మొత్తం 10 జిల్లాలో మంచినీటి దాహార్తిని తీర్చటం తక్షణ కర్తవ్యంగా భావించిన ముఖ్యమంత్రి కెసీఆర్ లక్షకిలో మీటర్ల దూరం పైపులైన్‌లు వేసి గడపగడపకు మంచినీటి సౌకర్యం కల్పిస్తాననే పనిని భుజం మీద వేసుకున్నారు. ప్రతి వ్యక్తికి స్వచ్ఛమైన మంచినీళ్లను అందించటం పాలకుల బాధ్యత. ఆపనికి పూనుకోవటం తెలంగాణ పునర్నిర్మాణానికి తొలిమెట్టుగా భావించవచ్చును.
హైదరాబాద్‌లో మంచినీటి సమస్య తీర్చటానికి నిజాం ప్రభుత్వంలో నాటి ఇంజనీర్ అలీనవాజ్‌్‌జంగ్ బహదూర్ ఎంతో కృషి చేశారు. 1908లో హైదరాబాద్‌ను వరదలు ముంచేసినప్పుడు మోక్షగుండం విశ్వేశ్వరయ్య హైదరాబాద్ నీటి వసతిపై ప్రత్యేక ప్రణాళిక తయారుచేశాడు. అలీనవాజ్ జంగ్ కృషితో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, జలాశయాలను నిర్మించటం జరిగింది. భూగర్భ డ్రైనేజి వ్యవస్థను నిర్మించటం జరిగింది. ఇప్పటికీ హైదరాబాద్ దాహార్తిని ఆరెండు సాగరాలే తీరుస్తున్నాయి. నిజాం పాలన తర్వాత మొత్తం తెలంగాణ 10 జిల్లాలకు సంబంధించి దాహార్తి తీర్చేందుకు కెసీఆర్ మంచినీటిని అందించే వాటర్ గ్రిడ్ పథకానికి రచన చేశారు.
అందరికీ మంచినీళ్లు
గొంతెండిన తెలంగాణ దాహార్తి తీర్చవలసి ఉంది. స్వాతంత్య్రం వచ్చి ఆరు దశాబ్దాలు గడుస్తున్నా గుక్కెడు మంచినీళ్లు దొరకని పల్లెలున్నాయంటే ఆశ్చర్యమేమీ కాదు. ఇప్పటివరకు పాలించిన మన పాలకులు కనీసం ప్రతి మనిషికి మంచినీళ్లు అందించలేకపోయారు. ప్రతి మనిషికి మంచినీళ్లు అందించటం ప్రాథమిక హక్కు. సాగునీటికే దిక్కులేనప్పుడు ఇక త్రాగునీరు గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ప్ల్లోరోసిస్ పెనుభూతమై లక్షలాది మంది ప్రజలను నిర్వీర్యుల్ని చేసింది. ఈ ప్లోరోసిస్ విషజలాలు తాగిన వారి పుట్టుకనే ప్రశ్నార్థకంగా మారింది. దీనివల్ల యవ్వనంలో ఉండే యువకులు వృద్ధులుగా మారిపోతున్నారు. అంగవైకల్యం అనుభవిస్తున్నారు. శారీరకంగా పలు జబ్బుల బారిన పడుతున్నారు. జీవితంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా ఈ ఫ్లోరిన్ విషజలాల వల్ల జీవితాలే దుర్భరమైపోయాయి. కనీసంగా మంచినీళ్లను కూడా అందించలేని మన పాలకుల మాటలు మాత్రం అపరభగీరథులను తలపించే విధంగా ఉన్నాయి. ఈ దుస్థితి మారాలంటే ప్రజలందరికీ మంచినీళ్లు