tsmagazine
ఆదిలాబాదు గోండు ఆదివాసీలంటే వెంటనే తలం పుకు వచ్చేది తలపైన నెమలిఈకల పెద్దటోపీలు ధరించి విచిత్రమైన వేషధారణతో లయబద్ధంగా నృత్యం చేస్తూ కదిలే ‘గుసాడి’ నృత్యకారులు.అయితే రంగస్థలం (స్టేజి) పైనో, సభలూ, సమావేశాల్లో ప్రముఖులను ఆహ్వానిస్తూనో చేసే గుసాడి నృత్యాన్ని మాత్రమే చూసినవాళ్లకు గోండు, ఇంకా కొలాం ఆదివాసీల అతిముఖ్యమైన సామాజిక ఉత్సవం ‘దండారి’లో గుసాడిలు ఒక భాగమని గాని, దండారి వంటి అతిమనోహరమైన, నృత్య, సంగీతమయమైన ‘సోవ పండుగ (శోభాయమైనపండుగ) ఏ సంస్కృతిలో నైనా అరుదనిగాని ఊహించడం కొద్దిగా కష్టమే.

దండారి పండుగ ఉమ్మడి అదిలాబాదు జిల్లా (ఇప్పుడు నాలుగు జిల్లాలు : అదిలాబాదు, కుమురంభీం-ఆసిఫాబాద్‌, నిర్మల్‌, మంచిర్యాల), దానికి ఆనుకొని ఉన్న మహారాష్ట్ర (విదర్భ) లోని జిల్లాల్లోనూ ఉండే రాజ్‌గోండులకు, కొలాంలకు ప్రత్యేకమైనది.

క్లుప్తంగా చెప్పుకోవాలంటే, దండారిలో ఒక ఊరివారు తమకిష్టమైన, తమఊరితో మంచి సంబంధాలున్న ఊరికి అతిథులుగా ఊరేగింపుగా వెళ్తారు. ఇందులో కోలాటం (దండారి అంటేనే కోలాటం) వేసేవాళ్ళు (యువకులు, మగ పిల్లలు); గుమేల, పర్ర, వెట్టె ఈ ప్రత్యేకమైన దండారి వాయిద్యాలు,చాలా పెద ్దతోలుడప్పులు (10,20 నుండి 50, 60 దాకా ఉండొచ్చు), తుడుం, పేప్రె (సన్నాయి), కాలికొం (కొమ్ము) ఈ వాయి ద్యాలు వాయించేవాళ్లు; ‘పోరిక్‌’ అంటే ఆడపిల్లల వేషాలు వేసిన పోర గాల్లు; గుసాడివేషగాళ్లు; తోడుగా వెళ్లేవాళ్లూ ఉంటారు. ఆతిథ్యం ఇచ్చే ఊరిలోకి చీకటి పడే వేళకు ప్రవేశించడం, వాళ్ల అతి స్నేహ పూర్వకమైన ఆతిథ్యాన్ని, మర్యాదలను (ఆడ పెళ్లి వారే వచ్చినట్టుగా! గోండు సంప్రదాయంలో వరుడి ఇంట్లోనే పెళ్ళిళ్ళు ఎక్కువగా జరుగుతుంటాయి.) అందుకోవడం, అక్కడి డప్పులబృందంతో కలిసీ, విడిగాకూడా జోరుగా డప్పులూ, తుడుమూ వాయించడం; పలురకాల (గుసాడిలవి, కోలాటాలవి, రెండూ కలిసినవి) నృత్యాలు చేయడం; గుమేలా, ఢోల్కీ (చిన్న డోలు) పాటలు పాడడం; మధ్య మధ్య గొప్ప వినోదాత్మకమైన చిన్న, చిన్న హాస్య, వ్యంగ్య నాటికా సన్నివేశాలను ప్రదర్శించడం (వీటిని ‘ఖేల్‌’ అంటారు);

విందులు ఆరగించడం, హాస్యాలు, ముచ్చట్లాడుకోవడంబీ ఒక రాత్రి విశ్రమించి, మరునాడు మళ్లీ ఆటలాడి, పాటలుపాడి, ‘ఖేల్‌’ ప్రదర్శనలతో కడుపారా నవ్వుకొని, డప్పులు మ్రోగించుకొని, సాదరంగా వీడ్కోలు చెప్పిరావడం, స్థూలంగా ఇదీ దండారి స్వరూపం.

