మూగవోయిన గొంతులలో మంజీర నాదాలు పలికించి, తీగలు తెంపి అగ్నిలో దింపిన రతనాల వీణతో అగ్నిధారలు కురిపించి, (నాటి) కోటి తమ్ముల గళాల ప్రజావాణికి మైక్ అమరించి, రవ్వలురాల్చి అక్షరాల మువ్వలుదాల్చి, పద్యాలుపాడి-మానవుని కాపాడి, ఆలోచనాలోచనాలు తెరిపించి, తెలుగు నుడులకు అమృతాభిషేకము జరిపించి, తిమిరంతో సమరంచేసిన అక్షరయోధుడు మహాకవి దాశరథి. స్వయంగా ఉద్యమంలోకి ఉరికి నిజాం నిరంకుశత్వానికి ఎదురొడ్డి నిలిచిన నిజమైన వీరుడు. మహాకవి దాశరథి జీవిత సాహిత్య వ్యక్తిత్వాలపై వివిధ పరిశోధకులు సప్రమాణంగా విశ్లేషించి రచించి అందించిన ప్రసంగ పత్రాలతో రూపొందించిన అపురూప గ్రంథమే ”మహాకవి దాశరథి-సాహిత్య సమాలోచన”.
అలాగే దాశరథితో మైత్రీబంధాన్ని పెనవేసుకొన్న సమకాలీన సాహితీ మిత్రుల అనుభవాలను, ఆయన కవిత్వాన్ని సవిమర్శకంగా విశ్లేషించిన పరిశోధకుల వ్యాసాలను, తెలంగాణ స్పృహతో ప్రత్యేకించి దాశరథి స్పృహతో రాసిన 108 వ్యాసాలను సేకరించి విలువైన సమాచారన్నంతా భద్రంగా ఒకచోట నిక్షిప్తంచేసి ”సాహిత్య ప్రపంచంలో దాశరథి” గ్రంథాన్ని కూడా తెలంగాణ భాషా సాంస్కృతిక మండలి పక్షాన డా||గంటా జలంధర్‌రెడ్డి సంపాదకులుగా పాఠకలోకానికి అందించారు.
సాహితీ జిజ్ఞాసువులందరికీ మహాకవి దాశరథిపట్ల సమగ్ర అవగాహన కలిగించే బృహత్ప్రయత్నమిది.
2013 నవంబర్ 5, 6వ తేదీల్లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరిపిన జాతీయ సదస్సు సంచాలకునిగా-పత్రాల సంకలనకర్తగా తెలంగాణ భాషా సాంస్పృతికమండలి పక్షాన డా|| గంటా జలంధర్‌రెడ్డి చిరస్మరణీయమైన ఈ రెండు గ్రంథాలనందించి అభినందనీయుడయ్యాడు.
”సాహిత్య సమాలోచన” సంకలనంలో 61మంది సాహితీవేత్తల విలువైన వ్యాసాలు న్నాయి. ఈ సదస్సులో కీలకోపన్యాసం చేసిన ఆంధ్రజ్యోతి సంపాదకులు కె. శ్రీనివాస్ ”దాశరథిని పున:స్ఠాపించుకుందాం” అన్న ఆకాంక్షతో ఆరంభమైన ఈ గ్రంథంలో దాశరథి వ్యక్తిత్వాన్ని, సాహిత్య వ్యక్తిత్వాన్ని, వారి కావ్యాల అనుశీలనను, వెలుగు చీకట్ల జ్ఞాపకాలను, పద్యశిల్పాన్ని, శైలీనవ్యతను, ప్రక్రియావైవిధ్యాన్ని ప్రదర్శించే వ్యాసాలేకాక వచన రచనల్లోనూ దాశరథి వైశిష్ట్యాన్ని సినీగీతాల్లో సాహితీ సరాగాల్ని తమ పరిశోధనా పత్రాల్లో అందించిన తీరు భావి పరిశోధకులకు ఎంతో ఉపయుక్తంగా ఉంది.
నిన్నటి తరానికి దాశరథి ఉద్యమ కవి మాత్రమేకానీ నేటి తెలంగాణ పోరాటానికి దాశరథి ఉద్యమస్ఫూర్తి, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ ఒక రణన్నినాదగీతం. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ పథంలో దాశరథి కవిత దారిచూస్తే కరదీపిక. పాల్కురికినుండి కాళోజీదాకా, తెలగన్ననుండి తెరేశ్‌బాబు దాకా ప్రతి కవినీ ఇలా సమీక్షించుకోవాల్సిన చారిత్రకావసరం ఇవాళ మనకుంది. అందుకు తొలి అడుగే ఈ దాశరథి సాహిత్య సమాలోచన.
పరిశోధనలో తలపండిన విద్యావేత్తలనుండి ఇప్పుడిప్పుడే పరిశోధనలతో తలపడుతున్న వారందరినీ ఒకచోట చేర్చి ఏర్చికూర్చిన సాహిత్య సమాలోచన మహాకవికి అందించే సారస్వత నీరాజనంగా ఉంది.
అలాగే ‘సాహిత్య ప్రపంచంలో దాశరథి’ స్థానాన్ని నిరూపించే శతాధిక వ్యాసాలు, అరుదైన దాశరథి ఇంటర్వ్యూలు, లేఖలు, పుస్తకాలకెక్కని కవితలు, అభినందన పత్రాలు, సందేశాలు, అపురూపమైన ఛాయాచిత్రాలు సేకరించడంలో, ఒకచోట చేర్చడంలో సంపా దకులు పడ్డ శ్రమకు ప్రతిఫలమై చక్కని పుస్తకాలుగా రూ పొందాయి. వేర్వేరు వ్యక్తులు, రచయితలు భిన్నభిన్న అం శాలతో దాశరథిని తూచి చిత్రిం చడం వల్ల పునరుక్తులు తప్పలేదు. ఆచార్య నిత్యానందరావు అన్నట్లు కొన్ని ఎత్తిపోతలూ లేకపోలేదు.
ఐనప్పటికీ కలకాలం గుర్తుండిపోయేలా కవితాశరధి కవిదాశరథి కవితాత్మను చిత్రికపట్టి అందంగా అచ్చొత్తించి అందించిన తెలంగాణ సాంస్కృతిక మండలి, సంపాదకులు డా|| గంటా జలంధర్‌రెడ్డి కృషి కృతకృత్యమైందనడంలో సందేహ మేలేదు. ప్రతి తెలుగు సాహిత్యాభిమాని కొని, చదువుకొని, కాపాడుకొని ఆనందించదగ్గ విలువైన పుస్తకాలివవి.
– మరుమాముల దత్తాత్రేయశర్మ