అ డాక్టర్ పాలకుర్తి మధుసూదన రావు
అది 1981వ సంవత్సరం. రవీంద్రభారతిలో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కవిసమ్మేళనాన్ని ఏర్పాటు చేసింది. అప్పటికి ఇంకా దూరదర్శన్ ప్రాశస్త్యంలోకి రాలేదు. ప్రజలంతా ఆకాశవాణి కార్యక్రమాలనే ఆదరిస్తున్న రోజులు కనుక ఆకాశవాణి అన్నా, అందులో పని చేస్తున్నవారన్నా జనబాహుళ్యంలో అభిమానం, ఆదరణ ఉండేవి.
కవిసమ్మేళనాన్ని నిర్వహించే బాధ్యత అప్పుడున్న ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం డైరెక్టరు నాకు అప్పగించారు. ఈ కవిసమ్మేళనం సరిగ్గా ఆగస్టు 15వ తేదీకి ఒకరోజు ముందుగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేశాం. ఈ కవిసమ్మేళనంలో పాల్గొన వలసిందిగా తెలుగునాట సుప్రసిద్ధులైన కవివరేణ్యులను ఆహ్వానించాం. దాశరథిóó, సి.నారాయణరెడ్డి, శ్రీశ్రీ, ఆరుద్ర, ఆవంత్స సోమసుందరం, భుజంగరాయశర్మ ఇలా మహామహులైన కవులు ఈ కవిసమ్మేళనంలో పాల్గ్గ్గొనడానికి అంగీకరించారు. ఆకాశవాణి కవిసమ్మేళనం అంటే ఆ రోజుల్లో ఎంతో ఉదాత్తమైన కార్యక్రమంగా ఇటు కవులు, అటు ప్రజలు భావించేవారు. కవిసమ్మేళనంలో పాల్గొనడమంటే తమకు ఒక గౌరవంగా భావించే ఆనవాయితీ ఆనాటి తరంలో స్పష్టంగా కనిపించేది.
అయితే కొత్తగా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా వచ్చినవాడు, అందునా తెలంగాణ ప్రాంతానికి చెందినవాడు, తెలుగు భాషకు ‘కిరీటం’ లాంటి కవి సమ్మేళనాన్ని ఏ విధంగా నిర్వహిస్తాడో చూద్దాం! అని భావించే సీనియర్లు కొంతమంది ఆకాశవాణిలో ఆ రోజుల్లో ఉండేవారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నా ధ్యాసనంతా ఈ కవిసమ్మేళనాన్ని దిగ్విజయం చేయడంపైనే కేంద్రీకరించాను. ఆ రోజుల్లో తెలంగాణా నుండి నాతోపాటు కేశవపంతుల నరసింహశాస్త్రి, ఆర్.సి.వి.రెడ్డి పనిచేస్తుండేవారు. కేశవపంతుల నరసింహశాస్త్రి కూడా నాలాగే ప్రొడ్యూసర్. ఆర్.సి. వి.రెడ్డి ఆర్టిస్టుగా పనిచేస్తుండేవారు. ఆయన తెలంగాణ మాండలికంలో ‘మాటా-మంతీ’ కార్యక్రమాన్ని నిర్వహిస్తుండేవారు. కేశవపంతుల నర సింహశాస్త్రి మంచి సంస్కృతపండితులు. సంస్కృ తంలో, తెలుగులో వారికున్న పాండిత్యాన్నిచూసి తెలుగునాట ఎంతో గర్వంగా చెప్పుకునేవారు.
సాయంత్రం 6 గంటలకు రవీంద్రభారతి వేదికమీదకు కవులను ఆహ్వానించాలను కున్నాం. అయితే సాయంత్రం 5గంటలకే హాలంతా నిండిపోయింది. బాల్కనీ అంతా జనమే. సీట్లులేక ఎంతోమంది హాలుకు రెండువైపులా నిల్చుని వున్నారు. రవీంద్రభారతి ప్రాంగణం అంతా జనసందోహం. పండుగ వాతావరణం.