సొంత ఊరి నుండి బయలుదేరి వెళ్లడం, తిరిగి రావడం కూడా చెప్పుకోదగ్గ తంతులే! ఆడవాళ్ల దండారి సంప్రదాయం కూడా ఉన్నది!బృందంలోని పెళ్లికాని యువకులు ఈ ఊళ్లో పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల్లో తమకు తగినవారె వరైనా ఉన్నారా అని వెతుక్కోవడం కూడా దండారి ప్రయోజనాల్లో ఒకటి.

ఇంతవిపులమైన దండారి పండుగలో ఉండే ఆచారాలు, పూజలు, మర్యాదలు, చిన్నా పెద్దా ఇతర తంతులూ,సరదాలూ, వాటి అందాలూ, విశేషాలూ అన్నీ వర్ణించి చెప్పాలంటే పెద్ద గ్రంథమే అవుతుంది.దండారి పర్వం వివిధ దశల్లోని కొన్ని విశేషాంశాలను ప్రస్తావించుకోవడానికి మాత్రమే ఇక్కడ వీలవుతుంది.

దండారి ఆటలు (నృత్యాలు), పాటల శిక్షణ, అభ్యాసం ‘బుడ్‌-భావై’ (ఆషాఢ మాసం, జూన్‌-జులై)పౌర్ణమి రోజుకు దగ్గరగా జరుపుకునే ‘అకాడి’ పండుగతో మొదలవుతుంది.’అకాడి’కి ముందు ఒక నెలరోజుల పాటు,అంటే తొలకరిలో విత్తనాలు వేసినప్పటి నుండి మొక్కలు కొద్దిగా పెరిగే వరకు, ఆదిలాబాదు ఆదివాసీ గ్రామాల్లో ఎక్కడా ఏ వాయిద్యాల ధ్వనీ వినిపించదు! ఎదిగే పంటచేలకు ఏమాత్రమూ ఇబ్బంది కలగకూడదని ఈ ప్రశాంత నిశ్శబ్దం!

‘అకాడి’ రోజున దండారి పండుగలో మాత్రమే వాడే గుమేల, పర్ర, వెట్టె అనే తాళ వాయిద్యాలను బయటకు తీసి, అలంకరించి, వాటిని, ఇతర వాయిద్యాలను, ‘టప్పల్‌’ కోడల్‌ (చెక్కతో చేసిన తోడేలు, పులి) ముఖ కవచాలు, గుసాడిలు ధరించే ‘కంకాలి’ టోపీలు, ఆభరణాలు, రోకళ్లతో సహా సామూహికంగా పూజచేసి, వాయిద్యాలను మోగించడం, దండారిపాటలు, నృత్యాల అభ్యాసం మొదలుపెడ్తారు. నాలుగు నెలల పాటు ఆదిలాబాదు కొండాకోనల్లో ప్రతి రాత్రీ ఈ సంరంభం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది.
tsmagazine

‘దివాడి’ (ఆశ్వయుజం) నెలలో పౌర్ణమి వెంటనే వచ్చే ఏదో ఒక రోజున చక్కగా అలికి, అలంకరించబడిన ఊరి ‘పాట్లా’ ఇంటి ముందుండే విశాల ప్రాంగణంలో, నడిమధ్యలో ఉండే ‘ముండ’ అనే అందంగా చెక్కిన పెద్ద్ద కర్రస్తంభం (లేకచెట్టు) చుట్టూ తిరుగోలగా (గుండ్రంగా) చేసే నృత్యాలతో దండారి ఉత్సవాలు మొదలవుతాయి. ఆ రోజే ఇద్దరు ముగ్గురి నుండి తొమ్మిది పదిమందిదాకా గ్రామ యువకులు గుసాడి వేషాలు వేసుకుంటారు.

