ibraheempurసిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో నగదు రహిత లావాదేవీల తొలి గ్రామంగా సిద్దిపేట మండలం ఇబ్రాహీంపూర్‌ నమోదు అయింది. ఈ గ్రామానికి చెందిన ముత్తవ్వ క్యాష్‌ లెస్‌ ద్వారా తన కార్డు ఉపయోగించుకొని రేషన్‌ షాపులో 12 కిలోల బియ్యం కొనుక్కున్నది. రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌ రావు డిసెంబర్‌ 5న ముత్తవ్వ సహా అయిదుగురికి బియ్యం, చెక్కర వంటి నిత్యావసర సరుకులు స్వయంగా తూకం వేసి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ పాతూరి సుధాకరరెడ్డి, ఎంఎల్‌ఏ బాబూ మొహన్‌, కాన్సర్‌ వైద్యుడు పద్మశ్రీ డాక్టర్‌ రఘురాం తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామాన్ని మంత్రి హరీశ్‌ దత్తత తీసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను రద్దుచేసిన అనంతరం తెలంగాణ రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఇందులో భాగంగా సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదురహిత లావాదేవీలకు ఒక మోడల్‌ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలని సీఎం ఆదేశించారు.

ఇబ్రహీంపూర్‌ గ్రామ జనాభా దాదాపు 1200 మంది. ఈ గ్రామంలో ప్రజలందరికీ ఎకౌంట్లు తెరవడం, డెబిట్‌ కార్డులు, స్వైపింగ్‌ మెషీన్ల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. నగదు రహిత లావాదేవీలకు ఈ గ్రామం అందరికీ ఆదర్శం కానున్నట్టు మంత్రి తెలిపారు. మంత్రి హరీశ్‌ రావు నిరంతర కషి, శ్రమ, ప్రజల్లో ఆయన కల్పిస్తున్న విశ్వాసం తమ గ్రామం నగదు రహిత గ్రామంగా రికార్డులకు ఎక్కుతున్నదని గ్రామ సర్పంచ్‌ కుంభాల ఎల్లారెడ్డి తెలియజేశారు. ఇబ్రాహీంపూర్‌ లో నగదు రహిత కార్యక్రమాల అమలు తీరును మంత్రి హరీశ్‌ రావు స్వయంగా పరిశీలించారు. ఈ నియోజకవర్గంలో నగదు రహిత తొలి గ్రామానికి ప్రకటించిన 10 లక్షల ప్రోత్సాహక బహుమతి ఇబ్రాహీంపూర్‌కు దక్కనుంది.

సిద్ధిపేట నియోజకవర్గం ఇప్పటికే రాష్ట్రానికి అనేక అంశాల్లో రోల్‌ మోడల్‌. దక్షిణాదిలోనే నగదు రహిత లావాదేవీల తొలి తెలంగాణ గ్రామంగా ఇబ్రహీం పూర్‌ చరిత్ర పుటల్లోకి ఎక్కింది. సిద్ధిపేట ఘనతను మరోమారు ప్రపంచానికి చాటిచెప్పింది. కేబినెట్‌ సమావేశంలో సిద్దిపేట నియోజకవర్గాన్ని నగదు రహిత లావాదేవీల పైలట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసి పదిహేను రోజులు గడవ లేదు. అసాధ్యమని భావించిన అంశాన్ని సుసాధ్యం చేసి చూపిన తీరు మిగతా తెలంగాణ గ్రామాలన్నింటికి ఆదర్శంగా నిలువనుంది.

Other Updates