అందాలి. వండుకునే వంటకు మంచినీళ్లు అందాలి. పండించే పంటకు విషజలాలు అందకుండా ఉండాలి. ఇంత తీవ్రమైన సమస్యకు శాశ్వతంగా చరమగీతం పాడనున్నట్లు కెసిఆర్ ప్రకటించాడు. ఫ్లోరిన్ భూతాన్ని తరిమికొట్టేందుకు పాతాళజలాలను సంరక్షించటంతో పాటు కృష్ణా గోదావరి నదుల నుంచి 160 టింఎసీల నీటిని మళ్లించే పథకానికి రూపకల్పన చేశాడు. కృష్ణా నది నుంచి 80, గోదావరి నుంచి 80 టిఎంసీల నీటిని మల్లించేందుకు బృహత్తర పథకం రచనలు చేశారు. తెలంగాణ నేలపై 1 లక్షా 15 వేల కిలోమీటర్ల మేరకు పైపులైన్‌లు వేసి మంచి నీటిని గడపగడపకు అందిస్తానని ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటన చేశారు. ఇదివిప్లవాత్మకమైన నిర్ణయంగానే ప్రజలు భావిస్తున్నారు. తాగునీటి కష్టాలను తీర్చేందుకు తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ (టీడిడబ్ల్యూజీ) పథకం ప్రవేశపెడుతున్నట్లు కెసిఆర్ ప్రకటించాడు. ఈ పథకం పూర్తి అయితే ఇక తెలంగాణలో మంచినీళ్లు దొరకని ప్రాంతాన్ని ఎక్కడ వెతికినా దొరకదు. అవును ఈ బృహత్తర పని విజయవంతం కావాలని మొత్తం సమాజం హర్షం వ్యక్తం చేస్తుంది. మరి ఈ పథకానికి 40 వేల కోట్ల రూపాయల నిధులు ఎక్కడ నుండి తెస్తారని ప్రతిపక్షాలు అప్పుడే విమర్శలు మొదలుపెట్టాయి. తాగునీటితో పాటుగా ఈ పథకం ద్వారా పారిశ్రామిక అవసరాలకు కూడా 10 శాతం నీటిని అందించబోయే పనికి శ్రీకారం చుట్టబోతున్నారు. పాలకుడు తలుచుకోవాలి. కానీ కాలచక్రంతో పాటుగా జలచక్రాన్ని కూడా గిర్రునా తిప్పేయవచ్చును. పాలకులకు అసలు సంకల్పమే కలుగుకపోతే పల్లెలు గొంతెండిపోతాయి. పల్లెలు తాగునీరు లేక కన్నీరు పెడతాయి. సాగునీరు లేక చెరువులు ఎండిపోతాయి.
”నల్లగొండ జిల్లా ప్రజల దుఃఖం నాకు తెల్సినంతగా మరెవ్వరికీ తెల్వదు. దేశపతి శ్రీనివాస్, నేను ఎనిమిది రోజుల పాటు ఇక్కడే పడుకుని, గ్రామ గ్రామాన తిరిగి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నాం. నల్లగొండ బాధను, దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకున్నా, ”చూడు చూడు నల్లగొండ” అనే పాట నేను దేశపతి కల్సి రాసినం. నల్లగొండ జిల్లా నుంచి ఫ్లోరైడ్ రక్కసిని పారదోలాలని నిర్ణయించినం. అందుకే మునుగోడులో వాటర్‌గ్రిడ్ పైలాన్ ఏర్పాటు చేశాం”.