నేను సరిగ్గా 6గంటలకు పోడియం దగ్గర నిల్చొని కవిసమ్మేళనాన్ని గురించి రెండుమాటలు చెప్పి, ఈ కవిసమ్మేళనానికి మహాకవి దాశరథిని అధ్యక్షత వహించవలసిందిగా కోరుతూ, సభావేదిక మీదికి ఆహ్వానించాను. కరతాళధ్వనులతో రవీంద్ర భారతి మారుమ్రోగిపోయింది. ఆ వెనువెంటనే అందరు కవులను ఆహ్వానించడం, అందరూ సభావేదికమీద ఆసీనులు కావడం జరిగిపోయాయి.
దాశరథిó తెల్లని జరీఅంచు ధోవతి, తెల్లని లాల్చీ, తెల్లని జరీఅంచు ఉత్తరీయం ధరించి కవుల మధ్యలో కూర్చుని ఒక చిరునవ్వు నవ్వి సభనంతా కలియజూశారు. సముద్రంలో మహావిష్ణువుగా సాక్షాత్కరించారు. కవిసమ్మే ళనంలో అధ్యక్షత వహించిన కవి ముందుగా మాట్లాడి తన కవితను వినిపిస్తాడు. ఆ తరు వాత కార్యక్రమాన్నంతా సమన్వయం చేస్తాడు.
దాశరథి లేచి నిల్చొని, ఒక్కసారిగా గళమెత్తి ‘జెండా ఒక్కటే మూడు వన్నెలది’ అని తనకెంతో ఇష్టమైన పద్యాన్ని ఎత్తుకొన్నారు. అప్పుడు దాశరథిó ‘ఒక ఎత్తైన శిఖరంమీద ఒక బలమైన సింహం నిల్చొని నలువైపులా పరికిస్తూ, జూలును విదిలించి సింహగర్జన చేస్తున్నదా’ అని అనిపించింది. ఆ సమయంలో వేదికమీదవున్న ఆరడుగుల కవివరేణ్యులందరూ ఐదు అడుగులుగా, ఐదడుగులువున్న దాశరథిóó ఆరుడుగులుగా భాసిల్లినారు. ఒక బలమైన శక్తిస్వరూపుడుగా దాశరథిóó ఆ వేదికమీద కనిపించారు. నా జీవితంలో ఇది ఒక మహాద్భుతమైన ఘట్టం. దాశరథిóóగారిలో ఎంతటి చైతన్య స్ఫూర్తి ఉండేదో ఈ ఒక్క సంఘటన చాలుచెప్పడానికి.
దాశరథి మామూలు వ్యక్తికాదు. ఒక మహాపండితుడు, ఒక గొప్ప దార్శనికుడు, ఒక గొప్ప దేశభక్తుడు, ఒక యోధాగ్రేసరుడు, ఒక భాగవతోత్తముడు – ఇందరు కలిస్తే మహా కవి దాశరథి. కలాన్ని కత్తితో సమంగా నడిపించిన స్వాతంత్య్ర సమరయోధుడు.
దాశరథి కి నేనంటే ఎంతో వాత్సల్యం. ”ఒరేయ్ నాన్నా! మంచి కార్యక్రమాలు చేయరా. తెలంగాణా గుండెనిండా కవులు, కళాకారులే ఉన్నారు. ఆకాశవాణి వారికి అండగా ఉండాలి. నువ్వు యువకుడివి. తెలంగాణా వాడివి. నువ్వు చేయగలవు. భగవంతుడు నీకు చక్కని అవకాశాన్ని ఇచ్చాడు” అని నన్ను వెన్నుతట్టి ఆశీర్వదించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.