ఆ తరువాతి పది పన్నెండు రోజుల్లో – దీపావళి తరువాతి రోజు వరకు – ఒక ఊరి దండారిబృందం రెండు, మూడు ఊళ్లకు వెళ్లడం, ఆ ఊళ్ల దండారి వాళ్లు ఈ ఊరికి రావడం చేస్తారు. ఆతిథ్యం ఇచ్చిన ఊరి వారిని సమ్మోహన పరిచే రీతిలో తమ ప్రదర్శన ఉండాలని ప్రతి దండారిబృందం పట్టింపు. వచ్చిన దండారిబృందంవారికిి ఈ ఊరి డప్పులు, తుడుంబృందం ఎదుర్కోలుగా వెళ్ళినప్పుడు రెండుబృందాలూ పోటాపోటీగా చెవులు దద్దరిల్లేలా చేసే మహోదృతమైన ధ్వనులు, అతిథుల కాళ్ళు కడిగి, బొట్టు పెట్టి మక్కువగా, చెలిమిగా చేయి పట్టుకొని (పిల్లలు, ‘పోరిక్‌’ లైతే ఎత్తుకొని మరీ) తీసుకువెళ్లి కూర్చోబెట్టేదృశ్యాలు;

తెల్లని ధోవతులు, అంగీలు ధరించి, నడుముకూ, తలకూ తెల్లని లేక రంగు రుమాళ్లూ కట్టుకొని, చేతుల్లో సన్నని కోలలు ధరించి వచ్చిన దండారి ఆటగాళ్లబృందం వారు వెట్టె, పర్ర వాయిద్యాల దరువుల మీద చేసే ‘మాన్కోలా’ (గౌరవ అభివాదక సూచకమైన కోలాటం), ‘చచ్చోయ్‌’ నృత్యాలు, మెత్తని గుమేలా, పర్ర దరువుల మీద పాడే మెల్లని, మధురమైన పాటలకు అనువుగా చేసే అత్యంత లయాత్మకమైన కోలా టాలు, వారితో కలిసి ‘పోరిక్‌’లు (అమ్మాయిల వేషంలో వచ్చిన యువకులు) కూడా కోలాటం ఆడటం చూడ ముచ్చటగా ఉంటుంది. గజ్జెలు, అందెల రణగొణ సవ్వడులతో, బరువైన లయాత్మకమైన అడుగులు వేస్తూ, ఎడమ చేతితో జింకతోలును వెడల్పుగా కదిలిస్తూ, చాచిన కుడిచేతిలో పట్టుకున్న దండంతో శాసనం చేస్తున్నట్టు, మహత్తరమైన గాంభీర్యంతో, అతిలోకమైన శివసౌందర్యంతో, రెండు ఊళ్ల గుసాడిలు కలగలిసి కోలాటం ఆడేవాళ్లతోనూ, విడిగా కూడా చేసే తిరుగోల నర్తనాలు; కుర్రవాళ్లు, యువకులూ నిలబడి పాడే జోరైన ఢోల్కీ పాటలు, భుజాల మీదుగా చేతులు కలుపుకొని, ఏ వాద్యమూ తోడు లేకుండా తమ శతిదేలిన సన్నని గొంతుకలతో దేవుండ్ల పాటలు పాడుతూ మెల్లని తిరుగోలలా ఈ ఊరి ఆడవాళ్ళు ఆడుతూ ఉంటే, వాళ్లను రక్షిస్తున్నట్టు వాళ్ల చుట్టూ మరో వలయంగా గుసాడిలు ఆడుతుంటారు. కనికట్టులా సాగే ఈ ఆటలు, పాటల మధ్య నిత్యజీవితపు వాస్తవానికి తీసుకు వచ్చి గొప్ప హాస్యమూ, వ్యంగ్యదృష్టీ కలబోసి, పనికొచ్చే సందేశాలు కూడా ఇచ్చే ‘ఖేల్‌’ అనే లఘు వీధి నాటికలు, ఇలా ఎన్నో ఘట్టాలతో సకలేంద్రియాలను, మనస్సును గొప్ప ఉత్సవానందాను భూతితో నింపుతుంది దండారి.