– కల్వకుంట్ల చంద్రశేఖరరావు
కోట్లాది మందికి ఫ్లోరిన్ కాటు
మన సువిశాల భారతదేశంలో 640 జిల్లాలో 275 జిల్లాలు ఫ్లోరిన్ విషపు కాటుకు తల్లడిల్లుతున్నాయి. అంటే దేశంలో మూడవ వంతు ప్రజలు తాగునీరు అందక తీవ్ర క్షోభను అనుభవిస్తున్నారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 17 జిల్లాలు ఈ విషపు కోరల్లో చిక్కుకుపోతే తెలంగాణ రాష్ట్రంలో నల్లగొండ, వరంగల్, మహబూబ్‌నగర్, మెదక్, కరీంనగర్‌లలో ఫ్లోరోసిస్ సమస్య తీవ్రంగానే ఉంది. నల్లగొండ జిల్లా దేశంలో ఫ్లోరిన్ పీడిత ప్రాంతంగా గుర్తించబడింది. నల్లగొండ జిల్లాలోని 59 మండలాల్లో 42 మండలాలలో ఫ్లోరిన్ ప్రభావం తీవ్రంగా ఉంది. జిల్లాలోని సుమారు 36 లక్షల మంది ప్రజలలో 8 లక్షల మందికి పైగా ప్రజలు ఫ్లోరిన్ పీడితులుగా మారిపోయారు. నల్లగొండ జిల్లాలోని నీటిలో 25 శాతం ఫ్లోరిన్ ఉంది. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతంగా శాస్త్రవేత్తలు, డాక్టర్లు, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలలో ఫ్లోరిన్ ప్రభావం అంతగా లేదని సర్వేలు చెబుతున్నాయి.
నల్లగొండ జిల్లా విప్లవపోరాటాలకు, కమ్యూనిస్టు ఉద్యమాలకు ఎర్రగడ్డగా చరిత్రకెక్కింది. ”దున్నేవానిదే భూమి” అన్న నినాదం ఈ గడ్డ మీద నుంచే పుట్టింది. అదే దేశంలో భూసంస్కరణలకూ కారణభూతమైంది అలాంటి పోరాటాల పోతుగడ్డ ఇపుడు ఫ్లోరోసిస్ పెనుభూతం వల్ల వంకర్లు కొంకర్లు తిరిగింది. నల్లగొండ ఫ్లోరోసిస్‌తో మారుగుజ్జుగా మారింది. పోరాటాల నల్లగొండ అంగవైకల్యానికి గురైంది. లక్షలాది మంది ప్రజలు దీనావస్థకు నెట్టబడ్డారు. ఈ సమస్యపై నీటి ఉద్యమకారుడు దుశ్చర్ల సత్యనారాయణ తన జీవితాన్నే అంకితం చేసి పోరాడాడు. అయినా పాలకుల మనసు కరుగులేదు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన కెసిఆర్ నల్లగొండ పర్యటనల్లో ఫ్లోరోసిస్ బాధితులను చూసి చలించి పోయాడు. కెసిఆర్ గుక్కపట్టి ఏడ్చాడు. కలం బట్టి పాట రాశాడు. ఈ సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని కెసిఆర్ 2014 ఎన్నికల పర్యటనల్లో గర్జించాడు. అందులో భాగంగానే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రవేశపెట్టేందుకు సన్నాహాలు చేస్తున్నాడు. 1937వ సంవత్సరంలో ఈ ఫ్లోరోసిస్ వ్యాధిని గుర్తించటం జరిగింది. భారతదేశం నుంచి లెప్రసీని కూడా చాలావరకు పారద్రోల గలిగారు. ఆ వ్యాధి విస్తరించకుండా చేయగలిగారు కానీ ఫ్లోరోసిస్ పెనుభూతాన్ని మాత్రం నివారించలేకపోయారు. ఈ ఫ్లోరోసిస్‌ను పారదోలేందుకు కొన్ని సంవత్సరాలు యుద్ధ ప్రాతిపదికపై పనిచేయాలి. రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలంతా ఆహ్వానించటమే గాకుండా అందరూ ఈ మహాయజ్ఞంలో పాల్గొనాలి. రాజకీయ పార్టీలు విమర్శలు మాని ఫ్లోరిన్ భూతాన్ని పాతర వేసే పనికి ఐక్య కంఠంతో ముందుకు రావాలి. ప్రజల దీర్ఘకాలిక సమస్య అయిన ఫ్లోరిన్ నుంచి బైటపడవేసే పనిలో భాగంగానే తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకాన్ని
చూడవలసి ఉంది.
చైనాలో దుఃఖనదికి ఆనకట్టలు కట్టి కోట్ల మంది ప్రజల సమస్యలను తీర్చారు. తెలంగాణ 10 జిల్లాల్లో పైపులైన్ల ద్వారా మంచినీటిని అందించే లక్ష్యం కూడా తప్పక నెరవేరి తీరుతుంది. ఇందుకు అధికార పాలనా యంత్రాంగానికి చిత్తశుద్ధి కావాలి. ప్రజలందరూ ఈ పని నెరవేరేందుకు స్వచ్ఛంధంగా సహకరించాలి. మానవనిర్మిత మహాసాగరం నాగార్జునసాగరం లాంటి బహుళార్థక సాధక ప్రాజెక్టును నిర్మించగలిగిన మన ప్రజలు 10 జిల్లాలో మంచినీటి పైపులైన్లు వేసుకునే పనిని కూడా నిర్విఘ్నంగా నెరవేర్చగలిగి తీరుతారు. 1945 లోనే నిజాం వైద్య ఆరోగ్య సలహాదారుడైన దేబర్ నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధితులను గుర్తించటం జరిగింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో 70,000 జనవాసాలుంటే అందులో 6,000 జనవాసాలు ఫ్లోరిన్ పీడిత ప్రాంతాలుగా గుర్తించటం జరిగింది. ఈ ఫ్లోరిన్ జలాలు విషతుల్యంగా మారి జన జీవితాలను అతలాకుతలం చేసేస్తున్నాయి.
ఈ ఫ్లోరిన్‌ను 1771లోనే శాస్త్రవేత్తలు గుర్తించటం జరిగింది. పళ్లు గారె పట్టినట్లు కనిపిస్తే అది ఫ్లోరోసిస్ వ్యాధిగా చెప్పవచ్చును. ఆ ప్రాంతం లేదా ఆ గ్రామంలోని నీళ్లలో ఫ్లోరిన్ విపరీతంగా ఉండి ఉంటుందని శాస్త్రవేత్తలు డాక్టర్లు తేల్చారు. తెలంగాణ అన్ని జిల్లాలో కలుపుకుంటే లక్షలాది మంది ఈ వ్యాధి బారినపడ్డారని పలు అంచనాలు తెలియచేస్తున్నాయి.ఈ వ్యాధులకు సంబంధించి సమగ్ర సమాచారం కూడా ప్రభుత్వాల దగ్గర అందుబాటులో లేదు. ఈ ఫ్ల్లోరోసిస్ వ్యాధిపై అనేక మంది సర్వేలు చేశారు. ప్రపంచవ్యాపితంగా ఈ వ్యాధికి బారినపడ్డ విషయాలను అనేకమంది వెలికితీశారు. ఒక్క చైనాలోనే 30 కోట్ల మంది ఈ వ్యాధి బారినపడ్డారని ఇందులో 4 కోట్ల మందికి ఈ వ్యాధి ప్రాథమిక దశలోనే ఉందని 2004లో జరిపిన సర్వేలో తేలింది. మనదేశంలో తమిళనాడు, రాజస్థాన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానాలలో ఫ్లోరోసిస్ బాగా ప్రబలింది. తెలంగాణ జిల్లాలోని నల్లగొండలో ఫ్లోరోసిస్ మరింతగా విస్తరించింది. మన దగ్గరి కన్నా పంజాబ్‌లో ఫ్లోరోసిస్ ఎక్కువగా ఉన్నప్పటికినీ వారు తీసుకునే ఆహారపు అలవాట్ల వల్ల ఈ వ్యాధిని చాలావరకు నివారించగలిగారు. ప్రధానంగా చెరువులు, ప్రాజెక్టుల కింద పండించిన పంటలను తినటం వల్ల ఆ వ్యాధిని చాలా వరకు పంజాబ్ హర్యానాలలో నివారించగలిగారని అనేకమంది శాస్త్రవేత్తలు, డాక్టర్లు చెబుతున్నారు. కానీ నల్లగొండ జిల్లా నీటిలో ఫ్లోరిన్ తీవ్రత అధికంగా ఉంది. అందువల్లనే లక్షలాది మంది ఈ వ్యాధి బారినపడ్డారు. ఫ్లోరోసిస్ పీడిత ప్రాంతాలకు మంచినీళ్లు అందించగలగాలి. భూగర్భజల మట్టాలను పెంచగలగాలి.
నగరంలో కోటి మందికి నీళ్లు
హైద్రాబాద్ మహానగరానికి సంబంధించి 340 ఎంజిడిల నీటిని మెట్రో వాటర్ వర్క్స్ ద్వారా సరఫరా చేస్తున్నారు. ఎంజిడి అంటే (మిలియన్ గ్యాలెన్స్ ఫర్ డే) 4.546 లీటర్లు పరిణామం నీళ్లుంటాయి. హైదరాబాద్ నగరానికి రోజుకు 340 ఎంజిడీల నీరును సరఫరా చేస్తున్నారు. హైదరాబాద్ మహానగరానికి 5 మార్గాల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. ఉస్మాన్‌సాగర్ ద్వారా 25 ఎంజీడి, హిమాయత్‌నగర్ ద్వారా 15 ఎజిడి, మంజీరా ఫేజ్ 1, 2, 3, 4 ల ద్వారా 120 ఎం.జి.డి, కృష్ణా ఫేజ్ 1 ద్వారా 90 ఎంజిడి, ఫేజ్ 2 ద్వారా 90 ఎంజిడిల నీటిని అందిస్తున్నారు. మొత్తం 340 ఎంజిడి నీటిని మెట్రోవాటర్ వర్క్స్ ద్వారా అందించగలుగుతున్నారు. హైదరాబాద్‌లో దాదాపుగా ఒక కోటి జనాభా నివసిస్తున్నట్లు అంచనా వేస్తున్నారు. హైద్రాబాద్ నగరానికి 490 ఎంజిడీలు డిమాండ్ ఉంది. కానీ 340 ఎంజిడీలు మాత్రమే ఇవ్వగలుగుతున్నారు. మరో 150 ఎంజిడి నీటి కొరత స్పష్టంగా కనిపిస్తుంది.
కృష్ణా ఫేజ్ 3 ద్వారా మరో 90 ఎంజిడిల నీటిసరఫరాను యుద్ధ ప్రాతిపదికపై అందించాలని ముఖ్యమంత్రి కెసిఆర్ ఆదేశించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆ పని పూర్తవుతుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. హైద్రాబాద్ నగరంలో నీటి సరఫరా చేసేందుకు 100 స్టోరేజ్ రిజర్వాయర్‌లున్నాయి. 8 లక్షల వరకు నల్లాల కనక్షన్‌లున్నాయి. ఒక్కొక్క నల్లా కింద 100 ల కుటుంబాలు నీటిని పొందుతున్నాయి. గోదావరి ఫేజ్ 1 ద్వారా 172ఎంజిడీల నీటిని సరఫరా చేసేందుకు పథక రచనలు చేశారు. మే 2015 నాటికి ఈ పథకం అమలులోకి వస్తుంది.
