల చంద్రశేఖర్ లెఫ్ట్‌నెంట్ కల్నల్ వేణుగోపాల్ దృష్టిని ఆకర్షించాడు. యుద్ధ చిత్రాలు, వ్యక్తి చిత్రాలు, ప్రకృతి చిత్రాలు సైన్యంకోసం కావాలని ఆయనతో సుమారు రెండువందల దాకా చిత్రాలు వేయించాడు. ప్రసిద్ధ వ్యక్తుల చిత్రపటాలను ‘సజీవమూర్తులు’ కాబోలు! అన్నంత సహజసుందరంగా రూపొందించాడు.
ఆ తర్వాత ఆయన గ్రామీణ జీవితాన్ని వస్తువుగా తీసుకుని వారి కష్టాలు-కన్నీళ్ళు వ్యక్తం చేసే చిత్రాలెన్నో వేశాడు. వాటిలో భారతీయ సంస్కృతి, ఆచార వ్యవహారాలు ప్రతిబింబించాడు. పుంఖానుపుంఖంగా చిత్రాలు వేస్తున్న తరుణంలోనే చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లలితకళా అకాడమికి కార్యదర్శి అయ్యాడు.
అయినా, తానెంత తీరికగా లేకున్నా సమయం చిక్కించుకుని చిత్రాలు వేసి 1975నుంచి ఐదుమార్లు వ్యష్టిచిత్రకళా ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. మూడు నాలుగు పర్యాయాలు సమష్టి చిత్రకళా ప్రదర్శనల్లో, రెండు పర్యాయాలు-న్యూఢిల్లీ, మద్రాసులో ఏర్పాటు చేసిన చిత్రకారుల శిబిరాల్లో పాల్గొన్నారు. వారు రూపొందించిన చిత్రాలకు 1973లో అఖిలభారత స్థాయి గ్రాఫిక్ ప్రదర్శనలో అవార్డు లభించింది. అదే సంవత్సరం జాతీయ నాయకుల వ్యక్తి చిత్రాల ప్రదర్శనలో వీరు వేసిన చిత్రానికి బహుమతి వచ్చింది. ఆ తర్వాత – 1974, 1975, 1976లో హైదరాబాద్ ఆర్ట్ సొసైటీవారి బహుమతులు వరుసగా అందుకున్నారు. 1975లో ఆంధ్రప్రదేశ్ చిత్రకారుల మండలి ఏర్పాటు చేసిన మూడు దశాబ్దాల చిత్రలేఖన ప్రదర్శనలో వీరి చిత్రానికి బహుమతి లభించింది. 1977లో మినియేచర్ బైనాల్‌లో స్వర్ణపతకం గెలుచుకున్నారు. నాల్గవ ట్రైనాలేలో వీరి చిత్రానికి ప్రశంసలు వచ్చాయి. 1980 బొంబాయి చిత్రకారుల కేంద్ర అవార్డు, 1982లో కేంద్ర ప్రభుత్వ జూనియర్ ఫెలోషిప్ అవార్డు వచ్చింది. 1981లో మలేసియా, సింగపూర్ వెళ్లి చిత్రాలు ప్రదర్శించారు. వారి డ్రాయింగ్-1983 చిత్రానికి అవార్డు వచ్చింది. వారి చిత్రాలు పాత ఆంధ్రప్రదేశ్ లలిత కళా అకాడమి, సాలార్‌జంగ్ మ్యూజియం, సమకాలీన చిత్ర కళా మ్యూజియంతోపాటుగా కేంద్ర లలిత కళా అకాడమి, నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడ్రన్ ఆర్ట్స్ (ఢిల్లీ), యంగ్ గ్యాలరీ (మలేసియా) సేకరించారు. ఇంత విశిష్ట కృషి చేసి విశేష సేవలందించిన చంద్రశేఖర్ తన యాభయవ యేట 1997 అక్టోబర్ 6న ఆకస్మికంగా ఒక రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు.