ముస్లిం సోదరులు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆనందోత్సహాలతో జరుపుకునే అతి ముఖ్య పండుగలు రెండు. మొదటిది, పేదల హక్కులకు పెద్దపీట వేసి మానవీయ ఉపవాసానికి శ్రీకారమైన రంజాన్ (ఈదుల్ ఫిత్ర్). రెండోది త్యాగానికి ప్రతీకగా నిలిచిన బక్రీద్ (ఈదుల్ అజ్‌హా). రంజాన్ పండుగ మానవత్వానికి ప్రతీకగా నిలిచి తన సంపాదనలో పేదలకు ఉన్న హక్కును అందించగా, బక్రీద్ తనను తాను అర్పించుకునే త్యాగానికి ప్రతీకగా నిలిచింది. తనకు అత్యంత ప్రియమైనది త్యాగం చేసి దైవ ప్రసన్నత పొందే మాసం.
ఈ పండుగ పేరు వినగానే మనకొక మహత్తరమైన సంఘటన గుర్తుకు వస్తుంది. దైవప్రవక్త హజ్రత్ ఇబ్రాహీం (అ) తనకు అత్యంత ప్రియమైన ఏకైక సంతానాన్ని దైవానికి సమర్పించుకున్న అపూర్వ చారిత్రక సన్నివేశం హృదయాంతరాల్లో మెదులుతుంది. దాదాపు ఐదువేల సంవత్సరాల క్రితం ప్రస్తుత ఇరాక్ దేశంలో జన్మించిన ఇబ్రాహీం దైవాంశ సంభూతుడిగా తనను తాను ప్రకటించుకున్న దుష్టరాజు నమృద్ బారి నుంచి ప్రజలను కాపాడేందుకు గళం విప్పారు. సమాజంలో పాతుకుపోయి ఉన్న దురాచారాలపై, ముఖ్యంగా విగ్రహారాధన లాంటి విషయాలను వ్యతిరేకించారు. సకల చరాచర సృష్టికి మూలాధారమైన పరాత్పరుణ్ణి మాత్రమే పూజించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. దీంతో ఆగ్రహించిన రాజు భగభగ మండే అగ్నిగుండంలో ఇబ్రాహీంని పడవేయించాడు. కాని దైవ మహాత్యంతో ఆయనకు ఏమి కాలేదు. అగ్నిగుండం పూలపాన్పుగా మారింది. అయినా రాజులో మార్పు రాలేదు. ఈ సారి ఏకంగా దేశ బహిష్కారం చేశారు.
చేసేది లేక ఇబ్రాహీం దంపతులు దైవ సందేశాన్ని ప్రచారం చేస్తూ, దేశ దిమ్మరుల్లా జీవితం గడుపుతూ మక్కాకు చేరుకున్నారు. వయసు పై బడుతున్న కొద్దీ తన తదనంతరం దైవ సందేశ కార్యభారాన్ని నిర్వర్తించడానికి సంతానం ఉంటే బాగుండునన్న కోరిక కలిగేది. ఈ కోరికను ప్రార్థన రూపంలో దైవానికి విన్నవించుకోగా ఓ శుభఘడియలో దైవం పండంటి బిడ్డను ప్రసాదించాడు. లేకలేక కలిగిన బిడ్డనుచూసుకొని ఆ దంపతులు ఎంతగానో మురిసి పోయారు. అల్లారు ముద్దుగా పెంచుకోసాగారు. ఆ సంతోషం ఎంతోకాలం నిలవలేదు. దేవుడాయనకు మరో పరీక్ష పెట్టాడు. భార్యను, కొడుకును జనసంచారం లేని ఎడారి ప్రాంతంలో వదిలేసిరమ్మని ఆదేశించాడు. ఈ ఆదేశాన్ని ఇబ్రాహీం తన శ్రీమతి హాజిరా (అ)తో చర్చించారు. అందుకు ఆమె మౌనంగానే అంగీకరించి జనసంచారంలేని ఎడారి ప్రాంతంలో నిస్సహాయంగా నిలిచారు.