జిల్లాల్లో మూడున్నరకోట్ల మందికి మంచినీళ్లు…
హైదరాబాద్ మినహా తెలంగాణలోని 9 జిల్లాలకు రూరల్ వాటర్ సప్లయ్ డిపార్ట్‌మెంట్ ద్వారా మూడున్నర కోట్ల మందికి నీళ్లందిస్తున్నారు. 9 జిల్లాలో 146 సమగ్ర నీటి పథకాలు 15,040 రక్షిత మంచినీటి పథకాలు, 9019 మినీవాటర్ సప్లయ్ స్కీములు 6,506 నేరుగా నీటి పంపిణీ పథకం స్కీములు, 1,59,312 చేతి పంపుల ద్వారా నీటి సరఫరా జరుగుతుంది. వేలాది గ్రామాల్లో లక్షలాది మంది ప్రజలకు ఈ నీటి సరఫరాను నిత్యం చేస్తున్నారు. అయినా అందరికీ తాగునీరు అందటం లేదని ప్రభుత్వలెక్కలే తేల్చి చెబుతున్నాయి. అందుకే మొత్తం తెలంగాణ రాష్ట్రానికి నీటిని అందించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా 1 లక్ష కిలోమీటర్ల మేరకు వాటర్ సప్లయ్ గ్రిడ్ పథకం ముఖ్యమంత్రి ప్రవేశపెట్టబోతున్నారు.
ప్రధానంగా ప్రాణాధారమైన స్వచ్ఛమైన జలాలను ప్రజలకు అందించాలి. అందుకోసం కెసిఆర్ ఎంచుకున్న తెలంగాణ వాటర్ గ్రిడ్ పథకాన్ని నల్గొండ జిల్లా నుంచే ప్రారంభించారు సుమారు 40 వేల కోట్లతో ఈ వాటర్ గ్రిడ్ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం అమలుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులు సరిపోకపోతే దేశ విదేశాల్లో వున్న ఈ మట్టి పుత్రులు కూడా వాటర్ గ్రిడ్ పథకంకు సహాయ సహకారాలు అందించే విధంగా పథకరచన ఉండాలి. పథకం అంటే ప్రభుత్వమే నిధులు ఇవ్వాలన్న ఆలోచనల నుంచి బయటపడాలి. ప్రభుత్వం బాధ్యతగా నిధులు కేటాయించినా అవి సరిపోకపోవచ్చును. సమాజంలోని అన్నివర్గాలు కలిసి ఐక్యంగా నిలవాలి. మన సమాజం నుంచి ఫ్లోరోసిస్‌ను పారద్రోలేందుకు ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా చేయి కలాపాలి. అందరూ కలిసి అడుగువేస్తే సాధ్యం కానిదంటూ ఏమీ లేదు. ఫ్లోరిన్ రహిత సమాజనిర్మాణమే ధ్యేయంగా అందరూ కలిసి కృషిచేయాలి. ప్రతివ్యక్తికి మంచి నీటిని అందించటం కంటే ఉన్నతమైనది మరొకటిలేదు. మంచినీటిని అందిద్దాం – మానవీయ విలువల సమాజాన్ని నిర్మించటమే నవ తెలంగాణ ధ్యేయం కావాలి. ఆ దిశలో అడుగులు వేస్తూ ముందుకు సాగటమే చేయాలి.
”తలాపున గోదావరి నది ఉన్నా సమైక్య పాలనలో నల్లగొండ జిల్లా వెనుకబడ్డది. ఆంధ్రప్రదేశ్‌లో అప్పుడు ఉండడమే ఈ జిల్లా ప్రజలు చేసుకున్న తప్పా? అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడినోట్లో శని ఉన్నట్లు.. ఈ జిల్లా నుంచే గోదావరి నీళ్లు పారుతున్నా… తాగునీరు ఇయ్యకలేక పోయిండ్రు. ఆ పాలకులు చేయలేనిది మేం చేస్తున్నందుకు విమర్శలు చేస్తుండ్రు. ఎవరు ఎన్ని చేసినా, ఏమన్నా రాబోయే నాలుగేండ్లలో రాష్ట్రంలో ఇంటింటికీ తాగునీరిచ్చి దశాబ్దాలుగా ఫ్లోరోసిస్ బారిన పడ్డ నల్లగొండ ప్రజల గొంతు తడుపుతాం”.
– కల్వకుంట్ల తారకరామారావు