దాశరథి లో ఆవేశంపాలు కొంచెం ఎక్కువే. నేను ఆయన్ను ఎంతో సన్నిహితంగా చూశాను. ఎన్నో విషయాలను వారినుండి నేర్చుకున్నాను. తనకంటే చిన్నవయసువారితో ఎంతో స్నేహంగా ఉండడం వారిలో గమనించాను. స్వయంగా అనుభవించా ను. అందర్నీ ‘నాన్నా’ అని పిలవడం దాశరథిóóకి సర్వసాధారణం. మాట్లాడుతున్నప్పుడు మహావక్తగా భాసిల్లేవారు. అమోఘమైన పాండితీప్రకర్షతో ఒక విద్వాంసుడుగా కనిపించేవారు. ప్రాచీనకావ్యాలపై కవులపై ఎనలేని భక్తి ప్రపత్తులను ప్రదర్శించే వారు. అలాగే ఆధునిక కవిత్వంపై కవులపై ప్రేమా భిమానాలను కురిపించేవారు. ఇతర భాషాకవు లంటే దాశరథిóóకి ఎనలేని గౌరవం. స్వయంగా ఉర్దూగజల్‌ను తెలుగులోకి ప్రవేశపెట్టిన ఘనతను దక్కించుకున్నారు దాశరథిóó. ఉర్దూ, పారశీక భాష లపై మంచి పట్టును సాధించిన అతి కొద్దిమందిలో దాశరథిóó ఒకరు. అలాగే ఆంగ్లంలో ఆయనకు మంచి ప్రావీణ్యం ఉండేది.
దాశరథి మొదట్లో ఆకాశవాణి మద్రాసు కేంద్రంలో ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా (ప్రొడ్యూసర్‌గా) కొంతకాలం పనిచేసి, పూర్తిగా సినిమాలకే పాటలు రాయాలని సంకల్పించుకొని, ఆ ఉద్యోగానికి రాజీనామాచేసి, ఆ తరువాత హైదరాబాదులో స్థిరనివాసం ఏర్పరచుకున్నారు. హిమాయత్‌నగర్‌లో మాతృశ్రీ అపార్ట్‌మెంట్‌లో ఉంటుండేవారు. తరచుగా వెళ్ళడం, వారిని కలిసి మాట్లాడడం, వారి సలహాను తీసుకోవడం- ఇవన్నీ నాకు దక్కిన అమూల్యమైన అవకాశాలు.
ప్రతిభవున్నచోట నేను ఉన్నాను! ముందడుగు వెయ్యి! అని భరోసా ఇచ్చే మనస్తత్వం దాశరథిóóది. ఈ మనస్థత్వానికి నిదర్శనంగా నిలిచే ఒక సంఘటన నా మదిలో ఇప్పటికీ మెదులుతూనేవుంది.
ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్‌గా (ప్రొడ్యూసర్‌గా) ఉన్న రోజుల్లో కొంతకాలం లలితసంగీతం విభాగాన్ని పర్యవేక్షించాను. ఏ విభాగాన్ని పర్యవేక్షించినా, ఒక వినూత్నమైన ఆలోచనతో కార్యక్రమాలకు రూపకల్పన చేయాలన్న గాఢమైన వాంఛ నాలో వుండేది. ఆకాశవాణిలో ఆ రోజుల్లో తెలుగు టాక్స్,లలిత సంగీతం ఈ రెండు విభాగాలు అత్యంత ప్రధానమైనవి. ఈ రెండు విభాగాలను పర్యవేక్షించే అవకాశం నాకు దక్కింది. ఆకాశవాణిలో లలిత సంగీతానికి ఎంతో ప్రాచుర్యం ఉన్న రోజులు అవి. కవిత రాసే ప్రతీ కవికి, ఆకాశవాణిలో ఒక్క పాటైనా రాయాలనే తపన ఆ రోజుల్లో సర్వసాధారణం. ‘కవితావాహిని’ అనే శీర్షికతో యువవులను పిలిచి, వారి కవితాగానం వినిపించిన సందర్భాలు ఎన్నో! ఎన్నెన్నో! తెలంగాణాలోని దాదాపు అన్ని జిల్లాల వులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారే. ఆ రోజుల్లో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రసారమయ్యే కవితావాహినిలో పాల్గొనడం తెలంగాణా జిల్లాలకు చెందిన కవులకు అందిన ఒక మహదావకాశం.
నేను తెలంగాణలోని పలు ప్రాంతాలలో పర్యటించి అక్కడి కవుల కవితాగానాలను రికార్డుచేసి ఆకాశవాణిలో ప్రసారం చేయడం జరిగింది. ఆనాటి కవులకు, ప్రజలకు ఒక అద్భుతం. ఎంతోమంది యువకులకు ఈ కవితాగానం స్ఫూర్తిదాయకంగా నిలిచింది.
