విత్తనం మొలకెత్తుతున్న చప్పుడు
విశ్వాసాల వేళ్ళు మట్టి లోతుల్లోకి దిగుతూ
ఒక కొత్త నమ్మకాన్ని పచ్చని కొమ్మల్లో నింపుతున్న దృశ్యం
వంపులు తిరిగిన ఒర్రెలు వెన్నెల నురగలతోని
పరుగులు పెడుతు
వాలిపోయిన పొద్దుతిరుగుడు చేన్ల సేద తీరుతూ
వంగిన మొక్కజొన్న కండెల్ని భుజం మీది కెత్తుకుంటూ
మర్రిచెట్టు నీడల తల దాచుకుంటున్న శిధిలస్వప్నాల మీద పాలపిట్టలా రెక్కల్ని ఆడించి
కాలం కనురెప్పల మీద గోసపడ్డ మనసును
నిరందిగా కూర్చోబెట్టాలి
లుంగలు చుట్టుకుపోయిన దు:ఖాన్ని
పర్రెలు వారిన నేల మించి చదును చేయాల్సిన సమయమిది
ఇసుక తుఫాన్‌లో కూరుపోయిన
బీరపిందల్లాంటి బాల్య యవ్వనాన్ని
వరికల్లంల పిట్టల్లా వదలాల్సిన వేళయిది
గుమ్మడి తీగెంట వారిన ఆశల పంటల్ని
గుడిసెల గుమ్మరించాల్సిన సందర్భమిది
ముడుతలుపడ్డ దేహాల
ముద్దచామంతుల్లా విచ్చుకుంటున్న మగువల మందహాస వదనమిది
నాగలెత్తుకున్న జోడెడ్ల విజయగానమిది
మందారవనమైన తెలంగాణమిది
– వేముగంటి మురళీకృష్ణ