దీపావళి అమావాస్య తరువాతి ఒకటి రెండు రోజుల్లో జరిపే ‘కోలబోడి’తో దండారి పండుగను ముగిస్తారు. ఆనాడు ఏ ఊరికాఊరి దండారి, గుసాడిలబృందం ప్రతి ఇంటికీవెళ్లి, పూజలందుకొని, పరాచ కాలాడి, ఊరవతల ‘చెంచిభీమన్న’ దేవుడుండే ఇప్పచెట్టుదగ్గర దండారి వాయిద్యాలు, దుస్తులు, ఆభరణాలు అన్నీ తీసిపెట్టి, బలులిచ్చి, పూజలు, తాపీగా విందు భోజనమూ చేసి, అన్ని వస్తువులనూ ఇళ్లకు తీసుకువెళ్తారు. గుసాడిలు దగ్గరలో ఉన్న చెరువో, కాల్వకో వెళ్లి, ఒళ్లు కడుక్కొని, స్నానం చేసి, దీక్ష విరమిస్తారు. గుమేల, పర్ర, వెట్టె, ఈ దండారి వాయిద్యాలు మళ్లీవచ్చే ‘అకాడి’ పండుగ వరకు బయటకురావు, వినిపించవు!
tsmagazine

గోండుల పౌరాణిక గాథలు, సంస్కృతీ పెద్దగా తెలియని వారికే ఒక్కసారిచూస్తే చాలు, గొప్ప అనుభూతిగా మిగిలిపోయే దండారి ఉత్సవం, ఆ గాథల వారసత్వంగానే ఏర్పడిన మతాచార సంస్కృతీ సంప్రదాయాల్లో నిత్యం జీవిస్తున్న ఆ జాతి జనులకు ఎంతో ప్రాణ ప్రదంగా ఉండటంలో ఆశ్చర్యం ఏముంది? అయితే రాజ్‌గోండుల్లో ఉన్న నాలుగు శాఖలు లేక గట్ల (‘నాల్వేన్సగ’, ‘సియివేన్సగ’, ‘సార్వేన్సగ’, ‘యేడ్వేన్సగ’ – అంటేనాలుగు, అయిదు, ఆరు, ఏడు(ఆదిగోండు) దేవతల గుంపులు లేక గట్ల – గోత్రాల నుండి జనించినవారు) వాండ్లల్లో వారివారి సగల పౌరాణిక గాథల్లో ఉన్న అపారమైన వైవిధ్యం కారణంగా దండారి ఉత్సవం పుట్టుక గురించి చాలాకథలే ఉన్నాయి. రాజ్‌గోండుల గురించి, విఖ్యాత మానవశాస్త్రవేత్త ప్రొఫెసర్‌ క్రిస్తోప్‌వాన్‌ ఫ్యూరర్‌ హైమండాఫ్‌ రాసిన ప్రామాణిక గ్రంథంలో రెండు మూడు కథలు లభిస్తున్నాయి. ఈ కథలన్నీ కూడా గోండుల తొలితరంతోనే ముడివడిఉండటం విశేషం.

ఆది గోండులు పంటలు, సమృద్ధి బాగా ఉన్న ఒక తరుణంలో, ఆ ఆనందపు రోజులు ఉండగానే పండుగగా చేసుకునే గొప్ప సంబురాన్ని రూపొందించమని అడిగినప్పుడు హీరాసుక్‌ అనే తొలి పరధాన్‌ (‘పరధాన్‌’లు, ‘తోటి’లు గోండుల పురాణాలను, వంశ చరిత్రలను ఆలపించే ఆశ్రిత జాతుల వారు) దండారి వాయిద్యాలను, ప్రక్రియ మొత్తాన్ని రూపొందించి ఇచ్చినాడని ఒక కథ. ఈ కలియుగం చడీ, చప్పుడు లేకుండా నీరసంగా ఉందని ఆది గోండులు దుఃఖిస్తుంటే కోట్కపిట్టె జుంగాల్‌ రావుడ్‌ అనే సాహసికుడు సమస్య పరిష్కారం కోసం వెదుకుతూ సుదూర ప్రయాణం చేసి, సముద్రం మీద వెదుకుతూ ఉంటే ‘యేత్మ సూర్‌’ అనే దేవ జలకన్య గుసాడి రూపంలో మనోహరమైన నృత్యం చేస్తుంటే చూసి ఆమెతో ప్రేమలో పడితే, ఆమె తన వేషభూషణాలను అతనికిచ్చి, గోండులు ప్రతి యేడాదీ యేత్మసూర్‌ (యేర్‌ అంటే నీరు, సుర్‌ అంటే స్వరము అని వింగడించవచ్చు) దేవత రూపం వేసుకొని నృత్య, సంగీతాలతో దండారి చేసుకొమ్మని ఆనతి ఇస్తుంది.