ఎలాగైతే కవులకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఒక వేదికగా నిలిచిందో, అలాగే లలితసంగీతం వేదికకావాలని భావించాను. ఇందుకు ఒక ప్రయోగం చేశాను. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ఉదయం ప్రసారాలు ఉదయం 5.55 ని||లకు ప్రారంభంమయ్యేవి. వందేమాతరంతో కార్యక్రమాలు ప్రారంభం కావడం సంప్రదాయంగా వస్తున్న విధానం. ప్రతిరోజూ వందేమాతరంతో ప్రారంభమై మంగళధ్వనితో అంకురార్పణ జరుగుతున్న హైదరాబాద్ కేంద్రంలో, మంగళధ్వని తరువాత-ప్రభాతగీతం అనే పేరుతో దేశభక్తి గీతం ఉంటే ఎలా ఉంటుంది? అనే ఆలోచన వచ్చింది. అందరూ ఈ ఆలోచన బాగుందని అన్నారు. మొదటి గీతాన్ని దాశరథిóóతో రాయించాలని వారినే అడిగాను. భక్తి, దేశభక్తి గీతాల రచనలో దాశరథిóóకి ఒక ప్రత్యేకత ఉంది. ఒక వినూత్న ఒరవడి ఉంది. నేను అడిగినవెంటనే దేశభక్తి గీతం రాసి ఇచ్చారు. అద్భుతంగా రాశారు. చిత్తరంజన్ మంచి సంగీతం సమకూర్చారు. ఆ రకంగా ఒక కొత్త సంప్రదాయం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ప్రారంభమైంది. ప్రభాతగీతాన్ని ఏ రోజు, ఏ సమయానికి ప్రసారం చేస్తున్నామో తెలియజేస్తూ దాశరథిóóకి ఒక వారంరోజుల ముందే లెటర్ పంపించాం.
అనుకున్న ప్రకారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రంలో ‘ప్రభాతగీతాన్ని’ ప్రసారం చేశాం. ఉదయమే ఆ గీతాన్ని వింటున్నప్పుడు ఎంతో ఆనందం కలిగింది. ఆ ఆనందంలో ఆకాశవాణికి ఆ రోజు ఉదయం 9గంటలకే చేరుకున్నాను. ఆఫీస్‌కారిడార్‌లో దాశరథిóó కనిపించారు. నేరుగా వెళ్ళి నమస్కరించాను. ”ఇదేమిటి? ఇంత పొద్దున్నే వచ్చారు. అందునా కర్ఫ్యూలో. నేనే వచ్చేవాడిని కదా” అన్నాను.
ఆ రోజు హైదరాబాద్‌లో కర్ఫ్యూవుంది. ”నాన్నా! నేను రావాలనుకున్నాను. ఈ రోజు నిన్ను చూసి, నా మనసులోని మాట చెప్పకపోతే అంతా వేస్ట్” అన్నారు. ”ఉదయం 8గంటలనుండీ 10గంటల వరకూ కర్ఫ్యూ సడలించారు. మామూలుగా ధోవతితో వద్దామను కున్నాను. కానీ అసలే కర్ఫ్యూ, నా మనసులోని మాట వెంటనే నీకు చెప్పాలి . అదీ పర్సనల్‌గా. అందుకే కుర్తా పైజామాతో వచ్చాను. నన్ను ఎవ్వడూ గుర్తుపట్టలేడు” అన్నారు. ”నువ్వు పంపించిన లెటర్ నాకు అంది వారం రోజుల యింది. మీరు రచించిన పాట ఫలానా రోజు ఫలానా సమయానికి రేడియోలో వస్తుంది. అని ముందుగా మాకు చెప్పినవాడివి నువ్వేరా!నేనూ రేడియోలో పనిచేశాను. రేడియో ఎప్పుడో 1930లో పుట్టింది. కానీ ఒక కవికి, ఒక రచ యితకు తెలిసేలా ముందే లెటర్ పంపించినవాడివి నువ్వే. నిన్ను అభినందించకుండా ఉండలేకపో యాను. నేరుగా నీ దగ్గరకు వచ్చేశా. ”గో హెడ్ మై బాయ్” అన్నారు దాశరథిóó. తెలుగులో మాట్లాడు తూ ఉర్దూ లోకి, ఆంగ్లంలోకి వెళ్ళే అలవాటు దాశరథిóóకి ఉండేది. అది మహాకవి దాశరథిóó మనస్తత్వం.
