tsmagazine
‘వాడికి బుర్రలేదు’ అనే వాక్యం తెలంగాణలో ‘వానికి తల్కాయలేదు’, ‘వానికి దమాక్‌ లేదు’, ‘వానికి అకల్‌ లేదు’, ‘వానికి పుర్రె లేదు’ మొదలైన విన్యాసాలతో వుంటుంది. ఇందులో ‘దమాక్‌’, ‘అకల్‌’లు ఉర్దూ పదాలు. తెలంగాణ తెలుగు భాషకు అవి మాధుర్యాన్నీ, మార్దవాన్నీ తీసుకొచ్చిన మాటలు. నిజానికి ‘వాడికి బుద్ధి లేదు’ అనే అర్థంలో ‘బుర్రలేదు’ అని తెలంగాణేతర తెలుగు ప్రదేశాల్లో వ్యవహరిస్తున్నారు. బుద్ధి తలలో వుంటుంది. అదే మెదడు. వాస్తవంగా ఆలోచిస్తే తలను బుర్ర అనడం సముచితం అనిపించుకోదా. బుర్ర అంటే ఏమీ లేని తొర్ర. డొల్ల. బోలు. ఖాళీ. మరి తలలో నిక్షేపంగా మెదడు వున్నప్పుడు బుర్ర అనడం ఏమిటి? అందుకనే తెలంగాణలో పుర్రె అంటున్నారు. సైన్సులో కూడా పుర్రె దాని భాగాలూ అంటూ చదువుకుంటాము గానీ బుర్ర దాని అవయవాలు అని అభ్యసించం కదా! తెలంగాణలో బుర్ర అంటే సొరకాయ బుర్ర. పెన్నుమీది క్యాపును కూడా బుర్ర అంటారు. ‘నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయినయట’ అని సామెత.

తెలుగులో తరచుగా మనకు మరోమాట బుర్రకు సంబంధించి వినిపిస్తూ వుంటుంది. అది: వాడిది ఉత్త మట్టి బుర్ర. అంటే వాడి బుర్రలో మట్టి వుంటుందనీ, వాడు మృత్పిండంలాంటి మట్టిముద్దవంటి మనిషనీ, మందబుద్ధి అనీ అర్థఛాయలు. తెలివైనవాడు కాపోతే మట్టిబుర్ర అంటారు. మరి తెలంగాణలో ఏమంటారు? ‘వాని దమాక్‌ల/మెదడుల పెండ వున్నది గని’ అంటుంటారు. ఆంధ్ర మొదలైన ప్రాంతాల్లో మట్టి వుంటే తలల్లో, తెలంగాణలో పెండ వుంది. అర్థాల్లో మాత్రం తేడా లేదు. అట్లా మట్టో, పెండో వున్నవాళ్లు వుభయులూ తెలివితక్కువ దద్దమ్మలే! అబ్బన్న! సుబ్బన్నలే!! వాజమ్మలే!!!

‘వాడికి ఏకాగ్రత కుదరడం లేదు’ మోస్తరు వాక్యాన్ని తెలంగాణలో ‘వానికి దమాక్‌ సంటర్ల లేదు’ అని అంటుంటారు. ఒకే విషయమ్మీద మనస్సు కేంద్రీకరింపచేయడం ఏకాగ్రత. అది కుశాగ్రబుద్ధులకే సాధ్యమవుతుంది. కుశ అంటే దర్భ అగ్రమ్మీద మనస్సూ, దృష్టి స్థిరంగా నిలపాలి. ఎప్పుడు సాధ్యం మరి! మనస్సు స్థిరంగా, నిమ్మళంగా, కుదురుగా, ప్రశాంతంగా, నిశ్చలంగా వున్నప్పుడే ఏకాగ్రతకు వీలు కలుగుతుంది. తెలంగాణాలోని ‘దమాక్‌ సంటర్ల వుండదు’ ఏంది మరి? మెదడు సెంటర్లో అంటే తలలోని మధ్యభాగంలో కేంద్రీకరించబడి వుండడం. ఆలోచనలు పక్కదారులు, పెడతోవలు పట్టకుండా వుండడం.చపల చిత్తుల్నీ, చంచల మనస్కులనూ, పిచ్చిపిచ్చి పనులు చేసేవాళ్ళనూ వుద్దేశించి పై మాటలు మాట్లాడుతారు. మరికొన్ని సందర్భాల్లో ‘వాడు దేడ్‌ దమాక్‌గాడు’ అంటారు. ఉండాల్సిన దానికన్నా మెదడు మరో అరపరిమాణం అదనంగా అధికంగా వుంటే దేడ్‌ దిమాక్‌. ఒకటిన్నర అంతలో మెదడుంటే విపరీత పరిణామాలే కదా!