నాలుక తడుపుకోడానికి సైతం గుక్కెడు మంచి నీళ్ళుకరువైన ఆ ప్రదేశంలో చిన్నారి పసికందు దాహంతో గుక్కపట్టి, వెక్కివెక్కి ఏడుస్తుంటే, పసివాడి నాలుక తడపడానికి తల్లి హాజిరా అక్కడి రెండు పర్వతాల(సఫా, మర్వా) మధ్య నీటికోసం వెదుకుతూ అటూఇటూ పరుగులు తీస్తారు. ఆ అపురూప దృశ్యాన్ని ప్రళయకాలంవరకు సజీవంగా ఉంచడానికి హాజీలకు ‘సయీ’ ఆదేశాలనిచ్చాడు దైవం. అలాగే చిన్నారి ఇస్మాయీల్ దాహంతో ఏడుస్తూ కాలిమడిమెలతో నేలను రాసినచోట దైవాజ్ఞతో అద్భుతమైన నీటిఊట వెలిసింది. ఆబే ‘జమ్ జమ్’. ఆ నీటితో తల్లీబిడ్డ దాహం తీర్చుకున్నారు. ఆ పవిత్రజలాన్నే ఈనాటికీ ప్రపంచ వ్యాప్త ముస్లిములందరూ తీర్ధజలంగా సేవిస్తున్నారు. ఆనాడు రెండు ప్రాణాల కోసం వెలసిన ‘జమ్ జమ్’ నేటికీ కోట్లాది ప్రజల అవసరాలు తీరుస్తూ, తన మట్టాన్ని యధాతథంగా ఉంచుకోవడం గమనిస్తే అల్లాహ్ ప్రత్యక్ష మహిమకు ఇంతకన్నా ఇంకేం నిదర్శనం కావాలనిపిస్తుంది. ఆనాటి ఆ నిర్జనఎడారి ప్రాంతమే ఈనాడు సుందర మక్కా నగరంగా రూపుదిద్దుకొని ప్రపంచ ముస్లిం ప్రజానీకానికి పవిత్ర పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతోంది.
ఆ తరువాత కొంత కాలానికి దైవాదేశం మేరకు ఇబ్రాహీం మక్కా తిరిగొచ్చి భార్యా బిడ్డల్ని కలుసుకున్నారు. తనయుడు చిన్నారి ఇస్మాయీల్‌తో కలసి కాబా గృహాన్ని నిర్మించారు. తరువాత ఆయనకు మరో పరీక్ష ఎదురైంది. ఐతే ఇది మామూలు పరీక్ష కాదు. మానవ ఇతిహాసం కనీవిని ఎరుగని పరీక్ష. ఈసారి దైవం ఏకంగా కన్నకొడుకునే త్యాగం చెయ్యమని కలలో ఆదేశించాడు. ఇబ్రాహీం ఎంతమాత్రం వెనుకామూందూ ఆలోచించలేదు. శ్రీమతిని సంప్రదించాడు. ఆమె సంతోషంగా అంగీకరించింది. ఇద్దరూ కలిసి తనయుణ్ణీ సంప్రదించారు.’ నాన్నా! దైవాదేశాన్ని వెంటనే నిర్వర్తించండి. నేను సహనం వహిస్తాను’. అన్నాడు ఆ తండ్రికి దగ్గ తనయుడు. నిర్ణీత ప్రదేశానికి చేరుకొని తండ్రీకొడుకులిద్దరూ దైవాదేశ పాలనకు ఉపక్రమించారు. నన్ను చూస్తూ నా గొంతు కోయలేరు కనుక మీరు కళ్లకు గుడ్డ కట్టుకుని నా మెడపై కత్తి నడపండి అంటూ చిన్నారి ఇస్మాయిల్ చేసిన సూచనకు తండ్రి ఇబ్రాహీం తల్లడిల్లి పోయాడు. దైవవాకృపాలకుడైన తాను గుండె నుంచి ఉబికి వస్తున్న మనోవేదనను బలవంతంగా దిగమింగుకుని గుండెలనిండ ఊపిరి పీల్చుకుని ప్రియమైన కుమారుడు ‘జబహ్’ చేయడానికి ఉపక్రమించాడు. దీంతో తనప్రియ ప్రవక్త పై దైవప్రసన్నత పతాక స్ధాయిన ప్రసరించింది.’ నాప్రియ ప్రవక్తా ఇబ్రాహీం! నువ్వుకేవలం స్వప్నంలో చూసినదాన్ని అక్షరాలా నిజంచేసి చూపించావు. నా ఆజ్ఞా పాలనలో విూరు మానసికంగా సిద్ధమైన క్షణంలోనే నేను ప్రసన్నుడనయ్యాను. నాపరీక్షలో విూరు అగ్రశ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. సంపూర్ణ విశ్వాసం విూ ప్రతి శ్వాసలో తొణికిసలాడింది. ఇక భౌతిక చర్యగా మిగిలిన త్యాగకార్యం కోసం ఒక స్వర్ణ పొట్టేలును పంపు తున్నాను’. అనిపలికింది దైవ వాణి. బాబు ఇస్మాయీల్ స్ధానంలో పొట్టేలును జబహ్ చేశారు హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాం. నాటి సంఘటనను స్మరించుకుంటూ తమ ఇళ్ళవద్ద ఖుర్బానీలు ఇస్తారు ముస్లిం సోదరులు. ఆర్థిక స్థోమత కలిగిన ప్రతి ముస్లిం జీవితకాలంలో ఒక్క సారైనా హజ్ యాత్ర చెయ్యాలి. దైవానికి కావలసింది రక్తమాంసాలు, సిరిసంపదలు కాదు. కేవలం చిత్తశుద్ధి, సచ్ఛీలత, మానవీయత, దైవభక్తి మాత్రమే.
– సయ్యద్ అహ్‌సన్ హష్మి