ఆ రకంగా ప్రారంభమైన ప్రభాతగీతం ఆ తరువాత ఎంతోమంది కవులకు ముఖ్యంగా లలితగీతాలు రాయాలన్న తపనతోవున్న కవులకు ఒక వేదికగా నిలిచింది. మరెన్నో కొంగ్రొత్త ఆలోచనలను సంతరించుకున్న దేశభక్తిగీతాల సృష్టికి మూల కారణమైంది. తరువాత కలిసినప్పుడల్లా ”నువ్వు నిత్యాన్వేషివిరా! తెలంగాణంలోవున్న ఎంతోమంది కొత్త కవులను, కళాకారులను పరిచయం చేస్తున్నావు. వెరీగుడ్” అని భుజం తట్టేవారు. మనం మనకోసమేకాదు మన సమాజంకోసం కూడా ఆలోచించాలి అన్నది ఆ మహనీయునిలో నాకు కనిపించిన ఒక వాస్తవం.
పద్యం రాసినా, పద్యం చదివినా దాశరథిóóగారే! దాశరథిóóకి సాటి ఎవ్వరూలేరు. ఆ రోజుల్లో దాశరథిóó పద్యం చదివితే వినాలనే తపన తెలుగువారందరిలో కనిపించేది. అలాగే పాటలు, లలితగీతాలు వీటిని రాయడంలో దాశరథిóóది ఒక ప్రత్యేకమైన శైలి. ఆయన రచించిన సినిమాపాటల్లో దేశభక్తికి, ప్రేమతత్వానికి, స్వాతంత్య్ర పిపాసకు, భగవద్భక్తికి తార్కాణంగా నిలిచినవి కోకొల్లలు.
ఆకాశవాణిలో లలితసంగీతం విభాగాన్ని పర్యవేక్షిస్తున్న రోజుల్లోనే నేను మరో ప్రయోగం చేశాను. రేడియోలో ‘ఈ మాసపుపాట’ చాలా పాపులర్. ఎన్నో సంవత్సరాలుగా ప్రసారమవుతున్న కార్యక్రమం. ఈ మాసపుపాటను కూడా కొత్తవారితో రాయించాలని, కొత్త కంపోజర్స్‌తో చేయించాలని అనుకున్నాను. ముందుగా అనౌన్స్‌మెంట్ ఇచ్చి కొత్తరచయితల దగ్గరనుండి పాటలను తెప్పించుకొని కొత్త కంపోజర్స్‌తో మ్యూజిక్ చేయించేవాణ్ణి. అప్పటివరకు పేరున్న కొద్దిమందితోపాటూ తెలంగాణంలోని ఎంతోమంది కవులకు ఈ కార్యక్రమంలో అవకాశం లభించింది. అప్పటి ఆంధ్రప్రదేశ్‌లో హైదరాబాద్‌లో ఆకాశవాణికేంద్రం, కడపలో ఆకాశవాణి కేంద్రం, విజయవాడ, విశాఖపట్టణాలలో ఆకాశవాణి కేంద్రాలు వుండేవి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం కేవలం తెలంగాణ కవులకు, కళాకారులకు వేదికగా ఉండాలని విశ్వసించి నేను పనిచేసినన్ని రోజులూ ఆ దిశగానే పనిచేశాను. ‘ఈ మాసపుపాట’ కొరకు యువకులు, అనుభవజ్ఞులైన పెద్దలు అందరూ గీతాలను పంపుతూ ఉండేవారు.