చెయ్యగూడని పనులు చేస్తున్నప్పుడు, చేయరాని ఆలోచనలు కావిస్తున్నప్పుడు ‘మెసులుతుంది’, ‘పురుగు మెసులుతుంది’, ‘తల్కాయల పురుగు మెసులుతుంది’ అనే వాక్యసరళి తెలంగాణలో వుంది.

‘అర్థమైందా?’, ‘బోధపడిందా?’, ‘సుబోధకంగా వుందా?’, ‘అవగతం అయిందా?’ మొదలైన ప్రశ్నావాక్యాలను తెలంగాణలో ‘మన్సున వట్టిందా?’, ‘సమజైందా? పద్ధతిలో ప్రయోగిస్తారు. దాదాపు తెలంగాణ అంతటా వ్యవహృత వాక్యం ‘మనసున పట్టిందా?’ అనేదే! మరి దీనికి అర్థం ఏమిటి? మనసున పట్టడమే మనసున వట్టడం. చెప్పిన విషయం మనస్సుకు పట్టాలి. అప్పుడే కదా అది అర్థమయ్యేది! అందుకే అట్లా ప్రశ్నిస్తుంటారు. మనం తిన్న తిండి పెయిన పట్టాలి. మనం వేసిన సున్నం గోడలకు పట్టాలి. అద్దిన రంగులు గుడ్డలకు పట్టాలి. చెప్పిన విషయం మాత్రం మనస్సుకు పట్టాలి. ఆ తర్వాతే అది మనకు అర్థమవుతుంది. ఎంత గొప్ప అభివ్యక్తి యిది! మనస్సుకు పట్టకపోతే వ్యర్థం కదా! అందుకే అర్తంలేని సదువు ఎర్తం అన్నారు. అర్థం కావాలి-మనసున వట్టాలె. చిన్నయసూరి తన నీతిచంద్రికలో అందుకే ‘మనంబునంబట్టి’ అన్నారు.

ఇంకా మళయాళంలోకూడా అర్థమైందా అనే ప్రశ్నను మనస్సిల్‌ ఆయో?’ అంటారు. అంటే మనస్సులోపలికి అయ్యిందా అని. తెలంగాణ ‘మనసున పట్టుడు’కు గ్రాంధిక భాషలోని ‘మనంబునంబట్టి” మలయాళంలోని ‘మనస్సిల్‌ ఆయో’లు అతి సమీపం. తెలుగు సినిమాలో ఒక దాంట్లో ‘మనసిలాయో మనసిలాయో అమ్ముకుట్టి’ అంటూ ఏదో పాట కూడా వున్నట్లుంది.

మనస్సు విరిగిపోవడాన్ని ‘మన్సు కట్కుమన్నది’ అనీ, ప్రేమను చూపడానికీ’ ఇష్టపడడానికి ‘మన్సు కొట్టుకుంది’ అనీ, గుండె దిటవు చేసుకోవడానికి ‘మన్సు గట్టి చేసుకునుడు’ అనీ, మనస్సు మొగ్గడానికి ‘మనసు గుంజుడు’ అనీ, మనస్సు కొట్టుకోవడానికి ‘మన్సు తొక్కులాడుడు’ అనీ, పాలుపోవడం లేదు అనడానికి ‘మన్సున పడుతలేదు’ అనీ, మనస్సు చంచలించడానికి ‘మన్సు సెంచరిల్లింది’ అనీ, తీవ్రంగా ఆలోచిస్తూ మనస్సు పాడుచేసుకుంటే ‘మన్సు మీదికి తెచ్చుకునుడు’ అని రకరకాల అభివ్యక్తులు తెలంగాణ ప్రజల భాషా వ్యవహారంలో చోటు చేసుకున్నాయి.

తెలంగాణలో ‘మన్సుకొస్తే మానుబావ-లేకపోతే జానుబావ’ అనే సామెత వుంది. ఎవడో ఒక మనిషి వున్నాడు. వాడి మనస్సుకు నచ్చితే అవతలివ్యక్తి మహానుభావుడవుతాడు (మానుబావ). వాడికి యిష్టం లేనట్లయితే వాడు పనికిరాని జావో, జావో అనే తీరులో అసహ్యించు కునే జానుబావ అయిపోతాడు. లేదా క్రైస్తవ సోదరుడు (జాన్‌ అనే పేరు సాధారణంగా వాళ్లు పెట్టుకుంటారు కనుక) అయినా అవుతాడు, తెలంగాణలో తల, తల్కాయ, పుర్రె, దమాక్‌, అకల్‌, మనస్సులు ఏయే సందర్భాలో వాడబడుతున్నాయో ప్రజల భాషను పరిశీలించాలి.

డా|| నలిమెల భాస్కర్‌

Other Updates