ఇటువంటిదే మరో కథలో దేవుడు తన మనుమరాలైన యేత్మసూర్‌ ను గోండు యువకుడు పెండ్లి చేసుకుంటానంటే ఒప్పుకొని, కాని ప్రతి యేడాదీ తమ లాగే రూపం వేసుకొని, ఆమె చుట్టూ నృత్యమాడి జాగ్రత్తగా కాపాడుకోవాలని నిర్దేశిస్తాడు. ఇంకొక కథా భేదం ప్రకారం అదృష్టాన్ని, సంపదలనిచ్చే లక్ష్మీ సమానమైన యేత్మసూర్‌ దైవత చిహ్నాలుగా దండారి వాయిద్యాలు, అలంకారాలు అన్నింటినీ పూజించి, ధరించి పండుగ చేసుకోవడం జరుగుతున్నది.

సష్టికర్తయైన ‘జటాశంకర్‌ విలాస్‌ గురు’ సష్టి చేయడానికి తపోదీక్ష పూనినప్పుడు సరీమ్‌ మీదకు చెట్లూ పుట్టలు పెరిగి పోయిన ఆయన రూపం వంటిది గుసాడి వేషం అని చెప్పుకోవడం కూడా ఉన్నది. యేత్మ అనగా ఆత్మస్వరూపుడైన ఈశ్వరుని రూపమే గుసాడి అని భావం. మరొక కథలో ఆది గోండులు తమకు భార్యలు కావాలి కదా అని అడిగినప్పుడు గోండుల సగలు, సామాజిక వ్యవస్థలు, మతాచారాలన్నింటినీ ఏర్పరిచిన ప్రవక్త వంటి ‘పహండి కుపార్‌ లింగు’ అభ్యర్థన మీద ‘సొంఖస్తాడ్‌’ గురువు, ‘షేకు’ సోదరుల కూతుళ్లను ఈ యువకులు ఆకర్షించడానికి తగినట్టుగా దండారి ఆటపాటలను రూపొందించినట్టు ఇంకొక కథ ఉన్నది. ఇలా ఒకే అంశం మీద పలు కథలు, తేడాలు ఉండటం జాన పద, పౌరాణికేతిహాసాల్లో మామూలే!

దండారి-గుసాడి పర్వంలో, ఈ కథలన్నీ నిర్దేశించే, సూచించే అంశాలూ, గూఢార్థాలూ, వ్యక్తిపరమైన, సామాజిక ప్రయోజనాలూ పెనవేసినట్టుగా కలగలిసి ఉన్నాయి. దండారిలో పాల్గొన్న వారికీ, చూసిన వారికి కూడా ఆ భావానుభవాలు అన్నీ ఎంతోకొంత అంది తీరుతాయి. ఉదాహరణకు వయసొచ్చిన మగ పిల్లలు ‘పోరిక్‌’ ల వేషాలు వేసుకొని రావడం అనేది, అన్ని మంచి గుణాలు, సామర్థ్యం ఉండి కూడా అణకువగా, అనుకూలంగా ఉండే ఆడపిల్లను ఎంత ప్రేమగా, జాగ్రత్తగా చూసుకోవాలో అన్న విషయం అనుభవపూర్వకంగా తెలుసుకోవాలనే కదా?