ఈ మాసపుపాట ఎన్నో ఏళ్ళుగా ప్రసారమవుతున్నది. రేడియో పుట్టినప్పటి నుండీ వున్నది. మరేదైనా కొత్త ఆలోచన చేస్తే ఎలా ఉంటుంది? ఈ ఆలోచనలనుండి ఉద్భవించిందే! ‘ఈ ఏడాది పాట’ ఈ మాసపు పాట ఒక నెలలో మూడు ఆదివారాలు ప్రసార మైతే, ఈ ఏడాదిపాట నెలలో చివరి ఆది వారం ప్రసారమయ్యేది. ఈ రకంగా ఒకటే పాట ఏడాదిపొడువునా ప్రసారమవు తుంది కనుక దీన్ని ‘ఈ ఏడాదిపాట’ అని అన్నార. భావుకత, మానవత, సామాజికత, మనం, మనకుటుంబ విలువలు, మనం, మనదేశం, మనకర్తవ్యం వీటిని ఆధారంగా చేసుకొని ‘ఈ ఏడాదిపాట’ ఉండాలని ఆలోచించాం. మరి ఎవరితో ఈ పాట ప్రారంభించాలి? మళ్ళీ నా మదిలో మహాకవి దాశరథిóó సాక్షాత్కరించారు.
ఒక ఆదివారం మాతృశ్రీ అపార్ట్‌మెంటుకు వెళ్ళి వారిముందు నా ప్రతిపాదన ఉంచాను. ”సార్! మీరు ప్రేమ గురించి రాయకండి. ప్రబోధంగురించి, భక్తి, దేశభక్తిగురించి రాయకండి. ఒక కొత్త సబ్జెక్ట్ తీసుకోండి అని దాశరథిóóని ఈ ఏడాదిపాట మీరే రాయాలని ప్రార్థించాను. దాశరథిóó ఒప్పుకుంటూ ”ఒరేయ్! చంపేశావుగదరా. ప్రేమా, భక్తి, దేశభక్తి లేకుండా లలితగీతం రాయడం ఎలారా బాబూ!” అన్నారు.
”సార్! మీరు రాసిన దేశభక్తిగీతాల్లో ‘విశాలభారతదేశం మనది హిమాలయాలకు నిలయమిది’ ఇంతకుమించిన పాట మరొకటిలేదు. అలాగే భక్తితత్త్వంలో ‘నడిరేయి ఏ జాములో’ (సినిమా పాట) పాటను మించిన పాటలేదు. ఇలాంటివి కాకుండా ఏదైనా కొత్త సబ్జెక్ట్‌తో రాయండి” అన్నాను.
”నువ్వు నాకు పరీక్షపెట్టావ్. తప్పుతుందా. ఓ.కే. నీకు ఎప్పుడు కావాలి ఈ పాట” అన్నారు.
”మీ ఇష్టం సార్. మీరు అయిపోయింది అని చెబితే పాట తీసుకెళతాను. కంపోజ్ చేయిస్తాను. మంచి పబ్లిసిటీ ఇచ్చి ప్రసారం చేస్తాను” అన్నాను.
సరిగ్గా రెండురోజుల తరువాత దాశరథిóó స్వయంగా ఆకాశవాణికి విచ్చేసి, పాటను నా చేతికందించారు. పాటను చదివాను. చదువుతున్నంతసేపూ సంభ్రమాశ్చర్యాలే!
దాశరథిóó రాసిన ఆపాట ఎంతగొప్పగాఉందో మాటల్లో వర్ణించలేను. నేను దేశభక్తి వద్దన్నాను, భక్తి వద్దన్నాను, ప్రేమ వద్దన్నాను. మహాకవి కాబట్టి ‘ప్రకృతిని’ ఆలంబనగా తీసుకొని అత్యంత మధురమైన గీతాన్ని దాశరథిóó మాకందించారు. అలా విలక్షణమైన ఆలోచన ఒక అద్భుతగీతాన్ని సృష్టించడానికి కారణమైంది. మహాకవులకు మాత్రమే అది సాధ్యం. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఈ పాటను ‘ఈ ఏడాదిపాట’ శీర్షికన ఒక సంవత్సరం ప్రతినెలా ప్రసారం చేసింది. ఇది ఒక వినూత్న ప్రయోగం.
దాశరథిóóతో పరిచయం నాకు దక్కిన ఒక గొప్ప అదృష్టం. మహాకవి దాశరథిóó మనం ఎల్లప్పుడూ స్మరించుకోవలసిన మహనీయుడు. ఆయనే ఒక హిమాలయశిఖరం.