తెలంగాణ వాళ్లం, భారతీయులం ఇంత మనోరమమైన అనుభవాన్ని ఒక్కసారైనా పొందాలంటే దీపావళికి ముందు రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాలో దండారి పండుగ బాగా జరుపుకునే గోండు, కొలాం ఒక ఊరిని, వాళ్ల అనుమతి తీసుకునే సుమారు సందర్శించాలి, తప్పక!
tsmagazine

ఎన్నో ఊళ్ల నుండి వచ్చి దర్శించి పోయే గుసాడి, దండారిబృందాలను చూడాలనుకుంటే మంచిర్యాల జిల్లా, దండేపల్లి మండలంలో గోదావరీ నదీ తీరాన ఉన్న ‘పద్మాల్‌ పురి కాకో’ అమ్మవారి పుణ్య క్షేత్రానికి వెళ్లాలి.

గుసాడి వేషం
సుద్ద మన్నులేక బూడిద ను బురదగా చేసి శరీరమంతా పూసి, వేళ్లతో గాని, పల్చటి లోహపు గొలుసుతో గాని రుద్దుతూ గీతల అందమైన విన్యాసాలు వచ్చేలా ముందుగా గుసాడి వేషగాన్ని దిద్దుతారు. ముఖానికి ఎక్కువగా పెంక మసిని, కొన్ని సార్లు తెల్ల సుద్ద రంగును దట్టంగా పూస్తారు. నడుముకు మోకాళ్ల కింది వరకు వచ్చేలా తెల్లని లేక రంగు వస్త్రం (ఒకప్పుడు మేక తోలు ధరించే వారు), దాని పై నుండి పెద్ద ఇత్తడి, కంచు గజ్జెలు, గంటల వడ్డాణము, అరచేతికి, మోచేతికి, చేతిదండాలకు పూసలు, రుద్రాక్షలు, రంగు గుడ్డలు లేక ప్లాస్టిక్‌ పూలతో అలంకరంచిన కంకణాలు, కాలి మడమల పైన బరువుగా ఇత్తడి గజ్జెల వరుసలు, ఎడమ భుజం నుండి వేలాడే చిన్న జోలె, ఒక వెడల్పైన జింక తోలు, మెడ నుండి పెద్ద రుద్రాక్షలు, ఎండిన మేడి, ఇతర అడవి కాయలు, పెద్ద ఫూసలతో చేసిన మాలలు, గంటలు, కుడి చేతిలో ‘గంగారాం సోట’ అని పిలిచే, కర్రతో అందంగా తణెం పట్టిన అలంకరించిన రోకలి కర్ర, తలపై భవ్యమైన ‘కంకాలి’ టోపిబీ ముఖం పైన గోగు నార పోగులతో చేసి కట్టిన గుబురు మీసాలూ, గడ్డాలూ – ఇది గుసాడి రూపం. దీక్ష తీసుకున్న తరువాత దండారి పండుగ పూర్తయ్యే దాకా వారం, పది రోజులు గుసాడిలు స్నానం చేయకూడదు..

గుసాడి టోపి 10, 15 దండారి పండుగల దాకా నిలిచే అతి పవిత్రమైన గుసాడి టోపీలను కొందరు నిపుణులైన గోండులు, కొలాంలే చేయగలరు. పదిహేను వందల కన్న ఎక్కువే నెమలి ఈకలను సేకరించి వాటి తెల్లని కాడలను అల్లికగా మెలివేసి తలకు పట్టే ఒక చిన్న వెదురు బుట్ట అంచు చుట్టూ గట్టిగా కుట్టేసి, నెమలి పింఛాలు పై వైపు అందంగా బయటకు గుండ్రని బుట్టలాగా విస్తరిస్తూ, కదిలినప్పుడు విలాసంగా ఊగేలా ఏర్పాటు చేస్తారు. టోపీకి చుట్టూ, ముఖ్యంగా ముందరి వైపు, పలు వరుసల్లో, పెద్ద అద్దాలతో, రంగు, జరీ దారాలు, చక్కటి డిజైన్లున్న గుడ్ద పట్టీలతో, పలు ఆకారాల రంగు రంగు చెమ్కీ బిళ్లలు, చిన్ని గంటల మాలలతో, కొన్ని సార్లు రెండు పక్కల జింక కొమ్ములతోనూ అలంకరిస్తారు.

సుమనస్పతి రెడ్డి

Other Updates